The Stark Reality of Nandyala
BY-Elections
నంద్యాల నగ్న సత్యాలు!
- - డానీ
నంద్యాల ఉపఎన్నికల్లో సెంటిమెంట్ బలంగా పనిచేసి తెలుగు దేశం
అభ్యర్ధికి ఘన విజయం చేకూర్చిందనే అభిప్రాయం బలంగా ప్రచారంలోనికి వచ్చింది. నిజానికి
అక్కడ సెంటిమెంటుకన్నా అనేక ఇతర అంశాలే బలంగా పనిచేశాయి. వాటిని పరిశీలించకుంటే ఎన్నికల
ఫలితాలని సరిగ్గా అంచనా వేయలేం.
నంద్యాల ఉపఎన్నికల్లో సెంటిమెంటు టిడిపి, వైయస్సార్ సిపిలకు
సమానంగా వుంది. టిడిపికి సిట్టింగ్ అభ్యర్ధి చనిపోతే, వైయస్సార్ సిపికి గత ఎన్నికల్లో
గెలిచిన అభ్యర్ధి ప్లేటు ఫిరాయించాడు. ఒకరికి అభ్యర్ధి సెంటిమెంట్ అయితే మరొకరికి పార్టి
సెంటిమెంట్ వుంది. సెంటి మెంట్ ఇద్దరికీ సమానం అయినపుడు ఫలితాలని ఇతర అంశాలు నిర్ణయిస్తాయి.
రాజకీయ పార్టీ
ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న వైపరీత్యాలకు తాజా ప్రతీక నంధ్యాల
ఉపఎన్నికలు. టిడిపీ తో మొదలయ్యి ఆళ్లగడ్డ నుండి
మూడుసార్లు గెలిచి, 2009లో ప్రజారాజ్యం పార్టీకి మారి, 2014 ఎన్నికల్లో వైయస్సార్ సిపి టిక్కెట్టుపై రెండుచోట్ల గెలిచి ఎన్నికల తరువాత
గోడ దూకి తిరిగి తెలుగు దేశం పార్టీ లోనికి
చేరిన చరిత్ర భూమా కుటుంబానిది. కాంగ్రెస్ లో మొదలయ్యి మంత్రి పదవిని కూడా పొంది,
2014 ఎన్నికల్లో టిడీపీకి మారి, ఇప్పుడు మళ్ళీ వైయస్సార్ సిపి టిక్కెట్టుపై రంగంలో దిగిన చరిత్ర శిల్పా కుటుంబానిది.
తడవకో పార్టీ మారే అభ్యర్ధులు తలబడుతున్నప్పుడు
వాటిని రాజకీయ సిధ్ధాంతాల ఘర్షణ అనరు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే
గనుక అందులో సామాజిక సంఘర్షణ కూడా ఏమీ లేదు.
అది కేవలం రెండు కుటుంబాల తగవు.
చంద్రబాబు
అభివృధ్ది విధానాలకు ఓట్లు పడ్డాయని ఇప్పుడు అధికారపార్టి సాగిస్తున్న ప్రచారమూ సరైనదికాదు.
దాదాపు 80 వేల ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడ్డాయి మరి!. వైయస్సార్ సిపీ నోటి దుర్వినియోగంకన్నా,
టిడిపి అధికార దుర్వినియోగం ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిందని అంటే అది కొంచెం
సమంజసంగా వుంటుంది.
డబ్బు పంపిణీలో
నంద్యాల ఉప ఎన్నిక గత రికార్డులు అన్నింటినీ బద్దలుగొట్టేసింది. ఒక అనధికార అంచనా ప్రకారం
అధికార పార్టి ఎన్నికల వ్యయం 100 కోట్ల రూపాయలకు పైమాటేనట! 1500 కోట్ల రూపాయల నంద్యాల
అభివృధ్ధి ప్యాకేజీ వగయిరాలు దీనికి అదనం.
2019 అసెంబ్లీ
ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదనే మాట ప్రచారంలో వుంది. అందువల్ల ఎవరు
గెలిచారు? అనే దానికన్నా ఎందుకు గెలిచారు? ఎందుకు ఓడారు? అన్న అంశాల మీద భారీ చర్చలు
జరుగుతున్నాయి.
అధికార యంత్రాంగం
సహకారం (దీనినే అధికార దుర్వినియోగం అని కూడా అంటారు.), డబ్బు ప్రవాహం రెండింటినీ కలిపి
ఎన్నికల సీసాలో పోసి దానిమీద అభివృధ్ధి మంత్రం
అనే లేబిల్ ను అంటించేస్తే గెలవడం సులభమని నంద్యాల ఫలితాలతో టిడీపీ వ్యూహకర్తలకు అర్ధం అయిపోయి
వుంటుంది. బహుశ ఈ ఫార్మూలానే ఆ పార్టి రేపు 2019 ఎన్నికల్లో కూడా ప్రయోగించవచ్చు!.
గెలుపుకు కొన్ని
కారణాలే వుంటాయి. ఓటమికి వంద కారణాలుంటాయి. ఇప్పుడు అవేమిటనేది అసలు చర్చ.
ఈ ఎన్నికల్లో
జగన్ ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకునిగా వ్యవహరించలేదు. సమీప భవిష్యత్తులో వారు అలాంటి
పరిపక్వతను సాధించగల సూచనలూ కనిపించడంలేదు. రాజకీయాల్లో విధానాలే కీలకం అయినప్పటికీ
నాయకుని వ్యక్తిత్వం, వ్య్వహారశైలి నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. ఎవరయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించడం తప్పుకాదు.
కానీ, ముఖ్యమంత్రి అయిపోయానని భ్రమించడం తప్పు!. ఈపాటి చిన్న
తేడాను జగన్ చాలా కాలంగా గుర్తించడంలేదు.
ప్రజాస్వామ్యం
అంటేనే అంకెల ఆధిక్యత. ఏపీలో రాజకీయ నాయకత్వం వహిస్తున్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాల్లో
దేనికీ కూడా స్వంత ఓట్లతో మేజిక్ ఫిగర్ ను సాధించి అధికారాన్ని చేపట్టగల సంఖ్యాబలం
లేదు. అందువల్ల, సామాజిక కూటమి రాజకీయాలు అనివార్యం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు టిడిపిని కమ్మపార్టీగా, వైసిపిని రెడ్డి పార్టిగా
ప్రచారంచేస్తున్నారుగానీ అది మరీ సంకుచిత దృక్పథం. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గం చొరవతో
వివిధ సామాజికవర్గాలతో ఏర్పడిన కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తుండగా, రెడ్డి సామాజికవర్గం
చొరవతో వివిధ సామాజికవర్గాలతో ఏర్పడిన కూటమికి జగన్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే,
సోషల్ ఇంజనీరింగ్ (కుల సమీకరణలకు గౌరవనీయ పదం) చంద్రబాబు శిబిరంలో కనిపించినంత స్పష్టంగా
జగన్ శిబిరంలో కనిపించదు. అది టిడిపికి ఎన్నికల్లో ఒక సానుకూల అంశం.
అసలు
తన ఓటు బ్యాంకు గురించి జగన్ కు లోతైన అవగాహన
లేనట్టుంది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు 2004,
2009 ఎన్నికల్లో పడ్డ ఓట్లన్నీ తన పేరున ఎన్నికల కమీషన్ లాకర్ లో ఇప్పటికీ భద్రంగా
వున్నాయనే భ్రమల్లో జగన్ వుంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగై పోవడంతో
ఆ ఓట్లన్నీ తనకు పడతాయని ఆయన నమ్మారు. అయితే, ఆ ఓటర్ల సామాజిక కూర్పు ఏమిటీ? వాళ్లపై
కొత్తగా రంగ ప్రవేశం చేసిన నరేంద్ర మోదీ ప్రభావం
ఏమిటీ? అనే అంశాలు ఆయనకు అర్ధం కాలేదు.
వైయస్ హయాంలో
కాంగ్రెస్ కు దగ్గరయిన ముస్లింలు కిరణ్ కుమార్
రెడ్డి అనుసరించిన విధానాలవల్ల ఆ పార్టీకి దూరం అవుతున్న సమయం అది. మరోవైపు, చంద్రబాబు ఎన్నికలకు ముందే మోదీతో జత కట్టడంతో
ముస్లీం సమాజం జగన్ వైపు ఆశగా చూసింది. “ఎన్నికల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీతో
జతకట్టను” అని ఒక్క హామీ ఇస్తే చాలని ముస్లీం ప్రతినిధులు వైయస్సార్ సీపీ పెద్దల్ని
కోరారు. మోదీ రాకతో ముస్లిం, క్రైస్తవ, దళిత సామాజికవర్గాల్లో తలెత్తిన భయాందోళనల్ని
జగన్ అస్సలు పట్టించుకోలేదు. ప్రచార ఘట్టం ముగిసే వరకూ ఆయన అలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ, మరోమార్గంలేక ఆ మూడు సామాజికవర్గాల్లో
అత్యధిక భాగం జగన్ కు ఓటేయక తప్పలేదు. వాళ్ళలో కొంత భాగం మాత్రమే టిడిపికి ఓటేశారు.
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలన్నీ రెండు ఎత్తుగడల్ని అనుసరిస్తుంటాయి.
మొదటిది, తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటాయి. రెండోది; తమ విధానాలతో కొత్తగా అదనపు
ఓటు బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నం చేస్తాయి.
నంద్యాల ఉప
ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వయో బేధం
వున్నప్పటికీ, కుటుంబాల నేపథ్యం కారణంగా దాదాపు ఇద్దరూ సమవుజ్జీలు. అప్పుడు నియోజకవర్గంలోని
రెడ్డి సామాజికవర్గం ఓట్లు సహజంగానే దాదాపు సమానంగా చీలిపోతాయని అందరికీ తెలుసు. ఈ
నేపథ్యంలో నంద్యాలలో విజయానికి ముస్లీం ఓటర్లు
అత్యంత కీలకంగా మారారు.
ముస్లిం ఫ్యాక్టర్
ను ముందే గమనించిన చంద్రబాబు ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ఎమ్మెల్సీ పదవి, వక్ఫ్
బోర్డు నియామకాలు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీకి నిధుల కేటాయింపు తదితర కొన్ని రాయితీలను ప్రకటించారు. అవి ఎన్నికల కోసం ప్రకటించిన రాయితీలే కావచ్చు.
ఎవరు ప్రకటించినా ఎప్పుడు ప్రకటించినా రాయితీలు రాయితీలే. జగన్ వెంటనే దానికి మించిన
రాయితీలను ముస్లిం సమాజానికి ప్రకటించి వుండాల్సింది. తెలంగాణలో కేసిఆర్ హామీ ఇచ్చినట్టు
విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ
ఇచ్చి వుండాల్సింది. “మా నాయిన వైయస్ రాజశేఖర రెడ్డిగారు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారూ.
నేను దాన్ని పది శాతం చేస్తా” అని ఒక్క మాట అనుంటే కనీసం 15 వేల ఓట్లు తారుమారయ్యేవి.
అప్పుడు ఫలితాలు ఎలావుండేవో ఊహించుకోవచ్చు.
జగన్ అలా చేయలేదు.
2014లో చేసిన తప్పునే ఆయన మరోసారి చేశారు. ఈసారి అంతకన్నా పెద్ద తప్పు చేశారు. తాను
నరేంద్ర మోదీ, అమిత్ షాలకు దగ్గరవుతున్నట్టు బలమైన సంకేతాలు ఇచ్చారు. దానివల్ల చంద్రబాబు
ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టవచ్చని వారు ఆశించి వుండవచ్చుగానీ, తన ముస్లిం ఓటు బ్యాంకు
పూర్తిగా మునిగి పోతుందని ఊహించి వుండరు.
ఎన్నికల వ్యూహకర్తగా
ఉత్తరాది నుండి జగన్ కోరి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ (పీకే) భారత రాజకీయాల్లో మోదీ
అప్రతిహత శక్తి అనే నమ్మే వ్యక్తి. 2014 ఎన్నికల్లో మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా వున్నారు.
బీహార్ లో నితీష్ కుమార్ ను బుజ్జగించి పాత
గొడవల్ని మరిచిపోయేలా చేసి మోదీకీ దగ్గర చేసింది వీరే. ఇప్పుడు జగన్ నూ పెరటి దారిలో
మోదీ-అమిత్ షాల దగ్గరికి చేరుస్తున్నదీ వీరే. ఇలాంటి వ్యూహాలు నంద్యాల వంటి చోట్ల ఓట్లు
పీకలేవని పీకేగారికి తెలియకపోవచ్చు.
2014లో మోదీతో
జత జట్టినప్పటి నుండీ ముస్లింలలో ఎక్కువ మంది టిడిపి మీద గుర్రుగా వున్నారనేది వాస్తవం.
మోదీ ప్రభావంతోనే ఏపీ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం దక్కలేదనే అభిప్రాయం కూడా బలంగా వుంది. తాము నమ్ముకున్న జగన్ ఇప్పుడు
మోదీకీ దగ్గర కావడం ద్రోహ చర్య అనే భావం ఆ సామాజికవర్గంలో బలపడింది. శత్రువుకన్నా ద్రోహి
మరింత ప్రమాదకారి అనే సామెత ఎలానూ వుంది.
నంద్యాల ఎన్నికల్లో
ముస్లిం ఫ్యాక్టర్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ముస్లింలు
తమ నమ్మకాన్ని వమ్ము చేశారని వైసిపి శిబిరం ఇప్పుడు బాధపడుతూ వుండవచ్చు. అసలు విషయం
ఏమంటే జగన్ కు స్వీయసామాజికవర్గం నుండి కూడా ఆశించిన మద్దతు లభించలేదు. రెడ్డి సామాజికవర్గానికి
ఓటింగ్ బలం వుందనుకున్న నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోనూ వైసిపికి ఆధిక్యత రాలేదు.
“ముస్లీంలు
చంద్రబాబుకు ఓటేసినా ఏన్డీయేకు ఓటేసినట్టేగా?’’ అని వైసిపీ మేధావులు కొందరు ఇప్పుడు
గడుసుగా అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడున్న రాజకీయ సమీకరణల్లో జగన్ కు ఓటేసినా ఏన్డీయేకు
ఓటేసినట్టే. ఇద్దరి మధ్య ఎవర్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు మొరటుదేగానీ ఒక పాత సామెత వుంది
“ఫత్తర్ ఫోడు వీపు నాకడంకన్నా అత్తరు సాయిబు చంక నాకడం మేలు” అని. విపక్షనేతకన్నా
అధికారపక్షనేతే మేలని ముస్లీంలు భావించారు. అదే నంద్యాల ఉపఎన్నికల ఫలితాలను నిర్ణయించింది.
Nothing hurts more when whom you thought a friend betrays
you.
హైదరాబాద్
28 ఆగస్టు 2019
ప్రచురణ :
మన తెలంగాణ దినపత్రిక, ఎడిట్ పేజీ,
30 ఆగస్టు 2017