Saturday, 28 October 2017

భావప్రకటనా స్వేఛ్ఛలా సంభోగం కూడా ఒక స్వేఛ్ఛే!.


భావప్రకటనా స్వేఛ్ఛలా సంభోగం కూడా ఒక స్వేఛ్ఛే!. 


A.M. KHAN YAZDANI DANNY·SATURDAY, OCTOBER 28, 20178 Reads

Abdul Rajahussain నిరంతరం కవిత్వాన్ని పలవరిస్తుంటారు. కొత్త కవిత ప్రచురణ కాగానే దాన్ని ప్రేమార చేతుల్లోనికి తీసుకుని తల నిమురుతారుకొత్త కవి  పుట్టగానే Rajahussain వాల్ లో మస్తరు / హాజిర్ వేసుకోవాల్సిందే.

అయితేకంచర్ల శ్రీనివాస్ కవిత 'అమీర్రాజేశ్వరి'ని  పరిచయంచేస్తూ చెలం మైదానం పాత్రల మీద Rajahussain చేసిన  కొన్ని వ్యాఖ్యానాలు  నాకు  ఏమాత్రం  నచ్చలేదు.

"మైదానంలో నగ్నంగా పందుల్లా బొర్లడం పాత్రల అవలక్షణం"
"అక్రమ సంబంధం పెట్టుకుంటుంది".
"వావి వరసల్లేని విశృంఖల, వికృత , శృంగార చేష్ట"

పాత్రలు విధంగానూ public nuisance సృష్టించలేదు. మారుమూల ఒక నిర్మానుష్య  మైదానంలో రాత్రి వెన్నెల్లో శృంగారం కావించారు. దాన్ని వీరు ఎలా తప్పుపడుతున్నారో అర్ధం కాలేదు.

భావప్రకటనా స్వేఛ్ఛలా సంభోగం కూడా ఒక స్వేఛ్ఛే.


Tuesday, 24 October 2017

Oil War And Rohingya Genocide

చమురుయుధ్ధం - రోహింగ్యా నరమేధం

-       -  డానీ

ప్రపంచ చమురు సంస్థలు  సాగిస్తున్న సమాజ విధ్వంసానికి  తాజా బాధితులు రోహింగ్యాలు. జాతీ, మతం, పౌరసత్వం వంటి సమాజ, నృశాస్త్రాల కీలక అంశాల మీద పాత అభిప్రాయాల్ని పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని మయన్మార్ లో రోహింగ్యా జాతినిర్మూలన ముందుకు తెచ్చింది.    

రాజకీయ నాయకులు స్థిరమైన ఓటు బ్యాంకును నిర్మించుకునే ఆతృతలో జాతీ, మతం, పౌరసత్వాల్ని తరచూ ఏకం చేసేస్తుంటారు. భారతీయులు అనేది ఒక జాతి అనుకుంటే వారిలో అనేక మతాల్లో విశ్వాసాలు కలవాళ్ళు వుంటారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌధ్ధ, జైన, శిక్కు, జొరాస్ట్రియన్, జుడాయిజం మాత్రమేకాక స్థాని మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు సహితం పెద్ద సంఖ్యలో మన దేశంలో వున్నారు. మరోవైపు, భారతీయులు భారతదేశంలో మాత్రమే పౌరసత్త్వం కలిగి వుండరు. అనేక దేశాల్లో ఇండియన్ డయాస్పోరాకు పౌరసత్వం వుంది. ఒక మతాన్ని ఒక సమూహం అనుకున్నా ప్రపంచమంతటా  అందులో ఒకే జాతి వుండదు. మత భావనలు ఇతర జాతులకు విస్తరిస్తాయిగానీ, ఒకేజాతీ ప్రపంచ వ్యాప్తంగా మతం పేరుతో విస్తరించదు. అనేక దేశల్లోని అనేక జాతులు ఒక మతాన్ని  స్వీకరించవచ్చు. ఒక దేశంలోని ఒక మతసమూహంలోనూ అనేక జాతులు, తెగలవాళ్ళు వుంటారు. వర్తమాన సిరియా అంతర్యుధ్ధంలో ఇరుపక్షాలు ముస్లింలే; కానీ వాళ్ళు భిన్న తెగలకు  చెందినవారు. ఇరాక్ లోనూ ఇరాకీయులు, కుర్దులకు సాగుతున్న హోరాహోరీ పోరూ అలాంటిదే. ఇండియాలో ఇస్లామిక్ ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు సీమాంతర ఉగ్రవాదం అంటున్నాం. ఉగ్రవాదులు ఇటీవల పాకిస్తాన్ లో మరీ రెచ్చిపోతున్నారు. అక్కడ అది వాళ్ళకు అంతర్గత ఉగ్రవాదందాడులు చేస్తున్నదీ, దాడుల్లో చనిపోతున్నది కూడా ముస్లింలే 

 పౌరులందరిదీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఓటర్లందరిదీ  ఒకే మతం, ఒకే జాతి అయ్యుంటే పార్టీ ఆధారిత పార్లమెంటరీ తరహా ఎన్నికల  ప్రక్రియలో సులభంగా విజయాన్ని సాధించవచ్చని కొన్ని రాజకీయ పక్షాలు భావిస్తుంటాయి. ఇలాంటి సిధ్ధాంతాలు సమాజ వాస్తవాన్ని, జాతుల కూర్పుని అర్ధం చేసుకోవడానికి అడ్దంకిగా మారుతాయి.

మానవ సమూహాల సమిష్టి అవసరాలకు అనుగుణంగా జాతి కూర్పు మారిపోతుంటుందని చెప్పడానికి చరిత్ర పుటల్లోనికి  మరీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరంలేదు. 1953లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి బయటికివచ్చి విడిగావున్న ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికీ, హైదరాబాద్ స్టేట్ నుండి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేరిపోవడానికి మరాఠీలు, కన్నడిగులు ఉత్సాహపడుతున్నపుడు మిగిలిన తెలంగాణ ప్రాంతానికి చెందినవారికీ హఠాత్తుగా తాము ఒకేజాతి వారమన్న విషయం గుర్తుకొచ్చింది. విశాలాంధ్ర నినాదం పుట్టిందిఓ నాలుగున్నర దశాబ్దాలు కలిసున్న తరువాత నిధులు, నీళ్ళు. నియామకాల్లోతమకు అన్యాయం జరుగుతున్నదనే  అంశం బయటికి రాగానే తెలంగాణ అనేది ప్రత్యేక జాతి అనే అభిప్రాయం బలపడిండి. ఆ సమయంలో  కుల, మతాలు, తెగలకు అతీతంగా తెలంగాణ నేల మీద పుట్టి పెరిగినవారందరు ఒకే అస్థిత్వంగా మారి ఉద్యమించారు. విజయాన్ని సాధించారుకొత్త రాష్ట్రంలో నేరెళ్ళ దారుణం, గుత్తి కొయల మీద దౌర్జన్యం, పరువుహత్యల పరంపర తరువాత ఇప్పుడు అతి సహజంగానే తెలంగాణలో అనేక ఉపజాతులున్నాయనే భావన పుంజుకుంటున్నది. ఇలాంటి మరో సందర్భంలో 19వ శతాబ్దపు ఫ్రెంచ్ చరిత్రకారుడు ఎర్నెస్ట్ రేనాన్ జాతి అంటే రోజుకోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తేల్చాల్సిన అంశం” (a daily referendum) అన్నాడు. ఇటీవల ఓ ముఖపుస్తక మిత్రుడు అన్నట్టు  ఇండియాలో అయితే రోజూ మూడుపూటలా చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ.

ఒక గ్రామాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రపంచం అర్ధం అయినట్టే! ఈ నేపథ్యంలో రోహింగ్యాల పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు

చమురు బావుల్ని దక్కించుకోవాలన్న బహుళజాతి సంస్థల  అత్యాశ రోహింగ్యాలు అనే ఒక ప్రాచీన జాతినిర్మూలనకు దారితీసింది.  రోహింగ్యాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి సైన్యం  ప్రతిరోజూ చరిత్ర కనీవినీ ఎరుగని రాక్షస క్రీడ అడుతోంది. ఇంకోవైపు అలనాటి ఫాసిస్టునాజీ, అల్లరిమూకలను పోలిన బర్మీయులు సైన్యానికి తోడయ్యారు. అహింసో పరమ ధర్మం అని బోధించిన బౌధ్ధమత గురువులు, నొబెల్ శాంతి బహుమతి గ్రహిత అయిన దేశాధినేత అంగ్ సాన్ స్యూ కీ  ఆ దారుణాన్ని ఖండించకపోగా  ప్రోత్సహిస్తున్నారు. ఇది వర్తమాన మయన్మార్ సామాజిక రాజకీయార్ధిక చిత్రం.  

రోహింగ్యాలు మయన్మార్ పశ్చిమ దిక్కున,  రఖైన్ రాష్ట్రంలో బంగాళాఖాతం  తీరప్రాంత ప్రజలు. ప్రస్తుతం వీరి జనాభా 2016 అంచనా ప్రకారం పది లక్షలుతీర ప్రాంత ప్రజలు కనుక చేపల వేట, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. పశ్చిమ రఖైన్  భూములు సారవంతమైనవికాదు. ఎక్కువగా చవిటి పర్రలు

మతపరంగా రోహింగ్యాల్లో అత్యధికులు ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ వాళ్ళల్లో హిందువులు, క్రైస్తవులు కూడా వున్నారు. వీలయితే వాళ్ళు బౌధ్ధమతాన్ని కూడా స్వీకరించేవారేమోగానీ, మయన్మార్ బౌధ్ధ గురువులు వాళ్ళకు పూర్తి వ్యతిరేకంగా వున్నారు.
రఖైన్ రాష్ట్రంలో కలదాన్, మాయూ, లే మ్రో నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో రోహింగ్యాలు ఎనిమిదవ శతాబ్దం నుండి నివశిస్తున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ప్రాంతం భారత ఉపఖండానికీ, ఆగ్నేయాసియాకూ మధ్య చాలా కాలం స్వతంత్ర దేశంగా కొనసాగింది. మయన్మార్ ను  గతంలో బర్మా అన్నట్టు రఖైన్ రాష్ట్రాన్ని గతంలో అరకాన్ అనేవారు. అరకాన్ రాజులు 7వ శతాబ్దంలో ఇప్పటి బంగ్లాదేశ్ వరకు విస్తరించి పాలించారు. పదవ శతాబ్దంలో తంజావూరును రాజధానిగా చేసుకుని పాలించిన చోళ రాజులు తమ రాజ్యాన్ని బర్మా వరకు విస్తరించారు. అప్పటి చోళ రాజ్యంలో అరకాన్ కూడా వుందిరెండవ ప్రపంచ యుధ్ద కాలంలో మిత్రపక్షాల బర్మా క్యాంపెయిన్ యుధ్ధవిమాన స్థావరం చిట్టగాంగ్ లోనే వుండేది. ప్రపంచంలో ఏ నగరానికీ లేనట్టు బంగ్లాదేశ్ లోని చిటగాంగ్ రేవు నగరానికి ఓ డజనుపేర్లు వుంటాయి. దానిని బట్టి ఎప్పుడెప్పుడు ఏఏ సామ్రాజ్యాలు ఎటు నుండి ఎటుకు విస్తరించాయో అర్ధం చేసుకోవచ్చుచిట్టగాంగ్ కు ఆనుకుని రఖైన్ రాష్ట్రం తీరప్రాంతం వుంటుంది. చిటగాంగ్ ఎదుర్కొన్న చారిత్రక సంక్షోభాలన్నింటినీ రోహింగ్యాలు ఎదుర్కొన్నారు. తాము అరకాన్ మూలవాసులమని రోహింగ్యాలు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. రోహింగ్యా అనగా దైవ కృప గలిగిన వారుఅనే అర్ధం కుడా వుందిరహమ్ అంటే పర్షియన్ భాషలో దయ అని అర్ధం.
ఒక ప్రజాసమూహం నిర్వాశితులుగా మారడానికి ఐదు బాహ్యాత్మక కారణాలుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుధ్ధాలు, అంతర్యుధ్ధాలు, భారీ ప్రాజెక్టులు; కార్పొరేట్లు సాగించే విధ్వంసాలు. మయన్మార్ లో రోహింగ్యాలు శరణార్ధులుగా మారడానికి దాదాపు ఈ ఐదు కారణాలూ వున్నాయి. ప్రపంచమంతటా శరణార్ధుల జీవితాల్లో ఒక విషాదం వుంటుంది. తమను శరణార్ధులుగా మార్చిన యుధ్ధాలు, భారీ ప్రాజెక్టుల్ని సహజంగానే వాళ్ళు వ్యతిరేకిస్తారు. మరోవైపు, యుధ్ధాలు, భారీ ప్రాజెక్టులవల్ల లబ్దిపొందే వాళ్ళు శరణార్ధుల్ని తరచూ అభివృధ్ధి నిరోధకులు అంటారు.
1948లో స్వాతంత్రంత్ర్యం వచ్చినప్పటి నుండి అప్పటి బర్మా, ఇప్పటి మయన్మార్ ఎన్నడూ ప్రశాంతంగాలేదు. ఆదేశంలో నిరంతరం అంతర్యుధ్ధం కొనసాగుతూనే వుంది. 1962లో సైన్యం ప్రభుత్వాధికారాన్ని చేపట్టి అర్ధశతాబ్ద కాలం పైగా నియంతృత్వాన్ని కొనసాగించింది. అప్పట్లో సైనిక పాలనను వ్యతిరేకించి, సుదీర్ఘ కాలం నిర్బంధంలో గడిపిన అంగ్ సాన్ స్యూ కీ  ఒక ప్రజాస్వామిక ప్రవక్తలా కనిపించారు. ఆమెను 1991లో నోబెల్ శాంతి బహుమతి కూడా వరించిందివారే రెండేళ్ల క్రితం స్టేట్ కౌన్సిలర్ పేరుతో ప్రభుత్వాధినేత్రి అయ్యారు.
స్టేట్ కౌన్సెలర్ కావడానికి ముందు సూ కీ చెప్పిన ప్రజాస్వామిక విలువలు, శాంతి భాష్యాలు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. పదవి మహాత్యమో ఏమిటోగానీ సూ కీ యూనిఫాంలేని నియంతగా మారిపోయారు. రోహింగ్యాల పౌరసత్వాన్ని పునరుధ్ధరిస్తానన్న నాయకి వాళ్ళ  జాతినిర్మూలన యాగాన్ని తలపెట్టారు. ఆ విషయం బయటి దేశాలకు తెలియకూడదనే తలంపుతో రోహింగ్యాలను దేశ సరిహద్దులు దాటక ముందే చంపి భూమిలో పూడ్చివేయడానికి సైన్యానికి సకల అధికారాలు ఇచ్చారు.

మయన్మార్ సైనికులు బౌధ్ధులు అనే సందేహం ఎవరికయినా రావడం సహజం. సైన్యానికి కౄరత్వంతప్ప అహింస బోధనలు పనికిరావు. శ్రీలంక సైన్యం జాఫ్నాలో తమిళుల మీద సాగించిన మారణ హోమాన్ని మానవజాతి ఇప్పట్లో మరచిపోదు. శ్రీలంక సైనికులు కూడా మతపరంగా బౌధ్ధులే. వాళ్లను మించిపోయారు మయన్మార్ బౌధ్ధ సైనికులు.

సాంధ్రీభూత ఆర్ధిక వ్యక్తీకరణలే రాజకీయాలుకనుక రాజకీయ నిర్ణయాలను రాజకీయ ప్రమాణాలతో చూస్తే ఎప్పటికీ అర్ధంకావు, వాటిని ఆర్ధిక అవసరాలతో కలిపి చూడాలి. అప్పుడు రాజకీయ చిక్కుముడులు అనేకం విడిపోతాయిఅసలు రాజకీయాన్నీ, ఆర్ధికాన్ని విడగొట్టి చూడడమే పెద్ద తప్పు.

సూ కీ రాజకీయ విధానాలనూరోహింగ్యాల జాతినిర్మూలనను అర్ధం చేసుకోవాలంటే ముందు మయన్మార్ లో చమురు, సహజవాయువుల రంగం విస్తరిస్తున్న తీరును, బహుళజాతి చమురు సంస్థలు సాగిస్తున్న విధ్వంసాన్నీ అర్ధం చేసుకోవాలి.

తూర్పు, దక్షణ ఆసియాదేశాల్లో చమురు సహజవావువుల (హైడ్రో కార్బన్స్) నిక్షేపాలు అత్యధికంగా వున్న దేశం బర్మా. 1795లోనే మ్యాగ్ వే రాష్ట్రంలోని  ఏనాన్ గ్యావుంగ్ పట్టణం పరిసరాల్లో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. చేతి మోటలతో చమురును తోడేవారు. మొదట్లో ఈ చమురు బావులన్నీ  బర్మా కుటుంబీకుల చేతుల్లోనే వుండేవి. 1853లో బర్మా చమురు ఎగుమతిని ఆరంభించింది.

బ్రిటీష్ పెట్టుబడితో 1871లో నెలకొన్న బర్మా ఆయిల్ కంపెనీ 1887లో ఏనాన్ గ్యావుంగ్ ఆయిల్ ఫీల్డ్ నుండీ, 1902లో చావుక్ ఆయిల్ ఫీల్డ్ నుండీ చమురు ఎగుమతులు ఆరంభించింది. వలస పాలన కాలంలోనేగాక, ఆ తరువాత కూడా ఓ పాతికేళ్ళు భారతదేశంలో బర్మా, షెల్ కంపెనీల ద్వారానే పెట్రోలు, డీజిల్ సరఫరా అయ్యేదిషెల్ కంపెనీ మూలాలు కూడా ఆంగ్లో-డచ్ పెట్టుబడిలో వున్నాయి.

బర్మాకు స్వాతంత్రం వచ్చిన తరువాత ఆ దేశ ఆయిల్ ఫిల్డ్స్ పై చైనా  చమురు కంపెనీలు గట్టిపట్టు సాధించాయి. ఇప్పుడయితే డజన్ల కొద్ది అంతర్జాతీయ ఆయిల్ కంపెనీ (ఐఓసీ)లు  మయన్మార్ చమురు బావుల మీద వాలిపోయాయి.

మ్యాగ్ వే రాష్ట్రానికి తూర్పు దిక్కున రఖైన్ రాష్ట్రం వుంటుంది. ఆ రాష్ట్రం తీర భూములే రోహింగ్యాల నివాస స్థలంరఖైన్ రాష్ట్రం రాజధాని సిట్వే పెద్ద రేవు పట్టణంకలదాన్, మాయూ, లే మ్రో నదులు బంగాళా ఖాతంలో కలిసే చోటూ ఇదే. సిట్వే అంటే బర్మీస్ భాషలో  యుధ్ధభూమి అని అర్ధం. 15వ శతాబ్దం ఆరంభం నుండి 18వ శతాబ్దం చివరి వరకు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఇప్పటి బర్మాలోని  రఖైన్ ప్రాంతం, ఇప్పటి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ప్రాంతం కలిసి మ్రావుక్- ఊ అనే రాజ్యంగా వుండేవి. బర్మారాజు బోద్వపాయ 1784లో మ్రావుక్-ఊ రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకున్నాడు. అయితే, ఆ విజయం అతనికి అంత సులువుగా దక్కలేదు. రఖైన్ రక్షణ దళాలు కలదాన్  నది ముఖద్వారం వద్ద బర్మా సైన్యాలను ఎదుర్కొని భీకర పోరాటం చేసి దాదాపు ఓడించినంత పనిచేశాయి. రఖైన్ రక్షణ దళాల పోరాట పటిమ తూర్పు బర్మా వాసుల మీద చెరగని ముద్ర వేసింది. రఖైన్ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నప్పటికీ అక్కడి రోహింగ్యాలను తూర్పు బర్మా వాసులు  బెంగాలీలుఅని తిట్టు అర్ధంలో వాడుతుంటారు. బంగాళాఖాతం తీరాన బెంగాలీ అనేది తిట్టుగా మారడం ఒక  వైచిత్రి! కొందరు వాళ్లని అరకనీ-ఇండియన్స్ అంటారు

బర్మాకు స్వాతంత్రం వచ్చే నాటికి రఖైన్ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. మ్యాగ్ వే రాష్ట్ర చమురు సిట్వే ఓడరేవుకు చేరాలంటే రఖైన్ రాష్ట్రం మీదుగానే రవాణా జరగాలి. అదే అతి దగ్గరి భూమార్గంమ్యాగ్ వే సిట్వే రహదారితప్ప ఆ పరిసరాల్లో పెద్దగా అభివృధ్ధి జరగలేదుఅక్కడి భూములు అంత సారవంతమైనవి కాకపోవడంవల్ల కూడా చాలా కాలం ఆ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి పరిమిత ఆర్ధికవ్యవస్థలో రోహింగ్యాలు జీవనాన్ని గడిపేవారు.

భారతదేశంలో జరిగినట్టే 1970వ దశకంలో మయన్మార్ లో కొత్త చమురు నిక్షేపాల కోసం  అన్వేషణ మొదలయిందిభారత దేశంలో కృష్ణా-గోదావరి, కావేరీ బేసిన్ లలో చమురు, సహజవాయువు నిక్షేపాలు బయటపడ్డట్టు మయన్మార్ లోని  కలదాన్, మాయూ, లే మ్రో నదుల బేసిన్లో అపార చమురు, సహజవాయువు నిక్షేపాలు బయటపడ్డాయిఇక అభివృధ్ధి పేరిట సిట్వే ప్రాంతంలో భారీ విధ్వంసమే సాగింది. దీనికి ప్రధాన బాధితులు రోహింగ్యాలు. సిట్వే ప్రాంతం నుండి రోహింగ్యాలను తొలగించి ఆ భూముల్ని అంతర్జాతీయ చమురు కంపెనీలకు ధారాదత్తం చేయయాలని మయన్మార్  సైనిక నియంతృత్త్వ ప్రభుత్వం  తలపెట్టింది. దానికోసం అనేక కుట్రలు పన్నిందిఏకంగా  రోహింగ్యాల పౌరసత్వ చట్టాన్నే మార్చేసింది.

బర్మా ప్రభుత్వం 1982లో తెచ్చిన పౌరసత్వ చట్టం 1935లో  అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో ప్రవేశపెట్టిన   నూరెంబర్గ్ చట్టం వంటిది. ఈ చట్టం 135 స్థానిక పురాతన తెగలను పౌరులుగా గుర్తించి రోహింగ్యాలను వదిలివేసింది. అప్పటి వరకు రోహింగ్యాలు రాష్ట్ర శాసన సభలకు, పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలిచిన సందర్భాలున్నాయి. వాళ్ళలో కొందరు మంత్రి పదవుల్ని కూడా నిర్వర్తించారు. ఈ చట్టం రోహింగ్యాలను పౌరులుగా గుర్తించ నిరాకరించింది. పౌరసత్వాన్ని నిరాకరించడం అంటే భూమి మీద యాజమాన్య హక్కు లేకుండా చేయడమే. అంతేగాక వాళ్ళు ఇతర తెగల్ని పెళ్ళి చేసుకోరాదనీ, స్వంత తెగలో పెళ్ళి చేసుకోవడానికైనా,  పిల్లల్నికనడానికైనా, చదువుకోవడానికైనా, పనిలో చేరాలనుకున్నా  తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనీ అమానుష నిబంధనలు విధించిందిమరోమాటల్లో చెప్పాలంటే బర్మా పౌరసత్వ చట్టం దేశంలో  ఒక జాతి నిర్మూలనకు నాందీ పలికింది.

మనం తరచూ నృశాస్త్ర కీలక సూత్రం ఒకదాన్ని మరిచిపోతుంటాం. ఈ భూమ్మీద తొలిమానవుడు ఎక్కడో ఒకచోట పుట్టి వుంటాడు. అక్కడి నుండి మానవజాతి అన్నివైపులకూ విస్తరించి వుంటుంది. విస్తరించడం అంటే వలసపోవడడమే. సమాజశాస్త్రంలో దీన్ని అడ్డ చలనం (Horizantal Mobility) అంటారు. 28 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు ఇప్పటి ఆఫ్రికాఖండపు ఇథియోపియా ప్రాంతంలో ఆవిర్భవించి వుంటాడని ఒక అంచన వుండేది. డెభ్భయి లక్షల సంవత్సరాల క్రితం ఇప్పటి యూరప్ లోని బల్గేరియా, గ్రీస్ ప్రాంతంలో తొలి మానవుడు సంచరించాడని ఇటీవల కొత్తగా కనుగొన్నారు. సంవత్సరాల విషయంలో తేడాలున్నా ఒకటి మాత్రం వాస్తవం; ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ నివశిస్తున్నది వలసవచ్చినవారేఎవరు ముందు వచ్చారు? ఎవరు తరువాత వచ్చారు? అనేది ఒక్కటే తేడా. ముందు వచ్చినవాళ్ళు తరువాత వచ్చినవాళ్ళను పరాయివాళ్ళు అంటారు. అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న జాతి ఘర్షణలకు మూలం.  

మయన్మార్ పౌరసత్వ చట్టం- 1982 అమల్లోనికి రావడంతో రాత్రికి రాత్రి రోహింగ్యాలు - తాము 12 వందల సంవత్సరాలుగా నివశిస్తున్న నేల మీద- అక్రమ వలసదార్లు, చొరబటుదార్లు అయిపోయారు!. అతి సహజంగానే ఆ చట్టం మీద రోహింగ్యాలు  నిరసన వ్యక్తం చేశారు
ఎవరయినా ప్రజాస్వామిక హక్కుల్ని కోరగానే  వాళ్ళను ప్రభుత్వాలు ఉగ్రవాదులుగానో, వేర్పాటువాదులుగానో, దేశద్రోహులుగానో, రాష్ట్ర ద్రోహులుగానో చిత్రించడాన్ని మనం దాదాపు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇప్పటి ప్రభుత్వాధి నేతలు ప్రజలకు రెండే ఆప్షన్లు ఇస్తున్నారు. “మమ్మల్ని పొగుడుతూవుంటే మిమ్మల్ని వుండనిస్తాం; లేకుంటే దేశ ద్రోహుల జాబితాలోనో, రాష్ట్ర ద్రోహుల జాబితాలోనో    చేర్చేస్తాం

 తెలంగాణ ఉద్యమ కాలంలో పొలిటికల్ జేయేసి కన్వీనర్ గా, ఉద్యమ నాయకత్వంలో దళపతిగావున్న ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఇస్తున్న బిరుదులు ఏమిటో గమనిస్తే రోహింగ్యాలకు మయన్మార్ ప్రభుత్వం ఇస్తున్న బిరుదుల్ని అర్ధం చేసుకోవడం కష్టం ఏమీకాదు

రాజకీయాల్లో అధికారపక్షం, ప్రతిపక్షం, అసమ్మతివర్గం, నిరసనకారులు, సమ్మెకారులు, ఆందోళనకారులు, ఉద్యకారులు, మితవాదులు, అతివాదులు, విప్లవకారులు, మిలిటెంట్లుఉగ్రవాదులు అనే ఓ డజను రకాల సమూహాలుంటాయి. బహుశ అంతకన్నా ఎక్కువ రకాలే వుండవచ్చు. అధికారపక్షంతో అభిప్రాయబేధం రాగానే ఇక దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, ఉగ్రవాదులు అని నిందించడం మొదలు పెడితే సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం అయిపోతుంది.
బర్మా చమురు బావుల మీద ఆధిపత్యం కోసం కార్పొరేట్ల మధ్య సాగుతున్న పెనుగులాట రోహింగ్యాలకు జాతినిర్మూలనగా మారిందిఇది పునాది. ఉపరితలంలో ఇది బర్మాలోని  ఇతర జాతీయులు, రోహింగ్యాల మధ్య పోరాటంగా, మరోవైపు బౌధ్ధ, ఇస్లాం మత సమూహాల మధ్య ఘర్షణగా కనిపిస్తోంది. మనం తరచూ ఉపరితలాన్నే చూస్తాంగానీ, చాలా అరుదుగా మాత్రమే పునాదిని చూస్తాంపునాదిని చూడకపోతే ఉపరితలం ఏ గుడ్డివానికీ అర్ధంకాని ఏనుగుగానే వుంటుంది.

రోహింగ్యాలు తమ ఉనికినీ, జీవికనూ కాపాడుకోవడానికి అరకాన్ రోహింగ్యా నేషనల్ ఆర్గనైజేషన్’ (ఏఆర్ ఎన్ వోఅనే ఉద్యమ సంస్థ ను ఏర్పాటు చేసుకున్నాడు. రోహింగ్యాలను మయన్మార్ పురాతన తెగల జాబితాలో చేర్చాలనేది దీని ప్రధాన డిమాండ్. అలా కుదరని పక్షంలో  రోహింగ్యాల కోసం మయన్మార్ లోనే స్వయంప్రతిపత్తిగల ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వీరు కోరుతున్నారు. అలాంటి పరిస్థితిలో స్వయం నిర్ణయాధికార హక్కును కోరడం అప్రజాస్వానికం ఏమీకాదు. కానీ ఏఆర్ ఎన్ వో ఆరంభం కాగానే రోహింగ్యాల మీద వేర్పాటువాద ముద్రపడిపోయిందిఅసలే ముస్లిం సమూహం, ఆపైన వేర్పాటువాద ముద్ర. ఇంకేముంది రోహింగ్యాలు నేరప్రవృత్తి గల తెగ అని బయటి ప్రపంచాన్ని నమ్మించడం వంచించడం మయన్మార్ ప్రభుత్వానికి చాలా సులువయిపోయింది

బౌధ్ధ సన్యాసుల రాజకీయాలకు కూడా సిట్వే నగరం కేంద్రంయూ ఒత్తామా అనే బౌధ్ధ గురువు అప్పట్లో వలస పాలనకు వ్యతిరేకంగా తన శిష్యగణాన్ని నడిపించాడు. గత మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కుడా సిట్వే  బౌధ్ధ గురువులకు వుంది. ఇప్పుడు అల్లరిమూకల్ని రోహింగ్యాల మీదకు ఉసి గొల్పుతున్నది కూడా బౌధ్ధ గురువులే. దీన్నే వాళ్ళు  కాషాయ విప్లవంగా చెప్పుకుంటున్నారు.

తరచూ అంతర్యుధ్ధాలు సాగిన కారణంగా భారీ పెట్టుబడులు పెట్టడానికి  అవసరమైన పారిశ్రామిక ప్రశాంత వాతావరణం మయన్మార్ లో కొరవడింది. దానితో అక్కడి చమురు పరిశ్రమ ఆశించినంతగా విస్తరించలేదు. దీనితో బహుళజాతి ఆయిల్ కంపెనీలే రంగప్రవేశం చేసి తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి పావుల్ని వేగంగా కదిపాయి. ఆ కంపెనీలే సైనిక పాలనను తొలగించి అంగ్ సాంగ్ సూ కి ని ప్రోత్సహించి దేశాధినేతను చేశాయనే వాదనను కొట్టిపడేయలేము

మయన్మార్ ఇప్పటికి మూడు రాజ్యాంగాలను ఆమోదించింది. 2008లో వచ్చిన మూడవ రాజ్యాంగంలో విదేశీయుల్ని పెళ్ళి చేసుకున్నవాళ్ళుగానీ, విదేశీ సంతానం కలిగివున్నవారూగానీ రాజ్యాంగ పదవుల్ని చేపట్టరాదని ఒక షరతు పెట్టింది సైనిక ప్రభుత్వం. అప్పట్లో  ప్రతిపక్షనేత్రిగా వున్న అంగ్ సాన్ స్యూ కీ  భవిష్యత్తులో ఎన్నికల ద్వార అధికారాన్ని చేపట్టకుండా కట్టడి చేయడం కోసం పెట్టిన క్లాజు అది. సు కీ బ్రిటీష్ చరిత్రకారుడు మైఖేల్ వి ఆరిస్ ను 1972లో వివాహమాడారు. ఆమె పిల్లలు బ్రిటీష్ పౌరులుగా పెరిగారు. రాజ్యాంగంలోని ఈ క్లాజ్ ను సహజంగానే సూ కీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె  నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ ఎల్ డి)  2010 నాటి సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించింది.
దేశంలో ప్రజాస్వామిక పునరుధ్ధరణ ఉద్యమాన్ని సాగిస్తున్న కాలంలో సూ కీ కొత్త రాజ్యాంగంతోపాటూ పౌరసత్వ చట్టం-1982ను కూడా వ్యతిరేకించేవారురోహింగ్యాల ఆందోళనకు మద్దతు కూడా పలికారు. తమ పార్టి అధికారంలోనికి వస్తే రోహింగ్యాల సమస్యను మానవీయకోణంలో పరిష్కరిస్తామనేవారు.  2015 సాధారణ ఎన్నికల్లో  ఎన్ ఎల్ డి 86 శాతం సీట్లను కైవశం చేసుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. రాజ్యాంగం ప్రకారం ఆమె ప్రధాని పదవిని చేపట్టే అవకాశం లేకపోవడంతో స్టేట్ కౌన్సిలర్ అనే తత్సమాన పదవి ఒకదాన్ని కొత్తగా సృష్టించి  ప్రభుత్వాధినేత్రిగా పరిపాలన చేపట్టారు. అయితే, రోహింగ్యాల పౌరసత్త్వాన్ని పునరుధ్ధరించే పనిని పక్కన పడేశారు.

2012లో సూకీ పార్లమెంటులో ప్రవేశించాక మయన్మార్ చమురు పరిశ్రమలో ఉత్సాహం పెరిగింది. దేశంలో ప్రస్తుతం 51 ఆన్ షోర్ బ్లాకులు, 53 ఆఫ్ షోర్ బ్లాకులు వున్నాయి. వీటిల్లో ఓ 26 డీప్ వాటర్ బ్లాకులున్నాయిజాతీయ ఇంద్జన శాఖ ఆదీనంలోని మయన్మార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎంటర్ ప్రైజెస్, మయన్మార్ పెట్రో కెమికల్స్ ఎంటర్ ప్రైజెస్, మయన్మార్ పెట్రోలియం ప్రాడక్ట్స్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు దేశంలోని చమురు, సహజ వాయువు నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాయి. చైనా, థాయిలాండ్ దేశాలు చమురు, సహజ వావువుల కోసం మయన్మార్ మీదనే ఆధారపడివున్నాయి. గల్ఫ్ దేశాలకన్నా మయన్మార్ నుండి దిగుమతి చేసుకునే చమురుపై రవాణ ఖర్చులు చాలా తక్కువ.

చైనా 2009లో 20 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2, 800 కిలో మీటర్ల పొడవున  సిట్వే- కున్మింగ్ నగరాల మధ్య చేపట్టిన  సమాంతర గ్యాస్, ఆయిల్ పైప్ లైన్ల నిర్మాణం 2014 ఆగస్టులో పూర్తయింది. అంతర్జాతీయ చమురు సంస్థలు (ఐఓసీలు) ఎస్సార్ గ్రూపు, చైనా నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పొరేషన్, చైనా పెట్రోలియం అండ్ కెమికల్ కార్పొరేషన్ (సినోపిక్), మలేసియాకు చెందిన పెట్రొనాస్, బీజీ గ్రూప్, స్టాట్ ఆయిల్, అమేరికాకు చెందిన షెవ్రాన్సింగపూర్ కు చెందిన మయన్మార్ ఆఫ్ షోర్ సప్లయి బేస్ (యంఓయస్ బి) మయన్మార్ చమురు రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయిపాత బర్మా ఆయిల్ కంపెనీరాయల్ డచ్ షెల్ ఆయిల్ కంపెనీ  ఎలాగూ రంగంలో వున్నాయి. రాసుకుంటూ పోతే  ఈ జాబితా చా;లా పెద్దదే అవుతుంది. ఇవిగాక స్థానిక పరమి ఎనర్జీ గ్రూప్, యంపిఆర్ ఎల్ సంస్థలున్నాయి.
ఇప్పుడు కొత్తగా భారత చమురు సంస్థలు కూడా మయన్మార్ లో కార్యకలాపాలు మొదలెట్టాయి. మవొత్తమ బేసిన్ లో దాదాపు 28 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణానికి వ్యాపించిన యం-17, యం-18 బ్లాకుల్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  చేజిక్కించుకుంది. అలాగే భారత ప్రభుత్వరంగ సంస్థలైన ఓయన్ జీసీ విదేశ్ లిమిటెట్, ఆయిల్ ఇండియా, గేయిల్ సంస్థలు కొన్ని విదేశీ సంస్థలతో కలిసి మరో మూడు బ్లాకుల్ని చేజిక్కించుకున్నాయి.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన మిక్కాల్ ఇ హెర్బెర్గ్ 2010 నాటి  Pipeline Politics in Asia: Energy Nationalism and Energy Markets’ పరిశోధనా వ్యాసంలో ఆసియా చమురురంగం విస్పోటనానికి అతి దగ్గరగా (గ్రౌండ్ జీరో) వుంది అని హెచ్చరించాడు

రఖైన్ అల్లరి మూకలు 2012లో రోహింగ్యాల నివాసాలపై దాడులు చేశాయి. ఆ దాడుల్లో పాల్గొన్నవారందరూ మతపరంగా బౌధ్ధులు. ఆ సందర్భంగా రోగింగ్యాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కపటనీతిని పాటించింది. రోహింగ్యాలను రక్షణ శిబారాలనే పేరుతో కాన్సన్ ట్రేషన్ క్యాంపులను ఏర్పాటుచేసి దాదాపు లక్షన్నర మంది రోహింగ్యాలను అక్కడికి  తరలించిందివాళ్ళు అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి వీలులేదనీ, ప్రైవేటు్ రంగంలోనూ ఉద్యోగాలు చేయడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది. నష్టపరిహారంగా ఒక్క కియా (మయన్మార్ కరెన్సీ) కూడా చెల్లించకుండా రోహింగ్యాల భూముల్ని లాక్కోవడానికి చేసిన పన్నాగమిదిఇవన్నీ ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమీషనర్  (UNHCR) నివేదికల్లో కూడా నమోదయిన అంశాలే

 2015లో సూకీ ప్రభుత్వాధి నేతగా మారేక రోహింగ్యాల స్థితిగతులు మెరుగుపడకపోగా మరీ క్షీణించాయి. జాతీయ, అంతర్జాతీయ చమురు సంస్థల మద్దతుతో అధికారాన్ని చేపట్టిన సూ కీ వాటి మీద తన రుణాన్ని తీర్చుకోవాలనుకున్నారు. రోహింగ్యాల మీద  సైనిక ప్రభుత్వాన్ని మించిన అణిచివేతను కొనసాగించారు.

 అణిచివేత భరించశక్యంగా మారినపుడు కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తమ దుస్థితికి కారణమైన వారి కార్యాలయాల మీదో, వాహనాల మీదో, కొందరు అధికారుల మీదో బాధితులు దాడులుచేయడం అసహజ పరిణామం ఏమీకాదు. అణీచివేత, అవమానం, పరాభవం పెరిగినపుడు ఏ దేశంలో అయినా ఒక ఉధ్ధామ్ సింగ్ పుడతాడు
భూములు, పౌరహక్కులు కూడా కోల్పోయిన రోహింగ్యాలు పొరుగు దేశాలకు వలస బాటపట్టారు. వారిలో కొందరు ఉద్యమ బాటపట్టారు. నిజానికి అరవై అయిదేళ్ళుగా ఇంతటి అణిచివేత సాగుతున్నప్పటికీ రోహింగ్యాలు ఎన్నడూ అహింసా మార్గాన్ని విడువలేదు. గత సాధారణ ఎన్నికల్లో రోహింగ్యాలు ఎన్ ఎల్ డికి మద్దతు నిచ్చారు. దేశంలో సైనిక పాలన ముగిసి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో రోహింగ్యాలు అసహనానికి గురయ్యారు. సూ కీ తమ విషయంలో సైనిక ప్రభుత్వ పోకడల్నే కొనసాగిస్తూ వుండడంతో వాళ్ళ అసహనం కట్టలు తెంచుకుంది.

రోహింగ్యా యువకులు కొందరు  అరకాన్ రోహింగ్యా సాలిడారిటీ ఆర్మీ (అర్సా) గా ఏర్పడ్డారు. అర్సా కార్యకర్తలు కొందరు గత ఏడాది అక్టోబరు 9న మావుంగ్దా, డాథేదావుంగ్ టౌన్ షిప్పులలోని మూడు పోలీసు ఔట్ పోస్టుల మీద కత్తులు, కర్రలతో దాడి చేసి తుపాకులు ఎత్తుకుపోయారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది పోలీసులు చనిపోయారు. ఆరున్నర దశాబ్దాల అణిచివేత ఒక్క దాడితో కనుమరుగయి పోయింది. అర్సాను  ఉగ్రవాద సంస్థగాఐసీస్, అల్ ఖైదాలతో సంబంధం వున్నట్టుగా ప్రభుత్వం ప్రచారం మొదలెట్టింది.  “మాది హింసామార్గం కాదుఆత్మరక్షణ కోసమే మా సంస్థ ఏర్పడింది. కర్రలు కత్తులతో మాత్రమే దాడి చేశాంఅని అర్సా నాయకుడు అతావుల్లా అబూ అమర్ జునుని ఓ వివరణ ఇచ్చాడు. “పోలీసుల నుండి లాక్కున్న తుపాకులు తప్ప ప్రస్తుతం మా వద్ద బాంబులు వంటివి లేవుఅని కూడా ఆయన ప్రకటించాడు. అయినప్పటికీ మయన్మార్ మీడియా అర్సాను ఉగ్రవాద సంస్థగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అర్సా సంస్థ కార్యకర్తలు. ఎక్కడా సాధారణ పౌరుల మీద దాడులు చేయలేదు. వాళ్ళు కేవలం పోలీసు, సైనిక క్యాంపుల మీద గురిపెట్టారు.

జర్మనీలో నాజీలు లక్షల మంది యూదుల్ని ఆష్విజ్ (Auschwitz) కాన్సన్ట్రేషన్ కాంపులో బంధించి హింసిస్తున్న రోజుల్లో ఫస్ట్ స్పెషల్ సర్విస్ ఫోర్స్’  పేరుతో కొందరు యువకులు చిన్న దళాలుగా ఏర్పడి నాజీల మీద అప్పుడప్పుడు రహాస్య దాడులు చేసేవారు. క్వింటిన్ టోరంటినో  2009 నాటి  సినిమా ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్లో బ్రాడ్పిట్ నటించిన ఆల్డో రైనే పాత్ర ఫస్ట్ స్పెషల్ సర్విస్ ఫోర్స్నాయకుడు. అర్సా సంస్థ దాదాపు అలాంటిదే.

పది నెలల అనంతరంఈ ఏడాది ఆగస్టు 25న అర్సా మరోసారి 30 పోలీసు, ఆర్మీ పోస్టుల  మీద దాడులు జరిపింది. ఈ దాడుల్లో 12 మంది పోలీసులు చనిపోయారు. దీనికి ప్రెతీకారంగా మయన్మార్ సైన్యం రోహింగ్యాల మీద యుధ్ధాన్ని ప్రటించింది. పిల్లాజెల్లా ముసలిముతక, ఆడామగా తేడాలేకుండా కనిపించినవాళ్ళను కనిపించినట్టే కాల్చి పడేసింది. మయన్మార్ సైన్యం రోహింగ్యా గ్రామాల్లో చేయని అకృత్యం లేదు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించేసి  ఇళ్ళను తగుల బెట్టేశారు. రోహింగ్యా మహిళలపై మయన్మార్ సైనికులు పెద్ద ఎత్తున అత్యాచారాలకు పాల్పడ్డారు. దానితో రోహింగ్యాలు వో దా గీ బీచ్ ద్వార ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో బంగ్లాదేశ్ లోనికి ప్రవేశించడం మొదలెట్టారు. ప్రాణ భయంతో దేశం విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళను కూడా మయన్మార్ సైన్యం వదల లేదు. వెంటాడి వేటాడి దొరికినవాళ్లను దొరికినట్టే చంపేసిందియువకులనేకాదు, వృధ్ధులు, మహిళలు, పిల్లల్ని సహితం చేతికి దొరికితే బాయ్ నెట్లతో పొడిచేశారు, దొరక్క పోతే తుపాకులతో కాల్చేశారు.

 సైనిక దాడిలో 400 మంది రోహింగ్యాలు చనిపోయారని సూకీ ప్రభుత్వం ప్రకటించింది. రోహింగ్యా మృతులు వెయ్యి మందికి పైగా వుంటారని ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందాలు అంచానా వేస్తున్నాయి.

మొదట్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పధంతో రోహింగ్యాలకు అశ్రయం ఇచ్చింది. కేవలం  50 రోజుల్లో   దాదాపు ఆరు లక్షల మంది రోహింగ్యాలు ఒక వరదలా సహాయక శిబిరాలకు వచ్చేయడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిమిత ఆర్ధిక వనరులతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ కు అంత మంది శరణార్ధుల్ని ఆదుకోవడం అయ్యేపనికూడా కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ రోహింగ్యాలకు తలుపులు మూసేసింది. జల మార్గంలో వస్తున్నవాళ్లను గట్టెక్కకుండానే బంగ్లాదేశ్ భద్రతా దళాలు వెనక్కి పంపించేస్తున్నాయి.
ఇలా ఇతరదేశాలకు వెళ్ళి అక్కడి భద్రతాదళాల చేతుల్లో చావడంకన్నా స్వదేశంలో స్వదేశీ సైనికుల చేతుల్లోనే చనిపోవడం మేలని రోహింగ్యా శరణార్ధులు భావిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సంస్థ  (యూఎన్ హెచ్ సి ఆర్ ) అధికార ప్రతినిధి ఆంద్రూస్ మెహసిక్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రోహింగ్యాలు మాతృభూమి ఒడిలో బతకాలనుకున్నారు. సూ కీ రోహింగ్యాలకు మాతృభూమి ఒడిలోనే  మృత్యువును ప్రసాదిస్తున్నారు! ఇప్పుడు రోహింగ్యాలు కూడా మాతృభూమి ఒడిలోనే చనిపోవాలను కుంటున్నారు!.

 (రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ 9010757776

హైదరాబాద్
15 అక్టోబరు 2016

ప్రచురణ :
ప్రజాపాలన దినపత్రిక, 24, 25 అక్టోబరు 2017

http://www.readwhere.com/read/1403537/Prajapalana/AP-24-Oct-2017#page/3/1