Tuesday 24 April 2018

Mere laws are not sufficient


చట్టాలు చేస్తే సరిపోదు!

-        డానీ

హత్యాచారాలు వెలుగులోనికి వచ్చినపుడు సభ్యసమాజం సహజంగానే ఆవేశంతో ఊగిపోతుంది. దోషులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతుంది.  మరణశిక్ష విధించాలనీ,  బహిరంగంగా ఉరి తీయాలనీ, పురాతన పధ్ధతుల్లో తల నరికేయాలనీ, బుడ్దకొట్టాలనీ (castration) అరబ్ దేశాల పధ్ధతుల్లో రాళ్లతో కొట్టి చంపాలనీ ఆందోళనకారులు ప్రభుత్వాలను కోరుతుంటారు. 2012 నాటి నిర్భయ హత్యాచారం సందర్భంగా మహిళా సంఘాలు ఇలాంటి ప్రతిపాదనలే చేశాయి.

ఆవేశంలో చాలామంది మరచిపోయే అంశం ఒకటుంటుంది. అదేమంటే క్రూరమైన నేరాలకు పాల్పడేవారిలో అత్యధికులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగివుంటారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన యన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వారి సామాజికవర్గానికి చెందినవాళ్ళే కారంచేడులో దళితుల మీద దాడిచేశారు. అలాగే, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేదురుమిల్లి జనార్దన రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వారి సామాజికవర్గానికి చెందినవాళ్ళే  చుండూరులో దళితుల మీద దాడి చేశారు. అధికారం, కులం, నేరం కలిసే వుంటాయన్న వాస్తవాన్ని ఈ రెండు హత్యాకాండలు నిరూపించాయి.

తమ వెనుక కాపాడుకునే వాళ్ళున్నారనే భరోసా వున్నప్పుడు నేరస్తులు మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తారు. చట్టాలు తమను ఏమీ చేయలేవనే ధీమాతో  (Immunity) విర్రవీగుతారు. ఎన్నికల్లో అడ్దమైన పధ్ధతుల్లో గెలవడానికి రాజకీయ పార్టీలకు ఇలాంటి అరాచకశక్తులు చాలా అవసరం. అంచేత అరాచకశక్తుల్ని పోషించడం, ఆపత్కాలంలో చట్టం బారి నుండి వారిని కాపాడడం రాజకీయ పార్టీలకు “పోల్ మేనేజ్ మెంటు”లో అనివార్యమైన ‘కర్తవ్యం’ అవుతుంది. అవసరమైనపుడు దీని కోసం వాళ్ళు న్యాయవ్యవస్థను సహితం వాడుకుంటారు.   

మక్కా మసీదు పేలుళ్ళు,  జస్టిస్ లోయా మృతి, గుజరాత్ అల్లర్ల కేసుల్ని వరుసగా కొట్టేస్తున్నపుడు న్యాయవ్యవస్థ మీద అనేక అనుమానాలు రావడం సహజం. నిందితులు తస్మదీయులు అయినపుడు వారికి శిక్షలు పడేలా చేయడానికి ప్రాసిక్యూషన్ అధికారులు అతి క్రియాశీలంగా వ్యవహరిస్తారు. నిందితులు అస్మదీయులు అయినపుడు వాళ్ళను శిక్ష నుండి తప్పించడానికి ప్రాసిక్యూషన్ అధికారులు తమ విధుల నుండి తప్పుకుంటారు. “నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది” అంటూ న్యాయమూర్తులు తమ చేతులు కడుక్కుంటారు. అధికారంలో వున్న పార్టీలకు ప్రాసిక్యూషన్ విభాగం అనేది న్యాయ వ్యవస్థలో గొప్ప సౌకర్యంగా వుంటుంది.  న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం తరచూ ప్రాసిక్యూషన్ విభాగం ద్వారానే సాగుతుంటుంది.

వందమంది దోషుల్ని వదిలేయవచ్చుగానీ ఒక్క నిర్దోషిని కూడా శిక్షించరాదనేది న్యాయవ్యవస్థకు మౌలిక విలువగా చాలామంది చాలా గొప్పగా చెపుతుంటారు. వంద మంది దోషుల్ని వదిలేసే పనిని ప్రాసిక్యూషన్ విభాగం చాలా చురుగ్గా చేస్తుంది. కొందరు నిర్దోషుల్ని కాపాడే పనిని మాత్రం వాయిదా వేస్తుంది. 

నిర్భయ చట్టం వచ్చినపుడు కఠినాతికఠిన శిక్షకు భయపడి మృగాళ్ళు ఇక తోక ముడుస్తారని, అత్యాచారం పేరు చెపితేనే భయంతో వణికిపోతారని విద్యావంతులైన మధ్యతరగతి ఉదారవాదులు  చాలా బలంగా నమ్మేరు. వాస్తవం ఏమంటే నిర్భయ చట్టం వచ్చాక దేశంలో హత్యాచారాల సంఖ్య పెరిగింది.

తమ కార్యకర్తలు హత్యాచారానికి పాల్పడినట్టు బయటికి తెలిసినపుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఇరకాటంలో పడుతుంది. ఆ సంఘటన కల్పిత కథ అని ఖండిస్తుంది. లేదా, దోషులు తమ పార్టీవాళ్ళు కాదని బుకాయిస్తుంది. సంఘ్ పరివారకులు అలాకాదు. బాధితులు ముస్లింలు అయినపుడు హత్యాచారాన్ని తమవాళ్ళే చేశారని ఘనంగా ప్రకటించుకుంటారు. అలా చెప్పుకోవడంవల్ల దేశంలో కరడుగట్టిన హిందూత్వవాదులు ఒకరకం రాక్షసానందాన్ని ఆస్వాదిస్తారనీ, అలా రెచ్చిపోయిన భావోద్వేగాలు సమీప ఎన్నికల్లో  తమకు ఓట్లుగా మారుతాయని వాళ్ళు నమ్ముతారు.

ఢిల్లీలోని రోహింగ్యా (మయన్మార్) శరణార్ధుల ఏకైక శిబిరం ఇటీవల అగ్నికి ఆహుతి అయిపోయింది. అందరూ దీన్ని ఒక ప్రమాదంగానే భావించారు. అయితే, బీజేపి యువజన విభాగానికి (బీజేవైయం) చెందిన మనీష్ చండేల “అవును. మేమే తగులబెట్టేశాం” అని సామాజిక మాధ్యమాల్లో ఘనంగా ప్రకటించి హఠాత్తుగా ‘హిందూజాతి రక్షకుడు’ అయిపోయాడు.  

నిర్భయ కేసులా కఠువా ఆసిఫా కేసు క్షణికావేశంలో జరిగిన ఒక యాధృచ్చిక సంఘటన కానేకాదు. జమ్మూ ప్రాంతం నుండి ముస్లింలని తరిమేయడానికీ, వాళ్లను భయభ్రాంతుల్ని చేయడానికి ప్రణాళికాబద్దంగా ఒక దేవాలయంలో దీర్ఘకాలం జరిపిన హత్యాచారం అది. వాళ్ళు మందిరాలను రాజకీయం చేస్తారు. మందిరాలలో పసిపిల్లల మీద హత్యాచారాలు చేస్తారు. పైగా అది ఒక మహత్కార్యంగా ప్రచారం చేసుకుంటారు!.

కఠువా హత్యాచారం నిందితుల్ని అరెస్టు చేయరాదంటూ ఏకంగా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర మంత్రులు ఊరేగింపులు, నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం, కేసు పెట్టకుండా బీజేపి అడ్వకేట్లు కోర్టు ఆవరణలో క్రైంబ్రాంచ్ అధికారుల్ని అడ్డుకోవడం వంటివి సభ్యప్రపంచానికి అనాగరీకంగా కనిపించవచ్చు. కానీ, అలాంటి అనాగరికమే తమ ఓటు బ్యాంకుని అలరించి పటిష్టంగా వుంచుతుందని సంఘ్ పరివారం నమ్ముతుంది. దక్షణాదిన ప్రతిష్టాత్మక కర్ణాటక ఎన్నికల్లో హిందూత్వ ఓట్ బ్యాంకును ఆకర్షించడానికి ఉత్తరాదిలో హత్యాచార కేసులు ఒక పరంపరగా సాగుతున్నాయని తెలుసుకోలేకపోతే వర్తమాన రాజకీయాలు మనకు ఇంకా అర్ధం కానట్లే!.

దేశంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే ట్వీట్ల ద్వార స్పందించే ప్రధాని నరేంద్ర మోదీ కఠువా దారుణం మీద వారాల తరబడి మౌనంగా వుండిపోయారు. ఈ ఘటన మీద అంతర్జాతీయ సమాజం సహితం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందిగానీ ప్రధాని మాత్రం మౌనాన్ని వీడలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధి క్రీస్టిన్ లగార్డే దౌత్య మొగమాటాన్ని సహితం పక్కన పెట్టి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించింది.   కామన్ వెల్త్ సభలకు లండన్ వెళ్ళిన మోదీ అంతర్జాతీయ వత్తిడికి  తలొగ్గి కఠువ, ఉనావ్ సంఘటనల మీద నోరు తెరవక తప్పలేదు. “పసిపిల్లల మీద సాగిన అత్యాచారం దేశానికి అవమానం. అయితే ఇలాంటి సంఘటనల్ని రాజకీయం చేయడం అంతకన్నా దారుణం” అన్నారు. అయితే, కఠువ దారుణం రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందన్న వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ప్రధాని అడ్దంగా ప్రయత్నించారు.   ప్రధాని మరచిపోయి వుండవచ్చుగానీ  చాలా మందికి ఇప్పటికీ గుర్తున్న విషయం ఏమంటే; నిర్భయ కేసును రాజకీయం చేసింది సాక్షాత్తు నరేంద్ర మోదీయే. 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  భాగంగా డిసెంబరు 1న అంబేడ్కర్ నగర్ లో జరిగిన బీజేపి సభలో మోదీ ప్రసంగిస్తూ “ఓటు వేసే ముందు ఒకసారి నిర్భయను గుర్తుకు తెచ్చుకోండి” అని పిలుపునిచ్చారు.

కఠువా కేసులో బాధితులు ముస్లింలు అయినప్పటికీ హిందూ సమాజం సహితం ఈ సంఘటన మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. హిందూ వేరు, హిందూత్వ వేరు అని మరొక్కసారి నిరూపించింది. స్వీయ సమాజం నుండే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పరిస్థితి చేయిదాటిపోతున్నదని తెలిసి మోదీ  ప్రభుత్వం ప్రమాద నివారణ చర్యలు చేపట్టింది. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలు జరిపిన వారిని ఉరి శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం  ఒక ఆర్డినెన్స్ ను తెచ్చింది.  

చట్టాలు కఠినంగా వున్నంత మాత్రాన దుష్టశిక్షణ జరిగినట్టుకాదు.   తమ వాళ్ళను శిక్షల నుండి కాపాడుకోవడం ప్రభుత్వాలకు పెద్ద కష్టమైన పనేమీకాదు. దళితుల మీద అత్యాచార నిరోధక చట్టం కింద అభియోగాన్ని  ఎదుర్కొంటున్న ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కాపాడుకోవడానికి రోహిత్ వేముల అసలు దళితుడేకాదని నిరూపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అడ్డదారులు తొక్కాయో మనకు తెలుసు.  ఇప్పుడు ఆసీఫా మీద అత్యాచారం జరగనేలేదనీ, ఉన్నావ్ కేసులో నిందితురాలు ‘మైనర్ బాలిక’ కాదని నిరూపించడానికి కమలనాధులు నడుముకు బెల్టులు బిగించారు. 

జాతీయ నేర ప్రశోధనా సంస్థ (ఎన్ సిఆర్ బి) గణాంకాల ప్రకారం 2015లో  మైనర్ బాలికల మీద అత్యాచారం నిందితులు   5, 361 మంది విచారణను ఎదుర్కొన్నారు. వీరిలో 1, 843 మందికి మాత్రమే శిక్షలు పడగా 3,518 మంది నిర్దోషులుగా బయటపడిపోయారు. అంటే, శిక్షల శాతం మూడో వంతు మాత్రమే వుంది. సుదీర్ఘ న్యాయవిచారణ కారణంగా అనేక నేరాలు కోర్టుల్లో నిరూపణకాక  దోషులు తప్పించుకుంటున్నారు.  బాధితులకు న్యాయాన్ని ఆలస్యంగా అందించడమూ న్యాయాన్ని నిరాకరించడమూ రెండూ ఒకటే!. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పిల్లల మీద అత్యాచారం కేసుల విచారణను  60 రోజుల్లోగా పూర్తి చేసేలా చట్టాలు తేవాలి.

ఏ దేశంలో అయినా చట్టాలు ఎంత కఠినంగా వున్నాయనేది ఎప్పుడూ ప్రశ్నేకాదు. చట్టాలను ప్రభుత్వాలు ఎంత పటిష్టంగా అమలు చేస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. నేరస్తుల్ని కాపాడే ప్రభుత్వాలున్నంత వరకూ చట్టాల్ని ఎంత కఠినంగా మార్చినా హత్యాచారాలు కొనసాగుతూనే వుంటాయి. ఉన్నావ్, కఠువా కేసులతో దేశం దద్దరిల్లుతున్న కాలంలోనే, ఇలాంటి నేరాలకు ఉరిశిక్షను విధిస్తూ ఆర్డినెన్స్ ను ఆయోదిస్తున్న  సమయంలోనే పశ్చిమ బెంగాల్ లో ఓ టీచర్ నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిల మీద తరగతి గదిలోనే నాలుగు రోజులు అత్యాచారం సాగించాడు! ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఈ టీచర్ ఇంట్లో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆరేళ్ళ పసిపాప మీద అత్యాచారం సాగించాడు. 

(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు)

ప్రచురణ
ఎడిట్ పేజీ, మన తెలంగాణ, 25 ఏప్రిల్ 2018 

http://epaper.manatelangana.news/1631965/Mana-Telangana-City-Main/25-04-2018#page/4/2

ప్రచురణ
చట్టాల అమలులో నిజాయితీ కావాలి!

ఎడిట్ పేజీ, ప్రజాశక్తి, , 27 ఏప్రిల్ 2018 

http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2031383

మొబైల్ :  9010757776

హైదరాబాద్
21 ఏప్రిల్ 2018

No comments:

Post a Comment