Gujarat
Elections
గుజరాత్ ఫలితాలు
రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతాలు
- డానీ
గుజరాత్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎవరు
ఓడారూ? అన్నది అంత ప్రధానమైన అంశంకాదు. నరేంద్ర మోది స్వంత గడ్డ మీద భారతీయ జనతా పార్టి బలం తగ్గింది అన్నదే ముఖ్యం. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో
అధికారాన్ని చేపట్టడం, నిలబెట్టుకోవడం, కోల్పోవడంతో అనే మూడు అంశాలే ప్రధానం. “నూట
యాభై సీట్లు గెలిచి తీరుతాం” అంటూ ఆర్భాటంగా
ప్రకటించిన బీజేపి అగ్రనేతలు ఇప్పుడు గొంతు తగ్గించి ‘ఒక్క సీటుతో గెలిచినా గెలుపు
గెలుపే” అంటున్నారు. ఎన్నికల్లో సామాజిక విశ్లేషకులు గమనించాల్సిన అంశాలు అంతకన్నా
ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో
పెరుగుతున్న దారిలో ఎవరున్నారూ? తరుగుతున్న
దారిలో ఎవరున్నారూ? అనేదీ కూడా సమాజ పరిణామంలో చాలా కీలక అంశం. అదే రాబోయే రాజకీయ పరిణామాలకు
సంకేతాలు అవుతాయి.
వర్తమాన భారత రాజకీయాల్లో ఉత్తర ప్రదేశ్
ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ-అమిత్ షా జోడి
అప్రతిహత శక్తులుగా కనిపించారు. ఈ జోడీకి గుజరాత్
స్వంత గడ్డ కనుక వారికి విజయావకాశాలు ఎక్కువ. ప్రచారం చేయకుండానే గెలవ వచ్చు అనుకున్న గుజరాత్ ఎన్నికల్లో వాళ్ళు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకన్నా
ఎక్కువ చెమటోడాల్సి వచ్చింది. అది వారి డొల్లతనాన్ని చెపుతోంది.
నరేంద్ర మోదీని అభివృధ్ధికి అవతార పురుషునిగా చిత్రించి, “గుజరాత్
తరహా అభివృధ్ధి’ గురించి కార్పొరేట్ మీడియా
అతిశయోక్తులతో సాగించిన ప్రచారమే 2014 ఎన్నికల్లో వారిని దేశ ప్రధానిని చేసిందన్నది
అందరికీ తెలిసిన విషయమే. ఈసారి “భారత్ తరహా అభివృధ్ధి”ని గుజరాత్ లో సాధిస్తానని ప్రధాని చెప్పాల్సి వుండింది. కానీ, వారు అలాంటి
సాహసాన్ని చేయలేకపోయారు. మోదీ ప్రభుత్వం అట్టహాసంగా,
ప్రతిష్టత్మకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీయస్టీ తదితర పథకాలన్నీ ప్రకటించిన ఫలితాలను
సాధించకపోగా దేశంలో అల్పాదాయ వర్గాల జీవితాలను మరింత దుర్భరంగా మార్చేశాయి. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు ‘నరేంద్ర మోదీ తరహా అభివృధ్ధి’కి
పరీక్షగా మారాయి.
పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమం ఐటీ విభాగ నిర్వాహకుడు సాగర్ సవాలియా ఎన్నికలకు దాదాపు
నాలుగు నెలల ముందు ఆగస్టు 24న “అభివృధ్ధికి పిచ్చెక్కింది” (వికాస్ గండో థాయొచ్చే)
అని ఒక నినాదాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు
చేశాడు. అది వైరల్ గా మారిపోయింది. అభివృధ్ధి
అంటే అవహేళనగా మారిపోవడంతో ఆ పదాన్ని పలకడానికి
కూడా బీజేపి నాయకులు భయపడిపోయారు. స్వంత రాష్ట్రంలోనే అభివృధ్ధి మంత్రం పనిచేయదని గుర్తించిన
మోదీ ఎన్నికల ప్రచారంలో ద్వేష రాజకీయాలనీ, చీలిక విధానాలనీ, దిగజారుడు వ్యాఖ్యానాలని
ఆశ్రయించి ప్రధాని హోదా గౌరవ మర్యాదల్ని మంటగలిపారు. ఇది ఈ ఎన్నికల్లో ప్రస్పుటంగా కనిపించిన అంశం.
పోలింగుకు ముందు అభివృధ్ది పేరే ఎత్తని బీజేపి అగ్రనేతలు
ఇప్పుడు ఫలితాలొచ్చాక ఢిల్లీలో కూర్చొని నరేంద్ర
మోదీ మార్కు అభివృధ్ధి నమూనాయే గుజరాత్ లో
మరొక్కసారి తమకు అధికారాన్ని కట్టబెట్టిందని అంటున్నారు. ఇదో రాజకీయ వైచిత్రి.
పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్
పటేల్ కాంగ్రెస్ కు దగ్గర కావడం కమలనాధుల్ని కలవర పరిచింది. మన దేశ ప్రధమ హోంమంత్రి
వల్లబ్ భాయి పటేల్ ను తరచూ స్మరించే మోదీ సహితం ఈ ఎన్నికల్లో పటేల్ పదాన్ని ప్రస్తావించడానికి
తటపటాయించారు. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్ళిందంటే గుజరాత్ కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్
ను బీజేపి నేతలు పటేల్ అనే ఇంటి పేరును తీసేసి అహ్మద్ మియా అనడం మొదలెట్టారు. కాంగ్రెస్ గెలిస్తే మియా (ముస్లిం)ను ముఖ్యంత్రి చేస్తారు
అని భయపెట్టే ప్రయత్నమూ చేశారు.
దళిత నేత జిగ్నేష్ మేవానీ. శ్రామిక కులాల నేత అల్పేష్ ఠాకూర్
కూడా కాంగ్రెస్ కు దగ్గరయ్యి కాషాయ శిబిరంలో
పెద్ద కలవరాన్నే సృష్టించారు. ఈ ఎన్నికల్లో తాడును చూసినా త్రాచు పామును చూసినట్టు
కమలనాధులు భయపడ్డారన్నా అతిశయోక్తికాదు. దానితో వాళ్ళు ఓటర్లను వెనక నుండి వలవేసే పట్టుకునే
పనిలోపడ్డారు.
బలహీనవర్గాల ఉద్యమాల్లో యువకులు వీరోచితంగా
ఉద్యమాలు చేస్తుంటే పెద్దతరం అనదగ్గవారు పదవులకో నిధులకో అధికార పార్టీలకు లొంగిపోవడం
ఒక బాధాకర పరిణామం. ఇది దాదాపు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని బలహీన సామాజికవర్గాల్లోనూ కనిపిస్తూనే వుంది. తెలంగాణలో నేరెళ్ళ, అభంగపట్నం తదితర చోట్ల దళితుల మీద దాడులు
జరిగినపుడు అధికార పార్టీలోని బహుజన నేతలు మౌన ప్రేక్షకుల్లా వుండిపోయారు. ఆంధ్రప్రదేశ్
లో ఏర్పేడు, గరకపర్రు వంటి దాడులు జరిగినపుడు
అక్కడి అధికార పార్టీలోని బహుజన నేతలు సహితం నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇలాంటి
పరిణామమే గుజరాత్ లోనూ జరిగింది. పటీదార్ యువకులు రిజర్వేషన్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటుంటే,
కొందరు కుల పెద్దలు ఇటూ రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలోవున్న పార్టీ అగ్రనేతలతో
రహాస్య మంతనాలు సాగించారు.
హిందూత్వ శిబిరంలో సాధారణంగా బ్రాహ్మణ-బనియా
సామాజిక వర్గాల ప్రతినిధులే సూత్రధారులుగా వుంటారు. హిందూ సమాజంలోని శ్రామిక కులాల్ని
హిందూత్వ పాత్రధారులుగా మార్చే క్రమం ఇటీవల విస్తృతంగా సాగుతోంది. కొత్తగా వచ్చిన సాంస్కృతిక
గుర్తింపుతో వాళ్ళూ హిందూత్వ శిబిరంలో చాలా ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. 2002 నాటి గుజరాత్
అల్లర్ల కాలంలోనే నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లోనూ అదే
పునరావృతమైంది. గుజరాత్ పశ్చిమ తీరంలోని కోలీ సామాజికవర్గం ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపిని
ఆదుకుంది. ‘దళిత’ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చాలా కాలం తీరప్రాంతంలోని కోలీలకు నాయకునిగా
వున్నారు. అసలు వారిని రాష్ట్రపతిని చేయడంలో కోలీ ఓటు బ్యాంకు కూడా ఒక కారణమన్నది తోసివేయదగ్గ
అంశం ఏమీకాదు. కోలీలు సౌరాష్ట్ర, దక్షణ గుజరాత్ ప్రాంత మత్స్యకారులు. వాళ్లకు పాకిస్తాన్
తో నేరుగా ఒక సమస్య వుంది. ఇబ్బిడిముబ్బిడిగా ఓడరేవుల నిర్మాణం, పారిశ్రామిక కాలుష్యం
మూలంగా గుజరాత్ తీర ప్రాంత సముద్ర జలాల్లో
చేపల లభ్యత తగ్గిపోయింది. దానితో ఆ ప్రాంత మత్స్యకారులు సాహసించి అంతర్జాతీయ జలాల్లోనికి
ప్రవేశించి చేపల వేట సాగిస్తున్నారు. ఇలా అనేక
సందర్భాల్లో సరిహద్దులోని పాకిస్తాన్ జలాల్లోనికి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి కాలంలో
ఓ వెయ్యి డీప్ సీ ఫిషింగ్ బోట్లను పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఓ ఐదు వందల మంది భారత జాలర్లు ఆ దేశ జైళ్ళల్లో వున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిస్తేనేగానీ వాళ్ళను విడిపించుకోవడం సాధ్యం కాదు. కోలీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను సద్వినియోగం చేసుకోవడానికి
ప్రధాని స్వయంగా రంగంలోనికి దిగారు. పాకిస్తాన్ కాంగ్రెస్ ల మధ్య ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఎన్నికల ప్రచారంలో
పెట్టారు.
హోరాహోరిగా సాగే ఎన్నికల ప్రచార హోరు ఓటర్లను
ఒక రకం పూనకంలో ముంచెత్తుతుంది. ఓటర్లు ఆ పూనకం
నుండి బయటపడి స్థిమితంగా ఆలోచించి ఓటు వేయాలనే దృష్టితో పోలింగు జరగడానికి కనీసం
40 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల చట్టంలో ఒక క్లాజ్ ను చేర్చారు. అయితే, ఈ షరతు రోడ్ షోలు, బహిరంగ సభల్ని ఆపగలుగుతున్నదేతప్ప, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్
మీడియాల్లో పెద్ద ఎత్తున సాగే ప్రచారాన్ని ఆడ్డుకోలేదు. ఒక విధంగా ఎన్నికల్లో చివరి
ఘట్టం ప్రచారాన్ని మీడియా సాగిస్తోంది. అధికారం,
ఆర్ధిక వనరులు పుష్కలంగా వున్న రాజకీయ పార్టీలే సాధారంగా ఈ సౌలభ్యాన్ని ఎక్కువగా వాడుకుని
ప్రయోజనాన్ని పొందగలుగుతాయి. అది ఈసారి బీజేపికి బాగా లాభించింది. అనేక అంశాలు
ప్రతికూలంగా వున్నప్పుడు ప్రధాన స్రవంతి మీడియా
గుజరాత్ లో కమలనాధుల్ని ఆపత్కాలంలో ఆదుకుంది. మోదీ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలవల్ల
అత్యధికంగా లబ్దిపొందుతున్న కార్పొరేట్ సంస్థలే ఇప్పుడు ఈ ప్రధాన మీడియా సంస్థల ప్రమోటర్లు
కావడం కమలనాధులకు ఓ వెసులుబాటు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‍కు అదనంగా
లభించిన 19 సీట్లలో గ్రామీణ ఓటర్లు అధికంగావున్న
సౌరాష్ట్ర ప్రాంతం నుండే 13 సీట్లు వున్నాయి. అంటే రైతాంగం కమలనాధుల మీద గుర్రుగా వున్నారని
దీని అర్ధం. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చోటుచేసుకోబోయే రాజకీయ పరిణామాల్లో రైతుల పాత్ర ప్రధానం కాబోతున్నదని
గుజరాత్ ఎన్నికలు సంకేతాన్నిచ్చాయి. దాన్ని
గమనించడం ముఖ్యం.
హిందూత్వ శక్తుల్ని హిందూయేతర శక్తులు
మాత్రమే ఎదుర్కోవాలి అనేది ఒక తప్పుడు అవగాహన. సువిశాల హిందూ సమాజం సహితం హిందూత్వ
శక్తుల ఆర్ధిక విధానాలకు బాధితురాలే. ఆలోచనాపరులు ముందు ఈ అంశాన్ని గుర్తించాలి. ఇటలీలో
ఫాసిజాన్నీ, జర్మనీలో నాజీజాన్నీ అంతం చేసింది యూదులు (మాత్రమే) కాదు; క్రైస్తవులు.
అది భారత దేశానికి కూడా వర్తిస్తుంది. హిందూత్వ రాజకీయాల్ని హిందువులే అంతం చేస్తారు.
హిందువులతోసహా హిందూత్వ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాలి.
గుజరాత్ లో బీజేపి బలహీనంగావున్న దాదాపు
25 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలవడం ఒక విచిత్రం. దానికి ప్రధాన కారణం బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులు బహుముఖ పోటీలో
పాల్గొనడమే. యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాతిధ్యం వహిస్తున్నామని గొప్పగా చెప్పుకునే పార్టీలన్నీ విడివిడిగా ఒకే తప్పును చేశాయి. దీన్ని సరిదిద్దనంత వరకు మన
రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరగదు.
(రచయిత సమాజ
విశ్లేషకులు) సెల్ నెం. – 9010757776
హైదరాబాద్
19 డిసెంబరు 2017
ప్రచురణ :
ప్రజాపాలన, 22 డిసెంబరు 2017
No comments:
Post a Comment