BIG STORY
చంద్రబాబు ఢిల్లీ యాత్ర
కాంగ్రెస్ పై వైఖరే కీలకం
- డానీ
జాతీయ రాజకీయాల్లో
కొత్త సమీకరణలకు రంగం సిధ్ధమైన దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ
పర్యటనకు రావడం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో ఇప్పుడున్న
ముఖ్యమంత్రులు అందరిలోనూ చంద్రబాబుకు ఒక ప్రత్యేకత వుంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా
వ్యవహరించగల సత్తా అందరికన్నా ఆయనకే ఎక్కువగా వుంది. 1996లో దేవేగౌడను, 1997లో ఐకే
గుజ్రాల్ ను ప్రధాన మంత్రులుగా చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు ఆయనే కన్వీనర్. అలాగే 1998లో వాజ్ పాయిని ప్రధాని చేయడానికి ఏర్పడిన జాతీయ
ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఏ) – 1 కు కూడా ఆయనే కన్వీనర్ గా వ్యవహరించారు.
1997 ఏప్రిల్ నెలలో దేవెగౌడ తరువాత ప్రధానమంత్రి
అయ్యే అవకాశం సిపియం వృధ్ధనేత జ్యోతి బసుతో పాటూ చంద్రబాబుకు కూడా వచ్చింది.
ఎన్డీయేలో
బీజేపియేతర ముఖ్యమంత్రుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మీద ఎక్కువ విశ్వాసాన్ని ప్రకటించిన ఘనత చంద్రబాబుకే
దక్కుతుంది. దాదాపు ఓ నాలుగేళ్ళు ఆయన నరేంద్ర
మోదీని నెత్తి మీద పెట్టుకుని మోశారన్నా అతిశయోక్తికాదు. దానికి టిడిపి వర్గాలు చెప్పే
సమర్ధన భిన్నంగా వుంటుంది. కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు
తదితర పథకాలకు నిధుల్ని తేవడానికి మోదీతో
‘అదనపు’ మైత్రి బంధాన్ని సాగించామని ఆ పార్టి నేతలు అంటున్నారు.
బీజేపి సీనియర్
నేతలయిన యశ్వంత్ సిన్హావంటివారైనా మోదీ ప్రభుత్వాన్ని
అడపాదడపా ఒక మాటైనా అన్నారేమోగానీ చంద్రబాబు గత నాలుగేళ్లలో మోదీనే కాదు మోదీ సన్నిహితుడు
అమిత్ షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి, హొంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జలవనరుల
శాఖా మంత్రి నితిన్ గడ్కరిని సహితం పల్లెత్తు
మాట అనలేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదా బదులు ప్రత్యేక ఆర్దిక సహాయం (ప్యాకేజీ) ఇస్తానని అరుణ్ జైట్లి ప్రతిపాదించినపుడు
చంద్రబాబు నిస్సందేహంగా ఆమోదించేశారు. “కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?”
అని అతి ఉత్సాహపు ప్రకటనలు చేశారు.
అయితే, చంద్రబాబుకు
వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. వరుస నాలుగు కేంద్ర బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం చేయని నరేంద్రమోదీ మొన్నటి చివరి బడ్జెట్
లోనూ నిరాశే మిగిల్చారు. చివరి నిముషంలో ముప్పుని గమనించిన చంద్రబాబు ప్రమాద నివారణ
చర్యలకు శ్రీకారం చుట్టారుగానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్ కు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
రాష్ట్ర రాజకీయాల్లో
చంద్రబాబుకు ఒక అనుకూల అంశం వుండింది. ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ వయసులోనూ, రాజకీయ
అనుభవంలోనూ చంద్రబాబుకన్నా చాలా చిన్నవారు. అయితే, జగన్ మొదటి నుండీ ఒక సెంటిమెంటుగా
ప్రత్యేక తరహా హోదా అంశాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. దానికోసం నిరాహార దీక్ష
చేశారు. ఆ దీక్షను చంద్రబాబు భగ్నం చేయడమేగాక,
ప్రత్యేక తరహా హోదా కోసం ఆందోళన చేసేవారిని అరెస్టు చేసి జైళ్ళలో పడేస్తామని
గట్టి హెచ్చరికలు చేశారు. దానితో ప్రత్యేక
తరహా హోదా మీద జగన్ పేటెంట్ రైట్స్ పొందేశారు.
కేంద్రం చేసిన
మోసం బయటపడ్డాక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక తరహా హోదా పెద్ద సెంటిమెంటుగా మారిపోయింది.
ఈ పరిణామాలు జగన్ కు అనుకూలంగా మారిపోవడంతో
చంద్రబాబు ఖంగు తిన్నారు. ప్రత్యేక తరహా హోదాను విమర్శించిన నోటితోనే దాని జపం
చేయక తప్పలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి యంపీలు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం
గురించి పార్లమెంటులో గళం విప్పారు. చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ నాయకత్వంలో పార్లమెంటు
బయట దశావతారాలు ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
లో తన రాజకీయ ఎజెండాను జగన్ నిర్ణయిస్తారని
చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు. జగన్ ప్రత్యేక తరహా హోదా అంటే చంద్రబాబు
ప్రత్యేక తరహా హోదా అనక తప్పలేదు. జగన్ పార్టి ఎంపీలు మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస
తీర్మానం పెడితే టిడిపి ఎంపీలు సహితం అవిశ్వాస
తీర్మానం పెట్టక తప్పలేదు. తమ ఎంపీలు ఏపిల్ 6న రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు
చేస్తారని జగన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెద్ద కుదుపుకు గురయ్యాయి.
కేంద్రంలోని
నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా గత ఏడాది వున్నంత పటిష్టంగా ఏమీ లేదు. లోక్ సభలో మొత్తం
545 సీట్లుండగా బీజేపికి స్వంతంగా ప్రస్తుతం
273 సీట్లు మాత్రమే వున్నాయి. ఇది కనీస మెజారిటీ (మేజిక్ ఫిగర్) మాత్రమే. తార్కికంగా ఇప్పుడు బీజేపి తన ఎన్డీఏ మిత్రపక్షాల మీద ఆధార పడివుందని అర్ధం. ఇది గాక
బీజేపిలోనే నరేంద్ర మోదీ వ్యతిరేకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదనే సంకేతాలూ వెలువడుతున్నాయి.
అవిశ్వాస తీర్మానాన్ని సవాలుగా స్వీకరిస్తే బీజేపిలోని అసమ్మతి బయటపడిపోతుందని నరేంద్ర
మోదీ-అమిత్ షా ద్వయం భయపడుతోంది.
ఇలాంటి చారిత్రక
సందర్భంలో చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు విడిది చేయడం విశేషంగా మారింది. బెంగాల్ ముఖ్యమంత్రి, తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి
మమతా బెనర్జీ గత వారమే ఢిల్లోలో విడిది చేసి నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టడానికి
ఒక ప్రయత్నం చేశారు. ఆ వెంటనే చంద్రబాబు ఢిల్లీ
చేరుకొని జాతీయ రాజకీయాల్లో మరో కలకలం రేపారు.
వైయస్సార్
సిపీ, తెలుగు దేశం పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు కాంగ్రెస్ సహా ఎన్డీఏ
యేతర పార్టీలు అనేకం మద్దతిచ్చాయి. ఇప్పుడు
చంద్రబాబు ఎన్డీయేలో బీజేపీయేతర పార్టీలతో కూడా చర్చిస్తారని అంటున్నారు. చంద్రబాబు
పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే వివిధ పార్టీల నాయకుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యను వివరిస్తారని
సమాచారం. ఢిల్లీలో చంద్రబాబు వివిధ పార్టీల
నేతలతో విందు దౌత్యం నడిపే అవకాశాలు కూడా వున్నాయి. ఇలా ఢిల్లీలో దౌత్యం నడిపే అవకాశాలు
జగన్ కు అంతగాలేవు. ఆ విధంగా చంద్రబాబు ఈ విభాగంలో జగన్ కన్నా అనేక అడుగులు ముందుకు వేసినట్టే.
అయితే చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో కొన్ని ఖాళీలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ మీద చంద్రబాబు వైఖరి స్పష్టం కావలసివుంది. మోదీతో దోస్తీ రోజుల్లో చంద్రబాబు
తరచూ కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోసేవారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారనీ, రాజధానినగరం
లేకుండా చేశారనీ, కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి గెంటేశారని సందర్భం వున్నా లేకున్నా
వారు కాంగ్రెస్ ను విమర్శించే వారు. ఇప్పుడు వారు గుర్తించాల్సిన అంశాలు కొన్నున్నాయి.
గత నాలుగేళ్ళలో కేంద్ర ఆదాయంలో రాష్ట్రావాటా (డెవల్యూషన్) గా వచ్చే నిధులు గాకుండా
అదనంగా వచ్చిన ఇతర నిధులన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా వచ్చినవే. ఆ చట్టాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
అభిష్టం మేరకు రూపొందించారని తెలియనివాళ్ళెవరూ
ఇప్పుడు లేరు. అలాగే రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కొత్తగా ఏర్పడబోయే
అంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక తరహా హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్
కాంగ్రెస్ ప్రధాని. ఇప్పుడు చంద్రబాబు అమలు
చేయమని కేంద్రాన్ని కోరుతున్న 2014 చట్టం, ప్రత్యేక హోదా రెండూ కాంగ్రెస్ ఇచ్చినవే!
కనుక కాంగ్రెస్ మీద చంద్రబాబు తన వైఖరిని పునఃసమీక్షించు కోకతప్పదు.
కాంగ్రెస్
లోక్ సభా పక్షనాయకుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు
ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పకపోతే ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు అదనంగా సాధించిందేమీ
వుండదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అధినేత్రి సోనియాగాంధీని కూడా కలిస్తే
అప్పుడు
చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం నిజంగానే జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది.
(రచయిత సీనియర్
పాత్రికేయుడు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ :
9010757776
హైదరాబాద్
3 ఏప్రిల్
2018
http://epaper.manatelangana.news/1604704/Mana-Telangana-City-Main/04-04-2018#page/4/2
No comments:
Post a Comment