Sunday, 2 July 2017

GARAGAPARRU Pamphlet

GARAGAPARRU Pamphlet

కరపత్రం
గరగపర్రు దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి మద్దతుపలకండి!

గరగపర్రు దళితులు ఇప్పుడు పోలీసు పహారాలో బతుకుతున్నారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఒక పోలీసు పికెట్టువుంది. అల్లూరి సీతారామరాజు  విగ్రహం పక్కనే మరో పోలీసు పికెట్టు వుంది.  దళితవాడలకు వెళ్ళే  వీధి మొదట్లో మూడో పోలీసు పికెట్టు వుంది. దళితవాడలో ప్రవేశించడానికి కట్టిన ఎనమదుర్రు డ్రెయిన్ వంతెన మీద నాలుగో పికెట్టు వుంది. దళితవాడలో నిర్మాణంలో వున్న చర్చీ లోపల, బయట ఖాకీ డ్రెస్సులు వేసుకున్న పోలీసులు, ఖాకీ డ్రెస్సులు వేసుకోని పోలీసులు రాత్రీ పగలు గస్తీ కాస్తున్నారు. దళితవాడల్లోని కదలికల్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయడంలో వాళ్ళంతా  నిమగ్నమై పోయివున్నారు. దళిత బాధితులను పరామర్శించడానికీ, నిత్యావసర సరుకులు దానం చేయడానికీ వచ్చేవారిని  తీవ్రవాదులుగా అనుమానించి వేధించడమే వాళ్ల  పనిగా వుంది. భీమవరం నుండి గరగపర్రు మీదుగా తాడేపల్లిగూడెం వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికీ వేరే రూట్ లోనే నడుపుతున్నారు. గ్రామ దళీతుల మీద సాంఘీక బహిష్కరణ, ఆర్ధిక ఆంక్షలు విధించిన ప్రధాన నిందితులు ముగ్గుర్నీ అరెస్టు చేసిన తరువాత కూడా గరగపర్రులో కొనసాగుతున్న పోలీసురాజ్యం ఇది.
అధికారుల మాటలకు అర్ధాలు వేరు. దళితుల రక్షణ కోసం గరగపర్రులో పోలీసుల్ని భారీగా నియమించినట్టు వాళ్ళు చెపుతున్నారు. నిజానికి ఈ సంఘటనలో దోషులైన పెత్తందారీ కులాల కుటుంబాలను  రక్షించడానికే అక్కడ పోలీసులు వున్నారు. దళితులు తిరగబడకుండా  అడ్డుకోవడం, వాళ్లకు బయటి నుండి అందే సలహా, సహకారాలను నిరోధించడం ఇప్పుడు పోలీసుల పరమ విద్యుక్తధర్మం.  
అభద్రజనులే ముందుగా దాడిచేస్తే పోలీసులు వాళ్ళ వాడల మీద యుధ్ధాన్నే ప్రకటించి భస్మీపటలం చేసేస్తారు. భద్రజనులు ముందుగా దాడిచేస్తే వాళ్ళ మీద ప్రతిదాడి జరక్కుండా అభద్రజనుల చేతుల్ని పోలీసులు కట్టిపడేస్తారు.  గరగపర్రులో ఇప్పుడు రెండో సన్నివేశాన్ని చూస్తున్నాం.
గరగపర్రులో అశాంతి చెలరేగి దాదాపు రెండున్నర నెలలు కావస్తోంది. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని రాజధాని నగరం అమరావతిలో  ఆయనకు 125 అడుగుల భారీ విగ్రహాన్ని  నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత యేడాది అట్టహాసంగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రియల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా గరగపర్రు గ్రామంలో ఏడడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు పెద్ద వివాదమే మొదలయింది. రాజు సామాజికవర్గం నాయకత్వంలో గ్రామ పెత్తందారీ సామాజికవర్గాలు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడంతో వివాదం ముదిరింది. ఆ విగ్రహం అనేక మలుపులు తిరిగి గ్రామ పంచాయితీ పాత ఆఫీసు ముందుకు చేరింది. తాము తొలగించిన విగ్రహాన్ని దళితులు తిరిగి ప్రతిష్టించడంతో పెత్తందారుల అహం దెబ్బతిన్నది. కుల అహంకారం నెత్తికెక్కిన  యిందుకూరి బలరామకృష్ణం రాజు, ముదునూరి రామరాజు (పొత్తూరి రాము), కొప్పుల శ్రీనివాస్‌ ల నాయకత్వంలో గ్రామ పెత్తందారీ కులసభ్యుల సభ జరిగింది. వెయ్యి మంది జనాభా, ఏడు వందల మంది ఓటర్లువున్న రెండు దళితవాడల మీద ఆ సభ సాంఘీక బహిష్కరణ విధించింది.  
               దళితుల్ని ముట్టుకోకూడదు; వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళకు వ్యవసాయ భూముల్ని కౌలుకు ఇవ్వకూడదు. గతంలో ఇచ్చిన కౌలును రద్దు చేసుకోవాలి. వాళ్ళకు వ్యవసాయ కూలీ పనులకు పిలవకూడదు. ఇళ్ళల్లో పాచి పనులు చేస్తున్న దళిత మహిళల్ని తొలగించాలి.  వాళ్ల పిల్లలకు చదువులు చెప్పరాదు.  వాళ్లకు రోగం వస్తే  వైద్యం చేయరాదు. వాళ్ళకు క్షవరం చేయరాదు. వాళ్ళ బట్టల్ని ఇస్త్రీ చేయరాదు.  వాళ్ల పశువుల్ని గ్రామ బంజరులో గడ్డి మేయనియ్యరాదు. వాళ్ల వార్తల్ని మీడియా ప్రచురించకూడదు; ప్రసారం చేయకూడదు. ఇవీ గ్రామ పెద్దల సభ తీర్మానాలు. సమావేశంలో ఒకటి రెండు కులాలవాళ్ళు అసమ్మతి తెలిపినా రాజు, కాపు సామాజికవర్గాలవాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. వీటిని వుల్లంఘించిన వారిపై భారీ జురిమానతోపాటూ శిక్షలూ వుంటాయని బెదిరించారు. దళితులకు రోగంవస్తే వైద్యం చేయడానికి నిరాకరించాడు ఓ ప్రైవేటు డాక్టరు. మందుల షాపువాడు మందులు అమ్మనన్నాడు. అప్పుకుకాదుకదా నగదు ఇచ్చినా దళితులకు సరుకులు ఇచ్చేది లేదని కిరాణషాపువాళ్ళు తేల్చి చెప్పేశారు. దళితులు ఇతరగ్రామాల నుండి నిత్యావసర సరుకులు తెచ్చుకోకుండా గ్రామం మీదుగా నడిచే బస్సుల్ని రూటు మళ్ళించారు.  
               నవ్యాంధ్రప్రదేశ్ లో ఇంతటి ఘోర అన్యాయం సాగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదు.  దళితుల కోసమే ప్రభుత్వంలో వున్నామని చెప్పుకునే ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్కారెం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్చైర్మన్జూపూడి ప్రభాకర్తదితరులు రెండు నెలల వరకు గరగపర్రు వెళ్ళడానికి జంకారు. అలా వెళితే, అధికార తెలుగుదేశానికి చెందిన ఉండి శాసనసభ్యుడు  కలవపూడి శివ అనే వీవీ శివరామ రాజు, లైలా గ్రూపు ఛైర్మన్, భారతీయ జనతా పార్టీకి చెందిన నరసాపురం యంపీ గోకరాజు గంగరాజుల ఆగ్రహానికి గురవ్వాల్సి వుంటుందని వాళ్ళు భయపడ్డారు. సోషల్ మీడియా ప్రచారంతో దిగివచ్చిన  కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్‌, రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనంద్బాబు గరగపర్రు వెళ్ళి  గ్రామ సభ నిర్వహించినప్పటికీ బాధితులకు చేసింది ఏమీలేదు.   కనీసం సహాయక చర్యలు  కూడా చేయింలేకపోయారు.
               దళితుల సాంఘీక బహిష్కరణ చాలా తీవ్రమైన నేరం. తక్షణం దోషుల్ని అరెస్టుచేసి న్యాయస్థానంలో  ప్రవేశపెట్టడంతోపాటూ  బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వం బాధ్యత. సమాచారం తెలియగానే యఆర్ వో, సబ్ కలెక్టర్ బియ్యం, పప్పు, కంచాలు, దుప్పట్లను బాధితులకు అందజేయాలి. ఆ పని ఇంతవరకూ ప్రభుత్వం చేయలేదు. మరోవైపు, గ్రామంలో వివాదం సమసిపోయిందనీ, ఇరువర్గాలు కలిసిమెలసి ప్రశాంతంగా  వుంటున్నాయనీ, గరగపర్రులో దళితుల మీద సాంఘీక బహిష్కరణ జరగనేలేదని ప్రపంచాన్నీ, న్యాయస్థానాన్నీ నమ్మించడానికి ప్రభుత్వం ఓవర్ టైమ్ పనిచేస్తున్నది. యస్సీ యస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కీంద అరెస్టయిన వారికి సులువుగా బెయిలు వచ్చేలా చేయడానికే ఈ ప్రయాసంతా.
               ప్రభుత్వ కపట వ్యవహారంతో విసిగిపోయిన గరగపర్రు దళితులు తమ డిమాండ్లతో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సన్నధ్ధం అవుతున్నారు. 
ప్రభుత్వానికి డిమాండ్లు :
1.     దళిత ఆత్మగౌరవ సంకేతం అయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని గరగపర్రు పంచాయితీ కార్యాలయం ముందు ఇప్పుడున్న చోటులోనే వుంచాలి.
2.     దళితులపై సాంఘీక బహిష్కరణ విధించిన దోషుల్ని రక్షించే ప్రయత్నాలు చేయకుండా వారికి కఠిన శిక్షలు పడేలా చేయాలి.  
3.     గరగపర్రు గ్రామంలో ఏప్రిల్ 14, 2017కు ముందు వున్న సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్యా, వైద్య పరిస్థితిని పునరుధ్ధరించాలి.
4.     వ్యవసాయ భూముల పాత కౌళ్ళు అన్నింటినీ పునరుధ్ధరించాలి.
5.     రెండు యస్సీ కాలనీలను కలిపి ప్రత్యేక గ్రామ పంచాయితీ చేయాలి.
6.     కాలనీలో ప్రతి కుటుంబానికీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలి.
7.     యస్సీ కార్పొరేషన్ ద్వార ప్రతి కుటూంబానికీ రెండు గేదెలు ఇవ్వడమేగాక పశుగ్రాసానికి సమిష్టిగా ప్రత్యేక భూమిని కేటాయించాలి.
8.     సాంఘీక బహిష్కరణకు గురైన ప్రతి కుటుంబానికీ మూడు ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలి.
9.     ఇళ్ళు లేని కుటుంబాలకు తక్షణమే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. 
ఇట్లు
గరగపర్రు దళితుల ఆత్మగౌరవ ఉద్యమ కమిటి
ప్రచురణ – 1 జులై 2017

కరపత్ర రచన – ఏయం ఖాన్ యజ్దానీ (డానీ), మొబైల్ 9010757776 

No comments:

Post a Comment