Wednesday 23 August 2017

From Shabano to Shayara Bano the progress of Indian Muslims

షాబానో నుండి షాయరాబానో వరకు
భారత ముస్లీం సమాజం పురోగమనం!
-        ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

ట్రిపుల్ తలఖ్ విధానాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత ముస్లిం సమాజం సంతోషంగా ఆహ్వానించింది. ముస్లిం సమాజంలోనీ మహిళలేకాక పురుషులు సహితం, ఉదారవాదులేకాక, చాంధసులు సహితం ట్రిపుల్ తలఖ్ (చిటికెల్లో విడాకులు) విధానాన్ని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, వాట్స్ అప్, ఆన్ లైన్, స్కైప్ వగయిరాల ద్వార చెప్పే తలాఖ్ లు చెల్లవని చెప్పడానికి షరియా / హదీస్ ల నుండి ఉటంకింపులు కూడా అఖ్ఖరలేదు. ఇవన్నీ సమాచార విప్లవం అనంతరం వచ్చిన సౌకర్యాలు, దుర్వినియోగాలు. సమాచార విప్లవం కన్నా వెయ్యేళ్ళు ముందుగా రాసినవి కనుక షరియా / హదీస్ లు వీటిని గుర్తించవు. ఒక్కసారిగా (వెంటవెంటనే instant) తలాక్ చెప్పడం ముస్లిం పర్సనల్ లా (షరియా)కు వ్యతిరేకమని ఇస్లాం ధార్మిక గురువులు చాలాసార్లు చెప్పివున్నారు. అలా ధర్మవిరుధ్ధంగా విడాకులు ఇచ్చిన భర్తల కుటుంబాలను సాంఘీకంగా బహిష్కరించాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు గతంలో పిలుపు (ఫత్వా) కూడా ఇచ్చింది.
చిటికెల్లో విడాకులు విధానంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించాల్సినంతగా స్పందించలేదనే అపవాదు కూడా ఒకటి వుంది. అయితే. ఇందులో ఒక స్మృతి సూక్ష్మం వుంది. సాంఘీక బహిష్కరణ చేయమని  మాత్రమే పర్సనల్ లా బోర్డు ఫత్వా జారీ చేయగలదు. త్రిపుల్ తలాఖ్ దోషులతో  అంతకు మించి వ్యవహరిస్తే – అంటే తిట్టడం, కొట్టడం వంటివి చేస్తే -  అది పౌరస్మృతి పరిధిని దాటి నేరస్మృతి పరిధిలోనికి వెళ్ళిపోతుంది. ప్రత్యేక పౌరస్మృతి వున్నట్టు ముస్లింలకు ప్రత్యేక నేరస్మృతి వుండదు. పర్సనల్ లా బోర్డు పరిధి పరిమితుల్ని కూడా అర్ధం చేసుకోవాలి.
తాము ఆశించిందే కోర్టు తీర్పుగా రావడం ఎవరికైనా ఆనందమే. ముస్లిం సమాజానికి  అంతకు మించిన  ఆనందాన్నిచ్చే అంశం అత్యున్నత న్యాయస్థానం తీర్పులో మరొకటుంది. మత స్వేఛ్ఛ అనేది పౌరులకు రాజ్యాంగంలోని 25వ అధీకరణ ద్వార  వచ్చిన  ప్రాధమిక హక్కు అని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది. ప్రస్తుత, అసహన వాతావరణంలో, గోగ్రవాదుల మూకదాడుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన భరోసా తమకు పెద్ద వరమని భారత ముస్లిం సమాజం భావిస్తోంది.  
1985లో షాబానో మనోవర్తి కేసు సాగిన సమయంలో భారత ముస్లిం సమాజం మీద  ఛాందసుల  ప్రాబల్యం ఎక్కువగా వుంది. అప్పుడు ముస్లిం ఉదారవాదులు బలంగాలేరు. ఇప్పటి షయరా బాను కేసు సందర్భంగా కొందరు కొన్ని అపోహలూ, భయాందోళనల్ని వ్యక్తం చేసినప్పటికీ, ట్రిపుల్ తలాక్ ను రద్దుచేయాలనే అంశం మీద ముస్లీం సమాజంలో  దాదాపు ఏకాభిప్రాయం వుంది.  గడిచిన మూడు దశాబ్దాల కాలంలో భాతర ముస్లిం సమాజం సాధించిన పురోగతిగా దీన్ని భావించవచ్చు.
ఈ సందర్భంగా వ్యక్తమైన అపోహలూ, భయాందోళనల్ని కూడా  కొట్టి పడేయడానికి వీలులేనివి. ట్రిపుల్ తలాక్ నెపంతో ముస్లిం పర్సనల్ లానే రద్దు చేస్తారని కొందరు భయపడ్డారు. బయటి నుండి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రచారమే దానికి ప్రధాన కారణం. వాళ్ళల్లో కొందరు అతివుత్సాహంతో ఏకంగా ముస్లిం సమాజంలో మొత్తం విడాకులనే రద్దు చేయాలని ప్రతిపాదించారు.
ముస్లిం విడాకుల్లో మూడు విధానాలున్నాయి. వాటిల్లో తక్షణ విడాకుల విధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనినే మీడియా ‘ట్రిపుల్ తలాఖ్’ గా ప్రచారం చేసింది. నిజానికి మిగిలిన రెండు విధానాల్లో కూడా మూడుసార్లు తలాఖ్ చెపుతారు. అయితే సుదీర్ఘ గడువు తీసుకుని వాయిదాల పధ్ధతుల్లో తలాఖ్ చెపుతారు.
“తక్షణ తలాఖ్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనదా?” “ఇస్లాం ధర్మాల్లో ప్రాధమికమైనదా?” అనే రెండు అంశాలను ఈ కేసులో సుప్రీం కోర్టు పరిశీలినకు స్వీకరించింది. తక్షణ తలాఖ్ అనేది త్రాజ్యాంగ వ్యతిరేకమైనది మాత్రమేగాక, ఇస్లాం ప్రాధమిక ధర్మాలకు కూడా  వ్యతిరేకమైనదని తేల్చింది. విడాకుల విధానంలో ఒక వైపరీత్యంగా మొదలయి విచక్షణా రహితంగా కొనసాగుతున్న “తక్షణ తలాఖ్’ ను రద్దు చేయడం ద్వార  ఇస్లాం ప్రాధమిక ధర్మాలకు సుప్రీం కోర్టు తీర్పు మేలు చేసింది.
ఇంతటి వివాదాన్ని సృష్టించిన ‘చిటికెల్లో విడాకుల’ కేసులు దేశం మొత్తమ్మీద రెండు వందలు కూడా వుండవు. మొత్తం ముస్లీం విడాకుల కేసుల్లో ఇవి 0.1శాతం మాత్రమే. వెయ్యికి ఒక్కటి కాదు కేవలం ఒక్క కేసు వున్నా విచక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించాల్సిన పనిలేదు.
విచక్షణతో కూడిన విడాకుల విధానాలు ఇకముందు కూడా ముస్లిం సమాజంలో కొనసాగుతాయి.
మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే మతాలు అన్నీ  మధ్యయుగాలకన్నా ముందు కాలంలో ఆవిర్భవించాయి. పితృస్వామ్య వ్యవస్థలో  పుట్టిన కారణంగా మినహాయింపు లేకుండా సమస్త మతధర్మాల్లో స్త్రీ వివక్ష వుంటుంది. అయితే, స్త్రీల విషయంలో  ఇస్లాం  సాపేక్షకంగా  ఉదారంగా వ్యవహరించిందనేది వాస్తవం. స్త్రీలకు విద్య, వివాహ, పునర్ వివాహ, విడాకుల (కులా) స్వేచ్చలతోపాటూ ఆస్తి హక్కు కూడా కల్పించింది. స్త్రీ సంస్కరణల విషయంలో ఇతర మతసమూహాలతో పోలిస్తే ఇస్లాం వెయ్యి సంవత్సరాలు ముందున్నది. అయినప్పటికీ ముస్లీం సమాజంలో స్త్రీలకు పురుషులతో సర్వసమాన హక్కులున్నాయనడం అతిశయోక్తే అవుతుంది!.
వర్తమాన ప్రపంచంలో ముస్లీంలు ఒక్కోదేశంలో ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. తాము మెజారిటీగావున్న దేశాల్లో వ్యవహరించినట్టు  మైనారిటీగా వున్న దేశాల్లో వాళ్ళు దూకుడుగా మార్పుల్ని స్వీకరించలేరు. దానికి కారణం అభద్రత. పౌరస్మృతిని వదులుకుంటే తమ అస్థిత్వమే అంతరించిపోతుందని భారత ముస్లీం సమాజం భావిస్తుంది.  అంచేతవాళ్ళు తమ పౌరసృతిని గట్టిగా పరిరక్షించుకోవాలనుకుంటారు. నిజానికి తాము మైనారిటీలుగా వున్న దేశాల్లో హిందువులు సహితం ఇదే విధానాన్ని కొనసాగిస్తారు. భారతదేశంలో భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలను పట్టించుకోనివారు సహితం అమేరికా వెళ్ళాక వాటికి పెద్దపీట వేస్తుండడాన్ని మనం తానా తదితర ఉత్సవాల్లో చూస్తున్నాం.
ట్రిపుల్ తలాఖ్ తో ఆగకుండా మొత్తం ముస్లీం పర్సనల్ లానే రద్దు చేయాలని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నశ్రీన్ ఒక అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు. భారత ముస్లీం సమాజం ఎందుకు తన ప్రత్యేక అస్థిత్వాన్ని రద్దు చేసుకోవాలీ? అనే ప్రశ్నకు తస్లీమా నశ్రీన్ వంటివారివద్ద సమంజసమైన సమాధానం వుండదు.
ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేయకుంటే తాము హిందూమతాన్ని స్వీకరిస్తామని కొందరు ముస్లిం మహిళలు హెచ్చరించినట్టు ఇటీవల కొంత ప్రచారం సాగింది. కులవ్యవస్థ పునాది మీద ఏర్పడిన హిందూసమాజం లోనికి బయటివారు సగౌరవంగా ప్రవేశించగల మార్గం ఇప్పటి వరకు తెరుచుకోలేదు. కులవ్యవస్థకు బయటికి పోయే పెరటి ద్వారంతప్ప, లోపలికి ప్రవేశించే సింహద్వారం లేదు.
గ్యాడ్జెట్ యాప్ తలాఖ్ వివాదం మొదలయ్యాక చాలా మందికి కొత్త ఉపాధి దొరికింది. వాళ్ళు ముస్లిం మహిళ మీద  సానుభూతి పేరుతో ముస్లిం సమాజాన్ని పరమ అనాగరీకంగా చిత్రించే పనిలో పడ్డారు. ఈ జీయస్టీ తరం స్త్రీజనోధ్ధారకుల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రుల నుండి గల్లీల్ల చిన్న లీడర్ల వరకు అందరూ వున్నారు. వీళ్లంతా చాకచక్యంగా దాచే ప్రయత్నం చేసిన వాస్తవం ఒకటుంది. మన దేశంలో విడాకులు పొందిన ముస్లీం మహిళలకన్నా హిందూ మహిళలు  మూడు రెట్ల కన్నా ఎక్కువ.  2011 జనాభా లెఖ్ఖల ప్రకారం దేశంలో విడాకులు పొందిన హిందూ మహిళలు 681529 మంది; ముస్లిం మహిళలు 212074 మంది.
స్త్రీపురుషులు ఇద్దరికీ విడాకుల సౌలభ్యం వున్నప్పటికీ ఏ మత సమూహంలో అయినా దీన్ని స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా వాడుకుంటారు. బహుశ శిక్కు సమాజం దీనికి మినహాయింపు కావచ్చు.    ముస్లిం సమాజంలో భర్తలకు భార్యలు విడాకులిచ్చే కేసు ఒకటుంటే, భార్యకు భర్తలు విడాకులిచ్చే కేసులు నాలుగు వుంటున్నాయి. ఇతర మత సమూహాలతో పోలిస్తే ఈ నిష్పత్తి ముస్లిం సమాజంలో ఎక్కువగా వున్నమాట వాస్తవం. అయితే, మరి కొన్ని అంశాలతో కలిపి ఈ గణాంకాలను పరిశీలించాల్సి వుంటుంది.
ముస్లిం సమాజంలో విడిపోవాలనుకున్నప్పుడు పురుషులు వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. ఇతర మత సమాజాల్లో చట్ట ప్రకారం విడాకులు ఇవ్వకుండానే భార్యల్ని వదిలివేసే సాంప్రదాయం కూడా వుంది. విడాకులు పొందకుండా, భర్త తమను వదిలేశాడో? లేదో? తేల్చుకోలేని కేసులు అనేకం వున్నాయి.  వాళ్ళు చట్టం దృష్టిలో కలిసి వుంటారు; వాస్తవంలో విడిపోయి వుంటారు. ఇలా సంధిగ్ధంలో కొనసాగే కేసులు ముస్లీం మత సదాయంలో చాలా తక్కువ. ఈ కారణం వల్లనూ ముస్లిం విడాకుల సంఖ్య దాదాపు కచ్చితంగా రికార్డులకు ఎక్కుతుంది. అంచేత ఎక్కువగానూ కనిపిస్తుంది.  
ముస్లిం సాంప్రదాయంలో పెళ్ళి అనేది ‘’దేవతలు చేసింది” “స్వర్గంల్లో నిర్ణయం అయింది” “జన్మజన్మల బంధం” వంటి శాశ్విత అనుబంధంకాదు. అదొక ఇహలోక ఒప్పందం. ఒప్పందం అనుకున్నప్పుడు కలవడం విడిపోవడమూ వుంటుంది. ముస్లిం సమాజంలో కన్యత్వ పట్టింపు లేకపోవడం ఒక గొప్ప విశేషం. పునర్ వివాహ సాంప్రదాయం అనాదిగా వుంది. విడాకులు పొందిన స్వల్పకాలంలోనే అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చేసేస్తుంటారు. పునర్వివాహం అనేది సాంప్రదాయంగా లేని సమాజాల్లో విడాకుల / విధవా స్త్రీల కష్టాలు మరింత తీవ్రంగా వుంటాయి.
ముస్లిం పర్సనల్ లా చర్చకు వచ్చినపుడు సహజంగానే ఉమ్మడి పౌరస్మృతి కూడా చర్చకు వస్తుంది. తక్షణ తలాఖ్ మీద సుప్రీం కోర్టు తీర్పు రాగానే బీజేపి రాజ్యసభసభ్యుడు సుబ్రమణియన్ స్వామి యూనిఫామ్ సివిల్ కోడ్ పాట అందుకున్నారు.  అహింసలాగ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఒక ఆశయమేగానీ ఆచరణకాదు.
భారత ఉపఖండంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలన ఆరంభమయిన కొత్తలోనే గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్  1772లో భారత దేశంలో పౌరస్మృతిని రూపొందించడానికి ఒక ప్రయత్నం చేశాడు.  ముస్లిం సమాజానికి  ఖురాన్ వంటి పవిత్రగ్రంధం, షరియా-హదీస్ వంటి పౌర స్మృతి వున్నట్టు హిందూ సమాజానికి లేవు. వేదాలను, రామాయణ, మహాభారత ఇతిహాసాలను స్మృతులుగా భావించడం కుదరలేదు. మరో గవర్నర్ జనరల్ విలియమ్ బెంటింక్, విద్యావేత్త థామస్ మెకాలే  హిందూ సమాజానికి ఒక పౌర స్మృతిని క్రోడీకరించడానికి పూనుకున్నారు. మనుస్మృతినే  ఆంగ్లో-హిందూ పౌరచట్టంగా   గుర్తించాలనే ప్రతిపాదనలు వచ్చాయి.  ఇరవయ్యవ శతాబ్దం ఆరంభంలో విలియం జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీషులోనికి అనువదించాడు. అప్పటి నుండి అదే అధికారికంగానో అనధికారికంగానో  హిందూ పౌర స్మృతిగా కొనసాగింది. భగవద్గీతను హిందూస్మృతిగా ప్రతిపాదించిన సందర్భాలూ వున్నాయి.  నిజానికి భగవద్గీతకు ప్రజల్లో ఆమోదాంశం కూడా ఎక్కువ. అయితే మహాభారత ఇతిహాసంలో అంతర్భాగంగా ఆవిర్భవించిందనే కారణంతో దానికి స్మృతి గుర్తింపు రాలేదు.
జాతియోద్యమం ఊపందుకున్న కాలంలో మనుస్మృతి చర్చనీయాంశంగా మారింది. అప్పుడే కొత్తగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ మనుస్మృతిని హిందూ పౌర స్మృతిగా ప్రచారం చేసింది. మహాత్మా గాంధీజీ  సహితం కొన్ని వివాదాస్పద అంశాలను తొలగించి మనుస్మృతిని హిందూ పౌర స్మృతిగా స్వీకరించవచ్చని  భావించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందుకు భిన్నంగా స్పందించారు. కులవ్యవస్థకు పునాది వేసిందే మనస్మృతి అని ఆయన దుయ్యబట్టారు. 1927 డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధాన్ని నడివీధిలో అంబేడ్కర్ తగులబెట్టారు.
ఉమ్మడి పౌర స్మృతి అంటే ఆచరణలో ఖురాన్, షరియా, బైబిల్,  మనుస్మృతి తదితర మతగ్రంధాల్ని  క్రోడీకరించి కొత్తగా ఒక పౌర స్మృతిని రూపొందించడం అని అర్ధం. ఏ గ్రంధం నుండి ఏ అంశాన్ని స్వీకరించాలి అనేది సామాజిక అవసరాల మీదకాక రాజకీయ ప్రాబల్యాల మీద ఆధార పడివుంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్రంలో ఇప్పుడు అధికారంలోవున్న శక్తుల రాజకీయార్ధిక దృక్పధం హిందూత్వ అనేది బహిరంగ రహాస్యం.  వాళ్ళ మేధో సరోవరం ఆరెస్సెస్ నాయకత్వంలోని సంఘ్ పరివారం.
భారత త్రివర్ణ పతాకాన్ని ఒక అపశకునంగా విమర్శించినట్టే భారత రాజ్యాంగాన్ని కూడా తీవ్రంగా విమర్శించిన చరిత్ర ఆరెస్సెస్ ది. రాజ్యాంగ రూపశిల్పులు మనుస్మృతిని మరచిపోవడం చారిత్రక నేరం అంటూ ఆ సంస్థ దుయ్యబట్టింది. ఆర్ ఎస్సెస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ - భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన పక్షం రోజుల్లో విడుదలైన సంచికలో - “మనువు మన హృదయాలను ఏలుతున్నాడు” అనే వ్యాసాన్ని ప్రచురించింది.
సంఘ్ పరివార శక్తుల ఆధ్వర్యంలో సాగే  ఉమ్మడి పౌర స్మృతి రచన సహజంగానే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వుంటుందని ఊహించడం పెద్ద కష్టమేమీకాదు. అలాంటి ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం సమాజానికేకేకాక ఇతర మత అల్పసంఖ్యాక సమాజాలకు సహితం  ఆమోదయోగ్యంకాదు.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ కన్వీనర్)
మొబైల్ :  9010757776
హైదరాబాద్
23 ఆగస్టు 2017
ప్రచురణ :
మన తెలంగాణ దినపత్రిక, 24 ఆగస్టు 2017

http://epaper.manatelangana.news/1330773/Mana-Telangana-Daily/24-08-2017#page/4/2 

1 comment:

  1. *స్త్రీ సంస్కరణల విషయంలో ఇతర మతసమూహాలతో పోలిస్తే ఇస్లాం వెయ్యి సంవత్సరాలు ముందున్నది. అయినప్పటికీ ముస్లీం సమాజంలో స్త్రీలకు పురుషులతో సర్వసమాన హక్కులున్నాయనడం అతిశయోక్తే అవుతుంది!.

    hari.S.babu
    how its is possible to make two different and contradictory statements about a single entity in a single sentence?

    ReplyDelete