దక్షణాది దళపతి ఎవరూ?
-
డానీ
ఈశాన్య రాష్ట్రాల
ఎన్నికల ఫలితాలను మించిన అనూహ్య పరిణామాలు
ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల్లో వేగంగా చోటుచేసుకుంటున్నాయి.
భారతీయ జీవన
విధానం భిన్నత్త్వంలో ఏకత్త్వం, గంగా-యమున మేలు కలయిక మన సాంప్రదాయం అని చాలామంది అంటుంటారు.
అయితే, సంఘ్ పరివార శక్తులు మాత్రం ఒకే దేశం, ఓకే జాతి, ఒకే చట్టం అని నినదిస్తుంటాయి.
విచిత్రం ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే జాతి భావన వెనక్కుతగ్గి
దక్షణాది ప్రజల మనోభావాలు దెబ్బతినడం మొదలయ్యాయి. మోదీజీ ఏ పనిచేసినా అయినవాళ్లకు వెండి
కంచాల్లో, కానివాళ్లకు విస్తరాకుల్లో వడ్డిస్తారని ప్రచారంలోనికి వచ్చేసింది. వివిధ
రాష్ట్రాలకు కేంద్ర నిధుల సంక్రమణ (Devolution) లోనేగాక, ప్రతిష్ఠాత్మకంగా చేట్టిన పెద్దనోట్ల రద్దు, జీయస్టీ వంటి పథకాల్లోనూ ఉత్తర
దక్షణ ప్రాంతాల మధ్య వివక్ష కొనసాగిందనే అనుమానాలు
బలపడుతున్నాయి. ఈ నేపథ్యం నుండే కమల్ హాసన్ ‘మక్కల్ నీధి మయం’పుట్టింది.
ఆంధ్రప్రదేశ్
పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా కొత్తగా ఏర్పడే
రాష్ట్రానికి ఐదేళ్ళపాటు ప్రత్యేక తరహా హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్
2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఒక ప్రత్యేక హామీ
ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపి ప్రధాని అభ్యర్ధిగావున్న నరేంద్ర మోదీ ప్రత్యేక తరహా
హోదాను పదేళ్ళు కొనసాగిస్తామని ఇంకో ముందస్తు హామీ ఇచ్చారు.
అయితే, ఆ తరువాత జరిగింది వేరు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ ఏపీకి ప్రత్యేక తరహా హోదాను నిరాకరించడానికి అనేక విన్యాసాలు
చేసింది. దీనికి ఒక ప్రాంతీయ కోణం కూడా వుంది.
దేశంలో ఇప్పటి వరకూ అస్సాం, నాగాలాండ్, జమ్మూ–కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం,
మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక తరహా హోదాను ఆస్వాదిస్తున్నాయి.
ఈ పదకొండు రాష్ట్రాల్లో ఒక్క దక్షణాది రాష్ట్రం
కూడా లేకపోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ కేవలం ప్రత్యేక హోదాతో పరిష్కారంకావని
అందరికీ తెలుసు. 2014 పునర్ వ్యవస్థీకరణ చట్టం, సంబంధిత హామీలు అన్నీ నెరవేరినపుడే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని
తెలీనివాళ్ళెవరూ ఇప్పుడు లేరు. అయినప్పటికీ,
ఒక ప్రత్యేక చారిత్రక దశలో ఏపీకి ప్రత్యేక
తరహా హోదా అనేది ఆత్మగౌరవ నినాదంగా మారిపోయింది.
నాలుగేళ్ళ పాలనలో మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం చేపట్టామని
గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటీ లేదు. మరోవైపు, ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఆయన
పాలన సాగిస్తున్న విధ్వంసం భరించశక్యం కాని దశకు చేరుకుంది. మోదీ పాలనలో అభద్రలోక మరింత
అభద్రకు గురికాగా, భద్రలోకం మరింత సంపన్నులుగా మారుతోంది. ఈ వివక్ష పెట్టుబడీదారుల్లోనూ
కొనసాగుతోంది. మోదీ ఆశిస్సులున్న కార్పొరేట్
సంస్థలు తమ ప్రత్యర్ధుల సంస్థల్ని క్రమంగా మింగేసి అపర సంపన్నులుగా అవతరిస్తున్నాయి.
ప్రభుత్వ ప్రాయోజిత గోగ్రవాదులు దేశంలో మతమైనారిటీల జీవితాలను నరకప్రాయంగా మార్చేస్తున్నారు. దేశంలో దళితులు, ఆదివాసుల మీద దాడులు, హత్యలు గతంకన్నా
పెరిగిపోయాయని ప్రభుత్వ లెఖ్ఖలే చెపుతున్నాయి. త్రిపురలో విజయం తరువాత రెచ్చిపోయిన కమలదళాలు అక్కడ
సాగిస్తున్న విధ్వంసకాండ మధ్యయుగాలను తలపిస్తున్నది.
ఒక దృక్పథం, ఒక విధానం, ఒక నినాదం చుట్టూ రాజకీయ సమీకరణ మొదలయినపుడు
అనేక సమూహాలు, శక్తుల్లో కదలిక వస్తుంది. ఇప్పుడిది ఎంతమాత్రం ప్రత్యేక తరహా హోదా సాధన
సమస్యకాదు; మోదీ పాలన సృష్టించిన ఆర్ధిక, సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సంక్షోభాల మీద
తిరుగుబాటు. అలాంటి రాజకీయ తుఫాను ఒకటి ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమై వుంది.
ఒక చారిత్రక బాధ్యత ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద
పడింది. అందుకు వారికి ఒక గొప్ప సానుకూల అంశం వున్నది. రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు
దశాబ్దాల సుదీర్ఘ జీవితమేగాక, జాతీయ రాజకీయాల్లో 1989లో నేషనల్ ఫ్రంట్, 1996లో యునైటెడ్ ఫ్రంట్, 1998లో నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ లకు కన్వీనర్ గా పనిచేసిన
అనుభవం ఆయనది. రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుండీ ప్రత్యేక తరహా హోదా నినాదంతో ముందంజలోవున్న
వైయస్ జగన్ ను నిలవరించడానికి చంద్రబాబు దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే.
అయితే, కేంద్రంలో మోదీ చివరి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాక
“బీజేపి చేతిలో మనం మోసపోయాం” అని చెప్పడానికి కూడా చంద్రబాబుకు మూడు వారాలు పట్టింది.
ఎన్డీయే అన్యాయం మీద యుధ్ధాన్ని ప్రకటించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో చెప్పలేం.
ఇంతకీ వారు మోసపోయి ప్రజల్ని మోసం చేశారా? ప్రజల్ని మోసం చేశాక వారే మోసపోయారా? అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
దక్షణాది రాష్ట్రాలు, ప్రసాజ్వామికవాదులు, ఉదారవాదులు,
లౌకికవాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తుఫాన్ కదలికల
వైపే చూస్తున్నారు. రణమా? శరణమా? మరో మార్గంలేదు.
“మహాబలిష్టమైన జాతులు, మహా తెలివైన జాతులు మాత్రమే నిలదొక్కుకుంటాయని చెప్పలేం.
మార్పుకు అనుగుణంగా మారిన జాతులే జీవికను కాపాడుకుంటాయి” అని జీవపరిణామ సిధ్ధాంతవేత్త
ఛార్లెస్ డార్విన్ అన్న మాటలు ఇప్పుడు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించు కుంటున్నాయి.
ఒకవైపు, దక్షణాది దళపతి బాధ్యతలు చేపట్టడానికి
చంద్రబాబు తాత్సారం చేస్తుంటే మరోవైపు కేసిఆర్ ఆ భారాన్ని స్వచ్చందంగా భ్జాలకు ఎత్తుకున్నారు.
ఏప్రిల్ 27న ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వారు అప్పుడే
బలమైన సంకేతాలను ఇచ్చేశారు.
అయితే, కేసిఆర్ పెట్టబోయేది సమాఖ్య కూటమి కాదనీ, అది బీజేపీ
వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక థర్డ్ ఫ్రంట్ మాత్రమే అనే మాట కూడా చక్కర్లు కొడుతోంది.
ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో థర్డ్ ఫ్రంట్ అంటే నరేంద్ర మోదీ నెత్తిన పాలు పోయడమే
అవుతుంది!.
ఇప్పటి వరకు నరేంద్ర మోదీ- అమిత్ షా జోడీ ఎన్నికల్లో ‘మూడుముక్కలాట’
ఆడుతున్నారు. ముస్లింలు, దళితులు, కమ్యూనిస్టులు, మత సామరస్యవాదులు వగయిరాలు దేశంలో
30 శాతానికి మించి వుండరని వాళ్ళ అంచనా. మిగిలిన
70 శాతం ఓట్లలో తామూ కాంగ్రెస్ పోటీ పడితే ఆధిక్యత తమదే అనేది వాళ్ల ఫార్మూలా! ఈ ఫార్మూలా
ప్రకారం 36-40 శాతం ఓట్లను దక్కించుకుంటే గెలుపు తధ్యం. బీజేపి వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్
కు పడకుండా థర్డ్ ఫ్రంట్ కు పడితే మేలు జరిగేది బీజేపీకే. అసలు కేసిఆర్ థర్డ్ ఫ్రంట్
వెనుక వున్నది మోదీయేననే మాటలూ బలంగా వినిపిస్తున్నాయి. “ మోదీ నాకు మంచి మిత్రుడు.
ఆయనకు చెప్పి, ఆయన ఆశిస్సులతోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన”ని స్వయఙా కేసిఆర్ చెప్పడంతో
ఇలాంటి అనుమానాలు బలపడుతున్నాయి.
సమాఖ్య భావనకు తూట్లు పెడుతున్నది మోదీయే గనుక కేసిఆర్ అయినా
చంద్రబాబు అయినా మరొకరయినా థర్డ్ ఫ్రంట్ ఆలోచనల్ని
పక్కన పెట్టి మోదీ వ్యతిరేక విశాల సమాఖ్య కోసం ప్రయత్నించాలి. కాంగ్రెస్ కే కాక బీజేపీలో
మోదీని వ్యతిరేకించే శక్తులకు కూడా స్థానం
కల్పించేంత విశాలంగా కూటమిని నిర్మించాలి. సమాఖ్య అంటే రాష్ట్రాలు, రాజకీయాలు అనే సంకుచిత
భావనకే పరిమితం అయితే దానివల్ల కూడా పెద్దగా
ప్రయోజనం ఏమీ వుండదు. అది జాతుల సమాఖ్యగా వుండాలి. కులాల సమాఖ్యగా వుండాలి. మతాల సమాఖ్యగా
వుండాలి. వర్గాల సమాఖ్యగా వుండాలి.
(రచయిత ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ప్రధాన కార్యదర్శి)
మొబైల్ – 9010757776
హైదరాబాద్, 7-03-2018
ప్రచురణ :
మనతెలంగాణ, 9-03-2018
http://epaper.manatelangana.news/1571542/Mana-Telangana-City-Main/09-03-2018#page/4/2
No comments:
Post a Comment