Friday, 1 June 2018

Expiry Date - Debate on Vijaya Bhandaru's Post on 30th May 2018

Expiry Date - Debate on Vijaya Bhandaru's Post on 30th May 2018 

         
1. భర్త నుండి విడిపోవాలనుకోవడం స్త్రీ స్వేఛ్ఛ అయినపుడు భార్య నుండి విడిపోవాలనుకోవడం పురుష స్వేఛ్ఛ అవుతుందా?  స్త్రీ అణిచివేత  అవుతుందా? 
2.  స్వేఛ్ఛా ప్రమాణాలు స్త్రీపురుషులకు ఒకటేనా? కాదా?
3. ఈ భూమ్మీద ప్రతిదానికీ ఒక ఎక్స్పైరీ డేట్ వుంటుంది.  అసలు ఈ భూమికే ఒక ఎక్స్పైరీ డేట్ వుంది.
4. పట్టభద్రులయ్యాక సంతానాన్ని బయటికి పంపించేసే సాంప్రదాయం అనేక దేశాల్లోవుంది.
5.  మనం మరచిపోతున్నాంగానీ భర్తనో, భార్యనో వదిలేయడానికి కూడా కొన్ని సాంప్రదాయ ప్రమాణాలున్నాయి. చట్టబధ్ధ ప్రమాణాలు కూడా వున్నాయి. అదే విడాకుల చట్టం.
6. మనం ఇప్పుడు చేయాల్సింది ఎక్స్పైరీ డేట్  కు ప్రమాణాలు రూపొందించడం మాత్రమే.
7. (అంతే తప్ప) ఎక్స్పైరీ డేట్ నే రద్దు చేస్తామనడం అమాయకపు భావుకత అవుతుంది.  దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది.

మనుషులకు ఒకే అస్తిత్త్వం వుండదు. బహుళ అస్తిత్త్వాలు వుంటాయి. సాధారణంగా పెళ్ళికి రెండు అస్తిత్త్వాలే వుంటాయి; సామాజికం, ఆర్ధికం. పెళ్ళయ్యాక అనేక అస్తిత్త్వాలు, అభిరుచులు, ఆసక్తులు వెలుగులోనికి వస్తాయి. విరుధ్ధ అస్తిత్త్వాలు, అభిరుచులు, ఆసక్తులు వున్నప్పుడు భార్యాభర్తల Relationship Compatibility  సహజంగానే దెబ్బతింటుంది.  అలాంటి సమయాల్లో, దంపతులకు సమాజంలో  exposer, visibility కూడా విస్తృతంగా వుంటే వివాహేతర సంబంధాలు ఏర్పడడానికి ఆస్కారం వుంటుంది.   అది మనకు నచ్చనపుడు, తార్కికంగా రెండు పరిష్కారాలుంటాయి. మొదటిది; దంపతుల exposer, visibilityని నియంత్రించడం. ఆ పనిని సాంప్రదాయవాదులు వేల సంవత్సరాల తరబడి చేస్తూనే వున్నారు. రెండు, వివాహాబంధాన్ని రద్దు చేయడం.

                 వివాహబంధం రద్దయినపుడు మహిళలే బాధితులవుతారు అనేది అర్ధసత్యం. పురుషులూ బాధితుల్లయ్యే సందర్భాలు తక్కువగా ఏమీ వుండడంలేదు. మహిళలకు vulnerability ఎక్కువ అనడం సమంజసంగా వుంటుంది. ప్రగతిశీలవాదులు ఏ సందర్భంలో అయినా సరే  vulnerable groups  పక్షాన వుండాలి. అందులోనూ సందేహంలేదు.

                 అయితే, మహిళలు vulnerable group గా వుంటున్నది వివాహబంధంవల్లకాదు; ఆర్ధిక స్థితిగతులవల్ల. పొరపాటు ఒకచోట జరిగితే మనం నేరాన్ని మరో చోట మోపుతున్నాం. ఇప్పుడు పురుషులకు వున్నంత విస్తృతంగా మహిళలకూ ఉద్యోగాలు వుంటే, ఇప్పుడు పురుషులకు వున్నంతగా  మహిళలకూ సంపద మీద ఆధిపత్యం వుంటే అప్పుడు విడాకుల ప్రభావం స్త్రీపురుషుల మీద సమానంగా వుంటుంది.

                 వర్తమాన సమాజంలోనూ విడాకుల ప్రభవం పేద, మధ్యమ ధనిక తరగతుల మీద ఒకే విధంగా వుండదు.  మూడు వర్గాలకూ మూడు పరిష్కారాలు చూడాలి. అంతే తప్ప, అన్ని వర్గాలను కలగాపులగం చేసేస్తే  ఎప్పటికీ పరిష్కారం దొరకదు.
                 నిరాస్తి సమూహాల్లో విడాకుల ప్రభావం స్త్రీపురుషులు ఇద్దరి మీదా దాదాపు సమానంగా వుంటుంది.  దీన్ని ఆస్తి సమూహాలకు సహితం వర్తింపచేయాలి. విడాకుల గురించి ధనికవర్గాలు  పెళ్ళి సమయంలోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. పైకి భారీగా కోట్ల రూపాయల వరకట్నం ఇచ్చినట్టు కనిపించినా పెళ్ళి సమయంలో నగదు, బంగారం రూపాల్లో అల్లుడికి ఇచ్చేది చిన్న వాటా మాత్రమే. మిగిలినదంతా కుమార్తె పేరు మీద రాసేస్తారు. అత్యధిక కేసుల్లో స్త్రీధనం భద్రంగానే వుంటుంది కనుక  విడాకులవల్ల వాళ్ళు రోడ్డునపడే స్థితి వుండదు. ముస్లింలు వివాహ సమయంలో మహర్ ప్రకటిస్తారు. కొందరు పెళ్ళి కాగానే  భార్య పేరున కొంత ఆస్తి రాస్తారు. (మా నాన్న 1948లో మా అమ్మ పేరున ఒక ఇల్లు రాశారు. ఆ సాంప్రదాయం ప్రకారం నేను కూడా నాకు పెళ్లయిన కొత్తలో నాకున్న సమస్త స్థిరాస్థిని నా భార్య పేరున రాసేశాను.) విడాకుల్ని రద్దు చేయాలనే ఆలోచనలు చేసే సమాజాన్ని వెనక్కు మళ్ళించే పనులు చేయడంకన్నా, విడాకులవల్ల జరిగే నష్టాన్ని నివారించే కార్యక్రమాలు చేపడితే సమాజానికి మేలు జరుగుతుంది.

                 వర్తమాన సమాజంలో విడాకులవల్ల ఎక్కువగా  బాధపడుతున్నది మధ్యతరగతి స్త్రీలు. అక్కడ సామాజిక కార్యకర్తలు పని చేయాల్సిన అవసరంవుంది.

                 విడాకులవల్ల ఎక్కువగా నష్టపోయేది పిల్లలు. దీని నివారణోపాయాల్ని ఆలోచించడం అత్యవసరం. మళ్ళీ దాని అర్ధం విడాకుల్ని రద్దు చేయమనికాదు. పిల్లల మీద తల్లిదండ్రుల బాధ్యత ఏమిటీ? అదెప్పుడు తీరుతుందీ? అనే అంశాన్ని తేల్చాలి. కనీసం పట్టభద్రుల్ని చేసే స్తోమత లేనివాళ్ళు పిల్లల్ని కనడానికి వీల్లేని విధంగా కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అలాగే, పట్టభద్రులు అయిన పిల్లల్ని ఇంటి నుండి పంపించేయాలనే నియమం కూడా చాలా అవసరం. జీవిత కాలం తల్లిదండ్రుల మీద పడి బతికేస్తున్న పిల్లల సంఖ్యా ఇప్పుడు చిన్నదేమీకాదు.

                 అంచేత సర్వకాల సర్వావస్థల్లో ఒకే నియమం పెట్టుకునే ధోరణి భావోద్వేగాలను సంతృప్తి పరుస్తుందేమోగానీ సమస్యను ఎప్పటికీ పరిష్కరించదు.
-----

No comments:

Post a Comment