Tuesday 19 June 2018

That is My Father

అదీ మా నాన్న !
అందరిలాగే నాకూ తొలిగురువులు మా అమ్మానాన్నలే. జాలి, కరుణ, అమాయకత్త్వం, విపరీతమయిన సాంకేతిక నైపుణ్యం మా నాన్న వ్యక్తిత్త్వం. మొదటితరం యంత్రాలను చూపెట్టితే చాలు వాటిని ఎలా తయారు చేయాలో చెప్పేసేవారు. కొన్ని యంత్ర పరికరాలను అతి తక్కువ డబ్బుతో స్వయంగా తయారు చేసేసేవారు. రేకును పట్టుకుని గేజ్ చేప్పేసేవారు. ఇనుప తీగను వంచి టెంపర్ చేప్పేసేవారు.
ఓ జమీందారు పెద్ద కూతురికి కొడుగ్గా పుట్టినా బాల్యంలోనే తల్లి చనిపోయి తండ్రి మరో వివాహం చేసుకోవడంతో దాదాపు అనాధగా పెరిగారు. గొప్ప ఐశ్యర్యాన్నీ చూశారు; కటిక పేదరికాన్నీ చూశారు. రెండింటినీ సమ దృష్టితో చూడగలిగిన కర్మయోగి. ఎవరయినా తారసపడితే ముందు "భోజనం చేశారా?" అని అడిగేవారు. దారిలో కనిపించిన వారిని ఇంటికి తీసుకొచ్చి భోజనం వడ్డించమనేవారు.
"మనిషి డబ్బులోనూ బతకవచ్చు; పేదరికంలోనూ బతకవచ్చు. కానీ, అల్పుడిగా దిగజారి బతకకూడదు" అనే మాటను తరచుగా వాడేవారు.
నాకు వ్యాయామంలో ఉస్తాద్ మా నాన్నే. రెండు మూడు వీధుల్లోని పిల్లల కోసం తెల్లవారుజామున చిన్న సైజు తాలీంఖానా నడిపేవారు. ఇటుకలు, రైలు పట్టా ముక్కల మీద గుంజీలు, బస్కీలు, దండీలు చేయించేవారు. బార్ మీద కూడా కొన్ని మెళుకువలు నేర్పించారు. నాకు ఈత నేర్పింది వారే. నేనెప్పుడూ ఆధునిక జిమ్ లకు వెళ్లలేదు. ఆయన చెప్పినవే ఇంతవరకూ చేశాను. (నేను కీళ్ళు అరిగేలా కొంచెం అతిగా వ్యాయామం చేశానని ఈ మధ్య డాక్టర్లు అన్నారు).
కాలేజీ రోజుల్లో స్టడీస్ మానేసి నాటకాల మీద ఆసక్తి చూపడంతో నేను చెడిపోయానని మా అమ్మ తెగ తిట్టేది. మా నాన్న మాత్రం మనిషి ఏ రంగంలో అయినా గొప్పవాడు కావచ్చు అంటు నన్ను సమర్ధించేవారు. మనసు పెట్టి చేస్తే ఏ పనిలో అయినా విజయం వస్తుంది అనేవారు. నా నాటకాలకు అందరికన్నా ముందు వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. మా దర్శకులు ధవళ సత్యంగారు మా నాన్నగారిని 'ఉత్తమ ప్రేక్షకుడు' అనేవారు.
కొప్పినీడి రాధ రాసి, దర్శకత్వం వహించిన 'లైటెలిగింది' నాటికలో నాకో చిన్న పాత్ర వుంది. నోట్లో కాలుతున్న సిగరెట్టుతో ప్రవేశించాలి. దాన్ని సగం కాల్చి చెత్తకుండి వైపు గిరాటేయాలి. అక్కడున్న బిచ్చగాడు ఆ సిగరెట్టు పీకను తీసి దమ్ము పీల్చాలి. ఇదీ సీను. నేను కొంచెం స్టైలుగా సిగరెట్టు కాల్చుకుంటూ స్టేజీ మీదకు ప్రవేశించాను. ఎదురుగా మా నాన్న కనిపించారు. నేను కంగారు పడి పాత్రను మరిచి పోయి నోట్లో సిగరెట్టును ఎటో పడేశాను. నాటిక పూర్తయ్యాక మా నాన్న నా దగ్గరికి వచ్చి "నువ్వు సిగరెట్టు రాంగ్‍ డైరెక్షన్ లో పడేశావు" అని తప్పుపట్టారు. అదీ మా నాన్న !
జర్నలిస్టునో, సాహిత్య విమర్శకుడినో, సమాజ విశ్లేషకుడినో, అస్తిత్త్వవాదినో కావడాన వర్తమాన సమాజంలో నా మీద జనానికి గౌరవమో, ద్వేషమో వుండవచ్చు. కానీ, తరాజెష్ అలీ ఖాన్ కొడుకుని అని చెప్పగానే పాత తరం ముస్లింలు ముస్లిమేతరులు కూడా నన్ను చాలా ప్రేమగా చూస్తారు. మా నాన్న చనిపోయి పాతికేళ్ళు దాటిపోయింది. నిన్న రంజాన్ ఈద్ ముబారక్ చెప్పిన పాత మిత్రులు కొందరు మా నాన్నను తలచుకోవడం చాలా ఆనందం వేసింది. అలా ఇప్పటికీ నేను మా నాన్న వాత్సల్యాన్ని ఆస్వాదిస్తుంటాను.
మనిషిగా నాలో జాలి గుణం ఎక్కడయినా ఏ కొంచెం అయినా వుంటే అది మానాన్న నుండి వచ్చిందనే అనుకోవాలి.

No comments:

Post a Comment