‘వివాహహక్కుల రక్షణ’
ముస్లిం మహిళలకేనా?
-
అహ్మద్ మొహియుద్దీన్
ఖాన్ యజ్దానీ (డానీ)
ముస్లిం
సమాజంలో వైవాహిక బంధం లోనికి ప్రవేశించడానికి ఒక్కటే పధ్ధతుంది; ట్రిపుల్ ఖుబూల్. అలాగే,
వైవాహికబంధాన్ని తెంచుకోవడానికి కూడా ఒక్కటే పధ్ధతుంది; ట్రిపుల్ తలాఖ్.
ముస్లిం
వివాహ సాంప్రదాయాన్ని, హిందూ వివాహ సాంప్రదాయంతో పోల్చడమే తప్పు. హిందూ వివాహం శాశ్విత బంధం. ముస్లిం వివాహం ఒక ఒప్పందం.
దీని విధివిధానాలు ఆధునిక ‘అగ్రిమెంట్ మేరేజ్’ కు దగ్గరగా వుంటాయి. ఒప్పందం అంటేనే
పరస్పర అంగీకారం మీద జీవిత కాలం కొనసాగనూవచ్చు; జీవిత భాగస్వాముల్లో ఏ ఒక్కరికి అభ్యంతరంవున్నా
ఏ దశలో అయినా విడిపోనూవచ్చు.
శాశ్వితమనుకునే
హిందూ వైవాహిక సాంప్రదాయం నుండి బయటపడడానికి మహిళలు విడాకుల చట్టాన్ని కోరుకోవడాన్నీ మనం చూశాం.
అశాశ్వితమనుకునే ముస్లిం వైవాహిక సాంప్రదాయంలోనే శాశ్వితంగా వుండిపోవాలని కోరుకుంటున్న
మహిళల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
ట్రిపుల్
తలాఖ్ వేరు, ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ వేరు. ట్రిపుల్ తలాఖ్ అనేది ముస్లిం
సమాజంలో అనాదిగా వుంది; ఇక ముందు కూడా వుంటుంది. ఇప్పుడు వివాదం సాగుతున్నది ఇన్ స్టాంట్
ట్రిపుల్ తలాఖ్ గురించి మాత్రమే. దీనిని తలాఖ్-
ఏ- బిద్దత్ (చిటికెల్లో విడాకులు) అంటారు. ఇది ఇస్లామిక్ సాంప్రదాయంకాదు. ఖురాన్ లోగానీ, హదీస్
లోగానీ దానికి సమర్ధన లేదు. అంచేత ముస్లిం పౌరస్మృతి (షరియా)లోనూ దానికి సమర్ధన లేదు.
ఇన్
స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ అనేది ఇటీవల అతికొద్ది మంది ముస్లిం భర్తలు అనుసరించిన ఒక అరాచక
విడాకుల విధానం. ఎస్సెమ్మెస్, ఇ-మెయిల్, వాట్స్ అప్, మెసెంజర్ తదితర అత్యాధునిక సమాచార
మాధ్యమాల ద్వార వాళ్ళు విడాకుల్ని ప్రకటిస్తున్నారు. ఒక విధంగా ఇది ఐటీ విప్లవం సృష్టించిన
ఒక వికారం. దీన్ని ముస్లిం సమాజం సహితం తీవ్రంగా ఖండిస్తూనే వుంది.
ఇస్లాం
మూలసూత్రాలకు చిటికెల్లో విడాకుల ఆచారం అనుకూలమా?
వ్యతిరేకమా? అనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తారంగా పరిశీలించింది. చివరకు ఇన్ స్టాంట్
ట్రిపుల్ తలాఖ్ అనేది ఇస్లాం ఆదర్శాలకు విరుధ్ధమని చట్టపరంగా చెల్లదని ఈ ఏడాది ఆగస్టు
22న తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు మీద సాధారణ ముస్లిం సమాజం మాత్రమేకాక ఇస్లాం
మత పెద్దలు సహితం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. సుప్రీం కోర్టు ఇస్లాం ధర్మాలను
కొనియాడడంవల్ల ముస్లిం సమాజానికి నైతిక మద్దతు కూడా లభించింది. అయితే, కేసు విచారణ
సందర్భంగా సాంప్రదాయ మాధ్యమాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ముస్లిం వ్యతిరేక ప్రచారం
పెద్ద ఎత్తున సాగింది. ముస్లిం వివాహ వ్యవస్థను ఒక నరకంగానూ, ముస్లిం పురుషుల్ని నరరూప
రాక్షసులుగానూ వాటిల్లో చిత్రించారు.
సుప్రీం
కోర్టు తీర్పు తరువాత కూడా ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ సంఘటనలు మరికొన్ని తమ దృష్టికి
రావడంతో వాటిపై తాము స్పందించి దాని నిషేధానికి ఒక చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్ర
ప్రభుత్వం చెపుతోంది. కేంద్ర హోం, న్యాయశాఖలు సంయుక్తంగా రూపొందించిన ముస్లిం మహిళ (వివాహ హక్కుల
పరిరక్షణ) బిల్లు-2017కు డిసెంబరు 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును
వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రంగం సిధ్ధమైంది. వుభయ సభల్లోనూ అధికార
పార్టీకి అవసరమైన సంఖ్యాబలం వున్నకారణంగా ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఇన్
స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణించాలనేది ఈ చట్టంలో ప్రధానాంశం. అలాంటి నేరానికి
పాల్పడిన భర్తలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష
విధించాలనీ, యుక్త వయసు రాని పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కావాలంటే తల్లి తీసుకోవచ్చనీ,
వాళ్ళ జీవనభృతిని భర్త భరించాలనే అంశాలు ఈ బిల్లులో వున్నాయి.
ఒక
మతసమూహపు ఆచారవ్యవహారాలపై ఒక చట్టాన్ని తేదలిచినపుడు సంబంధిత సమాజపు అభిప్రాయాలను కూడా
పరిగణన లోనికి తీసుకుని వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. మరోమాటల్లో ఇది మైనారిటీల
సాంస్కృతిక వ్యవహారాల్లో ఏకపక్షంగా జోక్యం
చేయడమే అవుతుంది.
ప్రభుత్వానికి
మహిళల గౌరవ మర్యాదలు స్వేచ్చా స్వాతంత్ర్యాల మీద అంతగా ప్రేమ వుంటే దేశంలోని అన్ని
మత సమూహాల్లోని మహిళలకు వర్తించేలా ఒక సమగ్ర చట్టాన్ని తెస్తే బాగుండేది. ప్రత్యేకంగా
ముస్లిం మహిళ వైవాహిక హక్కుల పరిరక్షణ కోసమే కొత్త చట్టం తేవడం దేనికీ? ఈ అంశాన్ని
తాము మతవిశ్వాసాల ప్రాతిపదికగా చూడడం లేదనీ, లింగన్యాయం, లింగ సమానత్వం, మహిళల గౌరవం
తదితర మానవీయ కోణంలో చూస్తున్నామని కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర ప్రసాద్ అంటున్నారు.
కేంద్ర
ప్రభుత్వానికి ఇంతటి ముస్లిం మహిళాభిమానం వుండడం మహత్తర విషయమే. పదిమంది కాదు ఒక్కరు
బాధితులైనా ప్రభుత్వం స్పందించాల్సిందే. కానీ, దేశవ్యాప్తంగా ముస్లిం మహిళల మీద జరుగుతున్న
అన్యాయాలు అన్నింటి మీదా ప్రభుత్వం అలాగే స్పందిస్తున్నాదా?. మాలియాన, ముజఫర్ నగర్
హత్యలు, అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళలు ఇంతకన్నా పెద్ద సంఖ్యలో, ఇంతకన్నా హృదయ విదారకంగా
రోదించారు. ప్రభుత్వంలో అప్పుడెప్పుడూ ఇలాంటి ముస్లిం మహిళా సానుభూతి కనిపించలేదు.
భార్య
ఇష్టం లేకుండా సాగించే సంభోగాన్ని అత్యాచార నేరంగా పరిగణించి భర్తల్ని శిక్షించేలా ఒక చట్టం చేయాలని సుప్రీం కోర్టు ఆ
మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైవాహిక
అత్యాచారం మీద ఢిల్లీ హై కోర్టులో ఇంకో ప్రజా
ప్రయోజన వాజ్యం నడుస్తున్నది. పధ్ధెనిమి సంవత్సరాలు దాటని భార్యతో సంభోగం చేయడాన్ని
అత్యాచార నేరంగా పరిగణించి భర్తను శిక్షించాలనేది దీని సారాంశం. ఢిల్లీ హై కోర్టులోని
‘పిల్’ను కూడా తన పరిధిలోనికి తీసుకోవడంతో ఈ అశం ఇప్పుడు సుప్రీం కోర్టు పరిధిలోవుంది.
ట్రిపుల్
తలాక్ బాధిత స్త్రీల కన్నా వైవాహిక అత్యాచార బాధిత స్త్రీల సంఖ్య నిస్సందేహంగా వందల
వేల రెట్లు ఎక్కువగా వుంటుంది. ఆ పురుషుల్ని శిక్షించడానికీ ఆ స్త్రీలని రక్షించడానికీ,
మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం తెచ్చే సాహసం కేంద్ర ప్రభుత్వానికి వున్నదా? అని
ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది.
పైగా,
వైవాహిక అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్
ను చదివితే వారి మహిళాభిమానం ఎంత గొప్పదో అర్ధం
అవుతుంది. “భార్య అత్యాచారం అనుకున్నది భర్తకు అత్యాచారంగా కనిపించపోవచ్చు. … ఇలాంటి చట్టాలను కనుక తీసుకుని వస్తే వివాహ వ్యవస్తే
మొత్తంగా కూలిపోతుంది. భర్తల్ని వేధించడానికి భార్యల చేతికి ఆయుధాలను అందుబాటులో వుంచినట్టవుతుంది”
అని అందులో పేర్కొన్నారు. ఇదే మాటను ముస్లిం
సమాజం విషయంలో ఎందుకు చెప్పలేదన్నది కీలక అంశం. ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలూ? ముస్లిం
భర్తల్ని వేధించడానికీ ఆ చట్టం భార్యల చేతులకు ఆయుధాలను అందుబాటులో వుంచినట్టు కాదా?
తద్వార వివాహ వ్యవస్తే మొత్తంగా కూలిపోదా? పౌరుల మత విశ్వాసాలు ఎలావున్నా ప్రభుత్వానికి
మతపక్షపాతం వుండడం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుధ్ధం.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ
అధ్యక్షుడు)
సెల్ నెం. 9010757776
హైదరాబాద్
23 డిసెంబరు 2017
ప్రచురణ :
ఆంధ్రజ్యోతి దినపత్రిక 26 డిసెంబరు
2017
No comments:
Post a Comment