Tuesday 31 July 2018

The slogan of Muslims – Communal Harmony

సామరస్యం ముస్లింల నినాదం
-        డానీ
భారత ఉపఖండంలో మతతత్త్వశక్తులు ముస్లిం వ్యతిరేక విషబీజాలను జాతియోద్యమ కాలంలోనే బలంగా నాటాయి. ఇటలీ, జర్మనీ దేశాల్లో 1920-40ల మధ్య కొనసాగిన ఫాసిస్టు, నాజీ భావజాలం దీనికి ప్రత్యక్ష అంతర్జాతీయ ప్రేరణ. ఆ విషబీజాలు విషవృక్షాలుగా మారి దేశ విభజనకు దారితీసింది.
భారత ఉపఖండంలో 1947లో  జరిగింది భౌగోళిక విభజనేగానీ మత విభజనకాదు. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ భూభాగంలో నివశిస్తున్న ముస్లింలేకాక, ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళిన ముస్లింలను కూడా కలుపుకున్నా భారతదేశాన్ని తమ మాతృభూమిగా విశ్వసించి ఇక్కడ వుండిపోవడానికీ, ఈ నేల మీద చనిపోవడానికీ నిర్ణయించుకున్న ముస్లింలే ఎక్కువ. ఈనాటికీ పాకిస్తాన్ జనాభాకన్నా భారత ముస్లింల జనాభా ఎక్కువ.
అయితే, దేశవిభజనను సాకుగా చూపెట్టి ముస్లింలను దోషులుగా చిత్రించడం మతతత్త్వశక్తులకు సులభం అయింది. బీజేపి అగ్రనేత లాల్ కిషన్ అడవాణిజీ  1990లో చేపట్టిన సోమనాథ్-అయోధ్య రామ్ రథయాత్రతో దేశంలో మతతత్త్వశక్తుల ఏకీకరణ  మొదలయింది. 2014లో నరేంద్రమోదీ – అమిత్ షాల జోడీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టడంతో  మతతత్త్వశక్తుల విజృంభణ దశ ఆరంభమయింది.
దైవభక్తులకు మతతత్త్వశక్తులకు రూపంలో ఒక అనుబంధం వున్నట్టు కనిపించినా సారాంశంలో ఎలాంటి సంబంధంలేదు. ఆ రెండు సమూహాలు పరస్పర విరుధ్ధమైనవి.  దైవభక్తులది అమాయకపు ధార్మిక చింతన మాత్రమే; మతతత్త్వశక్తులది ప్రరాళికబధ్ధ రాజకీయార్ధిక కుట్ర.
దేశ ప్రజలకు దేశ సహజ వనరుల మీద వుండే సహజ హక్కును నిరాకరించి ఆ సంపదను  కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం మతతత్త్వశక్తుల ప్రధాన ఆర్ధిక  కార్యక్రమం. చేతిలో రాజకీయాధికారంలేకుండా ఈ పనిని అవి చేయలేవు. అంచేత, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవి మెజార్టీ మత సమూహాన్ని ఒక కవచంగా వాడుకుంటాయి.
మతతత్త్వశక్తులు అవలంభించే ఆర్ధిక విధానాలవల్ల దేశ సంపద అంతా కొన్ని కార్పొరేట్ల ఆధీనంలోనికి వెళ్ళిపోతూ వుంటుంది; మరోవైపు  దేశంలోని విశాల ప్రజానీకం నిరుపేదలుగా మారిపోతుంటారు. దీనితో, అత్యంత సహజంగానే మెజార్టీ మతంలోని సామాన్య ప్రజానీకం సహితం మతతత్త్వశక్తుల రాజకీయార్ధిక విధానాలను వ్యతిరేకించడం మొదలెడుతుంది. మొదట్లో ఆదివాసీలు, దళితులు తిరగబడతారు. క్రమంగా పెత్తందారీ కులాల్లోని సామాన్య ప్రజలు, ఆ తరువాత  పాలకవర్గంగా భావించే బ్రాహ్మణ-బనియా వర్ణాలలోని నిరుపేదలు సహితం తిరుగుబాటు బాట పడతారు.
ఇలా స్వీయ సామాజికవర్గమే తమ మీద తిరుగబడుతుందని మతతత్త్వశక్తులకు ముందుగానే తెలుసు. అలనాటి ఇటలీ, జర్మనీల్లో కూడా  ముస్సోలినీ, హిట్లర్ ల  మీద స్వీయ సామాజికవర్గమైన క్రైస్తవ సమూహం సహితం తిరగబడింది. ముస్సోలినీని తుపాకితో కాల్చి, ఒంటిమీద తోలు తీసి బహిరంగ ప్రదేశంలో కొక్కేలకు వేలాడగట్టింది. హిట్లర్ నూ అదే కుక్కచావు వెంటాడింది. వేగంగా సమీపిస్తున్న చావును చూసి భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
మొత్తం దేశ సంపదను కొన్ని మెగా కార్పొరేట్లకు కట్టబెట్టే తమ విధానాల మీద స్వీయసామాజికవర్గం నుండి సహితం వ్యతిరేకత వస్తుందని మతతత్త్వశక్తులకు ముందే తెలుసు. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవి మెజార్టి మతసమూహాన్ని ముందుగానే మైనారిటీ మతసమూహం మీదికి ఉసి గొల్పుతాయి. మైనారిటీ మతసమూహం వుండడంవల్లే దేశంలోని మెజార్టి మతసమూహం పేదరికంలో వుంటున్నదనే వాదన మొదలు, అసలు మైనార్టీల మతాలవల్ల మెజారిటీ మతమే అంతరించిపోతున్నది అనేంత వరకు ఆ బూటకపు ప్రచారం సాగుతుంటుంది. దీనితో దేశంలో మెజారిటీ మతసమూహంలోని సామాన్య ప్రజానీకం ఒక అసహనానికి గురవుతుంది. తమ మీద సాగుతున్న ఆర్ధిక అణిచివేతకు కారణమయిన  మతతత్త్వశక్తుల మీద తిరుగుబాటు చేయాల్సిన సమయంలో, మెజారిటీ  మతసమూహంలోని సామాన్య ప్రజానీకం,  మైనార్టీ మత సమూహం మీద వ్యతిరేకతను పెంచుకుంటుంది.  ఇది సహజంగానే మైనార్టీ మత సమూహానికి ప్రాణసంకటంగా మారుతుంది.
అసహన వాతావరణానికి బలయిపోతున్న మైనార్టీ మత సమూహంలోని  కొందరు నిరాశ నిస్పృహ  మనోవైఫల్యం (Frustration), పిరికితనాలతో  కొన్ని ప్రతిదాడులు చేస్తారు. అదే మైనారిటీ ఉగ్రవాదం. ఏ దేశంలో అయినా మెజారిటీ ఉగ్రవాదానికి ప్రతిచర్యగానే మైనారిటీ ఉగ్రవాదం పుడుతుంది. అయితే, ప్రచార మాధ్యమాలు మొదలు వున్నత న్యాయస్థానాల వరకు మైనారిటీ ఉగ్రవాద చర్యల్ని  కప్పిపుచ్చి వాటికి ప్రతిచర్యగా సాగే మైనారిటీ ఉగ్రవాద చర్యల్ని మాత్రమే ప్రచారం చేస్తాయి.  దేశ సహజవనరుల్ని కొల్లగొట్టి అత్యంత సంపన్నుడుగా మారిన ముఖేష్ అంబానీ యే ఇప్పుడు దేశంలో అత్యంత భారీ మీడియా సంస్థకు  అధినేతగా మారినపుడు మీడియా ‘మోడియా’గానే వ్యవహరిస్తుంది.  
భౌతికశాస్త్రంలో చర్యకు ప్రతిచర్య వుంటుందనే సిధ్ధాంతం సమర్ధనీయం కావచ్చేమోగానీ సమాజశాస్త్రంలో మెజార్టీ ఉగ్రవాదానికి మైనార్టీ ఉగ్రవాదం ప్రతిచర్య అనే సిధ్ధంతం ఎన్నడూ సమర్ధనీయంకాదు. ఉగ్రవాదం మైనారిటీలను ఆత్మవినాశనానికి దారితీస్తుంది. మైనార్టీ మత సమూహం నిరంతరం మతసామరస్యం,  ప్రజాస్వామిక సాంప్రదాయాలు విలువలకే కట్టుబడివుండాలి. ప్రజాస్వామిక వ్యవస్థకు నాలుగు మూల స్థంభాలయిన న్యాయ, శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలన్నీ పూర్తిగా కలుషితమైపోయిన యుగంలో మతసామరస్యం,  ప్రజాస్వామిక విలువల పునరుధ్ధరణకు పూనుకోవడం దుస్సాహసంగానే కనిపిస్తుంది.  కానీ, ఆ లక్ష్యం కష్టసాధ్యమేగానీ  అసాధ్యం ఏమీకాదు.
మతసామరస్యం అనేది సమాజంలో కొందరికి  ఇష్టము, అభిమానము, తపన, సరదా వగయిరాలు కావచ్చు కానీ మైనార్టీలకు అది జీవికను  కాపాడుకునే ఏకైక మందు;  అసహనంతో రగిలిపోయే సమాజానికి అందుబాటులోవున్న ఏకైక చికిత్స. మతసామరస్యం మైనార్టీల నినాదం; మతతత్త్వ శక్తులతోనే వారికి వివాదం. వర్తమాన భారత ముస్లింలకు రెండే కర్తవ్యాలు; మతసామరస్య ఆరాటం; మతతత్త్వశక్తులతో పోరాటం.
దేశంలో మతతవశక్తులతో పోరాడేవాళ్ళు ముస్లింలు ఒక్కరేకాదు. క్రైస్తవులు, శిక్కులు, ఆదివాసీలు, దళితులు, బహుజనులు, సామ్యవాదులు, సౌమ్యవాదులు, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, లౌకికవాదులు, మానవహక్కులు-పౌరహక్కుల కార్యకర్తలు సహితం తమతమ పరిధుల్లో మతతవశక్తులతో పోరాడుతూనే వుంటారు. వాళ్లందరి మధ్య అనేక విబేధాలూ వుంటాయి. ఆ విబేధాలకు దూరంగా అందర్నీ కలుపుకునిపోవడం, అందరితో కలిసి పనిచేయడం ముస్లింల చారిత్రక కర్తవ్యం.
అయితే, సామాజిక రంగంలో ప్రజాసంఘాలతో కలిసి పనిచేసినంత సులువుకాదు రాజకీయరంగంలో పని చేయడం. ప్రజాసంఘాలు కార్యక్రమాలు,  విధానాల ప్రాతిపదికగా కలిసి పనిచేస్తుంటాయి. రాజకీయ పార్టీల కలయికకు  కార్యక్రమాలు, విధానాలకు మించి రాజ్యాధికారం అనేది ఒక కీలక అంశంగా వుంటుంది. అందువల్ల, ఒకే రకమైన ఆశయాలు, విధానాలున్న రాజకీయ పార్టీలు సహితం కలిసి పనిచేయకపోగా పరస్పరం  శత్రువర్గాల్లా పోటీ పడుతుంటాయి.
అయితే, మైనార్టీ ప్రజాసంఘాలకు తమదైన ఒక స్పష్టమైన కొలమానం వుండాలి. ముందుగా ఎవరితో ఘర్షణ,  ఎవరితో ఐక్యత తేల్చుకోవాలి. మతతత్త్వశక్తుల రాజకీయ పార్టీలతోపాటూ ఎన్నికల్లో వారితో పొత్తులు పెట్టుకునే రాజకీయ  పార్టీలతో కూడా రాజకీయాల్లో మైనార్టీలకు ఘర్షణ వుంటుంది; వుండాలి. కానీ, ఏ రాజకీయ పార్టీతో ఐక్యత వుండాలి అనేది   అంత సులువుగా తేలే వ్యవహారంకాదు. ఇది ముస్లిం ఆలోచనాపరుల్లో వ్యూహకర్తలు లేకపోవడవల్ల తలెత్తిన సమస్యకాదు; రాజకీయ పార్టీల్లో విధానపరమైన నిజాయితీ లేకపోవడంవల్ల కొనసాగుతున్న సమస్య.  మతతత్త్వశక్తుల రాజకీయ పార్టీలతో ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జతకట్టని పార్టీ పార్లమెంటరీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో దాదాపు లేదు. కుళ్ళిపోయిన టమాటాల బుట్టలోంచి సగమైనా బాగున్న కాయల కోసం  వెతుకులాట తప్పదు.  
( రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ : 9010757776

రచన : విజయవాడ, 18 జులై 2018
ప్రచురణ : మనతెలంగాణ, 31 జులై 2018

No comments:

Post a Comment