చంద్రబాబు అంటే కూటమి రాజకీయాలు
- - డానీ
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుండి
తెలుగుదేశం పార్టి (టిడిపి) బయటికి రావడంతో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ ఆరంభమయింది. ఇది జాతీయ
రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి
పరిణామాలు అప్పుడే మొదలయిపోయాయి.
టిడిపి చరిత్రంతా రాజకీయ కూటముల చరిత్రే
అన్నా అతిశక్తికాదు. కనీసం చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఇది నిజం. 1950వ దశకంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాంగ్రెస్,
కమ్యూనిస్టుల చుట్టూ తిరిగేవి. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాల ప్రాబల్యం క్రమంగా
తగ్గిపోయి ఒక రకం రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను పూరించడానికే యన్టీ రామారావు
నాయకత్వాన తెలుగు దేశం పార్టి ఏర్పడింది. పుట్టుక
నుండే టిడిపి రాజకీయంగా కాంగ్రెస్ కు, సిధ్ధాంతపరంగా
కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకం. తొలి ఎన్నికలలోనే
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని రామారావు భావించారు. కమ్యూనిస్టులు ఎక్కువ బెట్టు
చేయడంతో అది కుదరలేదు. మేనకా గాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ ఆ ఎన్నికల్లో టిడిపితో
పొత్తు పెట్టుకుని ఐదు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల గెలిచింది.
నాదెండ్ల భాస్కర రావు 1984 ఆగస్టులో గవర్నర్
రామ్ లాల్ సహాయంతో ఎన్టీ రామారావును కుట్ర పధ్ధతుల్లో గద్దె దించినపుడు
కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘ప్రజాస్వామ్య
పునరుధ్ధరణ’ ఉద్యమం సాగింది. అందులో, వామపక్షాలతో పాటూ బీజేపి కూడా చురుగ్గా పాల్గొంది.
దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకతకు యన్ టి రామారావు
ఒక సంకేతంగా మారారు. అప్పట్లోనే ఆయన
కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో విజయవాడలో శిఖరాగ్ర
సదస్సు ఒకదాన్ని నిర్వహించారు. ఇందులో యంజీ రామచంద్రన్, ఫరూఖ్ అబ్దుల్లా, ప్రఫుల్లకుమార్
మహంతా, తదితర కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు అందరూ పాల్గొన్నారు.
ఇందిరా గాంధి మరణం తరువాత జరిగిన 1984 లోక్
సభా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి రికార్డు
స్థాయిలో 404 స్థానాలు గెలుచుకుంది. అప్పటి లోక్ సభలో 30 స్థానాలు గెలుచుకున్న టిడిపి
ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఆ హోదాలోనే యన్ టి రామారావు ఛైర్మన్ గా 1989లో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర శక్తులతో
నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. దానికి వి.పి. సింగ్ కన్వీనర్ గా వున్నారు. రాజీవ్ గాంధీ
పాలనలో అవినీతి పెరిగిపోయినదంటూ ఆరోపిస్తూ ఆ ఏడాది జూన్ నెలలో టిడిపి లోక్ సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రయోగం టిడిపికి కలిసి రాలేదు. 1989 లోక్
సభ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో కూడా
ఆ పార్టి అధికారాన్ని కోల్పోయింది. అయితే, ఆ ఎన్నికల తరువాత కేంద్రంలో వీపీ సింగ్ ను
ప్రధానిగా ఎంచుకున్న నేషనల్ ఫ్రంట్ కు ఎన్టీ రామారావు ఛైర్మన్ గా కొనసాగారు.
మళ్ళీ 1994 ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టిన
టిడిపి రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించింది. ఎందువల్లనోగానీ యన్టీ రామారావు ఎప్పుడూ
బీజేపితో నేరుగా పొత్తు పెట్టుకోలేదు.
యన్టీ రామారావు
మీద తిరుగుబాటు చేసి 1995లో టిడిపీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకు
మొదటి నుండీ కూటమి రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి వారు
జంకుతారనే మాట కూడా రాజకీయ వర్గాల్లో తరచుగా వినపడుతూ వుంటుంది. 1995లో యన్టీ రామారావును
తప్పించడం ద్వార ఎన్నికలతో పనిలేకుండానే వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో వామపక్షాల
మద్దతును కూడా తీసుకున్నారు.
1996 లోక్ సభ ఎన్నికల్లో బీజేపి 161 సీట్లతో
అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి, అటల్ బిహారీ వాజ్ పాయి ప్రధాని అయ్యారు. అయితే, మేజిక్ ఫిగర్ కు అవసరమైన సంఖ్యాబలాన్ని పుంజుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ సందర్భంలో
చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి 13 పార్టీలతో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్
గా వ్యవహరించారు. కాంగ్రెస్, సిపియం బయటి నుండి ఇచ్చిన మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ అధికారాన్ని
చేపట్టింది. హెచ్. డి. దేవగౌడ, ఐకే గుజ్రాలను ప్రధానులు చేయడంలో చంద్రబాబు చక్రం తిప్పారు.
1998 ఎన్నికల తరువాత వాజ్ పాయి నాయకత్వంలో ఏర్పడిన జాతీయ ప్రజాస్వామిక
కూటమి (ఎన్డీఏ) అధికారాన్ని చేపట్టడంలోను చంద్రబాబే చక్రం తిప్పారు. యునైటెడ్ ఫ్రంట్
కన్వీనర్ గా హైదరాబాద్ లో విమానం ఎక్కిన చంద్రబాబు ఢిల్లీలో విమానం దిగగానే ఎన్డీయే
కన్వీనర్ గా మారిపోయారు.
చంద్రబాబు స్వీయ నాయకత్వంలో ఎదుర్కొన్న తొలి
అసెంబ్లీ ఎన్నికలు 1999లో లోక్ సభ ఎన్నికలతోపాటూ జరిగాయి. చంద్రబాబు బీజేపీ తో ముందస్తు
పొత్తు కుదుర్చుకుని ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. అప్పటి కార్గిల్ యుధ్ధం సెంటిమెంటు
రెండు పార్టీలకూ కలిసి వచ్చింది. 2004లోను టిడిపి-బీజేపి కలిసే పోటీ చేశాయి. ఆ ఎన్నికలు
రెండు పార్టీలకూ కలిసిరాలేదు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని కోల్పోయాయి.
ఆ తరువాత ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. బీజేపీతో ఇంకెన్నడూ పొత్తు పెట్టుకోనని
టిడిపి మహానాడు వేదిక నుండి చంద్రబాబు ఒక శపథం
కూడా చేశారు.
2009లో చంద్రబాబు టీఆర్ఎస్, వామపక్షాలను
కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో టిడిపి సంఖ్యాబలం పెరిగిందికానీ
అధికారం చేజిక్కలేదు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో 2014లో మళ్ళీ బీజేపితో జట్టు
కట్టాలని చంద్రబాబు ఉవ్విళ్ళూరారు. బీజీపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ గెలుపు గుర్రంగా
కనిపించడం దీనికి ప్రధాన కారణం. అలాగే పార్టీకాని పార్టిలావున్న పవన్ కళ్యాణ్ జనసేనతోనూ
ఆయన పొత్తు పెట్టుకున్నారు. తద్వార కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకును ఆకర్షించాలనుకున్నారు.
ఒంటరిగా ఎన్నికల్ని
ఎదుర్కోవడానికి చంద్రబాబు జంకారుగానీ, బీజేపీతో జట్టు కట్టకపోయినా ఆ ఎన్నికల్లో టిడిపియే గెలిచి వుండేది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే
జరిగి అసెంబ్లీ ఎన్నికల తరువాత కౌంటింగ్ జరిపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని
నిర్ధారించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందే జరిగిన ఆ ఎన్నికల్లో టిడిపికీ
స్పష్టమైన ఆధిక్యత లభించింది.
ఎన్డీఏ కూటమి నుండి ఇప్పుడు టిడీపి బయటికి
వచ్చింది కనుక 2019 ఎన్నికలు బహుశ చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొనే తొలి ఎన్నికలు కావచ్చు.
(రచయిత సీనియర్
జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు)
https://www.bbc.com/telugu/india-43429535
https://www.bbc.com/telugu/india-43429535
//EOM//
No comments:
Post a Comment