అంబానీల చేతుల్లో రోహింగ్యాల భవిత
- డానీ
“మానవతా విలువల పునాది మీదనే భారత
రాజ్యంగం నిర్మితమైంది”. “రాజ్యంగబధ్ధ న్యాయస్థానంగా మేము ఆ అమాయిక బాధితుల విషయంలో
ఉదాసీనంగా వుండలేం”. “ కార్యనిర్వాహక వ్యవస్థ కూడా ఈ విషయంలో ఉదాసీనంగా వుండదని
ఆశిస్తున్నాం”.
రోహింగ్యా శరణార్ధుల కేసు విచారణ
సందర్భంగా అక్టోబరు 13న భారత అత్యున్నత న్యాయస్థానం
చేసిన వ్యాఖ్యలు ఇవి.
గోగ్రవాదం, అసహన వాతావరణం, జీయస్టీల తరువాత రోహింగ్యా
శరణార్ధుల సంక్షోభమే ఇప్పుడు జాతీయంగా
ప్రధాన వివాదంగా మారింది. ఇతరుల అభిప్రాయం ఎలావున్నా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి
మేధోసరోవరంలావున్న ఆరెస్సెస్ తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ రోహింగ్యాలను దేశభద్రతకు ముప్పుగా ప్రకటించారు. దేశభద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన
అంశాలలో రిస్క్ తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కేసు సుప్రీం కోర్టులో అక్టోబరు 13న, అంతకు ముందు సెప్టెంబరు 4న విచారణకు వచ్చినపుడు కేంద్ర
ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపేది లేదంటూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. “నేను అలాంటి ప్రకటన ఏదీ
చేయబోవడంలేదు” అన్నారు అదనపు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహత.
ఇప్పటి పరిస్థితుల్లో రోహింగ్యాలను
మయన్మార్ కు వెనక్కి పంపడం అంటే చితిమంటల
నుండి తప్పించుకుని వచ్చిన వారిని పట్టుకుని రెక్కలుకట్టి తిరిగి మంటల్లోనికి
విసిరివేయడంతప్ప మరేదీకాదు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ శోభను మసకబారుస్తాయేతప్ప, ప్రతిష్టను పెంచవు.
రోహింగ్యాలను స్వదేశానికి వెనక్కి పంపడం కూడా నిజానికి
సులువైన ప్రక్రియ కాదు. సరైన పత్రాలు లేకుండా భారత దేశంలోనికి ప్రవేశించిన మయన్మార్ రోహింగ్యాలు 11 మందిని 2012-14 మధ్యకాలంలో మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. చౌరాచాంద్ పూర్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ 1946 నాటి విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం వారికి ఆరు నెలల కారాగార
శిక్ష విధించి జైలుకు పంపించారు.
వీరంతా ఆ ఆర్నెల్ల శిక్షను పూర్తిచేసి 3, 4 సంవత్సరాలు దాటిపోయాయి. అప్పటి నుండి సాంకేతిక కారణాలవల్ల వాళ్లను
స్వదేశానికి పంపడం భారత ప్రభుత్వానికి సాధ్యం కావడంలేదు. వాళ్ళు మయన్మార్ పౌరులని భారతదేశం
అంటోంది. వారు తమ పౌరులు కాదని అంగ్ సాన్ స్యూ కీ నాయకత్వంలోని మయన్మార్ ప్రభుత్వం అంటోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేదికాదు. ఈ కేసులో ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే
రోహింగ్యాలకు జైలుశిక్ష వేసిన చట్టాన్ని చేసింది బ్రిటీష్ వలస పాలకులు. 1946లో ఇప్పటి మయన్మార్, రోహింగ్యాల స్వరాష్ట్రం రఖైన్ కూడా బ్రిటీష్ పాలనలోనే వున్నాయి. ఆ చట్టం చేసినపుడు రోహింగ్యాలు విదేశీయులు కాదు; బ్రిటీష్ పాలనలో వున్నవారే.
వివిధ శాఖలు సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం భారత
దేశంలో దాదాపు 40 వేల రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో హైదరాబాద్ లో ఓ నాలుగు వేల
మంది వుంటున్నారు. వీరిలో రెండు వేలమంది మూడు నాలుగేళ్ల క్రితం వచ్చినవారుకాగా
మరో రెండు వేలమంది ఇటీవలి కాలంలో ఇక్కడికి చేరుకున్నవారు. పాత బస్తీలోని బాలాపూర్, రాయల్ కాలనీ, బాబానగర్, షాహీన్ నగర్, నౌ నంబర్ పహాడీ, కిషన్ బాగ్ తదితర ప్రాంతాల్లోని మురికివాడల్లో పొలాథిన్
సంచులతో వేసుకున్న కత్తెర పాకల్లో వీళ్ళు
నివాసం వుంటున్నారు. రోడ్లమీద పాత ఇనప ముక్కలు, ప్లాస్టిక్ సంచులు ఏరుకుని వీళ్ళు
జీవిస్తున్నారు. ఏ క్షణాన్నయినా భారత ప్రభుత్వం తమను తీసుకెళ్ళి పులిగుహ
వంటి మయన్మార్ లో దించి రావచ్చు అని భయం భయంగా వీళ్ళు బతుకుతున్నారు.
అనేక ఆసియాదేశాలకు చెందిన శరణార్ధులకు ఆశ్రయం కల్పించిన మానవీయ చరిత్ర
భారత్ కు వుంది. 1950వ దశకం చివర్లో టిబెట్ ను చైనా ఆక్రమించినపుడు నెహ్రూ
ప్రభుత్వం దలైలామాతోపాటూ ఒక లక్షా ఇరవై వేల మంది టిబెటన్లకు ఆశ్రయం కల్పించింది. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం
టిబెటన్ల నివాసం కోసం మైసూరు జిల్లా బైలకుప్పే వద్ద 3 వేల ఎకరాల భూమిని కేటాయించింది. తమ దేశం నుండి టిబెట్
ను విడదీయాలనే వేర్పాటువాద అజెండాతో దలైలామాలు పనిచేస్తున్నారని చైనా తీవ్రంగా ఆరోపిస్తోంది.
ఎవరయినా దలై లామాను ఆధ్యాత్మిక నేతగా భావించి కలిసినాసరే అది తమ దేశ సార్వభౌమాధికారాన్ని
సవాలు చేయడమే అవుతుందని చైనా ఇటీవలనే హెచ్చరించింది. చైనా హచ్చరికల్ని భారత ప్రభుత్వం
లెఖ్ఖచేయదలచలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల పట్టణంలో దలైలామ ఆశ్రయమేగాక. టిబెట్ ప్రవాస ప్రభుత్వ కార్యాలయం
కూడా ఇప్పటికీ కొనసాగుతూవుంది.
1971 నాటి పాకిస్తాన్
యుధ్ధం సందర్భంగా దాదాపు పది లక్షల
మంది తూర్పుపాకిస్తాన్ నిర్వాశితులు భారత దేశంలో ఆశ్రయం పొందారు. ఆ యుధ్ధంలో భారత్ గెలిచినపుడు- ఇప్పటి బీజేపికి మాతృక అయిన జనసంఘ్
కు అప్పటి అధ్యక్షులయిన - ఏబి వాజ్ పాయి ప్రధాని ఇందిరా గాంధీని “అభినవ చండీ దుర్గా” అని కొనియాడారు. (తనను దుర్గా, చండీ అని పిలవ వద్దని ఇందిరాగాంధీ అనడం వేరే చర్చ)
శ్రీలంకలో 1990వ దశకంలో అంతర్యుధ్ధం మొదలయినపుడూ
శ్రీలంక తమిళులు పెద్ద సంఖ్యలో సముద్రమార్గన తమిళనాడులో ప్రవేశించారు. నిజానికి రాజీవ్ గాంధి హత్యానంతరం
భారత్ లో ఏల్ టిటిఇ మీద నిషేధం విధించారు. అయినప్పటికీ, శ్రీలంక నుండి వచ్చిన తమిళ
శరణార్ధుల్ని తమిళనాడు ప్రభుత్వంగానీ, భారత ప్రభుత్వంగానీ వెనక్కు పంపే ప్రయత్నం చేయలేదు. శ్రీలంకలోని తమిళులందరూ ఏల్ టిటిఇ
సభ్యులుకారనే గొప్ప విచక్షణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయి.
రోహింగ్యాల ఆత్మరక్షణకు మయన్మార్
లో ఏర్పడిన అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (అర్సా)ను ఒక ఉగ్రవాద సంస్థగా మయన్మార్
ప్రచారం చేస్తున్నది. నిజానికి ఈ సంస్థ ఏడాది క్రితం కర్రలు, కత్తులతో పోలీసు ఔట్ పోస్టుల మీద
దాడి చేసి కొన్ని తుపాకులు ఎత్తుకు పోయింది. ఆ తరువాత ఒక ఏడాది పాటు ఒక్క హింసాత్మక సంఘటనకు కూడా అది పాల్పడలేదు. గత ఆగస్టు 25న ఆ సంస్థ మళ్ళీ పోలీసు, సైనిక పోస్టుల మీదే రెండో దాడి
చేసింది.
వాళ్ళకు జిహాదీ కార్యక్రమం
వున్నట్టుగానీ, వాళ్ల దగ్గర బాంబులు వున్నట్టుగానీ ఇంత వరకు మయన్మార్
ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం లేదు. అయినా భారత ప్రభుత్వ పెద్దలు సహితం వాళ్లను ఇస్లామిక్ ఉగ్రవాదులుగా
పేర్కొంటున్నారు.
అయితే, రోహింగ్యాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల
అభియోగంతో దేశ అత్యున్నత న్యాయస్థానం విభేదించింది. “పసిపిల్లలు మహిళలకు (ఉగ్రవాదం వంటి) వాటి గురించి ఏం తెలుసూ?” “మానవతా విలువలకూ, జాతీయ భద్రతకూ మధ్య ఒక సమతుల్యతను పాటించాల్సిన అవసరం వుంది” అని గుర్తు చేసింది.
నిజానికి అర్సాను ఎల్ టీటీఇతో పోల్చలేం. ఎల్
టీటీఇ భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించింది మాజీ ప్రధానిని హత్య చేసింది. ఇప్పటి వరకు అయితే భారత్ లో అర్సా వునికి వున్నట్టు కూడా ఏ ఆధారాలూ లేవు. .
కేంద్ర ప్రభుత్వ పెద్దలు
రోహింగ్యాలను చొరబాటుదార్లుగా పిలవడం కూడా సమంజసంగా లేదు. వాతావరణం ప్రశాంతంగా వున్నప్పుడు ఎవరయినా
మన దేశం లోనికి ప్రవేశిస్తే చొరబాటుదార్లు
అనవచ్చు. ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన
వాళ్ళను శరణార్ధులు అనాలిగానీ, చొరబటుదార్లు అనడం అమానవీయం. ఒకవేళ, మయన్మార్ లో అంతర్యుధ్ధం
మొదలుకాకపోనా, సైనికదాడి జరక్కపోయినా వాళ్ళు ప్రాణాలను అరచేతపట్టుకుని ఇక్కడికి
వచ్చివుండేవారే కాదు. నిజానికి
గల్ఫ్, యూరప్ అమేరికాల్లో అనధికారికంగా వుంటున్న భారతీయుల సంఖ్య
వేలల్లో కాదు లక్షల్లో వుంటుంది. ఎవరయినా వాళ్లను చొరబటుదార్లు అంటే
మనం ఊరుకుంటామా?
శరణుకోరి వచ్చిన వారి
విషయంలో మానవీయంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు గతంలోనూ అనేకసార్లు చెప్పింది. దేశంలోవున్న చక్మా, హజోంగ్ శరణార్ధులకు పారసత్వం
ఇవ్వాలని రెండేళ్ళ క్రితం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చక్మాలు బౌధ్ధులుకాగా, హజోంగులు హిందువులు. వీళ్ళు పూర్వకాలంలో చిట్టగాంగ్
కొండల్లో నివాసం వుండేవారు. అప్పటి తూర్పు పాకిస్తాన్
ప్రభుత్వం 1960లో కప్తాయి నీటిపారుదలా ప్రాజెక్టు నిర్మాణాన్ని
చేపట్టినపుడు ఆ ప్రాంతం మునిగిపోయింది. దానితో వీళ్ళు నిర్వాశితులుగా మారి భారత్
కు శరణార్ధులుగా వచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చక్మా, హజోంగ్ నిర్వాశితులకు పారసత్వం ఇచ్చే ప్రక్రియ
మొదలయిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వారం క్రితమే ప్రకటించారు.
చక్మా, హజోంగ్ లను కనికరించినట్టు రోహింగ్యా శరణార్ధుల మీద కూడా
భారత కేంద్ర ప్రభుత్వం జాలి చూపుతుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే, రోహింగ్యాల మీద భారత ప్రభుత్వ
విధానాన్ని చమురు కంపెనీలు నిర్ణయిస్తాయనే ఒక బలమైన వాదన వినిపిస్తోంది.
మయన్మార్ చమురు, సహజవాయువుల నిక్షేపాలలో వాటా కోసం అంతర్జాతీయ చమురు
కంపెనీలు (ఐవోసీలు) అన్నీ చాలా కాలంగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా భారత చమురు
సంస్థలు కూడా మయన్మార్ లో కార్యకలాపాలు మొదలెట్టాయి. మవొత్తమ బేసిన్ లో దాదాపు 28 వేల చదరపు కిలో మీటర్ల
విస్తీర్ణానికి వ్యాపించిన యం-17, యం-18 బ్లాకుల్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. అలాగే భారత ప్రభుత్వరంగ సంస్థలైన
ఓయన్ జీసీ విదేష్ లిమిటెట్, ఆయిల్ ఇండియా, గేయిల్ సంస్థలు మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి మరో మూడు
బ్లాకుల్ని చేజిక్కించుకున్నాయి.
నేటి మయన్మార్ ఆర్ధిక వ్యవస్థ మొత్తంగా చమురు పరిశ్రమ మీదే
ఆధాపడివుంది. కలదాన్, మాయూ, లే మ్రో నదుల బేసిన్ల
సమీపంలో చమురు కంపెనీలకు భూముల్ని కేటాయించడం కోసమే అప్పటి సైనిక ప్రభుత్వ,
ఇప్పటి అంగ్ సాంగ్ సు కీ ప్రభుత్వం
రోహింగ్యాల భూముల్ని సైనిక బలంతో
లాక్కొన్నది.
మయన్మార్ లో తమతోసహా తమలాంటి చమురు సంస్థలవల్ల నిర్వాశితులై
శరణార్ధులుగా వచ్చిన రోహింగ్యాలకు భారత్ లో ఆశ్రయం ఇవ్వడానికి రిలయన్స్ అంబానీలు
ఒప్పుకుంటారా? మోదీ ప్రభుత్వ వర్ణమాలలో అ అంటే అంబానీ, ఆ అంటే ఆడాని
అనేమాట ప్రచారంలోవుంది. అలాంటప్పుడు అంబానీల మనోభావాలకు భిన్నంగా భారత ప్రభుత్వం వ్యవహరించ
గలుగుతుందా? ఇవి సమీప భవిష్యత్తు తేల్చాల్సిన అంశాలు.
(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ 9010757776
హైదరాబాద్
20 అక్టోబరు 2017
ప్రచురణ :
మన తెలంగాణ, 22 అక్టోబరు 2017
http://epaper.manatelangana.news/1401877/Mana-Telangana-Daily/22-10-2017#page/4/2
No comments:
Post a Comment