Sunday, 13 August 2017

Adaption వేరు Plagiarism వేరు

Adaption వేరు Plagiarism వేరు

- ఉషా యస్ డానీ


Boule de Suif మీద నేను రాసిన తులనాత్మక వ్యాసంపై ఫేస్ బుక్ లో సాగిన చర్చలో ఒకరు చెలం కథల్ని, వాటి మీద మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి వారు చేసిన వ్యాఖ్యానాన్ని ప్రస్తావించారు.  
మొపాస కథలో చెలం ప్రస్తావన తేవాలని నేను అనుకోలేదు.  అస్థిత్వవాద దశలో దృక్పథాలు విభేదిస్తాయి కనుక ఆమేరకు చెలం పాత్రలు కొన్నింటి చిత్రణపై నాకు భిన్నాభిప్రాయాలు వున్నాయి.  అయితే, చెలం గారి స్వతంత్ర ఆలోచనల మీదా,  పరుగులు తీసే వారి తెలుగు  వాక్యాల మీద నాకు అపార గౌరవం వుంది.  వారి మీద మొపాసా, D. H. Lawrence ప్రభావం వుందని  అందరికీ తెలుసు. విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తే అవగాహనలేని కొందరు  పాఠకులు   చెలాన్ని పుసుక్కున plagiarist  అనేస్తారని భయపడ్డాను. సోషల్ మీడియాలో స్థాయిలేనివాళ్ళు సహితం  పదాన్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నారు.
Inspiration వేరు;  adoption వేరు; plagiarism వేరు. చెలాన్ని plagiarist  అని ఒక కుర్రకుంక అన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి అలనాటి ఉద్దండులు అన్నా తప్పే.
ప్రపంచవ్యాప్తంగా  మానవాళికి ప్రేమ, ద్వేషం, బాధ, అసూయ, మోసం, త్యాగం, స్వార్ధం వంటి ప్రాధమిక భావోద్వేగాలు కొన్ని మాత్రమే వుంటాయి. వాటిని సాహిత్య తొలి దశల్లోనే  అన్ని జాతుల్లోనూ, అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ  అప్పటి కవులు , రచయితలు  గ్రంధస్తం చేసేశారు. "పురాణాలు మానవజాతి బాల్యం అని కార్ల్ మార్క్స్ వంటివాళ్ళు అన్నది అర్ధంలోనే.
తరువాతి తరం రచయితలు చేసేదేమిటంటే భావోద్వేగాలను తమ కాలానికీ, తమ ప్రాంతానికి, తమ సంస్కృతికి, తమ ఉద్యమ, రాజకీయ అవసరాలకు, తమ దృక్పధాలకు అనువుగా అన్వయించడం మాత్రమే.  O. Henry రాసిన   'The Gift of the Magi' కథ దాంపత్య అనుబంధం మీద అత్యద్భుత చిత్రణ. అంతటి గొప్ప కథను చదువుతున్నప్పుడు కూడా ఎక్కడో  ఒకసారి వాల్మీకీ రామాయణంలోని సీతారాముల అనుబంధం గుర్తుకు వస్తుంది.
చరిత్ర పునరావృతం అయినట్టు సాహిత్యం కూడా పునరావృతమౌతుంది. రచయిత అసమర్ధుడయితే ఒక నకిలీ కథను తయారుచేసి పాఠకుల ముఖాన కొడతాడు. రచయిత సమర్ధుడయితే గతంకన్నా వున్నతంగాను పునఃసృష్టి చేయగలడు.  సాహిత్య విమర్శకులు పరిశీలించాల్సింది రచయితకున్న ఆధునిక అన్వయ సామర్ధ్యం గురించి.
నేను ఏడాది జనవరి నెలలో వివాహ వేడుకకు పౌరహిత్యం  వహించాను. పూర్వకాలంలో కొత్త దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించేవారు. ఆధునిక కాలంలో  'The Gift of the Magi' సినిమా చూపించాలి, లేకుంటే కథ వున్న పుస్తకాన్ని బహూకరించాలి అని ప్రతిపాదించాను. అలా పాత సాంప్రదాయాలను update చేయవచ్చు.
 ప్రతి రచయితకూ తనదైన సృజనాత్మక శక్తి వుంటుంది. అదే అతని కాంట్రిబ్యూషన్. దానికో మూలాన్ని పీకి   plagiarist   అనేయడం సరికాదు.  అన్వయం కూడా ఒక కళా సామర్ధ్యం. మూలాన్నీ, అన్వయాన్నీ మెచ్చుకునే సామర్ధ్యం విమర్శకులకు వుండాలి.
అలా కాదంటే, మన కవిత్రయం సహితం  plagiarists జాబితాలో చేరిపోతారు. లేదా వాళ్ల రచనల్ని కేవలం అనువాదాలు అనాల్సి వుంటుంది. అది సరికాదు.  మహాభారత పాత్రల్ని జలపాత హోరులా మలచిన తిక్కన రచనా నైపుణ్యాన్ని మెచ్చుకోకపోవడం సాహిత్య అపచారం అవుతుంది.  

యమకూపం నవలాకారుడు అలెగ్జాండర్ కుప్రిన్ ఒకసారి తన రచనా ప్రక్రియ గురించి మాట్లాడుతూ "Characters I've made cannot be seen as copying real people. I picked up a lot of small details from the real life, but that was by no means copying the reality, which is something I detest doing" అన్నాడు. పైగా తాను ఒక పాత్రను ఒకరి నుండి తీసుకోడనీ అనేక మందిని పరిశీలించి ఒక పాత్రను సృష్టిస్తానన్నాడు.
జాతియోద్యమం బలంగా సాగుతున్న కాలంలో కురుక్షేత్ర  నాటక రచన సాగింది. "అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు" వంటి పద్యాలు అలా పుట్టినవే. పాత కథకు సంబంధించి అది కౌరవులకు పాండవులు చేసిన హెచ్చరికలు. కానీ, కొత్త కథకు సంబంధించి అవి వలసపాలకులకు భారతీయులు చేస్తున్న హెచ్చరికలు.  ఇంకొంచెం పరికించి చూస్తే 1930 దశకపు సైమన్ కమీషన్ రిపోర్టు,  వైశ్రాయి  లార్డ్ ఇర్విన్ మంతనాలు, బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్  రౌండ్ టేబుల్ సమావేశ ఏర్పాట్లు, మహాత్మాగాంధీ స్వరాజ్య డిమాండ్, 1940 దశకపు క్విట్ఇండియా  నినాదం  వగయిరాల ఛాయలు మనకు తిరుపతి వెంకట కవుల రాయబార ఘట్టంలో కనిపిస్తాయి. అలా పుట్టినవే "జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని.... " వంటి పద్యాలు. మహామహితాత్ము డజాతశత్రువు గాంధీ మహాత్ముడే. ఆ దండం గాంధీజీ చేతిలోని కర్రే. అర్ధం అయినవాళ్లకు అర్ధం అయినంత!.
కథ ఒకటే అయినా, వ్యాసుని మహాభారతం, కవిత్రయం మహాభారతం, తిరుపతి వేంకట కవుల కురుక్షేత్ర నాటకం ఒకటికాదు.  మూడింటి చారిత్రక సందర్భాలు వేరు. ప్రయోజనాలు వేరు.  విధంగా అవి స్వతంత్ర రచనలే.
ఇప్పుడు అస్థిత్వవాద యుగంలో అంబేడ్కర్, పెరియార్,  జిన్నా పాత్రల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కురుక్షేత్ర నాటకాన్ని తిరగ రాయవచ్చు. అలాంటి నాటకాలు ఈపాటికే  తమిళ భాషలో వచ్చి వుంటాయి కూడ.  
మధ్య Andrey Zvyagintsev దర్శకత్వం వహించిన Leviathan (తిమింగిలగిలం) రష్యన్ సినిమా   చూసి నిర్ఘాంత పొయాను. కథ అయూబ్ (Job) అనే  ఇస్లాం ప్రవక్తకు చెందింది. దాని ప్రస్తావన బైబిల్ లో  కూడా (Naboth's Vineyard)  వుంది. వీటితోపాటూ, అమేరికాలో రోడ్ల విస్తరణ, సుందరీకరణ  పథకం మీద తిరుగుబాటు చేసి చనిపోయిన  Marvin Heemeyer  జీవితాన్ని తక్షణ ప్రేరణగా తీసుకున్నట్టు  రచయిత ప్రకటించాడు.
వారం క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక పతాక శీర్షికలో  ఆధునిక దాంపత్య జీవితం మీద పెద్ద కథనాన్ని ప్రచురించింది.  మానసిక వత్తిడి, కుంగుబాటుల కారణంగా  పురుషుల్లో లైంగిక పటుత్వం తగ్గిపోవడంవల్ల భార్యా భర్తల మధ్య కొత్త వివాదాలు తలెత్తుతున్నాయనేది కథనం సారాంశం. ఇలాంటి సర్వేలు అంతర్జాతీయ socialogy పత్రికల్లో చాలా కాలంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోయి మనుషులు మధుమేహానికి గురవుతున్నట్టు భవిష్యత్తులో టెస్టోస్టిరాన్  ఉత్పత్తి తగ్గిపోయి మగజాతే అంతరించిపోతుందనే ఊహాగానాలూ చెలరేగుతున్నాయి. వీటి ఆధారంగా కథలు రాస్తే అవి  అనివార్యంగా   D. H. Lawrence నవల  Lady Chatterley's Lover కు దగ్గరగా వుంటాయి. పరిశోధకులు ఇంకాస్త లోతుకు వెళితే లారెన్స్ నవలకు  Lady Ottoline Morrell వంటి ప్రాగ్రూపాలు కూడా కనిపిస్తాయి.
భర్త నయంకాని వ్యాధిగ్రస్తుడయినా, లైంగిక పటుత్వం లేనివాడయినా భార్య  అతనితోనే కొనసాగాలని చెప్పే పతివ్రతల కథలు మనకు చాలా వున్నాయి. 'సుమంగళి' వంటి సాంఘీక సినిమాలు కూడా వచ్చాయి.  యూరప్ మహిళలు అర్ధ శతాబ్దం ముందే ఇలాంటి నీతి కబుర్ల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు భారత మహిళలు  సహితం బాటలో నడుస్తున్నారు.  వివాహేతర సంబంధాల మీద ఇప్పటికే తెలుగులో చాలా కథలు వచ్చేశాయి. వస్తున్నాయి. వీటన్నింటినీ D. H. Lawrence కు అంటగట్టలేం.  యాభై యేళ్ళు ఆలస్యగానే కావచ్చుగానీ,  మన జీవితాలు యూరోప్ ను అనుసరిస్తున్నపుడు మన సాహిత్యం సహితం యూరోప్ ను అనుసరిస్తుంది. ఇప్పటికీ పతీవ్రతలు ఏకపత్నీవ్రతుల కథలు రాస్తున్న వాళ్ళున్నారు. ఈ కాలంలోనూ పతీవ్రతల్ని, ఏకపత్నీవ్రతుల్ని చూడగలుగుతున్న వారి మైక్రోస్కోపిక్ దృష్టిని మెచ్చుకోవాలి!.
స్వల్పకాలిక, తాత్కాలిక స్త్రీ పురుష సంబంధాల మీద   Robert James Waller రాసిన   'The Bridges of Madison County' నవల ఆధారంగా 1995లో  మెరిల్ స్ట్రిప్ తో క్లింట్ ఈస్ట్ వుడ్ ఒక  గొప్ప సినిమా తీశాడు. మహేష్ భట్ 1998లో తీసిన మరో గొప్ప సినిమా 'జఖ్మ్'  ముగింపు  ఎత్తుగడ 'The Bridges of Madison County' నవల ముగింపును పోలి వుంటుంది.  ముగింపు పోలికను పక్కన పెడితే, జఖ్మ్ సినిమాలో ప్రధాన  కథా వస్తువు   మత అసహన  వాతావరణం.  బీజేపి అగ్రనేత అడవాణి తొలి రథయాత్ర జరుపుతున్న కాలంలోనే మత అసహన  వాతావరణం మీద  సినిమా తీసినందుకు మనం మహేష్ భట్ ను ఎంతగా పొగిడినా తక్కువే.
యూరోపియన్ల గొప్పతనం  ఏమంటే తాము ఎక్కడ నుండి ప్రేరణ పొందారో దాన్ని వాళ్ళు ముందుగానే ప్రకటిస్తారు. 1933 నాటి King Kong సినిమాను చూసి జీవితంలో అలాంటి సినిమా ఒక్కటయినా తీయాలనే లక్ష్యంతో  తాను దర్శకునిగా మారినట్టు 2005లో అదే కథతో  అదే పేరుతో కొత్త  సినిమా తీసిన పీటర్ జాక్సన్ చెప్పుకున్నాడు.
మొపాసా 'వెన్నముద్ద' కథ ప్రేరణతో హాలీవుడ్లో Stage Coach' అనే సినిమా వచ్చింది. Citizen Kane సినిమా తీయడానికి ముందు ప్రేరణ కోసం Stage Coach సినిమాను నలభై రోజులు వరసాగ్గా చూసినట్టు దాని డైరెక్టరు  Orson Welles రాసుకున్నాడు. లూసన్ అయితే Old Stories Retold పేరుతో ఒక కథా సంకలనమే రాశాడు.  రావి శాస్త్రి కూ పిపీలకం వంటి కొన్ని కథల్లో అలాంటి ప్రయోగాలు చేశారు.

నేను రాసిన 'రాజుగారి కొమ్ము'కు The King and The Tamarind Drum కథ ప్రేరణ, 'కటారా' కథ ముగింపు ఎత్తుగడకు  Shaddad and his Paradise కథ ప్రేరణ, అలాంటి ఒక ఎత్తుగడ Citizen Kaneలో కూడ కనిపిస్తుంది.   గత నెలలో రాసిన 'మదరసా మేకపిల్ల' కు 'తోడేలు-మేకపిల్ల' కథ ప్రేరణ.
గత దశాబ్దంన్నర కాలంగా Vishal Bhardwaj, Sanjay Leela Bansali ఒకరితో ఒకరు పోటీపడి షేక్స్ పియర్ నాటకాలకు మహత్తర అన్వయాలు.  తీస్తున్నారు.  షేక్స్ పియర్ Hamlet,  Basharat Peer అనుభవాలు Curfewed Nightను కలిపి  Vishal Bhardwaj హైదర్ సినిమాగా మలిచిన తీరు అద్భుతం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన పాతాళభైరవి (1951) మూల కథను పింగళి నాగేంద్రరావు అల్లావుద్దీన్ నుండే తీసుకున్నారు. అన్నట్టు ఆధునిక అన్వయాలు పొందుతున్న వాటిల్లో రామాయణ మహాభారతాలు, నీతిచంద్రికలు, అరేబియన్ రాత్రులతోపాటూ  షేక్స్ పియర్, గై డి మొపాసాల రచనలే ఎక్కువ.
14 ఆగస్టు 2017

No comments:

Post a Comment