Sunday, 13 August 2017

Maupassant’s Boule de Suif


మొపాసా కథవెన్నముద్ద
Guy de Maupassant’s Boule de Suif
ఉష యస్ డానీ

ప్రపంచ కథకుల్లో అగ్రగణ్యులు గైడి మొపాసా, సాదత్ హసన్ మంటో, ఆనతోల్ చెఖోవ్, లూసన్. జాక్ లండన్.
మొపాసా 19 శతాబ్దపు ఫ్రెంచ్ దేశస్తుడు. 1870 నాటి ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధకాలంలో జీవించాడు.  బిస్మార్క్ జర్మనీ, నెపోలియన్ – 3 ఫ్రాన్స్ మధ్య సాగిన యుధ్ధం అది. యుధ్ధం ముగింపులోనే 1914లో  మొదటి ప్రపంచ యుధ్ధం ఆరంభానికి బీజాలున్నాయి. సరిగ్గా కాలంలోనే  పారీస్ కమ్యూన్ పేరిట ఫ్రాన్స్ లో   రెండు నెలలు తొలి కార్మిక రాజ్యం ఏర్పడింది.
ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధం, పారీస్ కమ్యూన్ నాటికి మొపాసా ఇరవై యేళ్ల యువకుడు. యుధ్ధాన్నీ, విప్లవ ప్రభుత్వాన్నీ స్వయంగా చూశాడు. ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం, ఫ్రాన్సులో రైతాంగ విప్లవాల నేపథ్యంలో ఛార్లెస్ డికెన్స్ రచనలు సాగినట్టు, ఫ్రాంకో-ప్రష్యన్ యుధ్ధం, పారీస్ కమ్యూన్ నేపథ్యంలో గై డి మపాసా  కథలు సాగాయి.   నేపథ్యాన్ని కూడా అర్ధం చేసుకుంటే మొపాసా రచనలి మరింత గొప్పగా ఆస్వాదించవచ్చు.
మనిషి బుధ్ధి విందులో మాంసం ముక్క దగ్గర బయటపడుతుందని మనకు  ఒక సామెత వుంది. ప్రశాంత కాలంలో మర్యాదస్తుల్లా ప్రవర్తించే మనుషులు ప్రళయ కాలంలో నైతికంగా దిగజారి ప్రవర్తిస్తారని మొపాసా కథలన్నీ  వందలసార్లు నిరూపిస్తాయి.  
తన ముప్ఫయ్యవ ఏట రాసిన బౌలే ది సౌఫ్తో మొపాసా కథా ప్రపంచంలో ఒక ధృవతారగా మారిపోయాడు.  తను రచయితగా వున్నది పదేళ్ళే అయినా చాలా విస్తారంగా రచనలు చేసాడు.  1980-1890 మధ్య కాలంలో 300 కథలు, 200 వ్యాసాలు, 6 నవలలు, మూడు నాటకాలు,  మూడు ప్రయాణ అనుభవాలు,  కొన్ని వచన కవితలు రాసాడు.

మనుషుల్లోని వివాహేతర సంభోగ యావ,  మర్యాదస్తులు ఎదుటివారికి చెప్పే నీతుల్లోని డొల్లతనం మొపాసా రచనల్లో ప్రధాన అంశంగా వుంటాయి.

మనుషుల ప్రవర్తన మీద వినిపించీ వినిపించని  అధిక్షేపణ,  కనిపించీ కనిపించని స్వల్ప హాస్యం (tragicomic) మొపాసా శైలి. భీభత్సాన్ని సహితం అలా అలవోకగా సాయంకాలాలు పిల్లలకు  అమ్మమ్మ కథ చెపుతున్నట్టు సాగిపోతుంది మొపాసా కథనం.

గోదావరి మండలంలో వరి నాట్లు, కోతలకు వచ్చే మహిళా కూలీలు పాడే పాటలు చాలా ఆసక్తిగా వుంటాయి.

 

 భద్రమ్ము అన్నాడు గోంగోరకి!

 అరే భద్రమ్ము అన్నాడు గోంగోరకి!

 వాడు భద్రమ్ము అన్నాడు గోంగోరకీ!

 అరే బట్టలిప్పదీశాడు గోంగోరకీ!”

 

జాగ్రత్త అన్నాడు గోంగోరకి!

 అరే జాగ్రత్త  అన్నాడు గోంగోరకి!

వాడు జాగ్రత్త అన్నాడు గోంగోరకీ!

అరే జాకెటిప్పదీశాడు  గోంగోరకీ 

 

ఇది బృందగానం. ఒకరో ఇద్దరో పాడుతుంటే ఓ నాలుగెకరాల కమతంలో  బారులు తీరి నిలబడిన ఓ నలభై యాభై మంది కోరస్ ఇస్తుంటారు. పనీ, పాట, నవ్వూ కలగలిసిపోతాయి. గట్టు మీదున్న మగాళ్ళు  ఆ పాటల్ని వింటూ గతాన్ని నెమరేసుకుంటూనో భవిష్యత్తును తలుచుకుంటూనో తెగ సంబర పడిపోతుంటారు. వాళ్లను చూస్తూ మహిళలు కొంచెం కవ్వింపుగానూ పాడుతుంటారు. ముఠాలో పెళ్ళీడు రాని పిల్లలూ వుంటారు. ఈ పాట వాళ్లకు  అర్ధంఅయ్యి అర్ధంకానట్టూ వుంటుంది. మధ్యమధ్యలో అర్ధం అయినపుడు ఆ పిల్లలు కిసుక్కున నవ్వుతుంటారు.   ఇందులో అశ్లీలం వుందటే వుంది.  పరిశుభ్రత లేదంటే లేదు. అయితే, పాటలోగానీ, ప్రవర్తనలోగానీ ఎవరూ అంతకు మించి ముందుకు సాగరు.

 సరిగ్గా ఇలాగే వుంటుంది మొపాసా రచనా శైలి. శృంగారాన్ని తడమకుండా వుండలేడు. దాని హద్దుల్ని దాటాలనీ అనుకోడు. ఇలాంటి శైలిని ఫ్రెంచ్ లో conte leste అంటారు. ఇంగ్లీషులోగానీ, తెలుగులోగానీ దీనికి పర్యాయపదాన్ని కనిపెట్టాల్సి వుంది. అరేబియన్ నైట్స్ కథల పరంపరలో కూడా ఇలాంటి శైలి ఒకటి కనిపిస్తుంది.

మొపాసా రాసిన  మూడు వందల కథల్లో అగ్రస్థానంబౌలే ది సౌఫ్దే. ప్రాణ రక్షణ కోసం ఒక అనుమతి పత్రాన్ని పొందడానికి పట్టణంలోని మర్యాదస్తులు అందరూ కలిసి అందమైన అమ్మాయిని సైనికాధికారి పక్కలో పడుకోబెట్టడం ఇందులో కథాంశం. సైనికాధికారి దగ్గరికి పంపడానికి మర్యాదస్తులందరూ అమ్మాయిని బుజ్జగించి ఒప్పించడం, తీరా పనయ్యాక అమ్మాయిని అమానుషంగా అవమానించడం ఇందులో కథనం. 
ముసుగులు తొడిగిన సమాజాన్ని మొపాసా భరించలేకపోయేవాడు.  సమాజాన్ని బట్టలూడదీసి నగ్నంగా చూపించడం అతని సాహిత్య లక్ష్యం. కొన్ని సందర్భాల్లో తానే బట్టలూడదీసుకుని నగ్నంగా తిరిగేవాడు.  వర్తమాన సమాజంలో గొప్ప కథలు రావడంలేదని గుండెలు బాదుకునేవారు అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. మర్యాదస్తులెవరూ గొప్ప కథలు రాయలేరని మపాసా, మంటో ఇద్దరూ కొంచెం  గట్టిగానే అరిచి చెప్పారు.

ఫ్రెంచ్ ‘బౌలే ది సౌఫ్’ను తెలుగులో కొవ్వుముద్ద అనవచ్చు. వెన్నముద్ద అని కూడా అనవచ్చు. ఇంగ్లీషులోనూ కొందరు 'Ball of Fat' అని అనువదిస్తే మరికొందరు 'Butterball' అని అనువదించారు. . తెలుగులో 'వెన్నముద్ద' అంటే బాగుంటుందనిపించింది. కొవ్వు పదంలో కొంచెం కరుకుదనం వుంది. 'వెన్నముద్ద' లో మృదుత్వం వుంది. కథలో ప్రధాన పాత్ర ఎలిజబెత్ రూసో భావోద్వేగాలు ఎక్కువగావున్న అమాయకపు వేశ్య. ఆమె వేశ్యావాటికల నిర్వాహకురాలు కాదు.
వెన్న ముద్దఎలిజబెత్ రూసో పాత్రకు భారత పౌరాణిక సాహిత్యంలో ఒక పోలిక వుంది. మహాభారతంలో ఋష్యశృంగుని కథలో వచ్చే  వైశాలి పాత్ర ఇలాంటిదే. విశ్వామిత్రుని పాత్ర రామాయణ మహాభారతాల్లో వున్నట్టు, ఋష్యశృంగుని పాత్ర కూడా రెండు పురాణాల్లోనూ కనిపిస్తుంది.
మహారాజు  రోమపాదుడు చేసిన పాప ఫలితంగా అంగ రాజ్యంలో దాదాపు పన్నెండు సంవత్సరాలు వర్షాలు కురవవు. ఋష్యశృంగుడనే ముని కుమారుడు  కాలుమోపితే  రాజ్యంలో వర్షాలు కురుస్తాయని రాజగురువు ఉపాయం చెపుతాడు. స్త్రీ స్పర్శ ఎరుగని ఋష్యశృంగుడ్ని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చే బాధ్యతను వైశాలీ అనే దేవదాసీకి అప్పగిస్తాడు రోమపాదుడు. వైశాలి నిజానికి రోమపాదుని వివాహేతర సంతానం. వైశాలిని తన కుమార్తె అని  ప్రపంచానికి  ప్రకటిస్తానని రాజు మాట ఇస్తాడు. దాన్ని నమ్మి ఋష్యశృంగుడ్ని తీసుకురావడానికి  బయలుదేరి వెళుతుంది వైశాలి. అక్కడ తన శృంగార కళానైపుణ్యంతో ఋష్యశృంగుడ్ని ముగ్గులోనికి దింపి అంగరాజ్యానికి తీసుకువస్తుంది. ఋష్యశృంగుడి రాకతో రాజ్యంలో భారీగా వర్షాలు కురుస్తాయి. కానీ, రాజు రోమపాదుడు మాట తప్పుతాడు. తన అధికారిక కూతుర్ని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్ళి చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. రాజు మోసం చేయడంతో వైశాలి కుంగిపోయి వర్షపు నీటిలో పడిపోతుంది. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలను చూసి ఆనందోత్సాహంలోవున్న జనం వైశాలిని తొక్కుకుంటూ పరుగులు తీస్తారు. తొక్కిసలాటలో వైశాలి, ఆమె తల్లి కూడా చనిపోతారు.
సుప్రసిధ్ధ తమిళ దర్శకుడు కే బాలచందర్ 1973లో తీసిన ఆరంగేట్రంలో ప్రధానపాత్ర లలితకు ప్రేరణ వైశాలి, ఎలిజబెత్ రూసో అనిపిస్తుంది. ఇదే సినిమాను తెలుగులో జీవితరంగం’  పేరుతో  పునర్ నిర్మించారు. రెండు భాషల్లోనూ ప్రధాన పాత్రను ప్రమిల నటించగా, హిందీలోఆయినాపేరుతో తీసిన సినిమాలో ముంతాజ్ నటించింది.
మళయాళ దర్శకుడు భరతన్ 1988లో వైశాలి పేరుతోనే పౌరాణీక గాధను తెరకు ఎక్కించారు. సినిమాను తెలుగులో కూడా అనువాదం చేశారు. అన్ని భాషలలోనూ అప్పట్లో అది ప్రజాదరణపొందింది.

కథా నవలా సాహిత్యంలోని గొప్ప పాత్రలకు  పౌరాణిక స్థాయి వచ్చేస్తుంది. స్థాయికి చేరుకున్నాక అది ప్రపంచ వ్యాప్తంగా వేలమంది రచయితలకు ప్రేరణగా మారుతుంది. దానికి Boule de Suif ఒక గొప్ప ఉదాహరణ.
మానవ జీవితసారం అంటే మపాసాకు సంబంధించినంత వరకు  రెండే రెండు అంశాలు; ఆహారం, మైధూనం. జానెడు పొట్ట, పొట్టకు జానెడు కింద. అంతే. మిగిలినదంతా ముసుగులు, బూటకం అనుకుంటాడతను. వెన్నముద్ద కథ కూడా ఆకలి ఆహరంతో మొదలయ్యి సంభోగంతో ముగుస్తుంది.
పద్యానికి చందస్సు, గణాలు, యతి, ప్రాసలు వున్నట్టే కథ, నవల, నాటకం, సినిమా  వగయిరా ప్రక్రియలకూ సందర్భం-ఘర్షణ- పరిష్కారం (Set up – confrontation-resolution) అంటూ ఒక నిర్ధిష్ట నిర్మితి (paradigm) వుంటుంది. అయితే, నిర్మితి తెలిసినవాళ్ళు గొప్ప కథలు రాస్తారనే నియమం ఏమీలేదు. పండితులువేరు కవులువేరు అనేమాట ఎలాగూ వుంది. కాకపోతే, నిర్మితి తెలియనివాళ్లకన్నా నిర్మితి తెలిసినవాళ్ళు సులువుగా కథలు రాయగలరు. అదొక సౌలభ్యం. అంతకన్నా ముఖ్యవిషయం ఏమంటే, గొప్ప రచయితలు రాసిన గొప్ప కథలు తరువాతి తరాల వారికి నిర్మితి నియమాలుగా మారిపోతాయి. అలాంటి కథల్లో మొపాసా కథ బౌలే ది సౌఫ్ ఒకటి.  ఆయన రాసిన నిర్మితిని అధ్యయనం చేయడం తరువాతి తరాల వారికి చాలా అవసరం.
ప్రష్యా, ఫాన్స్ మధ్య 1870లో యుధ్ధం ఆరంభమయింది. శారీరక సౌష్టవం, యుధ్ధ క్రమశిక్షణ రెండూలేని ఫ్రెంచ్ సైనికులు వారం రోజుల్లోనే చేతులు ఎత్తేశారు.  జర్మన్ సైనికులు ఫ్రాన్స్ లోనికి చొచ్చుకువచ్చి సీన్ నదీ తీరాన్న రూన్ తదితర నగరాలను ఆక్రమించుకున్నారు. వంటగదుల్లోనికీ పడకగదుల్లోనికి కూడా దూసుకు వచ్చేస్తున్న జర్మన్ సైనికుల్ని నిలవరించడం స్థానికులకు కష్టం అవుతోంది.   దౌర్జన్యాలను భరించలేక రూన్నగర ప్రముఖులు పదిమంది తెల్లారు జామున నాలుగు గుర్రాల బగ్గీ మాట్లాడుకుని ప్యారీస్ సమీపంలోని హావ్రే నగరానికి బయలుదేరారు. కోచ్ లో నగరవేశ్య కూ ఒకామె వుంటుంది. మొపాసా ఆమెను Prostitute అని కాకుండా courtesan అని గౌరవంగా  పరిచయం చేసాడు. 
వేశ్యల్లోనూ అనేక అంతస్తులుంటాయి. అక్కడా హాకర్స్-షోరూమ్తేడాలుంటాయి. 1970 నాటి రాజమండ్రి భాషలో చెప్పాలంటే మొదటిది ఇసుకవీధి, రెండోది మెరకవీధి. డబ్బు పడేస్తున్నాంకదా అని ఇసుకవీధి కొంపల్లోనికి వెళ్ళినంత సులువుగా మెరక వీధి మేడల్లోనికి వెళ్లడం కుదరదు. అక్కడ అనేక లాంఛనాలు వుంటాయి. అవన్నీ సంతృప్తి చెందితేనే ప్రవేశం వుంటుంది. ఇసుకవీధి అమ్మాయిలకు ఇంటి పేర్లు వుండవు. పేర్లు మాత్రమే వుంటాయి. పేర్లు కూడా కొత్తగా రంగంలో దిగాక పెట్టుకున్నవే.  మెరక వీధి అమ్మాయిలకు పేర్లు, ఇంటిపేర్లు కూడా వుంటాయి. ఇంటి పేర్లు కూడా ప్రాంతంలోని ప్రముఖ కుటుంబాలకు చెందినవే అయ్యుంటాయి. కన్నెరికం సాంప్రదాయం నుండి వాళ్లకు ఇంటి పేర్లు వస్తాయి.
స్థనాలు (embonpoint) వయసుకు మించి పెరిగిపోవడంవల్ల ఆమెకు ఊర్లో వెన్నముద్ద అనే ముద్దుపేరు స్థిరపడిపోయింది. ఆమె అసలు పేరు ఎలిజిబెత్ రూసో. సిసిలి జాతికి చెందిన కులీనుల ఇంటిపేరు అది. ఒక విధంగా ఆమెది గురజాడవారి కన్యాశుల్కం మధురవాణి రేంజి!
ఊరిని వదిలి పారిపోయే హడావిడిలో వాళ్లంతా తిండి తెచ్చుకోవడం మరచిపోయారు. మంచుదారిలో ప్రయాణం నిదానంగా సాగుతుంటే ఆకలి వేగంగా పెరిగిపోతోంది. ఆకలి ఘట్టంలోనే సారా వ్యాపారి లూసొ eat the fattest of the passengers’’ పాటను గుర్తు చేసాడు. సముద్రంలో దారితప్పిన నావికులు తిండి దొరకనపుడు తమలో లావుగా వున్నవాడ్ని కోసుకు తినేస్తారని చెప్పే పాట అది. వెన్నముద్దను దృష్టిలో పెట్టుకునే అతనా మాట అన్నాడు. అది వినంగానే మర్యాదస్తులైన ప్రయాణికులందరూ ఉలిక్కి పడ్డారు.    
కథలో ఆరంభం కాబోతున్న ఘర్షణకు ఇది తొలి సంకేతం. దీనినే కథా నిర్మీతిలో మొదటి ప్లాట్ పాయింట్ అంటారు.
బగ్గీలోని కులీన స్త్రీలంతా వెన్నముద్దను చూసి మొదట ఈసడించుకున్నారు. అయితే వాళ్ల పొగరును ఆకలి అణిచివేసింది. ఆమె తెచ్చిన తిండి తినకతప్పలేదు. ఆమె తిండి తింటూ ఆమెతో మాట్లాడకపోవడం  మర్యాద కాదు కనుక మాట కలిపారు. మాటల్లో ఆమె తాను ఫ్రెంచ్ విప్లవనేత నెపోలియన్ బొనపార్టెకు వీరాభిమానినని ప్రకటించుకుంది.  జర్మన్లు అంటే తనకు పరమ ద్వేషం అంది. వీలు కుదిరితే జర్మన్ సైనికాధికారి  ఒక్కడినయినా చంపాలనేది తన కోరిక అని భయం లేకుండా చెప్పేసింది.   
ఆరంభం కాబోతున్న ఘర్షణకు ఇది మలి సంకేతం. దానినే కథా నిర్మీతిలో రెండవ ప్లాట్ పాయింట్ అంటారు.
అలనాటి ఫ్రాన్స్ లోని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, రివల్యూషనరీ రాజకీయాలు కూడా బగ్గీలో చర్చకు వచ్చాయి. తిండి, కబుర్లు ముగిసే సమయానికి చీకటి పడింది. బగ్గీలో అందరూ నిద్రకు ఉపక్రమించారు.  డెమోక్రాట్ కోర్నుడెట్ చొరవచేసి వెన్నముద్ద భజం మీద చెయ్యి వేశాడు. ఆమె చీకట్లో అతని భుజాన్ని గురిచూసి  చప్పుడు కాకుండా బలంగా ఒక గుద్దుగుద్ధింది.
ఇది కూడా ఒక ప్లాట్ పాయింటే. ఇలా ప్రతి చోటా వెన్నముద్ద స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనాన్ని కొనసాగిస్తాడు మొపాసా. ఇంకో సందర్భంలోనూ శత్రు ఛాయలున్న చోట తాను సెక్స్ లో పాల్గొనను  అంటుంది ఎలిజిబెత్.

తరువాత దృశ్యంలో వెలుతురు తగ్గిపోయి చీకట్లు కమ్ముకున్నాయి. శబ్దం ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించింది. నిద్ర ముందు కొచ్చి మనుషులు నిశ్చలనంగా మారిపోయారు. బగ్గీ టోట్స్ నగరంలో ప్రవేశించింది.  
హఠాత్తుగా జర్మన్  భాషలో కేకలు అరుపులు, సైనికుల పదఘట్టనలు, సెర్చ్ లైట్ల వెలుతురులతో కొత్త సన్నివేశం ఆరంభం అయ్యింది. అప్పుడు ప్రత్యక్ష మయ్యాడు పొడవుగా సన్నగా వున్న జర్మన్ అధికారి.   పెద్దపెద్ద  మీసాలు పెంచాడుగానీ  పెద్ద వయసేమీకాదు; యువకుడే.
ఒక భీభత్స సన్నివేశాన్ని ఆరంభంచడానికి ముందు కాన్వాస్ ను నిశ్శబ్ద, నిశ్ఛలన, కాంతిహీనంగా మార్చడం ఒక టెక్నిక్.  ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిధ్ధ దర్శకులందరూ సినిమాల్లో ప్రతినాయకుడ్ని పరిచయం చేసే ఘట్టంలో ఇలాంటి టెక్నిక్ నే వాడారు. బాపు గారి ముత్యాలముగ్గు సినిమాలో  రావుగోపాలరావు పరిచయం ఘట్టం గుర్తుందిగా?
ఇక్కడే ఘర్షణ అధ్యాయం మొదలవుతుంది. సాధారణంగా ఘర్షణ అధ్యాయం పావు కథ అయ్యాక మొదలయ్యి ముప్పావు కథ వరకు కొనసాగుతుంది.
జర్మన్ అధికారిని చూసి బగ్గీలోని ప్రయాణికులంతా భయంతో ఒణికిపోయారు. వెన్నముద్దకు మాత్రం ఆవేశం ముంచుకొచ్చింది. అందరూ హోటల్  గదుల్లో సామాన్లు పెట్టి డైనింగ్ హాలులో రాత్రి భోజనాలకు కూర్చొని వుండగా హొటల్ యజమాని వచ్చిమేడం ఎలిజబెత్ రూసో?” అని పిలవడంతో కథ మలుపు తిరుగుతుంది.
కథ ఆరంభం నుండీ ఆమెను వెన్నముద్దగానే వర్ణిస్తూ వచ్చిన మొపాసా అప్పుడే మొదటిసారి ఆమె పేరు చెపుతాడు. ఆమె రూసో వంశీకురాలు అని పాఠకులకు పాత్రలకు అప్పుడే తెలుస్తుంది.
జర్మన్ సైనికాధికారి తనతో మాట్లాడాలనుకుంటున్నాడని హొటల్ యజమాని చెప్పాడు. జర్మన్ సైనికాధికారులతో తాను మాట్లాడనని వెన్నముద్ద మొండికేసింది. అమ్మాయి తమ కొంప ముంచుతుందని కులినులందరూ భయపడి పోయారు. వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కోమని అందరూ ఆమెను బతిమాలారు. చివరకు ఆమె ఒప్పుకుంది.
జర్మన్ సైనికాధికారుల మొఖం చూడడమే నాకు ఇష్టంలేదు. మీకోసం వెళుతున్నాను. గుర్తుపెట్టుకోండిఅంది వెన్నముద్ద.
కౌంటెస్ ముందుకు వచ్చి ఆమె ఎలిజబెత్  చేతిని ఆప్యాయంగా  పట్టుకునిమీ మేలు మరిపోలేముఅంది.
జర్మన్ సైనికాధికారిని కలిశాక అతన్ని తిట్టుకుంటూ  చ్చింది   వెన్నముద్ద. కానీ ఎందుకు అతన్ని తిడుతుందో చెప్పదు.  అందరూ ఆమె చుట్టూ మూగి ఎన్నోసార్లు అడిగాక మరునాడు  అసలు విషయం చెపుతుంది.
వాడు నాతో ఒక రాత్రి పడుకుంటాడట 
ఇది కథకు మిడ్ పాయింట్.
కథ రెండవ భాగంలో అసలు నాటకం మొదలవుతుంది. జర్మన్ సైనికాధికారి కోరిక విని మర్యాదస్తులందరూ నిర్ఘాంతపోయారు. హాహాకారాలు చేశారు. బల్ల మీద వున్న వస్తువుల్ని కోపంగా నేలకేసి కొట్టారు. మనుషుల్లో ఇంత నీచులుంటారా? అని తిట్టిపోశారు.
మరునాడు మర్యాదస్తుల ధోరణి మారిపోయింది. వెన్నముద్ద వల్లనే తమకు కష్టాలు వచ్చాయనే ఆలోచన మొదలయింది. వేశ్య వృత్తిలో వున్న మనిషికి  వాడితో క్క రాత్రి పడుకుంటే కొత్తగా వచ్చే నష్టమేంటీ? వంటి తర్కాలూ చేశారు. చిన్న విషయాన్ని ఎక్కువ చేస్తున్నదని విసుక్కున్నారు. వెన్నముద్ద కాళ్ళూ చేతులు కట్టి వాడికి అప్పచెప్పాలనే మొరటు ఆలోచనలూ చేశారు.  వాళ్లంతా మర్యాదస్తులు కనుక తమ ఆలోచనల్ని బయటికి పొక్కకుండా జగ్రత్త పడ్డారు. మంచి మాటలతో ఆమెను ఒప్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. శత్రువుల కోట మీదికి యుధ్ధానికి వెళూతున్న సైన్యాధిపతిలా వ్యూహ రచన చేశారు.  ఒక క్రమ పధ్ధతిలో ఆమెతో ఎవరు ఎలా మాట్లాడాలో ఒక స్ల్రిప్టు అనుకుని రిహార్సల్ కూడా వేసుకున్నారు.
వెన్నముద్దను జర్మన్ అధికారి పక్కన పడుకోబెట్టడానికి దేశభక్తి అనే సెంటిమెంటును గట్టిగా పూశారు. శత్రు సైన్యాధికారులకి తమ అందాల్ని ఎరగా వేసి దేశ ప్రజల్ని కాపాడిన పౌరాణీక స్త్రీల గాధల్ని ఏకరువు పెట్టారు. చరిత్రలో లేని కొన్ని గాధల్ని తామే కల్పించి చెప్పారు. అసలు ఆడదాని శరీరం వున్నది శత్రువులనించి తమ పురుషులని కాపాడటానికే అన్నంతగా కథలు అల్లేశారు.
వాళ్ళు ఇంతగా చెపుతున్నా వెన్నముద్దకు నమ్మకం కలగలేదు. అప్పుడు చర్చి సిస్టర్లు రంగంలోనికి దిగారు. “పరుల హితం కొరకు మనుషులు చేసే పాప కార్యాలని భగవంతుడు  క్షమిస్తాడు” అని  గట్టిగా చెప్పారు. బగ్గీలో వున్న పది మందినేకాక హావ్రే నగరంలో తమ సేవల కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది క్షతగాత్రులని కాపాడే అవకాశం భగవంతుడు ఆమెకే ఇచ్చాడన్నారు. 
దేశభక్తితోపాటు దైవ అనుమతి కూడా వుండడంతో వెన్నముద్ద ఆలోచనల్లో పడిపోయింది.  తరువాతి రోజు కూ మర్యాదస్తులంతా కలిసి  దాదాపు ఇలాంటి నాటకాన్నే కొనసాగించారు. లోకంలో ఎంతటి మూర్ఖుడికి అయినా దేశభక్తి, దైవభక్తి రంగరించి పోస్తే పూనకం వచ్చేస్తుందని వాళ్ళకు తెలుసు. దీనికి ఎలిజబెత్ మినహాయింపుకాదు.  తన మాతృదేశ ప్రజల్ని రక్షించడం కోసం  శత్రుదేశపు సైనికాధికారితో పడుకోవడానికి ఆమె సిధ్ధపడింది.
మొపాసా కథల్లో శృంగార నేపథ్యం వుంటుందిగానీ శృంగార వర్ణన వుండదు. మొపాసాకు సంబంధించి సెక్స్ అనేది మానవ సహజ చర్య.  వస్త్రాలు ముసుగులు లేకుండా సాగించే నగ్న కార్యం కనుక దానిని పాఠకులకు వర్ణించి చెప్పాల్సిన పనిలేదను కుంటాడతను.  
రాత్రి పడగ్గదిలో వెన్నముద్దతో జర్మన్ సైనికాధికారి సాగించిన శృంగారం గురించి ఒక్క వాక్యం కూడా రచయిత రాయడు. అంతకు ముందు జర్మన్ సైనికాధికారి వెన్నముద్దతో  తన కోరికను చెప్పిన సన్నివేశాన్ని కూడా మొపాసా పాఠకులకు చూపడు. కానీ, జర్మన్ సైనికాధికారి పడగ్గదిలో వెన్నముద్ద వుండగా వాళ్ళ సంభోగం గురించి మర్యాదస్తులు హొటల్ గదుల్లో కూర్చొని చెప్పుకునే మాటల్ని మొపాసా విపులంగా  రాస్తాడు. మర్యాదస్తుల జీవితాల్లోని బూటకాన్ని బయటపెట్టడం అతని లక్ష్యం.
వేశ్య జీవితం పారదర్శకం. మర్యాదస్తుల జీవితం తెర తీయని నాటకం. మపాసా తెరను చించిపడేస్తాడు.
తనకు దక్కని సౌఖ్యం జర్మన్ సైనికాధికారికి దక్కినందుకు డెమోక్రాట్ ఉక్రోషాన్ని పట్టలేకపోయాడు.  తమ లాంటి గొప్ప అందగత్తెల్ని కాకుండా బజారుదాన్నిఎంచుకున్న  జర్మన్ సైనికాధికారి అభిరుచికి మర్యాదస్తుల మహిళలు నొచ్చుకున్నారు. పెళ్ళి అయిన మహిళలంటే జర్మన్ అధికారికి చాలా గౌరవం కనుక తమ జోలికి రాలేదని కొందరు సమర్దించుకున్నారు.  యూనిఫాం వేసుకున్న మాగాడికి ఒళ్ళు సమర్పించుకోవడంలోవున్న ఆనందాన్నీ కొందరు ప్రస్తావించారు. జర్మన్ అధికారి తమను బలవంతంగా లొంగదీసుకుంటున్నట్టు ఊహించుకుని పరవశించిపోయినవాళ్ళూ బృందంలో వున్నారు. వేశ్యావృత్తిలో వుంటూ అధికారి  కోరికను కాదనే హక్కు వెన్నముద్దకు లేదని వాదించే వారూ వారిలో వున్నారు.
మరునాడు ఉదయం హావ్రే వెళ్లడానికి బగ్గీ సిధ్ధం అయింది. వెన్నముద్దది చిత్రమైన పరిస్థితి. వేశ్యా వృత్తిలో వున్న స్త్రీకి  ఇలాంటి రాత్రుళ్ళు కొత్తకాదు. కానీ రాత్రి భిన్నమైనది. తన దేహం జాతీయ సమస్యగా మారిన రాత్రి అది. తను మేలు చేసిందో మోసపోయిందో అర్దం కావడంలేదామెకు. అంతకు ముందు రోజు తనను అంతగా బతిమాలి ఒప్పించి పంపినవాళ్ళు  ఈరోజు తనను ఎంతగానో ఓదారుస్తారని ఆమె ఆశించింది. మొదటి రోజు వాళ్ళు తిండి తెచ్చుకోవడం మరిచిపోయినట్టు తను ఈరోజు తిండి తెచ్చుకోవడం మరచిపోయింది. మొదటి రోజు తను వాళ్ళకు వడ్డించినట్టు ఈరోజు వాళ్ళు తనకు కొసరికొసరి  వడ్డిస్తారని ఆమె అనుకుంది. కానీ వాళ్ళు ఆమెను చూడగానే అంటువ్యాధి సోకిన రోగిని చూసినట్టు మూకుమ్మడిగా పక్కకు తప్పుకున్నారు.
అంతా కలిసి తనను మోసం చేశారని ఆమెకు కొంచెం ఆలస్యంగా అర్ధం అయింది.  సరిగ్గా వారం క్రితం ఆమె ఒక జర్మన్ సైనికాధికారిని కుర్చీతో తల పగలగొట్టి చంపడానికి సిధ్ధమయింది. ఈరోజు శత్రుదేశస్తుల్ని మించిన శత్రువులు తన ముందు కూర్చుని చోద్యం చూస్తుంటే తను తలవంచుకు నిలబడింది. మోసపోవడం ఎవరికైనా బాధాకరమే. మొసగించినవాళ్ళ ముందు నిస్సహాయంగా నిలబడడం అంతకన్నా బాధాకరం.
మనుషులకు దుఃఖం, బాధ, దిగులు, బెంగ, నిస్పృహ, నిస్సహాయత అవమానం, పరాభవం ఎప్పుడయినా కలగవచ్చు. కానీ, ఏడ్వడానికి మాత్రం స్థలం, సందర్భం కావాలి. ఆత్మీయుల భుజాలు పట్టుకుని ఏడ్వగలగడం ఒక గొప్ప వరం. జీవితంలో అంతటి  అదృష్టంలేనివాళ్ళు గదిలో ఒంటరిగా కూర్చోనో, గుబురు చెట్ల మధ్య నిలబడో, కొండల్లోకి వెళ్ళో ఎవరూ చూడకుండా గట్టిగా  వెక్కివెక్కి ఏడ్చి మనసు తేలికబడ్డాక మళ్ళీ ఇహలోకం లోనికి  ప్రవేశిస్తారు.
ఎలిజిబెత్ రూసో దురదృష్టవంతుల్లోకెల్లా దురదృష్టవంతురాలు. ఏడ్పు వచ్చినా ఏడ్వలేని పరిస్థితి ఆమెది. ఆమెకు మోసం, దుఃఖం, బాధ, దిగులు, బెంగ, నిస్పృహ, అవమానం, పరాభవం అన్నీ ఒక్కసారే జరిగిపోయాయి. అంతటి  నిస్సహాయతలో గట్టిగా ఏడ్వాలనిపించడం సహజం. తన చుట్టూ వున్నది తనను మోసం చేసినవాళ్ళు. వాళ్లముందు ఏడ్వడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువచ్చింది. కానీ లోపలినుండి ఏడుపు పెల్లుబుకుని వచ్చేస్తోంది. అది బయటికి రాకుండా దాన్ని ఆమె గొంతులో బలవంతంగా నొక్కి వేస్తోంది. అప్పుడు ఏడుపు వెక్కిళ్ళుగా మారిపోయాయి.
వెన్నముద్ద ఇంకా ఏడుస్తూనే వుంది.  కోర్నుడెట్ ఆలపిస్తున్న ఫ్రెంచ్ జాతీయ గీతం చరణల మధ్య ఆమె వెక్కిళ్ళు రాత్రి చీకట్లో  సన్నగా వినిపిస్తున్నాయిఅనే పారడాక్సీతో కథ ముగుస్తుంది.
జాతీయ గీతం వైచిత్రి తరువాతి కాలంలో దాదాపు ఒక ఫార్మూలాగా మారిపోయింది. ఛార్లీ చాప్లిన్ సిటీలైట్స్ సినిమా ఆరంభంలోనే ఇలాంటి సన్నివేశం వుంటుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ గజల్ముఝ్ సే పహిలీసి ముహబ్బత్ నా మాంగ్కూడా కోవలోదే. 1970 దశకం తరువాత ప్రక్రియ విస్తారంగా సాగింది. “గాంధి పుట్టిన దేశమా ఇది?” (పవిత్ర బంధం), “గాంధీ పుట్టిన దేశం/రఘురాముడు ఏలిన రాజ్యం (గాంధీ పుట్టిన దేశం), వందేమాతర గీతం స్వరం మారుతున్నది (వందేమాతరం) వంటి అనేక పాటలు, సన్నివేశాలు అనేక సినిమాల్లో వచ్చాయి.
అయితే వాళ్ళంతా మొపాసాను కాపీ కొట్టారని కాదు. కొన్ని సాంప్రదాయాలు అలా పుట్టి కొనసాగుతుంటాయి. మనం భారత సినిమాల్లో  చూసిన  సంఘటనలన్నీ దేశంలో నక్సలైట్ ఉద్యమం ఆరంభం అయ్యాక, భారత రాజ్యాంగంలో సోషలిజాన్ని చేర్చాలనే ఆలోచనలు బలపడ్డాక వచ్చిన సాహిత్యం. నేను రాసినప్రగతినాటిక కోసం యంజీ రామారావు రాసినఇది భారత దేశం, ఇది భూతల స్వర్గంపాట కూడా సాంప్రదాయంలో వచ్చిందే. మొపాసా గొప్పతనం ఎక్కడ వుందంటే, 19 శతాబ్దంలోనే జాతీయగీతం మీద నిరసన తెలపడం. అది అంత చిన్న విషయం కాదు.

తెలుగు భాషతో  అనుబంధం వున్నవాళ్ళకు ఫ్రెంచ్ భాషతో అనేక ఇబ్బందులు వుంటాయి. తెలుగు భాషలో ప్రతి అక్షరాన్నీ పలుకుతాం. ఇంగ్లీషు భాషలో కొన్ని సైలెంట్ అక్షరాలుంటాయి. ఫ్రెంచ్  భాషలో  సైలెంట్ అక్షరాలు ఎక్కువగా వుండడమేగాక అవి కొత్త శబ్దాల్ని కూడా ఇస్తాయి. నాకు ఫ్రెంచ్ భాష రాదుకనుక, వచ్చినా కొన్ని శబ్దాల్ని తెలుగులో రాయలేము కనుక  పరిమితుల్లోనే ఇందులోని  నామవాచకాలను అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. అసలు మొపాసా పేరునే వాళ్ళు చాలా భిన్నంగా ఉచ్చరిస్తారట. 
“And Boule de Suif still wept, and sometimes a sob she could not restrain was heard in the darkness between two verses of the song” అనే మొపాసా ముగింపు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలిజిబెత్ రూసో ను ఒళ్ళోకి తీసుకుని, హృదయానికి హత్తుకుని, తల నిమురుతూ ఓదార్చాలని ప్రతి పాఠకునికీ అనిపిస్తుంది. (అలా అనిపించకపోతే వాళ్ళు అసలు మనుషులేకాదు. మనిషికానివాడు పాఠకుడుకాలేడు.). అప్పుడు సాహిత్యం ఒక సామాజిక చర్యగా మారిపోతుంది. ఒక వేశ్యను ఒళ్ళోకి తీసుకుని ఓదార్చే సామాజిక చర్య!. “విసర్జిత వ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించడమేగాక పాఠకుల చేత కూడా  గుర్తింప చేసేవాళ్ళు గొప్ప రచయితలుఅంటూ నా పోస్ట్ పై   కామెంట్ పెట్టిన వేమన వసంత లక్ష్మి కోణాన్ని సరిగ్గా గుర్తించింది. విసర్జిత జీవుల్ని అభిమానించేలా చదువరుల్ని సిధ్ధం చేయడమే అస్థిత్వవాద సాహిత్యాల ప్రయోజనం. అందుకు నేను మొపాసాను ప్రేమిస్తాను; చాలాచాలా ప్రగాఢంగా.

(వారం క్రితం బౌలే ది సౌఫ్ తెలుగు అనువాదాన్ని నా వాల్ మీద షేర్ చేస్తే రెండు లైకులు మాత్రమే ఇచ్చి నన్ను రెచ్చగొట్టిన ముఖపుస్తక మిత్రులకు ధన్యవాదాలు)

హైదరాబాద్
4 ఆగస్టు 2017

కొనసాగింపు

Boule de Suif మీద నేను రాసిన తులనాత్మక వ్యాసంపై ఫేస్ బుక్ లో సాగిన చర్చలో ఒకరు చెలం కథల్ని, వాటి మీద మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వారు చేసిన వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు.  
మొపాస కథలో చెలం ప్రస్తావన తేవాలని నేను అనుకోలేదు.  అస్థిత్వవాద దశలో దృక్పథాలు విభేదిస్తాయి కనుక ఆమేరకు చెలం పాత్రలు కొన్నింటి చిత్రణపై నాకు భిన్నాభిప్రాయాలు వున్నాయి.  అయితే, చెలం గారి స్వతంత్ర ఆలోచనల మీదా,  పరుగులు తీసే వారి తెలుగు  వాక్యాల మీద నాకు అపార గౌరవం వుంది.  వారి మీద మొపాసా, D. H. Lawrence ప్రభావం వుందని  అందరికీ తెలుసు. విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తే అవగాహనలేని కొందరు  పాఠకులు   చెలాన్ని పుసుక్కున plagiarist  అనేస్తారని భయపడ్డాను. సోషల్ మీడియాలో స్థాయిలేనివాళ్ళు సహితం  పదాన్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నారు.
Inspiration వేరు;  adoption వేరు; plagiarism వేరు. చెలాన్ని plagiarist  అని ఒక కుర్రకుంక అన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి అలనాటి ఉద్దండులు అన్నా తప్పే.
ప్రపంచవ్యాప్తంగా  మానవాళికి ప్రేమ, ద్వేషం, బాధ, అసూయ, మోసం, త్యాగం, స్వార్ధం వంటి ప్రాధమిక భావోద్వేగాలు కొన్ని మాత్రమే వుంటాయి. వాటిని సాహిత్య తొలి దశల్లోనే  అన్ని జాతుల్లోనూ, అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ  అప్పటి కవులు , రచయితలు  గ్రంధస్తం చేసేశారు. "పురాణాలు మానవజాతి బాల్యం అని కార్ల్ మార్క్స్ వంటివాళ్ళు అన్నది అర్ధంలోనే.
తరువాతి తరం రచయితలు చేసేదేమిటంటే భావోద్వేగాలను తమ కాలానికీ, తమ ప్రాంతానికి, తమ సంస్కృతికి, తమ ఉద్యమ, రాజకీయ అవసరాలకు, తమ దృక్పధాలకు అనువుగా అన్వయించడం మాత్రమే.  O. Henry రాసిన   'The Gift of the Magi' కథ దాంపత్య అనుబంధం మీద అత్యద్భుత చిత్రణ. అంతటి గొప్ప కథను చదువుతున్నప్పుడు కూడా ఎక్కడో  ఒకసారి వాల్మీకీ రామాయణంలోని సీతారాముల అనుబంధం గుర్తుకు వస్తుంది.
చరిత్ర పునరావృతం అయినట్టు సాహిత్యం కూడా పునరావృతమౌతుంది. రచయిత అసమర్ధుడయితే ఒక నకిలీ కథను తయారుచేసి పాఠకుల ముఖాన కొడతాడు. రచయిత సమర్ధుడయితే గతంకన్నా వున్నతంగాను పునఃసృష్టి చేయగలడు.  సాహిత్య విమర్శకులు పరిశీలించాల్సింది రచయితకున్న ఆధునిక అన్వయ సామర్ధ్యం గురించి.
నేను ఏడాది జనవరి నెలలో వివాహ వేడుకకు పౌరహిత్యం  వహించాను. పూర్వకాలంలో కొత్త దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించేవారు. ఆధునిక కాలంలో  'The Gift of the Magi' సినిమా చూపించాలి, లేకుంటే కథ వున్న పుస్తకాన్ని బహూకరించాలి అని ప్రతిపాదించాను. అలా పాత సాంప్రదాయాలను update చేయవచ్చు.
 ప్రతి రచయితకూ తనదైన సృజనాత్మక శక్తి వుంటుంది. అదే అతని కాంట్రిబ్యూషన్. దానికో మూలాన్ని పీకి   plagiarist   అనేయడం సరికాదు.  అన్వయం కూడా ఒక కళా సామర్ధ్యం. మూలాన్నీ, అన్వయాన్నీ మెచ్చుకునే సామర్ధ్యం విమర్శకులకు వుండాలి.
అలా కాదంటే, మన కవిత్రయం సహితం  plagiarists జాబితాలో చేరిపోతారు. లేదా వాళ్ల రచనల్ని కేవలం అనువాదాలు అనాల్సి వుంటుంది. అది సరికాదు.  మహాభారత పాత్రల్ని జలపాత హోరులా మలచిన తిక్కన రచనా నైపుణ్యాన్ని మెచ్చుకోకపోవడం సాహిత్య అపచారం అవుతుంది.  
యమకూపం నవలాకారుడు అలెగ్జాండర్ కుప్రిన్ ఒకసారి తన రచనా ప్రక్రియ గురించి మాట్లాడుతూ "Characters I've made cannot be seen as copying real people. I picked up a lot of small details from the real life, but that was by no means copying the reality, which is something I detest doing" అన్నాడు. పైగా తాను ఒక పాత్రను ఒకరి నుండి తీసుకోడనీ అనేక మందిని పరిశీలించి ఒక పాత్రను సృష్టిస్తానన్నాడు.
జాతియోద్యమం బలంగా సాగుతున్న కాలంలో కురుక్షేత్ర  నాటక రచన సాగింది. "అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు" వంటి పద్యాలు అలా పుట్టినవే. పాత కథకు సంబంధించి అది కౌరవులకు పాండవులు చేసిన హెచ్చరికలు. కానీ, కొత్త కథకు సంబంధించి అవి వలసపాలకులకు భారతీయులు చేస్తున్న హెచ్చరికలు.  ఇంకొంచెం పరికించి చూస్తే 1930 దశకపు సైమన్ కమీషన్ రిపోర్టు,  వైశ్రాయి  లార్డ్ ఇర్విన్ మంతనాలు, బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్  రౌండ్ టేబుల్ సమావేశ ఏర్పాట్లు, మహాత్మాగాంధీ స్వరాజ్య డిమాండ్, 1940 దశకపు క్విట్ఇండియా  నినాదం  వగయిరాల ఛాయలు మనకు తిరుపతి వెంకట కవుల రాయబార ఘట్టంలో కనిపిస్తాయి. అలా పుట్టినవే "జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని.... " వంటి పద్యాలు. మహామహితాత్ము డజాతశత్రువు గాంధీ మహాత్ముడే. ఆ దండం గాంధీజీ చేతిలోని కర్రే. అర్ధం అయినవాళ్లకు అర్ధం అయినంత!.
కథ ఒకటే అయినా, వ్యాసుని మహాభారతం, కవిత్రయం మహాభారతం, తిరుపతి వేంకట కవుల కురుక్షేత్ర నాటకం ఒకటికాదు.  మూడింటి చారిత్రక సందర్భాలు వేరు. ప్రయోజనాలు వేరు.  విధంగా అవి స్వతంత్ర రచనలే.
ఇప్పుడు అస్థిత్వవాద యుగంలో అంబేడ్కర్, పెరియార్,  జిన్నా పాత్రల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కురుక్షేత్ర నాటకాన్ని తిరగ రాయవచ్చు. అలాంటి నాటకాలు ఈపాటికే  తమిళ భాషలో వచ్చి వుంటాయి కూడ.  
మధ్య Andrey Zvyagintsev దర్శకత్వం వహించిన Leviathan (తిమింగిలగిలం) రష్యన్ సినిమా   చూసి నిర్ఘాంత పొయాను. కథ అయూబ్ (Job) అనే  ఇస్లాం ప్రవక్తకు చెందింది. దాని ప్రస్తావన బైబిల్ లో  కూడా (Naboth's Vineyard)  వుంది. వీటితోపాటూ, అమేరికాలో రోడ్ల విస్తరణ, సుందరీకరణ  పథకం మీద తిరుగుబాటు చేసి చనిపోయిన  Marvin Heemeyer  జీవితాన్ని తక్షణ ప్రేరణగా తీసుకున్నట్టు  రచయిత ప్రకటించాడు.
వారం క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక పతాక శీర్షికలో  ఆధునిక దాంపత్య జీవితం మీద పెద్ద కథనాన్ని ప్రచురించింది.  మానసిక వత్తిడి, కుంగుబాటుల కారణంగా  పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గిపోవడంవల్ల భార్యా భర్తల మధ్య కొత్త వివాదాలు తలెత్తుతున్నాయనేది కథనం సారాంశం. ఇలాంటి సర్వేలు అంతర్జాతీయ socialogy పత్రికల్లో చాలా కాలంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోయి మనుషులు మధుమేహానికి గురవుతున్నట్టు భవిష్యత్తులో టెస్టోస్టిరాన్  ఉత్పత్తి తగ్గిపోయి మగజాతే అంతరించిపోతుందనే ఊహాగానాలూ చెలరేగుతున్నాయి. వీటి ఆధారంగా కథలు రాస్తే అవి  అనివార్యంగా   D. H. Lawrence నవల  Lady Chatterley's Lover కు దగ్గరగా వుంటాయి. పరిశోధకులు ఇంకాస్త లోతుకు వెళితే లారెన్స్ నవలకు  Lady Ottoline Morrell వంటి ప్రాగ్రూపాలు కూడా కనిపిస్తాయి.
భర్త నయంకాని వ్యాధిగ్రస్తుడయినా, లైంగిక పటుత్వం లేనివాడయినా భార్య  అతనితోనే కొనసాగాలని చెప్పే పతివ్రతల కథలు మనకు చాలా వున్నాయి. 'సుమంగళి' వంటి సాంఘీక సినిమాలు కూడా వచ్చాయి.  యూరప్ మహిళలు అర్ధ శతాబ్దం ముందే ఇలాంటి నీతి కబుర్ల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు భారత మహిళలు  సహితం బాటలో నడుస్తున్నారు.  వివాహేతర సంబంధాల మీద ఇప్పటికే తెలుగులో చాలా కథలు వచ్చేశాయి. వస్తున్నాయి. వీటన్నింటినీ D. H. Lawrence కు అంటగట్టలేం.  యాభై యేళ్ళు ఆలస్యగానే కావచ్చుగానీ,  మన జీవితాలు యూరోప్ ను అనుసరిస్తున్నపుడు మన సాహిత్యం సహితం యూరోప్ ను అనుసరిస్తుంది. ఇప్పటికీ పతీవ్రతలు ఏకపత్నీవ్రతుల కథలు రాస్తున్న వాళ్ళున్నారు. ఈ కాలంలోనూ పతీవ్రతల్ని, ఏకపత్నీవ్రతుల్ని చూడగలుగుతున్న వారి మైక్రోస్కోపిక్ దృష్టిని మెచ్చుకోవాలి!.
స్వల్పకాలిక, తాత్కాలిక స్త్రీ పురుష సంబంధాల మీద   Robert James Waller రాసిన   'The Bridges of Madison County' నవల ఆధారంగా 1995లో  మెరిల్ స్ట్రిప్ తో క్లింట్ ఈస్ట్ వుడ్ ఒక  గొప్ప సినిమా తీశాడు. మహేష్ భట్ 1998లో తీసిన మరో గొప్ప సినిమా 'జఖ్మ్'  ముగింపు  ఎత్తుగడ 'The Bridges of Madison County' నవల ముగింపును పోలి వుంటుంది.  ముగింపు పోలికను పక్కన పెడితే, జఖ్మ్ సినిమాలో ప్రధాన  కథా వస్తువు   మత అసహన  వాతావరణం.  బీజేపి అగ్రనేత అడవాణి తొలి రథయాత్ర జరుపుతున్న కాలంలోనే మత అసహన  వాతావరణం మీద  సినిమా తీసినందుకు మనం మహేష్ భట్ ను ఎంతగా పొగిడినా తక్కువే.
యూరోపియన్ల గొప్పతనం  ఏమంటే తాము ఎక్కడ నుండి ప్రేరణ పొందారో దాన్ని వాళ్ళు ముందుగానే ప్రకటిస్తారు. 1933 నాటి King Kong సినిమాను చూసి జీవితంలో అలాంటి సినిమా ఒక్కటయినా తీయాలనే లక్ష్యంతో  తాను దర్శకునిగా మారినట్టు 2005లో అదే కథతో  అదే పేరుతో కొత్త  సినిమా తీసిన పీటర్ జాక్సన్ చెప్పుకున్నాడు.
మొపాసా 'వెన్నముద్ద' కథ ప్రేరణతో హాలీవుడ్లో Stage Coach' అనే సినిమా వచ్చింది. Citizen Kane సినిమా తీయడానికి ముందు ప్రేరణ కోసం Stage Coach సినిమాను నలభై రోజులు వరసాగ్గా చూసినట్టు దాని డైరెక్టరు  Orson Welles రాసుకున్నాడు. లూసన్ అయితే Old Stories Retold పేరుతో ఒక కథా సంకలనమే రాశాడు.  రావి శాస్త్రి కూ పిపీలకం వంటి కొన్ని కథల్లో అలాంటి ప్రయోగాలు చేశారు.

నేను రాసిన 'రాజుగారి కొమ్ము'కు The King and The Tamarind Drum కథ ప్రేరణ, 'కటారా' కథ ముగింపు ఎత్తుగడకు  Shaddad and his Paradise కథ ప్రేరణ, అలాంటి ఒక ఎత్తుగడ Citizen Kaneలో కూడ కనిపిస్తుంది.   గత నెలలో రాసిన 'మదరసా మేకపిల్ల' కు 'తోడేలు-మేకపిల్ల' కథ ప్రేరణ.
గత దశాబ్దంన్నర కాలంగా Vishal Bhardwaj, Sanjay Leela Bansali ఒకరితో ఒకరు పోటీపడి షేక్స్ పియర్ నాటకాలకు మహత్తర అన్వయాలు.  తీస్తున్నారు.  షేక్స్ పియర్ Hamlet,  Basharat Peer అనుభవాలు Curfewed Nightను కలిపి  Vishal Bhardwaj హైదర్ సినిమాగా మలిచిన తీరు అద్భుతం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన పాతాళభైరవి (1951) మూల కథను పింగళి నాగేంద్రరావు అల్లావుద్దీన్ నుండే తీసుకున్నారు. అన్నట్టు ఆధునిక అన్వయాలు పొందుతున్న వాటిల్లో రామాయణ మహాభారతాలు, నీతిచంద్రికలు, అరేబియన్ రాత్రులతోపాటూ  షేక్స్ పియర్, గై డి మొపాసాల రచనలే ఎక్కువ.
14 ఆగస్టు 2017

No comments:

Post a Comment