Sunday, 14 January 2018

Varna System in Muslim Society

ముస్లిం సమాజంలో ‘వర్ణవ్యవస్థ’!
-     డానీ  

        బ్రాహ్మణ అనేది  ఒక కులం పేరు. బ్రాహ్మణీయ అనేది ఒక సిధ్ధాంతం పేరు. కుల అంతస్తులను (Caste Hierarchy) పాటించేవారిని బ్రాహ్మణీయవాదులు అంటున్నాం. వర్ణవ్యవస్థలో నాలుగు అంతస్తుల గురించి మాత్రమే చెప్పినప్పటికీ వాటికి బయట మరో రెండు వర్ణాలున్నాయి; పంచములు, ఆదివాసులు. తరువాతి కాలంలో శూద్ర సమూహంలోనూ మార్పులొచ్చాయి. వారిలో కొందరు పై అంతస్తులకు చేరుకుని పెత్తందారీ కులాలుగా మారగా అత్యధికులు అతిశూద్రులుగా దిగువకు జారారు.
        వర్ణవ్యవస్థ ఏర్పడేనాటికి ముస్లిం, క్రైస్తవ  తదితర మతభావనలు మన దేశంలో లేవు.  అయినప్పటికీ తరువాతి కాలంలో వాళ్ళకూ ఒక అంతస్తును కేటాయించి తనలో ఇముడ్చుకుంది వర్ణవ్యవస్థ. రైల్లో ప్రయాణించాలంటే ఏదో ఒక పెట్టెలో ఎక్కక తప్పదన్నట్టు వర్ణవ్యవస్థలో భాగం కావాలంటే ఏదో ఒక అంతస్తులో చేరి (చేర్చి) తీరాలి. ముస్లిం, క్రైస్తవ సమూహాలని బ్రాహ్మణీయవాదులు అతిశూద్రులుగా పరిగణిస్తారు. వెనుకబడిన కులాల అంతస్తులో హిందూ వెనుకబడిన కులాలకూ, ముస్లిం, క్రైస్తవులకు మధ్య ఒక పోటీ ఏర్పడడానికి కూడా కారణం ఇదే.
        సాంస్కృతికంగా పుట్టుక రీత్యా ఒక సామాజికవర్గంకన్నా మరో సామాజికవర్గం గొప్పదనో తక్కువదనో భావించడమే బ్రాహ్మణీయవాదం. దీనివల్ల సామాజిక వ్యవస్థల మీద,  సహజవనరుల మీద కొందరికి పుట్టుకరీత్యానే హక్కులు వస్తాయి. మిగిలినవాళ్ళు ఆ రెండు వ్యవస్థల నుండి తొలగింపుకు గురవుతారు. కాలక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నప్పటికీ ఈ రకం పంపకాలే ప్రధానంగా వుంటాయి.
        స్వతంత్ర భారత దేశంలో, అందులోనూ రాకెట్ యుగంలో  ఇంకా కులమతాలు  ఎక్కడున్నాయి అనే వాళ్ళు కొందరుంటారు. ఉత్పత్తిలో యంత్రాల ఉపయోగం పెరిగే కొద్ది భద్రలోకంలో ఆశ కూడా పెరుగుతుంది. తమ అత్యాశను సాంస్కృతికంగా సమర్ధించుకోవడానికి వాళ్ళు వర్ణవ్యవస్థను సజీవంగా వుంచుతారు. కొత్త పధ్ధతులో గతంకన్నా క్రూరంగా మార్చడానికి  దాని కోరలకు కొత్త పదును పెడతారు.  ఈ క్రమాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. అయితే దీన్ని నిగ్గుతేల్చడానికి శాస్త్రీయ పరికరాలు లేకపోలేదు.
        130 కోట్ల దేశ జనాభాలో ఒక్కొక్కరికి ఎంతెంత ఆస్తి వున్నదో లెఖ్ఖలు తీయండి.  వాటన్నింటినీ  కులాలు మతాల వారీగా ఒక అవరోహణ క్రమం (Descending Order)లో పెట్టండి. అప్పుడు ఆ తిరగేసిన పిరమిడ్ ను విశ్లేషించండి.  అత్యధిక సంపద బనియా సామాజికవర్గం చేతుల్లో వుందని తెలుస్తుంది. ఆ తరువాతి స్థానాల్లో బ్రాహ్మణ, క్షత్రీయ, స్థిర శూద్ర సామాజికవర్గాలు వుంటాయి. ఆ తరువాతి స్థానాల్లో అతిశూద్ర సామాజికవర్గాలుంటాయి. కింది అంతస్తుల్లో దళిత, మతమైనారిటీ,  ఆదివాసీ  సామాజికవర్గాలుంటాయి. ఇదే క్రమంలో ఓ ఇరవై యేళ్ల, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 1991 నుండి ఛార్టులు తయారు చేస్తే మనకు ఇంకో విషయం తెలుస్తుంది. క్రమంగా సంవత్సరం వెంబటి సంవత్సరం కిందివారి సంపద తగ్గి పై అంతస్తులలోనికి చేరిపోతున్నదని గమనిస్తాం.
        ఇది చాలా పెద్ద కసరత్తు. కేంద్ర ప్రభుత్వమే తలచుకుంటేనేగానీ ఈ లెక్కలు తేలవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో కేసిఆడ్ ప్రభుత్వం ఒక రోజు రాష్ట్రానికి శెలవు ఇచ్చి, అందర్నీ తమ నివాసంలో అందుబాటులో వుండాలని కట్టుబాటు విధించి సూక్ష్మ స్థాయిలో సమగ్ర సామాజిక సర్వే  జరిపింది. అలాంటిది ఒకటి జాతీయ స్థాయిలో జరగాలి.
        దీన్ని ఇంకో విధంగానూ నిర్ధారించవచ్చు. ఇది కొంచెం సులువైన మార్గం.   మనదేశంలో 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా డంకెల్ ఆర్ధికశాస్త్రం అమల్లోనికి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన స్కామ్ లను మొత్తాల వారీగా, కులాల వారీగా ఒక అవరోహణ క్రమం (Descending Order) లో పెట్టండి. ఈ తిరగేసిన పిరమిడ్ లోనూ బనియా, బ్రాహ్మణ, క్షత్రీయ, స్థిర శూద్ర సామాజికవర్గాలు పై అంతస్తుల్లో కనిపిస్తాయి. అతిశూద్ర, దళిత, మతమైనారిటీ, ఆదివాసీ  సామాజికవర్గాలు కింది దొంతర్లలో కనిపిస్తాయి. అతిశూద్ర, దళిత, మతమైనారిటీ, ఆదివాసీ  సామాజికవర్గాల్లోనూ అవినీతిపరులు వుంటారు. అందులో సందేహం ఏమీలేదు. అలాగే బనియా, బ్రాహ్మణ, క్షత్రీయ, స్థిర శూద్ర సామాజికవర్గాల్లోనూ నీతిమంతులు వుంటారు. ఏ సామాజికవర్గం సమిష్టిగా ఎంతటి అవినీతికి పాలుపడుతున్నదన్నది ముఖ్యం. శ్రామిక కులాల మొత్తం సమిష్టి అవినీతి వాళ్ళ జనాభా దామాషాకన్నా చాలా తక్కువగా వుంటుంది. పాలక కులాల మొత్తం సమిష్టి అవినీతి  వాళ్ళ జనాభా దామాషాకన్నా చాలా ఎక్కువగా వుంటుంది.
        ఇంతకన్నా రుజువేం కావాలీ మన దేశంలో ఇప్పటికీ బ్రాహ్మణీయ వర్ణవ్యవస్తే సజావుగా, గతంకన్నా దృఢంగా వున్నదని చెప్పడానికీ? దేశంలో మనుస్మృతియే అనధికార రాజ్యాంగంగా కొనసాగుతున్నదని చెప్పడనికీ?
        దేశంలో వేల కులాలుండగా కేవలం బ్రాహ్మణ కులం పేరుతో వర్ణవ్యవస్థను నిందించవచ్చా అని అడగడం సమంజసమైన ప్రశ్నే. వర్ణవ్యవస్థను పౌరస్మృతిగానేగాక, వర్ణసంకరాన్ని నేరస్మృతిగా మార్చిన మనువే ఆ పనిచేశాడు. ఏ వర్ణాన్ని ఏ అంతస్తులో వుంచాలో నిర్ణయించడానికి మనువు బ్రహ్మణ సామాజికవర్గాన్ని  కొలబద్దగా పెట్టుకున్నాడు. వాళ్ళను భూమి మీద భగవంతునికి ప్రతినిధులుగా చిత్రించాడు.  బ్రాహ్మణ సామాజికవర్గానికి దగ్గరాగా వుండాల్సిన సామాజికవర్గాలకు పై అంతస్తులు కేటాయించాడు. బ్రాహ్మణ సామాజికవర్గానికి దూరంగా వుండాల్సిన సామాజికవర్గాలకు కింది అంతస్తులు కేటాయించాడు.  అంచేత వర్ణవ్యవస్థ సమర్ధన వాదం అని చెప్పినా బ్రాహ్మణీయ వాదం అని చెప్పినా, హిందూత్వ అని చెప్పినా అర్ధం దాదాపుగా ఒక్కటే.
        బ్రాహ్మణులను మాత్రమే వర్ణవ్యవస్థ సమర్ధన వాదులు, బ్రాహ్మణీయవాదులు అనడం కూడా తప్పు. నిర్దిష్టంగా పరిశీలిస్తే  బ్రాహ్మణీయవాదులు బ్రాహ్మణ కులంలోనూ కనిపిస్తారు; బ్రాహ్మణేతర కులాల్లోనూ కనిపిస్తారు. అలాగే బ్రాహ్మణుల్లోనూ  వర్ణవ్యవస్థ వ్యతిరేకులూ వుంటారు. దీనిని వ్యక్తిగత స్థాయిలో నిర్ణయించాలేగానీ మూకుమ్మడి ప్రకటన సాధ్యంకాదు.
        తాత్విక మిత్రుడు శ్రీవత్స గడియారం ఒక కీలక ప్రశ్న వేశాడు.   “’బ్రాహ్మణీయ కాని భావజాలం మరొకటి వుందా?!!అంటూ. వేలసంవత్సరాలుగా బ్రాహ్మణీయ వాతావరణంలో వుండిపోవడంవల్ల ఆధిపత్య కులాల్లోనేగాక ఆణగారిన కులాల్లోనూ బ్రాహ్మణీయ భావజాలం ఇంకిపోయింది.  వర్ణవ్యవస్థలోనే ఆ లక్షణం వుంది. ఏ అంతస్తులో వున్నా సరే అందరికీ ఒక తృప్తి, ఒక అసంతృప్తి వుంటుంది. తమకన్నా పై అంతస్తులోని సమూహం  తమను తక్కువగా చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే తమకన్నా కింది అంతస్తులోని సముహాన్నీ చూసి వాళ్ళకన్నా తాము గొప్పవాళ్లమని అనుకోవడం వాళ్లకు ఒక సంతృప్తి నిస్తుంది.
        బ్రాహ్మణ సామాజికవర్గానికి పై అంతస్తులో ఎవరూ వుండరు కనుక వాళ్లకు సంతృప్తేతప్ప అసంతృప్తి వుండదు.  అలాగే అట్టడుగు అంతస్తులో వున్న వాళ్లకు దిగువన ఇంకెవరూ వుండరు కనుక వాళ్ళకు అసంతృప్తితప్ప సంతృప్తి వుండదు.  అందుకే కింది అంతస్తులోని సమూహాలకు సహితం ఒక సంతృప్తిని  అందించడానికి వాళ్ళ కింద ఇంకో  కొత్త అంతస్తును నిర్మించే ప్రక్రియ ఎప్పుడూ సాగుతూ వుంటుంది. వర్ణవ్యవస్థకు ఇదొక అంతర్గత అవసరం. అలా అట్టడుగున నిర్మించే అంతస్తులోనికి ముస్లిం సామాజికవర్గాన్ని తోసే ప్రక్రియ ఇటీవలి కాలంలో చాలా వేగంగా సాగుతున్నదని సులువుగా గమనించవచ్చు.
        ఇంతటి దయనీయ స్థితిలో ముస్లిం సమాజానికి సంతృప్తి కాకపోయిన ఒక నిట్టూర్పుగా అయినా పనికొచ్చే అంశం ఏమిటీ? తాము సహితం వర్ణవ్యవస్థ లోనికి చేరిపోవడం!.
        భారత ముస్లిం సమాజంలోని విభిన్న తెగల కూర్పు సమాంతరం (Horizantal) గా వుంటుందా? నిలువు (Vertical) గా వుంటుందా? అన్నది ఒక పెద్ద చర్చ. సయ్యద్, పఠాన్, బేగ్, మొఘలాయి, షేక్, లద్దాఫ్, నూర్ బాష, పథ్థర్ ఫోడు  తదితర శాఖలు లేదా తెగల మధ్య సాంస్కృతిక నిచ్చెన మెట్ల వ్యవస్థకు ఇస్లాంలో ధార్మిక సమర్ధనలేదు. ఇలాంటి ధార్మిక చైతన్యం ప్రభుత్వ  ఉద్దీపన చర్యలకు విరుధ్ధం. సాంస్కృతికంగా  నిచ్చెన మెట్ల వ్యవస్థ వుందనీ, అందులో అణిచివేత కొనసాగుతోందనీ నిరూపిస్తేనే విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తారు. భారత రాజ్యాంగంలోని మార్గదర్శక సూత్రాలు అలా వున్నాయి,  ఉద్దీపన చర్యలు లేకుండా మనుగడ సాగించలేని దయనీయ ఆర్ధిక స్థితి భారత ముస్లింలది.   ప్రభుత్వ ఉద్దీపన చర్యల్ని పొందాలంటే తమ సమాజంలో నిలువు అంతస్తుల వ్యవస్థ  కొనసాగుతూ వుందని ప్రకటించి తీరాలి. మరో మాటల్లో చెప్పాలంటే తాము వర్ణ/ కుల వ్యవస్థను ఆచరిస్తున్నట్టు ప్రకటించాలి.  బ్రాహ్మణీయ వ్యవస్థ తను వ్యాపించిన ప్రతిచోటా తనను పోలిన సమాజాన్ని నిర్మిస్తుంది!.
(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైలు : 9010757776
హైదరాబాద్
9 జనవరి  2018
ప్రచురణ : మనతెలంగాణ దినపత్రిక 14 జనవరి 2018
http://epaper.manatelangana.news/1504249/Mana-Telangana-Daily/14-01-2018#page/4/2

No comments:

Post a Comment