వర్తమానం గతంగా మారిపోయింది. ఇన్నాళ్ళూ తాడి మోహన్ అనే గొప్ప చిత్రకారుడు "వున్నాడు" అనేవాళ్ళం. ఇక ముందు "వుండేవాడు" అనాలేమో! తీవ్ర అస్వస్థత కారణంగా కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మోహన్ సెప్టెంబరు 21 తెల్లవారుజామున చనిపోయాడు.
చిత్రకళారంగంలో శ్రామిక యోధుడు తాడి మోహన్. అతను మన కాలపు చిత్తప్రసాద్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ప్రతి ఉద్యమాన్నీ మోహన్ తన రేఖాచిత్రాల్లో భద్రపరిచాడు.
వామపక్షాలు విప్లవపక్షాలు మొదలు దళిత బహుజన ఆదివాసి, మైనారిటీ, స్త్రీవాదాలు,
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ప్రతిదానికీ క్రోక్విల్ సేవలు అందించడానికి మోహన్ అందరికన్నా ముందుండే వాడు. మోహన్ తరువాతి తరం చిత్రకారులు అనేక మంది వచ్చినప్పటికీ ఉద్యమ చిత్రకారుడనే టైటిల్ ను ఇప్పటి వరకు ప్రతి ఏడాదీ మోహనే నిలబెట్టుకునేవాడు. మోహన్ పోస్టర్ లేని సభలు సమ్మెలు ఊరేగింపులే కాదు లంచ్ అవర్ ధర్నాలు సహితం వుండేవికావనంటే అతిశయోక్తికాదు.
వేదిక మీద నిలబడి మాట్లాడేది నల్లమల గిరిప్రసాద్ అయినా, సురవరం సుధాకర రెడ్డి అయినా, కాళోజీ నారాయణరావు అయినా, వరవరరావు అయినా, కత్తి పద్మారావు అయినా, మంద కృష్ణ అయినా
వేదిక వెనక వుండే బ్యాక్ డ్రాప్ మాత్రం మోహన్ దే వుండేది.
తెలుగులో నాలుగు కవితలు రాసిన ప్రతిఒక్కరూ మోహన్ చేత అట్ట మీద బొమ్మ గీయించుకోవాలని తహతహ లాడేవారు. శ్రీశ్రీ మహాప్రస్తానం సంకలనాన్ని చెలం ముందుమాట లోకానికి పరిచయం చేసినట్టు మోహన్ కవర్ పేజి తమ కవితల్ని పాఠకులకు పరిచయం చేస్తుందని వాళ్ళు ఆశపడేవారు.
శ్రామికుల్ని బక్కగా నిస్సహాయులుగా దీనులుగా చిత్రించడాన్ని లెనిన్ ఇష్టపడేవాడుకాదు. మానవాళికి విముక్తిని సాధించి పెడుతున్న యోధులుగా వాళ్ళను చిత్రించాలని సూచించేవాడు. 1950వ దశకంలో చిత్తప్రసాద్
తెలంగాణ సాయుధపొరాట రైతు ముందు నిజాం - నెహ్రు సైన్యాలని చీమల్లా చిత్రించింది ఈ దృక్పధంతోనే.
చిత్రకళారంగంలో లెనినిస్టు సాంప్రదాయాన్ని కొనసాగించినవాళ్ళలో మోహన్ కూడా ఒకడు. అతని చిత్రాల్లోని కార్మికులు,
వ్యవసాయ కూలీలు, దళితులు, ఆందోళనకారులు ముఖంలో చెక్కుచెదరని ఆత్మస్థైర్యం, విశాలమైన ఛాతీ, బలమైన చేతులు, దృఢమైన కాలిపిక్కలు, ఇనప సంకెళ్లను సహితం తెంచేయగల శక్తివంతమైన చేతులతొ
అజానుబాహులుగా వుండేవారు. మోహన్ బొమ్మలేకాదు అక్షరాలు సహితం వుద్యమ ఆవేశంతో ఘీంకరిస్తూ వుండేవి. .
విశాలాంధ్రతో మొదలయిన మోహన్ చిత్రకళా జైత్రయాత్ర ఆంధ్రప్రభ మీదుగా ఉదయం నాటికి తనదైన ప్రత్యేక శైలిని సంతరించుకుంది. పొలిటికల్ కార్టూనిస్ట్ అంటే మోహనే అన్నంతగా ఆ రంగాన్ని దాదాపు మూడు దశాబ్దాలు శాసించాడు మోహన్. చిత్రకళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి యానిమేషన్ విభాగాన్ని అభివృధ్ధి చేసిన వాళ్లలో కూడా మోహనే అగ్రగణ్యుడు. తను సృష్టించిన యానిమేషన్ కృతులు ఇప్పటికీ ప్రమాణికమే.
తను రాసింది తక్కువే అయినా మోహన్ మంచి రచయిత. గొప్ప విమర్శకుడు. పదునైన వ్యంగ్యంతో కూడిన అతని తెలుగు వాక్యం చాలా అందంగా వుండేది. తను అంతకు మించిన గొప్ప పాఠకుడు.
మోహన్ అంతటి విస్తారంగా పుస్తకాలు చదివిన వారు బహు అరుదుగా మాత్రమే వుంటారు. అన్నింటికీ మించి అతను ఒక మంచి మనిషి. మోహన్ ఎక్కడుంటే అక్కడ కవులు కళాకారుల సమ్మేళనంగా వుండేది.
అనేక సంస్థల్లో పనిచేసినా, అనేక ఉద్యమాలతో అనుబంధాన్ని కొనసాగించినా మొహన్ హృదయం నిరంతరం ఎడమ పక్కనే కొట్టుకుంటూ వుండేది. గ్లోబల్ సన్నివేశంలో మోహన్ బ్లడ్ గ్రూప్ ఏ-నెగటివ్. అంటే అమేరికా వ్యతిరేకి. ఐయంఎఫ్, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే అతనికి పడేదికాదు. వియత్నాం యుధ్ధం నుండి ఇరాక్ యుధ్ధం, ఆఫ్ఘన్
యుధ్ధం వరకు, ఇందిరా గాంధీ నుండి నుండి నరేంద్ర మోదీ వరకు మోహన్ ది సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణి, ఫాసిస్టు వ్యతిరేక ఆలోచనా సరళి. ప్రపంచ పటం మీద ఎక్కడైనాసరే సామ్రాజ్యవాదం, ఫాసిజం కదలికల్ని పసిగట్టగానే మోహన్ కుంచె జూలు విదిలించేది. మోహన్ కార్టూన్లను వరుసగా పేరిస్తే
రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రనేకాదు, వర్తమాన ప్రపంచ చరిత్రను సహితం వ్యాఖ్యాన సహితంగా అర్ధం చేసుకోవచ్చు.
దేవీ ప్రియ కాంబినేషన్ లో వచ్చిన రన్నింగ్ కామెంటరీ, శివాజీ కాంబినేషన్లో వచ్చిన దిబ్బరాజ్యం, పతంజలి కాంబినేషన్ లో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్ అప్పట్లో చాలా పెద్ద ఆసక్తిని రేకెత్తించాయి.
వ్యక్తిగతంగా మోహన్ తో నాకు దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధవుంది. 1978 చివర్లో విజయవాడలో నేను తొలిసారి తనను (దాసరి శిరీష వాళ్ళింట్లో) కలిశాను.
నాలుగయిదు రోజుల్లోనే మేము సన్నిహితులం అయిపోయాం. తను ఆంధ్రప్రభలో ఉద్యోగం కోసం హైదరాబాద్ కు మకాం మారేంత వరకు నా జీవితం ఓ నాలుగేళ్ళు మోహన్ తో పాటు విజయవాడ కార్ల్ మార్క్స్ రోడ్డులోనే సాగింది. అప్పట్లో దాన్ని ఏలూరు రోడ్డు అనేవారు.
మోహన్ అప్పట్లో చాలా ఇష్టపడే నవల ‘అండ్ క్వైట్ ఫ్లోస్ ద డాన్ ‘. మిఖాయిల్ అలేక్జాంద్రోవిచ్ షోలఖోవ్ దీని రచయిత. మోహన్ మరో ప్రత్యేకత ఏమంటే రచయిత పూర్తి పేరు పలకాలనేవాడు. గోర్కీ కాదు; అలెక్సి మక్సిమోవిచ్ పెష్కోవ్ గోర్కి అనాలనేవాడు. అప్పట్లో తను నాకు ఇచ్చిన మిఖాయిల్ సాల్టికోవ్ షడ్రిన్ పుస్తకం తరువాతి కాలంలో రాజకీయ వ్యంగ్యం రాయడానికి చాలా వుపయోగపడింది.
బ్రిటీష్ నటి ఆడ్రి హెప్ బర్న్ అంటే మోహన్ కు చాలా ఇష్టం. ఆమె నటించిన ‘రోమన్ హాలిడే’, ‘మై ఫెయిర్ లేడీ’ సినిమాలను విజయవాడలో
ఇద్దరం కలిసే చూశాం.
మోహన్ సాహచర్యంలో నాకు అర్ధం అయిన విషయం ఏమంటే నేను ఎప్పటికీ తను చదివినన్ని పుస్తకాలు చదవలేనని; నాకు అంత అవసరం కూడా లేదని. అచ్చయిన ప్రతి పుస్తకాన్నీ చదివేసి మెదడులో చెత్తను పేర్చుకోవడంకన్నా ఒక సాంఘీక కార్యకర్తగా నాకు అవసరమైన మేరకు
పుస్తకాలు చదివితే చాలని నేను భావించేవాడిని. నా కోరిక మేరకు తను ఓ షార్ట్ లిస్ట్ తయారు చేసి ఇచ్చాడు. వాటిల్లో కొన్నింటిని తనే విశాలాంధ్ర పబ్లిషర్స్ లైబ్రరీ నుండి తెచ్చి ఇచ్చేవాడు. కొన్నింటిని నేను బెగ్ బారో అండ్ స్టీల్ స్కీముల్లో సేకరించుకునేవాడిని. పుస్తకాలను చదవడానికి తను దగ్గర దారిని చూపెట్టడం ద్వార నేను కనీసం ఓ పదేళ్ళ జీవిత కాలాన్ని ఆదా చేసుకుని వుంటాను. అందుకు నేను తనకు ఎన్నడూ రుణపడే వుంటాను.
కానీ, తను తన జీవితాన్ని ఓ పదేళ్ళు తగ్గించుకుని వెళ్ళిపోవడమే బాధాకరం.
(రచయిత సమాజ పరిశీలకుడు, రాజకీయ వాఖ్యాత)
మొబైల్ : 9010757776
21-09-2019
ప్రచురణ :
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ
22-09-2019
http://www.andhrajyothy.com/artical?SID=467368
No comments:
Post a Comment