ముస్లింల పడగ్గదుల్లో జోక్యం !
అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)
సునీతారెడ్డి (పేరు మార్చాము) వాళ్ళది రాయల
సీమ నుండి హైదరాబాద్ వచ్చి మాధాపూర్ ఇమేజ్ హాస్పిటల్ రోడ్డులో స్థిరపడిన ధనిక కుటుంబం.
విదేశీ సంబంధం అని భారీ కట్నం ఇచ్చి పెళ్ళిచేశారు. అక్కడ ఆర్ధిక మాంధ్యం రావడంతో భర్త
తిరిగి వచ్చేశాడు. సునీతారెడ్డి తండ్రి భారీగా పెట్టుబడి పెట్టి జూబిలీ హిల్స్ లో అల్లుడికి
ఆత్యాధునిక జిమ్ పెట్టించాడు. ఒక రోజు హఠాత్తుగా సునీతారెడ్డి భర్త మాయమైపోయాడు. అత్తామామలు
జిమ్ ను స్వాధీనం చేసుకుని సునీతారెడ్డిని బయటికి గెంటేశారు. భర్త మాయమైపోవడం, ఆస్తిపోవడం,
తనూ, పిల్లలు దిక్కులేనివాళ్ళైపోవడం ఆమెకు ఒక బాధ. అసలు తనిప్పుడు భార్యో, విడాకులు
పొందిన స్త్రీయో తెలియని అయోమయం అంతకన్నా ఎక్కువ బాధ.
ఊహాంజలి (పేరు మార్చాము) మియాపూర్ అమ్మాయి.
పదేళ్ల క్రితం పెళ్ళయింది. వ్యాపారంలో నష్టపోయిన భర్త స్నేహితుల దగ్గర భారీగా అప్పులు
చేశాడు. డబ్బు కోసం అత్తమామల మీద వత్తిడి తెచ్చాడు. వాళ్ళు నిరాకరించడంతో ఇంటికి రావడం
మానేశాడు. తనతో పాటు పదేళ్ల కొడుకుని పోషించుకోవడానికి అమె స్కూల్లో టీచరుగా చేరింది.
ఊహాంజలిది కూడా సునీతారెడ్డి సమస్యే. అసలు
తనిప్పుడు భార్యకాదు; విడాకులు పొందిన స్త్రీ
కూడా కాదు!.
యామినీ చౌదరి (పేరు మార్చాము) విజయవాడ అమ్మాయి.
అమేరికాలో యంఎస్ చదివి అక్కడే సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నది. అమేరికాలోనే సాప్ట్
వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో పెద్దలు పెళ్ళిచేశారు. పెళ్లయి పదేళ్లయింది. ప్రతిరోజూ
రాత్రి ఏదో ఒక వంకతో భార్యను నిందించి అలిగి
పడుకోవడంతప్ప భర్త ఒక్క రోజు కూడా సంసారం చేసింది లేదు. ఇటీవల హాస్పటల్ రిపోర్టుల ద్వార
భర్తకు సంభోగశక్తి లోపం (Erectile Dysfunction) వుందని తెలిసి నిలదీసింది. భర్త ఇంట్లో నుండి
వెళ్ళిపోయాడు. అంతకు ముందే భార్యాభర్తల జాయింట్
అకౌంట్ లో వున్న మొత్తం డబ్బును తన తండ్రికి
పంపించేశాడు. ఇప్పుడామెకు భర్త లేడు; దాచుకున్న డబ్బూలేదు.
గౌసియా బేగం (పేరు మార్చలేదు) హైదరాబాద్ శివార్లలో
పహాడీషరీఫ్ ప్రాంతంలోని ఎర్రకుంట మురికివాడ నివాసి. నిరుపేద ముస్లిం కుటుంబం. ఒమన్
దేశానికి చెందిన ఓ వృధ్ధునితో 2008లో పెళ్ళి చేశారు. అతనెప్పుడూ తనను ఒమన్ తీసుకుని
వెళ్ళలేదు. ఏడాదికి ఒకసారి హైదరాబాద్ వచ్చి ఓ రెండు వారాలు గౌసియా బేగంతో వుండి వెళ్ళిపోయేవాడు.
వచ్చినపుడు కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. ఈ ఏడాది అతను రాలేదు. డబ్బులు పంపలేదు. నాలుగు
నెలల క్రితం ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ సందేశం పంపించాడు.
గౌసియా దీనగాథ ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ గా మారింది. వాళ్లంతా గౌసియా మీద
సానుభూతిని చూపించడంకన్నా ముస్లిం భర్తల్ని విమర్శించడానికి ఈ అవకాశాన్నిఎక్కువగా వాడుకుంటున్నారు. పనిలోపనిగా,
ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017ను గట్టిగా వ్యతిరేకిస్తున్న ఏఐయంఐయం
అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీద విరుచుకుపడుతున్నారు. విడాకులు పొందిన స్త్రీల మీద
వారికి అంతటి సానుభూతే వుంటే దాన్నివాళ్ళు సునీతారెడ్డి, ఊహాంజలి, యామినీ చౌదరి వంటివారి మీద కూడా చూపించి
వుండాల్సింది. నిజానికి వైవాహిక బాధిత స్త్రీలు
ముస్లిం సమాజంలోకన్నా హిందూ సమాజంలో చాలాచాలా ఎక్కువ.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ‘ట్విట్టర్
వీరుల’ భావజాలంతో నడుస్తున్నది. ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం -
2017 ద్వార అది సాధించదలిచింది ముస్లిం వైవాహిక బాధిత మహిళల్ని ఆదుకోవడంకాదు; ముస్లిం
నిందిత భర్తల్ని కఠినంగా శిక్షించడం మాత్రమే. ముస్లిం నిందిత భర్తల్ని భారీ అపరాధ రుసుముతో
పాటూ మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించడానికి మెజిస్ట్రేట్ లకు ఇచ్చిన విశేష అధికారాల
గురించి ఇందులో చాలా స్పష్టంగా రాశారు. కానీ, బాధిత భార్యకూ, ఆమె సంతానానికీ జీవనభృతిని
భర్త ఆస్తి నుండి ఇస్తారా? భర్తకు ఆస్తి లేకుంటే
ప్రభుత్వమే ఇస్తుందా? వంటి ప్రాణప్రదమైన అంశాల్ని
కొత్త చట్టంలో గాలికి వదిలేశారు
బాల్య వివాహాలను రద్దు చేయడానికి హర్యాణ ప్రభుత్వం
1994లో ‘అప్నీబేటీ –అప్నా ధన్’ (మన అమ్మాయి-మన సంపద) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.
అమ్మాయి పుట్టినపుడే ‘అప్నీబేటీ –అప్నా ధన్’
బాండ్ ను తల్లిదండ్రులకు అందిస్తారు. అమ్మాయికి 18 ఏళ్ళు దాటేక – అప్పటి వరకు ఆమెకు
పెళ్ళి జరపలేదని నిరూపించి –ఆ బాండ్ ను తల్లిదండ్రులు బ్యాంకులో నగదుగా మార్చుకోవచ్చు.
ముస్లిం వివాహ బాధిత మహిళల మీద తమకెంతో సానుభూతి వుందని చెప్పుకుంటున్న ప్రభుత్వం
‘అప్నీబేటీ –అప్నా ధన్’ పథకం వంటిది ఒకదాన్ని
ప్రకటించి వుండాల్సింది. విడాకుల బాధిత ముస్లిం స్త్రీలకు ఇప్పటి ధరల ప్రకారం ఒక లక్ష
రూపాయల బాండ్ ను పెళ్ళి సమయంలోనే అందించే పథకాన్ని రూపొందించి వుండాల్సింది. ప్రభుత్వానికి
అంతటి నిజాయితీ లేదు. ముస్లింల పడగ్గదుల్లోనికి ప్రవేశించడమే రాజ్యం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది.
“ఇన్ స్టాంట్ ట్రిపుల్
తలాఖ్ చెల్లదు, చట్టవిరుధ్ధం” అని సుప్రీం కోర్టు
ధర్మాసనం ఆగస్టు 22 నాటి తీర్పులో తేల్చి చెప్పింది. దాని అర్ధం ఏమంటే, ఒకవేళ
భర్త ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెప్పినా అది చెల్లదు. భార్య గతంలోలా అతనికి భార్యగానే కొనసాగుతుంది. భర్త సంపద,
సంపాదనలపై ఆమెకూ, ఆమె సంతానానికీ సర్వహక్కులు యథాతధంగా వుంటాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం
ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఒక సామాజిక చర్యను చెల్లదని చెప్పడానికీ, శిక్షార్హమైన నేరం
అని చెప్పడానికీ నేరస్మృతిలో చాలా తేడా వుంది. సుప్రీం కోర్టు ముస్లిం భర్తల్ని మందలించి, ముస్లిం భార్యల వివాహ
హక్కుల్ని పరిరక్షించింది. కొత్త చట్టం ముస్లిం భర్తను శిక్షించి ముస్లిం భార్యను గాలికి
వదిలేస్తోంది. మరోమాటల్లో చెప్పాలంటే; ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితురాలైన ముస్లిం
మహిళలకు సుప్రీం కోర్టు అందించిన ఆర్ధిక హామీని, వైవాహిక సౌకర్యాన్నీ కొత్త చట్టం రద్దు
చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళలకు చేసిన ద్రోహం. ఈ చట్టంలో ఇంతకన్నా తీవ్రమైన
విషయం మరొకటుంది. భర్తతో విబేధాలు వచ్చినపుడు భార్యలు సాధారణంగా సర్దుబాటునీ, దిద్దుబాటునీ
కోరుకుంటారు. సంసారాన్ని ఏదో ఒక విధంగా గాడిలో పెట్టుకోవాలనుకుంటారు. భర్తను ఏకంగా జైలుకు పంపించేస్తారని తెలిస్తే ఇన్
స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితులైన ముస్లిం మహిళలు ఇక ముందు కేసు పెట్టడానికి కూడా సాహసించక
పోవచ్చు.
ఈ చట్టం శీర్షికే తప్పు. విడాకులు ఇచ్చిన భర్తల్ని శిక్షించడం మీదనే ప్రభుత్వం దృష్టిపెట్టిందితప్ప విడాకులు పొందిన స్త్రీలు సగౌరవప్రదంగా బతకగలిగేలా, తమ సంతానాన్ని సమర్ధంగా పోషించుకోగలిగేలా వాళ్లకు ఆర్ధిక స్తోమతను కల్పించడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది పురుషుల శిక్షణ చట్టమేతప్ప మహిళల రక్షణ చట్టంకాదు.
ఈ చట్టం శీర్షికే తప్పు. విడాకులు ఇచ్చిన భర్తల్ని శిక్షించడం మీదనే ప్రభుత్వం దృష్టిపెట్టిందితప్ప విడాకులు పొందిన స్త్రీలు సగౌరవప్రదంగా బతకగలిగేలా, తమ సంతానాన్ని సమర్ధంగా పోషించుకోగలిగేలా వాళ్లకు ఆర్ధిక స్తోమతను కల్పించడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది పురుషుల శిక్షణ చట్టమేతప్ప మహిళల రక్షణ చట్టంకాదు.
రాజ్యం ఒకేసారి రెండు తప్పులు చేస్తోంది. దేశప్రజలందరికీ చెందిన
సహజవనరుల్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోంది. విడాకుల విషయంలో అన్ని సమాజాల్లోనూ జరుగుతున్న తప్పుని పట్టుకుని
ఒక సమూహం మీదకు నెట్టేస్తోంది. మొదటి తప్పులో లబ్దిదారులు హిందూసామాజికవర్గానికి చెందినవాళ్ళు.
రెండో తప్పులో నిందితులు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారు. మొదటితప్పులో వాటా కోరకుండా
చేయడానికే రెండో తప్పులో వాళ్ళను బోను ఎక్కిస్తున్నారని భావించవచ్చు. చాలామంది తలాఖ్
వివాదాన్ని సాంస్కృతిక వ్యవహారం అనుకుంటున్నారుగానీ ఇది పచ్చి ఆర్ధిక వ్యవహారం.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల
వేదిక జాతీయ అధ్యక్షుడు)
సెల్ నెం.
9010757776
హైదరాబాద్
29 డిసెంబరు 2017
ప్రచురణ: మనతెలంగాణ దినపత్రిక,
3 జనవరి 2018
http://epaper.manatelangana.news/1490112/Mana-Telangana-Daily/03-01-2018#page/4/2
No comments:
Post a Comment