Tuesday 24 April 2018

Chandrababu Delhi Flight One Month Late


బాబు విమానం నెల రోజులు లేటు

-        డానీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానం నెల రోజులు ఆలస్యంగా ఢిల్లీ చేరుకుంది. వారు విమానం ఎక్కడానికే నెల రోజులు ఆలస్యం చేశారంటే ఇంకా బాగుంటూంది.

టిడీపి-బీజీపి సంబంధాలేగాక, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సహితం గట్టిగా దెబ్బతిన్న తరుణంలో చంద్రబాబు ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో విడిది చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద తమ పార్టి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల  మద్దతును కూడగట్టడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చినట్టు టిడిపి వర్గాలు చెపుతున్నాయి. అయితే, ఇందులో ఒక తిరకాసువుంది. జగన్ నాయకత్వంలోని వైసిపి, చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి విడివిడిగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులకు  మార్చి 19 నాటికే లోక్ సభలోని కాంగ్రెస్ సహా ఎన్ డిఏ యేతర పక్షాలన్నీ మద్దతు పలికాయి; తమిళనాడులో అధికారంలోవున్న ఏఐడియంకే ఒక్కటే దీనికి మినహాయింపు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యాకరణ దోషం వుంటోంది.  జరిగిన దానిని జరగబోయేదిగానూ, జరగబోయే దానిని జరిగిపోయినట్టుగానూ ప్రధాన రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయి. కేంద్ర నుండి భారీగా నిధుల్ని తెస్తాననీ, తెస్తున్నాననీ, తెచ్చేశానని భవిష్యత్, వర్తమాన, భూత కాలాల్లో చంద్రబాబు స్వయంగా గతంలో అనేకసార్లు ప్రకటించి వున్నారు. ఒక అబధ్ధాన్ని నిజంగా చిత్రించడానికి వారు అంతటితో ఆగలేదు ప్రధాని మోదీనీ, కేంద్ర ఆర్ధికమంత్రి అరున్ జైట్లీనీ ప్రసంసలతో ముంచెత్తారు. ఇప్పుడు తీరా ఐదో సంవత్సరంలో ప్రవేశించేసాక కేంద్రం నుండి నిధులు రాలేదని వారే అంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా ఇలాంటి వ్యాకరణ దోషంతోనే సాగింది. ఇప్పటికే మద్దతు ఇస్తున్న పార్టీలను  మద్దతు కోరడం ఏమీటీ? ఏది ముందూ? ఏది వెనకా? పోనీ కొత్తగా ఏదైనా ఒక పార్టీ మద్దతును అదనంగా కుడగట్టారా అంటే అదీలేదు. మద్దతు ఇస్తున్న పార్టీలకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా ఇప్పటి దాక అవిశ్వాసం నోటీసును స్పీకర్ స్వీకరించనేలేదు.  వారి చేత నోటీసును స్వీకరింపచేసే మార్గమేమిటో చంద్రబాబుకు కూడా తెలిసినట్టులేదు.
చంద్రబాబు ఢిల్లీ చేరడానికి ముందే వారితో సంబంధం లేకుండానే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఉపఎన్నికల్లో చిరకాల ప్రత్యర్ధులు మాయావతి, అఖిలేష్ యాదవ్ ఏకమై గొప్ప విజయాన్ని నమోదు చేయడంతో ఈ బాటలో అనేక ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి.

నరేంద్ర మోది నిరంకుశ పాలనను గద్దె దించాలంటే బీజేపి-ఆర్.ఎస్.ఎస్. లకు వ్యతిరేకంగా ఒక గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు కావాలనేది ఒక ప్రతిపాదన. తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను బలంగా ప్రచారం చేస్తున్నారు.  చంద్రబాబు పర్యటనకు వారం రోజుల ముందు మమతా బెనర్జీ ఢిల్లీలో మూడు రోజులు మకాం వేశారు. శరద్ పవార్, సోనియా గాంధీలనేకాక బీజేపి అసమ్మతులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, శత్రుఘ్నసిన్హా తదితరుల్ని కూడా వారు కలిశారు. బెంగాల్ లో తృణాముల్ కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయిన సిపియం జాతీయ ప్రధాన  కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే వున్నారు. అయితే, ఆ పార్టీలో మరో ముఖ్యనేత ప్రకాష్ కారత్ కాంగ్రెస్ మీద భిన్నాభిప్రాయంతో వున్నారు.

బీజేపి యేతర, కాంగ్రెసేతర ముడో ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు మరో పావు కదిలించారు. దీనినే ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు.  దీనికి పెద్దగా మద్దతు లభించకపోగా  కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ముడో ఫ్రంట్ అనేది ఎన్నికల గణాంకాల రీత్యా బీజేపికే అనుకూలంగా మారుతుందనేది వీటి సారాంశం. కొందరయితే మూడో ఫ్రంట్ అంటే ‘ మోదీ టీమ్-బీ’ అని కూడా అంటున్నారు.

గతంలో నేషనల్ ఫ్రంట్ లో  పరోక్షంగానూ,  యునైటెట్ ఫ్రంట్,  నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ లలో ప్రత్యక్షంగానూ చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి ఈ మూడు సమీకరణల జోలికి పోవడానికి జంకారు.  తన ఢిల్లీ యాత్ర రాజకీయం కాదని వారు  పదేపదే చెప్పింది అందుకే.  

జాతీయ పరిణామాల్ని చూస్తుంటే చంద్రబాబు అయినా, జగన్ అయినా ఏపీ ఓటర్ల ముందు నరేంద్ర మోదీ మీద చూపుతున్నంత అవేశాన్ని ఢిల్లీలో చూపడం లేదనిపిస్తోంది.  ఇద్దరూ మోది చంకలో పిల్లలే అనే మాట ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది.

చంద్రబాబు తరచూ యువకుడైన (కుర్ర) జగన్ కు పార్లమెంటు విధివిధానాలు  తెలియవని ఎద్దేవ చేస్తుంటారు.  ఆ రంగంలో తనకు 40 యేళ్ళ సుదీర్ఘ అనుభవం వుందని ఘనంగా చెప్పుకుంటుంటారు.  కానీ ఇటీవలి కాలంలో వారు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు వారి అనుభవానికి దీటుగా కనిపించడంలేదు.

అక్షరాల యుధ్ధంలో ప్రత్యర్ధి బలమైన స్థానం మీద దాడిచేయాలనీ, ఆయుధాల యుధ్ధంలో ప్రత్యర్ధి బలహీనమైన స్థానం మీద దాడి చేయాలని ఒక సామెత వుంది. ఏ ప్రభుత్వానికయినా ప్రాణప్రదమైన అంశం వార్షిక బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం పొందడం. బడ్జెట్ కు ఆమోదం పొందకపోతే గల్లాపెట్టెలో పైసా కూడా ప్రభుత్వం ముట్టుకోవడానికి వీల్లేదు.  అలాంటి అవకాశం ఏపీ రాజకీయ పక్షాలైన టిడిపి, వైసిపి లకు మార్చి మొదటివారంలో వచ్చింది. 

బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టిన అనంతరం  పార్లమెంటుకు శెలవులు ప్రకటించారు. ఆ తరువాత మార్చి 5న మళ్ళీ బడ్జెట్ సభావేశాలు మొదలయ్యాయి. నరేంద్ర మోదీ చివరి బడ్జెట్ లోనూ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేశారని అప్పటికే సుస్పష్టం అయిపోయింది. బడ్జెట్ లో సవరణలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అలాంటి సమయంలో, తమను అన్యాయం చేసిన బడ్జెట్ ను చంద్రబాబు అడ్డుకొని వుండాల్సింది. అలాంటీ అవకాశం పార్లమెంటరీ విధానాల్లోనే వుంది.

మార్చి 2నే చంద్రబాబు ఢిల్లీలో మకాంవేసి బీజేపియేతర శక్తుల మద్దతు కూడగట్టి మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చివుంటే జాతీయ రాజకీయాల్లో అసలు ఆట మొదలయ్యి వుండేది.  సభ సజావుగా లేదు కనుక అవిశ్వాసం నోటీసుకు మద్దతుదారుల్ని లెక్కించలేక పోతున్నాను అని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పుడు అంటున్నంత  సులువుగా అనగలిగేవారుకాదు.  ఎందుకంటే వెల్ లో గొడవ అవిశ్వాసం నోటీసుకే కాదు;  బడ్జెట్ ఆమోదానికి కూడా అడ్దంకే. ఆమోదిస్తే రెండూ ఆమోదించాలి; తిరస్కరిస్తే రెండూ తిరస్కరించాలి.

అవిశ్వాసం నోటీసు ఆమోదం పొంది సభలో చర్చ సాగి ఓటింగు జరిగినా నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోకపోవచ్చు. ఏమో! గుర్రం ఎగిరినా ఎగరవచ్చు! బీజేపీలోనూ మోదీ వ్యతిరేకత తక్కువగా ఏమీలేదనే మాట కూడా వినవస్తోంది.  అలాజరక్కపోయినా, ఏపీకీ ప్రత్యేక తరహా హోదా, 2014 చట్టం అమలు వంటి అంశాల మీద పార్లమెంటులో విస్తార చర్చ జరిగివుండేది.  అదే కదా మనం అంతా ఆశిస్తున్నదీ? అప్పుడు ఈ ఎంపీల రాజీనామాలు, ఆమరణ నిరాహార దీక్షలతో పనీ వుండేది కాదు.
 రాజకీయాలకు కొత్త అయిన జగన్ కు పార్లమెంటులో బడ్జెట్ ను ఎలా అడ్డుకోవాలో, ప్రధాన మంత్రిని ఎలా ఇరకాటంలో పెట్టాలో తెలిసి వుండకపోవచ్చు. కానీ నలభైయేళ్ళ అనుభవజ్ఞులైన చంద్రబాబుకు ఈ కిటుకు క్షుణంగా తెలుసుకదా!.  వారెందుకు బడ్జెట్ ఆమోదానికి తోడ్పడి గండం నుండి మోదీ తప్పించేశారూ? ఇందులో మనకు ఇప్పటికి తెలియనిది ఏదో వుంది. అది త్వరలో మన ముందుకు వస్తుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

ప్రచురణ
ఎడిట్ పేజీ, ప్రజాశక్తి,  7 ఏప్రిల్ 2018
http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2025278

No comments:

Post a Comment