Tuesday, 2 January 2018

Creating Cultural Terror among Muslims

Creating Cultural Terror
సాంస్కృతిక  భయోత్పాతమే లక్ష్యం
అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)

        ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017  వివాదంలో ఇటు రాజకీయ నాయకులు అటు మీడియా రెండు రకాల తుంటరి పనులు చేస్తున్నారు.  తక్షణ ట్రిపుల్ తలాఖ్ చెల్లదనీ అది చట్టవిరుధ్ధమని (void and illegal) మాత్రమే సుప్రీం కోర్టు  ధర్మాసనం చెప్పింది. దానికి ‘రాజ్యాంగ విరుధ్ధం’ అనే విశేషణాన్ని అదనంగా జోడించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణిస్తూ కేంద్రం  చట్టం తెస్తే, అందులో నుండి ‘ఇన్ స్టాంట్’  అనే షరతుని తీసేసి  ఏకంగా ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణిస్తూ  చట్టం తెచ్చారని ప్రచారం చేస్తున్నారు. లేనిది చేర్చడం, వున్నది తీసివేయడం అనేది ఒక  ప్రమాదకర ధోరణి. ఇది పౌరహక్కులతో క్రూరమైన చెలగాటం. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకో తిరకాసు వుంది. ధర్మాసనంలో ఆ తీర్పుకు స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ముగ్గురు మాత్రమే తీర్పుకు అనుకూలంగా వున్నారు. ఇద్దరు దాని మీద తమ అసమ్మతిని నమోదు చేశారు. ఆ ఇద్దరిరిలో ఒకరు సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. 
ట్రిపుల్ తలాఖ్ నే కాదు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను సహితం రాజ్యాంగ విరుధ్ధం అని సుప్రీం కోర్టు చెప్పలేదు. అలా అనకపోవడానికి రాజ్యాంగపరమైన ధర్మసూక్ష్మాలు అనేకం  వున్నాయి. మతవిశ్వాసాలు కలిగి వుండడం, మతాచారాల్ని పాటించడం, మతాన్ని ప్రచారం చేసుకోవడం వంటి పౌరుల ప్రాధమిక హక్కుల జోలికి సుప్రీం కోర్టు పోదలచలేదు. ఒక పౌర సమూహపు వివాహం, విడాకులు, వారసత్వం వంటి సాంస్కృతిక అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని భారత రాజ్యంగంలోని 25వ అధీకరణ ఆమోదించదని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్ చాలా స్పష్టంగా వివరించారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.  
        అంతిమంగా తక్షణం మూడుసార్లు విడాకులు చెప్పే తలాఖ్ –ఏ-బిద్దత్ ఇప్పుడు నేరంగా మారింది. అయితే తక్షణం అంటే ఏమిటీ? ఏకదమ్ముగా చెప్పడమా? రెండు నెలలకోసారి చెప్పడమా? ఇన్ స్టాంట్ తలాఖ్ చెప్పే వ్యవధిని నిర్దిష్టంగా నిర్వచించకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపం. ఇలాంటి స్పష్టత చట్టంలో లేకపోతే  ముస్లిం భార్యలు మాత్రమేగాక పోలీసులు, న్యాయమూర్తులు సహితం దానిని తమదైన శైలిలో అన్వయించుకుని నిర్దోషులైన ముస్లిం భర్తలకు కూడా  జైలు శిక్షలు విధించే ప్రమాదం వుంది. ముస్లిం సమాజాన్ని స్త్రీపురుష ప్రాతిపదికన విభజించి, ముస్లిం మహిళల్ని ఆకర్షించి, ముస్లిం పురుషుల్ని జైళ్లకు పంపించడానికే ఈ చట్టాన్ని చేశారనే అభిప్రాయం కూడా ఇప్పుడు చాలా గట్టిగానే వినిపిస్తోంది. ఇదొక రాజకీయ కుట్ర. మరోమాటల్లో ఒక జాతిహనన చర్య. ఒక పౌరసమస్యను నేరంగా పరిగణించడమేగాక, ఇంతటి లోప భూయిష్టంగా చట్టాన్ని చేయదలిస్తే  పెద్దల సభ, సుప్రీం కోర్టు అంగీకరిస్తాయా?
వివాహవ్యవస్థ అనేది పితృస్వామికవ్యవస్థలో అంతర్భాగం. అంచేత అది ఏ వివాహవ్యవస్థ అయినా అందులో అనివార్యంగా పురుషాధిక్యతే ప్రధానంగా వుంటుంది. అయితే, వివాహ వ్యవస్థలు అన్నింటిలోనూ దంపతులిద్దరికీ కొన్ని హక్కులు, సౌకర్యాలు వుంటాయి, కొన్ని బాధ్యతలు, ఇబ్బందులూ వుంటాయి.
        ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు అనేది అన్నింటికన్నా ప్రాణప్రదమైన అంశం. వైవాహిక అత్యాచారం కేసులో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్టు  ‘భర్తల్ని వేధించే ఆయుధాలు’ ఇప్పుడు ముస్లిం భార్యలకు కూడా సులువుగా అందుబాటులో వుంటాయి.  అంతకన్నా కీలకమైనది పోలీసు వ్యవస్థ పాత్ర. వర్తమాన భారత పోలీసు వ్యవస్థ కాషాయీకరణ చెంది వుంది. అది ముస్లిం యువకుల మీద కక్షసాధింపుగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం వుంది.  గతంలో హైదరాబాద్ మక్కా మసీదు పేలుళ్ళ కేసులో ఇలాంటి దుర్వినియోగాన్ని మనం చూశాం కుడా.
        సంక్షుభితమైన వర్తమాన సమాజం వివాహ వ్యవస్థలోనూ కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా భార్యాభర్తల్లో అత్యధికులు నిరంతరం కీచులాడుకుంటూ వుంటారనే ఒక వాస్తవాన్ని ముందు మనం గుర్తించాలి. అయినప్పటికీ, పట్టాలు తప్పుతూ మళ్ళీ ఎక్కుతూ వివాహ వ్యవస్థ కొనసాగుతూ వుంటుంది. భర్త ఒక ఆవేశ క్షణంలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నా శ్రేయోభిలాషులు కొందరు రంగప్రవేశం చేసి దంపతులిద్దరికీ నచ్చచెప్పి కలిపే అవకాశం ఇప్పుడు వున్నది. ఈ బిల్లు వ్చట్టంగా మారి  అమల్లోనికి వస్తే అలాంటి పునరాలోచనలకు తావు వుండదు. భర్త విధిగా జైలుకు పోతాడు.  పిల్లల భారం భార్య మీద పడుతుంది. భార్య, పిల్లలకు భర్త జీవనభృతిని ఇవ్వాలని చట్టంలో చేర్చవచ్చు గానీ జైలుకు పోయిన భర్త ఆ విధుల్ని ఎలాగూ నిర్వర్తించలేడు.  ఆ అపరాధానికి మళ్ళీ అతని శిక్షను పొడిగించవచ్చు గానీ దానివల్ల నికరంగా బాధిత మహిళకు జరిగే ప్రయోజనం ఏమిటీ?
        మతసమర్ధన లేని అనేక దురాచారాలు అనేక సమాజాల్లో కొనసాగుతుంటాయి.  వాటిని ఆ సమూహాలే క్రమంగా సంస్కరించుకుంటూ వుంటాయి. ఒక మత సమూహపు అంతర్గత సాంస్కృతిక వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం ఇంతగా ఎందుకు ఆసక్తి చూపిందనేది ఒక ఆసక్తికర సందేహం. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితులైన ఓ అరవై మంది ముస్లిం మహిళలు పిర్యాదు చేయడంవల్ల తాము స్పందించినట్టు అప్పట్లో కమలనాధులు చెప్పుకున్నారు. వైవాహిక అత్యాచారం (marital rape)కేసుల్లో బాధితులు కూడా మహిళలే.  ఆ కేసుల మీద స్పందించమని సాక్షాత్తు సుప్రీం కోర్టే హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. హిందూ వివాహిత స్త్రీలకన్నా ముస్లీం వివాహిత స్త్రీల మీదనే బీజేపీకి సానుభూతి ఎక్కువ అనుకుంటే అంతకన్నా క్రూరమైన వ్యంగ్యం మరేదీ వుండదు.
        సాంఘీక దురాచారాలని ప్రతి సమూహం రూపుమాపుకోవాల్సిందే. కానీ ఒక సాంఘీక దురాచారాన్ని శిక్షించదగ్గ నేరంగా భావించవచ్చా? భారత శిక్షా స్మృతిలో దేషద్రోహానికి పాల్పడడం (సెక్షన్ 124 ఏ),  మారణాయుధాలతో అల్లర్లు జరిపడం  (సెక్షన్ 148) వంటి టివ్రమైన నేరాలకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష, జుర్మానా విధించే అవకాశం వుంది.  ఓ పురుషుడు తన భార్యతో ఆవేశంలోనో, మూర్ఖత్వంలోనో అన్న మాటలు తప్పేకావచ్చుగానీ, దాన్ని దేశద్రోహం అంతటి తీవ్ర నేరంగా భావించి శిక్షీంచవచ్చా?  ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెప్పినంత మాత్రాన  వివాహం రద్దుకాదు అని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత ఇక ఆ భర్తను శిక్షించడం దేనికీ?
                కొత్త చట్టం ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను చెల్లదని చెపుతోందా? చెల్లుతుందని చెపుతోందా? ఒకవేళ ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెల్లుతుందని చెపితే అది భర్తను సమర్ధించి భార్యకు విడకుల్ని మంజూరు చేయాలి. ఒకవేళ ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెల్లదని చెపితే విడాకులు పొందినట్టుకాదుకనుక ఆ భార్యభర్తలు గతంలోలా కలిసి జీవించాలని ఆదేశించాలి. విచిత్రంగా ఈ చట్టంలో విడాకులు చెల్లనప్పటికీ భర్త మూడేళ్ళు జైలుకుపోతాడు. భార్య విడాకులు పొందలేదు  గనుక మరో పెళ్ళి చేసుకోవడం కుదరదు.  భర్త జైల్లో వున్నంత కాలం ఆమె అతనికి భార్యగానే కొనసాగాల్సి వుంటుంది. జైలు నుండి తిరిగివచ్చాక మళ్ళీ విడాకుల ప్రక్రియ మొదలవుతుంది. ఇంత గందరగోళపు చట్టాన్ని మనం ఎప్పుడయినా చూశామా? ఇది పెద్దనోట్ల రద్దుకన్నా దగుల్బాజీ ప్రక్రియమ, జీయస్టీకన్నా మోసపూరిత చర్య. 
అయితే, ఈ చట్టంవల్ల బీజేపికి ఒక రాజకీయ ప్రయోజనం వుంది. ముస్లింల సాంస్కృతిక జీవనాన్ని సహితం తాను నియంత్రించగలనని హిందూ సమాజంలోని ఛాందస సమూహానికి అది ఒక సంకేతాన్ని పంపదలచుకుంది. భారత ముస్లిం సమాజంలో సాంస్కృతిక   భయోత్పాతాన్ని సృష్టించడమే తలాక్ చట్టం లక్ష్యం
నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారం లోనికి వచ్చాక ఇప్పటి వరకూ చేపట్టిన ఒక్క పథకం కూడా విజయవంతం కాలేదు. కంచుకోట వంటి గుజరాత్ లో చావుతప్పి కళ్ళు లొట్టపోయాయి. నరేంద్ర మోదీ ‘అభివృధ్ధి నమూన’ ఒక బూటకమని తేలిపోయింది. మరోసాడి గెలవడం కషమని కమలనాధులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్ వంకతో దేశప్రజల దృష్టిని మళ్ళించాలనుకున్నారు.  తమకు తెలిసిన ఏకైక విద్య అయిన మత విద్వేషానికి కొత్త మెరుగులు దిద్దారు.  దేశ ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడంలో విఫలమయిన  ప్రభుత్వాధినేతలు అందరూ భావోద్వాలను రెచ్చగొట్టి రాజకీయలబ్ది పొందాలనే అనుకున్నారు. అది చరిత్ర. ఇప్పుడు వర్తమాన  నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అంతకన్నా భిన్నమైనదేమీకాదు.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ అధ్యక్షుడు)
సెల్ నెం. 9010757776

హైదరాబాద్
2 జనవరి 2018

ప్రచురణ : ప్రజాపాలన దినపత్రిక,  3 జనవరి 2018

No comments:

Post a Comment