Four Young Turks
ఆ నలుగురు !
-
డానీ
గుజరాత్ ఓటర్లు బీజేపికి ఉత్సవాలు జరుపుకునేంత
విజయాన్నీ ఇవ్వలేదు; కాంగ్రెస్ కు కుంగిపొయేంత పరాజయాన్నీ ఇవ్వలేదు. ఒక్క ఓటుతో గెలిచినా
గెలుపు గెలుపే, ఒక్క సీటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా విజయం విజయమే అంటూ కమలనాధులు
ఊపిరి పీల్చుకుంటుంటే, తమది నైతిక విజయమని కాంగీయులు సరిపెట్టుకుంటున్నారు. దీని తాత్పర్యం ఏమిటంటే కాంగ్రెస్ పెద్దగా పెరగకున్నా నరేంద్ర మోదీ- అమిత్
షా గాలి తగ్గుముఖం పట్టిందని!
గుజరాత్ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం
ఏమంటే అయితే, ఓ నలుగురు యంగ్ టర్కులు దేశ రాజకీయ రంగంలో వెలుగులోనికి వచ్చారు. వాళ్ళు;
జిగ్నేష్ మేవానీ, హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, ఇమ్రాన్ యూసుఫ్ భాయి ఖేడావాలా. ఈ
నలుగురూ సంఘసేవ నుండి రాజకీయాల్లోనికి ప్రవేశించారు. ఇంతకాలం నోట్లో నాలుకలేని మొద్దబ్బాయిగా ముద్రపడిన
గాంధీ-నెహ్రు వంశోధ్ధారకుడు రాహుల్ గాంధీ గుజరాత్
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ వాగాడంబరాన్ని గట్టిగా ఎదుర్కొన్నారంటే దానికి
ప్రధాన కారణం ఈ నలుగురే. రాహుల్ గాంధీ ఇలా హఠాత్తుగా రెచ్చిపోవడంతో ఆశ్చర్యపోవడం మోదీ-షాల
వంతయింది. సాంప్రదాయ మాధ్యమాలతోపాటూ సామాజిక మాధ్యమాల్లోనూ రాహుల్ గాంధి తన కొత్త శక్తియుక్తుల్ని
ఉధృతంగా ప్రదర్శించారు.
అహ్మదాబాద్ కు చెందిన దళిత యువకుడు జిగ్నేష్
నట్వర్ లాల్ మేవానీ జర్నలిస్టు, న్యాయవాది. గత ఏడాది గుజరాత్ సౌరాష్ట్రలో చెలరేగిన ఉనా ఉద్యమానికి నాయకత్వం వహించడంతో జిగ్నేష్
పేరు వెలుగులోనికి వచ్చింది. 2016 జులై 11న గిర్ సోమనాథ్ జిల్లా ఉనా పట్టణం సమీపాన
మోత సమాధియాల గ్రామంలో ఓ చనిపోయిన ఆవు చర్మాన్ని వొలుస్తున్న దళితుల మీద గోగ్రవాదులు
అనుమానించి, అవమానించి, దాడి చేసి, తీవ్రంగా
కొట్టారు. దానికి నిరసనగా అహ్మదాబాద్ నుండి
సౌరాష్ట్ర తీర ప్రాంతంలోని ఉనా వరకు 350 కిలో మీటర్ల పాదయాత్రను జిగ్నేష్ నిర్వహించారు.
దళితులు పశువుల కళేబరాలను తొలగించరాదనీ, సాంప్రదాయ
చర్మకార వృత్తి నుండి తప్పుకున్న దళితులు ఒక్కొక్కరికి
3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఉనా ఉద్యమం డిమాండ్ చేసింది. “ఆవు తోకను మీరే వుంచుకోండి;
మా భూమిని మాకు ఇచ్చేయండి” అనేది ఉనా ఉద్యమం ప్రధాన నినాదం.
అంబేడ్కర్, మార్క్స్ సిధ్ధాంతాలను జమిలిగా
నమ్మే జిగ్నేష్ ‘బహుజన శ్రామికవర్గం’ అనే మాటను ప్రచారంలోనికి తెచ్చారు. దళితులు సంఘ్ పరివారం ప్రభావంలో పడిపోవడం అపి ముస్లిం సమాజానికి
దగ్గర కావాలని ఆయన అంటారు.
ఈసారి ఎన్నికల్లో జిగ్నేష్ మేవానీ గుజరాత్
ఈశాన్య ప్రాంతపు బనాస్ కంఠ జిల్లాలోని వడ్గామ్
యస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. 2012
ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన మణీలాల్
వాఘేల బీజేపీకి చెందిన ఫకీర్ భాయి వాఘేలా ఓడించి దాదాపు 22 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి జిగ్నేష్ మేవానీ ప్రవేశంతో వడ్గామ్ లో బీజీపి వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ముప్పును గమనించిన కాంగ్రెస్
కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధి సంక్షోభ నియంత్రణకు రంగంలో దిగారు. తన పార్టి సిట్టింగ్
ఎమ్మెల్యే మణీలాల్ వాఘేలను ఒప్పించి మరో నియోజకవర్గానికి పంపి జిగ్నేష్ మేవానీకి పరోక్షంగా
మద్దతు పలికారు. సామాజిక రంగంలో జిగ్నేష్ ఆవశ్యకతను గుర్తించిన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్
కూడా తన అభ్యర్ధిని పోటీ నుండి ఉపసంహరించుకుంది. విచిత్రం ఏమంటే మాయావతి నాయకత్వంలోని
బహుజన సమాజ్ పార్టి తన అభ్యర్ధిని రంగంలోనికి దించి ముక్కోణపు పోటీని సృష్టించింది.
అంతిమంగా జిగ్నేష్ 22 వేల మెజారిటీతో ఘన విజయం సాధించి, కాంగ్రెస్‍కు మద్దతు ప్రకటించారు.
రాహుల్ గాంధీ తలపెడుతున్నారని ప్రచారం జరుగుతున్న సోషల్ ఇంజినీరింగులో జిగ్నేష్ కీలక
పాత్ర పోషించవచ్చు. ఈ వ్యూహం భారత రాజకీయాల్లో కొత్త మలుపు కానుంది.
గుజరాత్
రాజకీయాల్లో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మరో
యువకుడు హార్దిక్ పటేల్. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన పాతికేళ్ళు కూడా లేనప్పటికీ పాటిదార్ల ఉద్యమంతో ఆయన వెలుగులోనికి వచ్చారు. గుజరాత్ లో పెద్ద
సంఖ్యలో వున్న రైతు సమూహం పాటిదార్లు.
వీళ్ళపేర్ల చివర పటేల్ అని వుంటుంది. వీళ్ళు ప్రధానంగా గోధుమ, ప్రత్తి,
పప్పుధాన్యాలు సాగు చేస్తారు. వీరిలో కొందరు ఇస్లాం మతాన్నిస్వీకరించినా పటేల్ అనే
ఇంటి పేరును ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. గుజరాత్
కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్
పటేల్, బాలివుడ్ దర్శకుడు జబ్బార్
పటేల్, క్రికెటర్ మునాఫ్ పటేల్ తదితరులు ఈ కోవకు చెందినవారే.
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలులేక,
మరోవైపు ప్రైవేటు రంగంలో అవకాశాలు రాక, వ్యవసాయం గిట్టుబాటుగాక ఆర్ధికంగా
చితికిపోతున్న పటీదార్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని రెండేళ్ళ క్రితం రిజర్వేషన్
ఉద్యమాన్ని ప్రారంభించారు హార్దిక్ పటేల్. దాని కోసం ఏర్పడిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్)కి అతనే
అగ్రనేత. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్ పోటీ చేయకపోయినా కాంగ్రెస్ కు గట్టి
ప్రచారం చేశారు. పటీదార్ రైతుల ప్రభావం ఎక్కువగా వున్న సౌరాష్ట్రలో కాంగ్రెస్ భారీగా పుంజుకోవడానికి
కారణం పాస్ అనవచ్చు. అయితే, పటీదార్ పారిశ్రామికవేత్తల ప్రభావం ఎక్కువగావున్న
సూరత్ ప్రాంతంలో బీజేపి బలం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. సూరత్ వాణిజ్యవర్గం అందించిన
మద్దతుతోనే బీజేపి ఈసారి గట్టేక్కగలిగింది. పటీదార్ రైతులు కాంగ్రెస్ పక్షాన
వుంటే, పటీదార్ వాణిజ్యవేత్తలు బీజేపి పక్షాన నిలబడ్డారనవచ్చు. ఏమైనా, బీజేపికీ
బలమైన మద్దతుదార్లయిన పటీదార్లలొ చీలిక తేవడంలో హార్ధిక్ పటేల్ సఫలమయ్యారు. ఈ
ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమ ప్రభావం ఎంత బలంగా కనిపించిందంటే పటేల్ అనే పేరు
పలకడానికి కూడా బీజేపి అగ్రనేతలు భయపడ్డారు. అహ్మద్ పటేల్ ను సహితం వాళ్ళు అహ్మద్
మియా అనడం మొదలు పెట్టారు. హార్ధిక్ పటేల్
ఇక ముందు కాంగ్రెస్ శిబిరంలో ప్రాబల్యం గల యువనాయకునిగా కొనసాగే అవకాశాలున్నాయి.
గుజరాత్ రాజకీయ రంగంమీద
ప్రవేశించిన మరో యువకెరటం అల్పేష్ ఠాకూర్.
క్షత్రీయ ఠాకూర్ అనేది గుజరాత్ లో వెనుకబడిన సామాజికవర్గం. వీళ్ళు క్షత్రీయులను
పోలిన పేర్లను పెట్టుకుంటారు. అల్పేష్ ఠాకూర్ నాటు సారా వ్యతిరేక పోరాటాన్ని
నిర్వహించి సామాజిక సేవకునిగా మారారు. రెండేళ్ల
క్రితం హార్దిక్ పటేల్ చేపట్టిన పటీదార్ రిజర్వేషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా యస్సీ,
యస్టీ, ఓబిసి ల ఐక్య ఉద్యమాన్ని నిర్మించడంతో అల్పేష్ ఠాకూర్ వెలుగు లోనికి
వచ్చారు. హార్దిక్ పటేల్ ఉద్యమం యస్సీ, యస్టీ, ఓబిసిల రాజ్యాంగ భద్రతకు ముప్పు
తెస్తుందని ఆయన ప్రచారం చేసేవారు. ఓబీసీలకు ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్ కు
ఎలాంటి భంగం కలగకుండ పటీదార్ల కు రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధి హామీ
ఇవ్వడంతో అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ లో
చేరారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఉత్తర గుజరాత్ పతన్ జిల్లాలోని రాధన్ పూర్ నియోజకవర్గం
నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి 18 వేల మెజారిటీతో గెలిచారు.
గుజరాత్ ఎన్నికల్లో ప్రధాన స్రవంతి
ప్రచారానికి అంతగా నోచుకోని మరో ముఖ్యడు ఇమ్రాన్ యూసఫ్ భాయి ఖేడేవాలా. గుజరాత్ నగర
పాలక సంస్థలో పార్టీ గుర్తుతో పనిలేకుండా రెండుసార్లు కార్పొరేటరుగా గెలిచిన
పేరుంది ఆయనకు. అహ్మదాబాద్ నగర పాలక సంస్థలో ఆయనొక్కడే ముస్లిం కార్పొరేటర్. ఈసారి
ఆయన అహ్మదాబాద్ నగర పరిధిలోని జమల్ పూర్ – ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. 2012
ఎన్నికల్లో ఖాడియా నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ సాగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్ధి సమీర్ ఖాన్ సిపాయికు 42 వేల ఓట్లు రాగా, కాంగ్రెస్ రెబెల్ గా రంగంలో
దిగిన సాబిర్ భాయి కాబిల్ వాలాకు 30 వేల ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ముస్లింలకు
72 వేల నికర ఓట్లు వున్నప్పటికీ 48 వేల ఓట్లు వచ్చిన బీజేపి అభ్యర్ధి భూషన్ భట్ 6
వేల మెజారిటీతో గెలిచాడు. ఈసారి అలాంటి ప్రమాదాన్ని ముందుగా గమనించిన రాహుల్ గాంధి
ముస్లీం ఓట్లు చీలకుండా జాగ్రత్తలు
తీసుకున్నారు. సాబిర్ భాయి కాబిల్ వాలా, సమీర్ ఖాన్ సిపాయిలను బుజ్జగించి
తిరుగుబాటు అభ్యర్ధులుగా రంగంలో దిగకుండా కట్టడి చేశారు. ఫలితంగా ఇమ్రాన్ యూసఫ్ భాయి 30 వేల భారీ
మెజారిటీతో గెలిచారు.
నలుగురు యంగ్టర్క్స్ లో అల్పేష్
ఠాకూర్, ఇమ్రాన్ యూసుఫ్ భాయి ఖేడావాలా కాంగ్రెస్ లో చేరిపోయారు. జిగ్నేష్ మేవానీ,
హార్దిక్ పటేల్ కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఈ నలుగురి సామాజిక దృస్పథాల్లొనూ
అనేక బేధాలున్నాయి. అయితే వీళ్లందరి మధ్య ఒక విషయంలో విడదీయరాని ఐక్యత వుంది.
వీళ్లంతా ఫాసిస్టు శక్తులకు, హిందూత్వవాదులుకు బధ్ధ వ్యతిరేకులు. గుజరాత్ లో
తద్వార దేశంలో లౌకిక ప్రజాస్వామిక
మతసామరస్య రాజకీయాలు వికసించడానికి వీళ్లంతా దోహదపడతారని అశిద్దాం.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
సెల్ ఫోన్ – 9010757776
హైదరాబాద్
21 డిసెంబరు 2017
ప్రచురణ :
http://epaper.manatelangana.news/1475766/Mana-Telangana-Daily/22-12-2017#page/4/2
No comments:
Post a Comment