తెలంగాణ ఉద్యమంలో కొత్త దశ ఆరంభమైంది. ఇప్పటి వరకు హోరెత్తించిన రాజకీయ అంశం కొంచెం వెనక్కితగ్గి, సామాజిక అంశం కొంచెం ముందుకు వచ్చింది. భౌగోళిక తెలంగాణవాదం పక్కన సామాజిక తెలంగాణవాదం వచ్చి చేరింది.
అస్తిత్వవాదం - ఉప అస్తిత్వవాదం
అస్తిత్వవాద ఉద్యమాలు, ఏదో ఒక దశలో, ఉప-అస్తిత్వవాద ఉద్యమాలుగా మారడం సహజం, అనివార్యం. ఇప్పటి తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో, కొంచెం ఆలస్యంగానైనా, సామాజిక చర్చ మొదలైంది. వన్యసీమవాదం, ఎస్సీల వర్గీకరణ డిమాండ్, సామాజిక తెలంగాణ ఒప్పందం ప్రతిపాదన మొదలైనవన్నీ ఈ క్రమంలో ఒక ఆరంభం మాత్రమే. ముందు ముందు అనేకానేక ప్రజాసమూహాలు తమ ఉనికి కోసం అనేక డిమాండ్లతో ముందుకు వస్తాయి. భౌగోళిక తెలంగాణవాదం, అధికార మార్పిడితో ఆగిపోయే ప్రమాదముందని గుర్తించిన కొద్దీ సామాజిక తెలంగాణవాదం మరింతగా బలాన్ని పుంజుకుంటుంది.
ఏ ఉద్యమమైనా, ఉధృతంగా సాగుతున్నప్పుడు అనేక సామాజిక, ఆర్దిక సమూహాలు తమ తమ అస్తిత్వాల కోసం చురుగ్గా మారుతాయి. ఎవరికివారు తమ విముక్తి కోసమే ఉద్యమం సాగుతోందని నమ్ముతారు. ఉద్యమ నాయకత్వం కూడా అలాంటి భ్రమల్ని ఉధృతంగా ప్రచారం చేస్తుంది. తమ సమూహపు ప్రయోజనాల్ని సమస్త సమూహాల ప్రయోజనాలుగా ప్రచారం చేయగలిగినవారే నాయకులుగా కొనసాగగలరనే సూత్రం అన్ని ఉద్యమాల్లోనూ పనిచేస్తుంది. అంతిమంగా ఉద్యమ ఫలాలు మాత్రం కొన్ని సమూహాలకు మాత్రమే దక్కుతాయి. పాత పాలకవర్గాల స్థానంలో కొత్త పాలకవర్గాలు ఆవిర్భవిస్తాయి. అలాంటి అధికార మార్పిడిలో, ఉద్యమ ఫలాల్ని దక్కించుకున్న సమూహాలు, మిగిలిన సమూహాల అస్తిత్వాన్ని క్రూరాతిక్రూరంగా అణిచివేస్తాయి. ఆనుమానం వున్నవాళ్ళు, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం నాటి పరిణామాల్ని ఒకసారి పరికించాల్సి వుంటుంది.
హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటే బల్దియా-అత్రాఫ్బల్దియా, తెలంగాణ మాత్రమేకాదు. నిజాం సంస్థానంలో మరాఠా, కన్నడ ప్రాంతాలు కూడా వుండేవి. ఇప్పుడెవరూ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవడంలేదుగానీ, 1956లో జరిగింది ఆంధ్రా, తెలంగాణ, బల్దియా-అత్రాఫ్బల్దియాల విలీనం మాత్రమేకాదు, హైదరాబాద్స్టేట్విభజన కూడా!
1946 నుండి 1951 వరకు సాగిన హైదరాబాద్ అంతర్యుధ్ధంలో కూడా అనేక అస్తిత్వవాదాలు క్రియాశీలంగా పనిచేశాయి. ఆ ఐదేళ్ల అంతర్యుధ్ధాన్ని ఒక్కో అస్తిత్వ సమూహం, ఒక్కో పేరుతో పిలిచింది; పిలుస్తూనేవుంది.
1. ఆర్యసమాజ్/ సంఘ్పరివారానికి అది (ముస్లింలపాలన నుండి) విమోచన.
2. కాంగ్రెస్కు అది (భారతదేశంలో) విలీనం.
3. ఆంధ్రమహాసభకు అది వెట్టి నిర్మూలనా ఉద్యమం.
4. కమ్యునిస్టులకు అది సామ్యవాద సమాజం కోసం సాగిన పోరాటం.
5. మహారాష్ట్రులకు అది ఐక్య మహారాష్ట్ర ఉద్యమం.
6. కన్నడిగులకు అది కన్నడరాజ్య ఏకీకరణ ఉద్యమం.
7. ముస్లింలలో నిజాం సమర్ధకుల నుండీ తీవ్ర వ్యతిరేకుల
వరకు వున్నారు.
8. మరొకరికి అది మరొకటి!. ఇంకొకరికి అది ఇంకొకటి!
హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో ఐదేళ్ల అంతర్యుధ్ధానికి సంబంధించి కాంగ్రెస్, సంఘ్పరివార్, కమ్యూనిస్టుల వాదాలే ఇప్పుడు విశేష ప్రచారంలో వున్నాయి. వాటికి సంబంధించి వేలాది రచనలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో వున్నాయి. నాటి మహారాష్ట్రులు, కన్నడిగుల వాదాలు ఇప్పుడు రాజకీయ ప్రాసంగికతను కోల్పోయాయి. కానీ, నాటి నిజాం సంస్థానంలోనేకాక, నేటి ఆంధ్రప్రదేశ్లోనూ ఒక ప్రధాన సాంఘీక శక్తిగావున్న ముస్లింలు ఆ పోరాటాన్ని అప్పుడు ఏమనుకునేవారో, ఇప్పుడు ఏమనుకుంటున్నారో బయటి ప్రపంచానికి దాదాపు తెలియదనేచెప్పాలి. ముస్లింలు సహితం ప్రాణాలొడ్డి నిజాం వ్యతిరేక పోరాటం చేశారంటే నమ్మలేనంతగా వాస్తవాలు సమాధి అయిపోయాయి.
ముస్లిం సమాజం
ఉద్యమకాలంలో, సంస్థానంలోని ముస్లిం సమాజంలో స్పష్టంగానే, నిట్టనిలువు విభజన వచ్చింది. ఒకవర్గం, నిజాం డొమెనియన్ స్టాటస్‌ను సమర్ధించాలనుకుంది. ఇందులో కూడా మితవాదులు, అతివాదులు ఉన్నారు. ఈ వర్గంలోని అతివాదులే అత్యంత వివాదాస్పద రజాకార్లు. నిజాం వ్యతిరేకవర్గంలోనూ మూడు శాఖలున్నాయి. ఒక శాఖ నిజాం డొమెనియన్లోనే రాజరిక వ్యవస్థను కూల్చి ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలనుకుంది. రెండోశాఖ, రష్యా తరహా సోషలిస్టు వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. మూడోశాఖ, నిజాం సంస్థానాన్ని ఇండియన్యూనియన్లో విలీనం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించాలనుకుంది.
సంస్థానంలో సాగిన అంతర్యుధ్ధంలో తొలి అమరుడు షేక్బందగీ. చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఒక కోణంలో చూస్తే, అంతర్యుధ్ధానికి ఆరంభమూ, అంతమూ ముస్లింలే. ఇందులో విషాదం ఏమంటే, నిజాంను అడ్డంగా సమర్ధించిన అల్లరి మూకలు రజాకార్లకూ, వాళ్లకు ఓ పది నెలలపాటు నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీకి దొరికినంత విస్తృత ప్రచారం, నిజాం రాజరిక వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించిన ప్రజాస్వామిక ముస్లింలకు దక్కలేదు. షోయబుల్లా ఖాన్ గురించి కొందరికైనా తెలియడానికి యాభై యేళ్ళు పట్టింది. అతనికి విగ్రహం పెట్టడానికి అరవై మూడేళ్ళు పట్టింది!
పెత్తందారీ కులాల ఐక్యత
సంస్థానంలో వెట్టి చాకిరీకి వ్యతిరేక పోరాటం ఉధృతంగా సాగుతున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతపు కమ్యూనిస్టు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణకు వచ్చి, అందులో పాల్గొన్నారు. అయితే, జాగీర్దారులు, దేశ్ముఖులు, పటేళ్ళు, పట్వారీలు, దొరలపై కమ్యూనిస్టు గెరిల్లాలు దాడులు మొదలెట్టడంతో సన్నివేశం మారింది. డ్రాగన్ ను చూడాలని పరితపించిన చైనా యువరాజు, తీరా ఆ డ్రాగన్ తనంతట తానుగా రాజప్రసాదానికి వస్తే, దాన్ని చూసి మూర్చపోయినట్టు, గెరిల్లా చర్యల్ని చూసి పెత్తందారీ కులాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు భయంతో వణికిపోయి, పోరాటానికి ద్రోహం చేశారని ఆంధ్రా నక్సలైట్ పితామహుడు కొండపల్లి సీతారామయ్య అనేక సందర్భాల్లో నాటి సన్నివేశాన్ని వివరించేవారు.
నిజాంను గద్దే దించి, తాము అధికారాన్ని చేపట్టాలని హిందూ పెత్తందారీ కులాలు ఆశించాయి. అయితే, ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరిన దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, భిన్నవృత్తులవాళ్ళు, ముస్లింలు సహితం 'రాబోయే అధికారంలో న్యాయమైన భాగస్వామ్యం' కోరడం వాళ్లకు నచ్చలేదు. అలాంటి కోరికలు తమ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమని పెత్తందారీ కులాలు భావించాయి. మరోవైపు, ఉత్సాహంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు గెరిల్లా దళాలు నిజాంనేకాక, తమనూ పక్కకు గెంటేస్తాయనే భవిష్యత్తు చిత్రపటం వాళ్లకు స్పష్టంగానే అర్ధమయిపోయింది.
కమ్యూనిస్టు గెరిల్లాల ఉత్సాహాన్ని చూసి కమ్యూనిస్టేతర పెత్తందారీ కులాలవాళ్ళు భయపడిపోయినట్లే, కమ్యూనిస్టు పార్టీల్లోని పెత్తందారీ కులాలవాళ్ళూ భయపడిపోయారు. పెత్తందారీ కులాల భయానికి ఆంధ్రా, తెలంగాణ, కన్నడ, మహారాష్ట అనే ప్రాంతీయ విబేధాలు అడ్దం రాలేదు. అప్పటికి, తెలంగాణ ప్రాంతంలో మాత్రమే బలంగావున్న కమ్యూనిస్టు గెరిల్లాలు తమ ప్రాంతానికి కూడా విస్తరించక ముందే జాగ్రత్తపడాలని మహారాష్ట్రులు, కన్నడిగులు భావించారు. అప్పటి ఆర్యసమాజ్కు, కాంగ్రెస్కు కూడా మహారాష్ట్రులు, కన్నడిగులు అగ్రనాయకులుగా వుండడం వాళ్లకు కలిసొచ్చిన అంశం! దానితో నిజాం సంస్థానంలో రాజకీయ సవిూకరణలు మారిపోయాయి. ఆర్యసమాజ్, కాంగ్రెస్తో పాటూ, అన్ని సంఘాలు, పార్టిల్లోని పెత్తందారీ కులాలవాళ్ళు ఏకమైపోయారు. కమ్యూనిస్టు గెరిల్లాలు, కార్యకర్తలతోపాటూ, ప్రజాస్వామిక ముస్లింలు ఒంటరివారైపోయారు.
స్వామి రామానంద తీర్ధ
మరాఠా కుటుంబంలో పుట్టి, కన్నడ ప్రాంతంలో పెరిగి, బొంబాయి వెళ్ళి ఎన్. యం. జోషి వంటి కమ్యూనిస్టులతో కలిసి కార్మిక సంఘాల్లో పనిచేసి, చివరకు ఆర్యసమాజికునిగా మారి, నిజాం సంస్థానానికి చేరుకుని, కాంగ్రెస్కు నాయకత్వం వహించిన వ్యంకటేష్ భగవాన్‌రావు ఖేల్గీకార్ అనే స్వామి రామానంద తీర్ధ తిరుగుబాటు చివరిదశలో అధికారమార్పిడికి రూపశిల్పిగా మారారు. స్వామి రామానంద తీర్ధ అనేకాదు, ఆరోజుల్లో, నిజాం సంస్థానంలోని ప్రతి ప్రముఖ రాజకీయ కుటుంబంలోనూ ఆర్యసమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టు సభ్యులు వుండేవారు. దానితో, వివిధ సంఘాలు, పార్టీల్లోన్ని పెత్తందారీ కూలాల మధ్య 'భవిష్యత్ అవగాహన' ఏర్పడడానికి మార్గం మరింత సులభమయింది.
కొత్త సవిూకరణ, కొత్త అవగాహనలో భాగంగా, ఒక్కో శ్రేణి నాయకత్వం ఒక్కో పాత్ర నిర్వహించింది. కాంగ్రెస్నాయకులు 'ప్రతిపాదిత హైదరాబాద్డొవిూనియన్' పై పోలీస్ (సైనిక) చర్య తీసుకోవాలని ఇండియన్ యునియన్ను ఆహ్వానించారు. నిజాం విూర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దె దిగీ దిగగానే, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సాయుధపోరాట విరమణ ప్రకటించింది. సంస్థానంలో ముస్లింల పాలనను అంతంచేసి, హిందువుల పాలనను నెలకొల్పాలన్న ఆర్యసమాజ్ఆశయాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు సమిష్టిగా నెరవేర్చారు. స్వామి రామానంద తీర్ధకు 'రెండవ ఛత్రపతి శివాజీ' అనే బిరుదు వచ్చింది.
నెహ్రూ - ముస్లిం సెంటిమెంటు
ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్ను 1948 ఆగస్టు 22 రాత్రి రజాకార్లు క్రూరంగా చంపేసి, అతని చేతులు నరుక్కుపోయారు. ఈ వార్త విని చలించిపోయిన జవహర్లాల్ నెహ్రు నిజాంపై పోలీసు చర్యకు పచ్చ జెండా ఊపారు. సెప్టెంబరు మొదటి వారంలోనే భారత సైన్యం పశ్చిమాన షోలాపూర్కు, తూర్పున విజయవాడకు చేరుకుంది. సరిగ్గా ఆ సమయంలో, పాకిస్తాన్లో మహమ్మదాలీ జిన్నా ఆరోగ్యం విషమంగా మారింది. 'ముస్లిం సెంటిమెంటు'తో పోలీసు చర్యను నెహ్రు కొన్ని రోజులు వాయిదా వేశారు. సెప్టెంబరు 11న జిన్నా చనిపోయారు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 12 న జరిగాయి. పోలీసు యాక్షన్సెప్టెంబరు 13 ఉదయం అరంభమైంది.
ఐదు రోజుల నామమాత్రపు ప్రతిఘటన తరువాత సెప్టెంబరు 17న నిజాం సైన్యం భారత సైన్యం ముందు మోకరిల్లింది. నవాబ్ విూర్ ఉస్మాన్అలీ ఖాన్ స్వయంగా రేడియో స్టేషన్కు వెళ్ళి సంస్థానాన్ని ఇండియన్యూనియన్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. హైదరాబాద్కు స్వతంత్ర దేశంగా డొమేనియన్ హోదా ఇమ్మంటూ ఐక్య రాజ్య సమితి భద్రతామండలికి చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు.
నిజాం సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమైపోయి, అధికారం చేతులు మారడంతో, తిరుగుబాటుకు నైతిక మద్దతు నుండి రక్తం వరకు ధారబోసిన విభిన్న ప్రజాశేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కానీ, అధికారమార్పిడి జరిగినంత మాత్రాన కొత్త పాలకవర్గాలకు సంతృప్తి కలగదు. చేజిక్కించుకున్న అధికారం సుస్థిరంగా కొనసాగుతుందనే హావిూ కూడా వాళ్లకు కావాలి. అంతవరకు రాచరికపాలనను ద్వేషించిన తిరుగుబాటుదార్లు భవిష్యత్తులో భూస్వామ్య-పెట్టుబడీదార్లను కూడా ద్వేషించే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. భవిష్యత్తులో తలెత్తే తిరుగుబాట్లను మొగ్గలోనే తుంచేయాలంటే తమకు అధికారాన్ని కట్టబెట్టిన ఉద్యమకారుల్ని కూడా కర్కశంగా అంతం చేసేయాలని కొత్త పాలకవర్గాలు భావిస్తాయి. షోలాపూర్రెజిమెంట్కు నాయకత్వం వహించిన కల్నల్నజినేంద్ర నాద్ ఛౌధరి ఆధ్వర్యాన ఏర్పడిన సైనిక ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్లో రెండేళ్ల పాటు నిర్వర్తించిన కర్తవ్యం ఇదే!
కమ్యూనిస్టుల్ని వేల సంఖ్యలో, ముస్లింలని లక్షల సంఖ్యలో చంపేశారు. తెలంగాణ పోరాటంలో వీరోచితంగా పోరాడింది బందగీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల సామాజికవర్గాలే! నైజాంపై విజయోత్సవాల్లో ప్రాణాలను బలిచ్చింది
కూడా వాళ్ల సంతతినే!
కమ్యూనిస్టులకు త్యాగాలే మిగిలాయి. కొత్త సమాజంలో వాటా దక్కలేదు. నిజాం సంస్థానంలోని ముస్లింలు రెండు విధాలా నష్టపోయారు. తొలి అమరుడిగా బందగీ పేరు నిలిచిపోయిందిగానీ, అతని మతానికి చెందిన పాలకూలూ పతనం అయిపోయారు, మేలైన జీవితాన్ని ఆశించిన ఆ జాతి ప్రజలు పాతబస్తీ అయిపోయారు. ఇలా ఏందుకు జరిగిందంటే, ఉద్యమంలో పాలకవర్గాలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో? ప్రజలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో? తెలియని ఒక రకం గందరగోళం ఏర్పడిన ఫలితమిది.
ఏ ఉద్యమంలో అయినాసరే, అంతిమంగా, పాత పాలకవర్గ ముఠాను తొలగించి కొత్త పాలకవర్గ ముఠా అధికారాన్ని చేపడుతుంది. కనుక, అస్తిత్వ ఉద్యమాల్లో పాలకవర్గ శ్రేణులు ఎమరుపాటుగా వున్నా వాళ్లకు వచ్చే నష్టం ఏవిూ వుండదు. కానీ, సువిశాల ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్య వహిస్తున్న వ్యక్తులు, సంస్థలు ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా, ఆ పొరపాటుకు కొన్ని తరాలు నష్టపోతాయి.
తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేయడాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నవారు, అప్పుడు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడాన్ని కూడా విమర్శిస్తారా? అనేది ఒక ఆసక్తికర సందేహం!
సాంస్కృతిక సంస్కరణలు
ఒక ఉద్యమం ముగియగానే సాంస్కృతిక సంస్కరణలు
మొదలవుతాయి. అంటే విజేతలకు అనుగుణంగా
ఉద్యమ చరిత్రను, సంస్కృతిని, ఘటనల్ని తిరగరాయడం అన్నమాట.
చారిత్రక ప్రముఖుల మీద మనకుండే దృక్పథం చారిత్రక దశలు
మారేకొద్దీ మారిపోతూ వుంటాయి. ఇది రెండు స్థాయిల్లో జరుగుతుంది. మొదటిది,
పాలకవర్గాల అంచనా, రెండోది ప్రజల అంచనా. సాధారణంగానే ఇవి రెండూ పరస్పర విరుధ్ధంగా
వుంటాయి.
ఒక దశలో
మహాపురుషులుగా నీరాజనాలు అందుకున్నవారు మరో దశలో విమర్శల్ని అందుకోవడం, లేదా ఒక
దశలో విమర్శల్ని ఎదుర్కొన్నవారు ఇంకో చారిత్రక దశల్లో నిరాజనాలు అందుకోవడమూ జరుగుతుంది. 1940-50 దశకాల్లో పోరాట వీరులుగా
ఒక వెలుగు వెలిగిన చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలను ఇరవై యేళ్ళ
తరువాత విప్లవ కమ్యూనిస్టులు తీవ్రంగా విమర్శించడం మనకు
తెలుసు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా అంతే 1947కు ముందు నిజాం మీద అంచనాలు వేరు. 1947-48 మధ్య కాలంలో నిజాం మీద
అంచనాలు వేరు. 1948 తరువాత నిజాం మీద
అంచనాలు వేరు. ఇప్పుటి అస్తిత్వ యుగంలో నిజాం
మీద అంచనాలు వేరు. చాలామందిలో ఈ చారిత్రక భౌతికవాద
దృక్పథం లోపిస్తున్నది.
తెలంగాణ పోరాటంలో విజేతలు పెత్తందారీ కులాలు
కనుక పోరాట కాలంలో వాళ్ళ సామాజికవర్గానికి చెందిన దేశ్ ముఖ్
లకు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని ప్రఛ్ఛన్నంగా నిషేధిస్తారు. ఆ పోరాటంలో
పరాజితులు ముస్లింలు కనుక వాళ్ళ
సామాజికవర్గానికి చెందిన నవాబు, ఇతర దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం
చేస్తారు. ఈ ప్రక్రియ అక్కడితో ఆగదు. పోరాట కాలంలో పెత్తందారీ సామాజికవర్గాలకు చెందిన దేశ్ ముఖ్ లకు వ్యతిరకంగా వచ్చిన సాహిత్యాన్ని
నవాబ్ కు వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యంగా మారుస్తారు. నవాబ్ స్వయంగా బందగీని కత్తితో
పొడిచి హత్య చేసినట్టో, చాకలి ఐలమ్మను దగ్గరుండి హింసపెట్టినట్టో కొత్త కథనాలు వచ్చేస్తాయి.
ఇలాంటి సాంస్కృతిక మార్పుకు గొప్ప ఉదాహరణ “బండెనక బండి కట్టి’ పాట. ఈ పాట కనీసం అరుసార్లు మార్పులకు గురైవుంటుంది.
స్థానిక దేశ్ ముఖ్ మీద ప్రజల ఆగ్రహాన్ని చిత్రిస్తూ
రాసిన ఈ పాట నిజాం నవాబు మీద ప్రజలు ఆగ్రహాన్ని చిత్రిచే పాటగా మారిపోయింది. ఈ పాటలో
ఏఏ మార్పులు ఏఏ దశల్లో చోటుచేసుకున్నాయో కొంచెం లోతుగా పరిశోధిస్తే పాలకవర్గంలో
ఆయా సందర్భాలలో మారిన సామాజిక సమీకరణల్ని అర్ధం చేసుకోవడం సులభమవుతుంది. చరిత్ర
అనేది ఎన్నడూ గతం కాదు. అది వర్తమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చరిత్ర అనేది
భవిష్యత్తు ఆకాంక్ష.
ఒక ఉద్యమానికి భౌగోళిక నామం పెట్టడంలోనే సామాజిక
దృక్పథం వుంటుంది. 1970ల నాటి నక్సలైట్ ఉద్యమంలో “జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ
పోరాటాలు వర్ధిల్లాలి” అనేవారు. కొందరు
“కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి” అనేవారు. అయితే, ఏ దశలోనూ తెలంగాణ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి” అనే
నినాదం రాలేదు. అంతకు ముందు శ్రీకాకుళం
గిరిజనుల పోరాటంలోనూ అలాగే జరిగింది. దాన్ని నక్సలైట్లతోసహా అందరూ “శ్రీకాకుళ
గిరిజన సాయుధ పోరాటం” అన్నారేగానీ,
ఉత్తరాంధ్ర గిరిజన సాయుధ పోరాటం
అనో, ఆంధ్రా గిరిజన సాయుధ పోరాటం అనో అనలేదు.
నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో సాగిన రైతాంగ సాయుధ పోరాటాలను
ఆ జిల్లాల పేరుతో పిలిచి వుండాల్సింది. బహుశ దాని స్థాయిని పెంచడం కోసం తెలంగాణ
అని వుంటారు. ఆంధ్రా ప్రాంతపు రచయితలు, తెలంగాణ రచయితలు మాత్రమే గాక నిజాం
సంస్థానానికి చెందిన మఖ్ధూం మొహియుద్దీన్ వంటి వారు కూడా ఆ పోరాటాన్ని ‘తెలంగాణ’ పేరుతోనే
పేర్కొన్నారు. ఈ వ్యాసకర్త చదవలేదుగానీ, బహుశ ఆర్యసమాజ్ పుస్తకాల్లో దాన్ని నిజాం సంస్థానంలో
అంతర్యుధ్ధం అని రాసి వుండవచ్చు!.
విప్లవ సాహిత్యంలోనూ మత భావజాలం వుంటుంది. జననాట్యమండలి
అనేది ఒక విప్లవ కమ్యూనిస్టు పార్టీకి చెందిన సాంస్కృతిక వేదిక. మార్పులకు గురైన ‘బండెనక
బండి కట్టి’ పాటకు ప్రాణంపోసి విపరీతంగా ప్రచారం చేసింది ఈ సంస్థే. తెలంగాణలో ప్రజల వ్యక్తీకరణకు ప్రధాన రూపం పాట. నల్గొండ,
వరంగల్లు జిల్లాల రైతాంగ
సాయుధ పోరాట
కాలంలో కొన్ని వందల పాటలు పుట్టాయి. వాటిల్లో అత్యధిక భాగం స్థానిక
దేశ్ ముఖ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా రాసినవే. అన్ని పాటలు అందుబాటులో వుండగా జననాట్యమండలి
ఈ
ఒక్క పాటనే
ఎంచుకోవడానికి పని
చేసిన సామాజికవర్గ
దృక్పథం ఏమిటీ?
అన్నది ముఖ్యం.
విప్లవ కమ్యూనిస్టు
పార్టీలు కూడా విజేతల చరిత్రనే ప్రచారం చేశాయా? అనేవి ఎప్పటికయినా సమాధానం
రాబట్టాల్సిన ప్రశ్నలే.
రచన : 4 జులై 2012
ముద్రణ : (అముద్రితం)