మెజార్టీలూ మతోన్మాదుల బాధితులే !
డానీ
భారత ప్రజల
విజ్ఞతకు మహాపరీక్ష 2019 సాధారణ ఎన్నికలు. భారత ముస్లింలకు అయితే ఈ ఎన్నికలు జీవన్మరణ
సమస్య కాబోతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
జమిలీగా జరగబోతున్న రాష్ట్రం కనుక ఆంధ్రప్రదేశ్ ఈసారి జాతీయ రాజకీయాలకు ఒక నమూనా పరీక్షా
కేంద్రంగా మారబోతున్నది.
ఎన్నికల సమయంలో
అనేక సామాజికవర్గాలకు సాధారణంగా ప్రాంతీయ అంశాలే ప్రధానంగా పని చేస్తుంటాయి. అయితే,
జాతీయ అంశాలను కూడా పట్టించుకునే సామాజికవర్గాలు కొన్నుంటాయి. వాటిల్లో ముస్లిం సామాజికవర్గం
ఒకటి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోను చెప్పుకోదగిన ఉనికి వున్న సామాజికవర్గం కనుక ఎన్నికల్లో
ముస్లింలు ప్రాంతీయ అంశాలతోపాటూ జాతీయ అంశాలకు
కూడా సమాన ప్రాధాన్యం ఇస్తారు.
బీజేపి నేతగా
నరేంద్ర మోదీ ప్రధాని పదవిని స్వీకరించాక దేశంలో సామాన్య ప్రజల జీవిత స్థితిగతులు దుర్భరంగా
మారిపోయాయని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ, ముస్లింల జీవితాలు మరింత దయనీయంగా
మారిపోయాయి. ముస్లిమేతర సామాన్య ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ముస్లింలను
ఆర్ధిక ఇబ్బందులతోపాటూ ప్రాణ భయం కూడా వెంటాడుతోంది.
రాజకీయాల్లో
దాదాపు అందరూ అబధ్ధాలు చెపుతారు. నరేంద్రమోదీ కూడా అబధ్ధాలు చెపుతారు. అయితే వారు అబధ్ధాలు
చెప్పే నైపుణ్యం స్థాయిని పెంచి వ్యవస్థీకరించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న
నల్ల ధనాన్ని తెచ్చి భారత ప్రజలకు పంచుతానన్నది గత ఎన్నికల్లో మోదీ చేసిన ప్రధాన వాగ్దానం.
కోటి కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నదనీ దానిని తెచ్చి నూట పాతిక
కోట్ల మంది భారతీయులకు పంచితే ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంటులో 15 లక్షల రూపాయలు చొప్పున
ఊరికే జమ అవుతాయని ఎన్నికల ప్రచార సభల్లో మోదీజీ అన్నారు. తాను అధికారంలోనికి వచ్చిన వంద రోజుల లోపునే ఈ పని
జరిగిపోతుందన్నారు. జనం నమ్మినారు. మోదీజీ ప్రధాని అయ్యాక బ్యాంకు అకౌంట్లు తెరిచే
కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మొదలెట్టారు. ఆ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు ఎలాగూ
జమ కాలేదు. పైగా కనీసపు బ్యాలెన్స్ మొత్తాన్ని వుంచలేదనే కారణంతో ఆ పేద ఖాతాదారుల నుండి
బ్యాంకులు అపరాధ రుసుము పేరిట భారీగా డబ్బులు వసూలు చేశాయి.
ఇప్పుడు కమలనాధులు కొత్త కథనాలను వినిపిస్తున్నారు.
నల్ల ధనాన్నితెస్తే సగటున 15 లక్షల రూపాయలు
“వస్తాయి” అని మోదీజీ అంచనా వేసి చెప్పారే తప్ప తాను తెచ్చి ప్రజల ఖాతాల్లో జమ “చేస్తాను”
అనలేదని వారు అంటున్నారు. పైగా హిందీ భాష సరిగ్గా
రాకపోవడంవల్ల ప్రతిపక్షాలు తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాయని వాళ్ళు ఎదురు దాడికి దిగుతున్నారు.
మోదీ ప్రధాని
అయితే రూపాయితో డాలర్ మారకపు ధర 35-40 రూపాయలకు
పడిపోతుందని సుబ్రహ్మణ్యస్వామి, రవిశంకర్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. పెద్ద నోట్ల
రద్దుతో లీటరు పెట్రోలు ధర పది రూపాయలకు పడిపోతుందనీ, వంట గ్యాసును కుళాయిల ద్వార ఇంటింటికీ
ఉచితంగా సరఫర చేస్తారని సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం సాగింది. ఇప్పుడు పెట్రోలు, డాలరు
వంద రూపాయల మైలురాయిని చేరుకోవడానికి పరుగెడుతున్నాయి. మరోవైపు, జీయస్టీ దెబ్బ ప్రతి
పౌరుని మీద అదనపు భారాన్ని మోపింది.
నల్ల ధనాన్ని
కలుగుల్లోనే పట్టుకుంటామనే ప్రగల్భాలతో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు పథకం నల్ల ధనవంతుల్ని
తెల్ల మర్యాద పత్రాలతో సత్కరించింది. మార్కెట్లో
నగదుకు కరువొచ్చి చిరువ్యాపారులు, వృత్తి పనివాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ముస్లిం జనాభాలో
అత్యధికులు చిరువ్యాపారులు, తోపుడుబండ్లవాళ్ళు, వృత్తి పనివాళ్ళే గనుక పెద్ద నోట్ల రద్దు పథకం ముస్లింల ఆర్ధిక వ్యవస్థను
మరింతగా కుంగదీసింది. అసలు ముస్లింల ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయడానికే పెద్దనోట్ల రద్దు
పథకాన్ని రూపొందించారని సాగుతున్న ప్రచారం కూడా
కొట్టివేయదగిందేమీ కాదు. సంఘపరివారం పాలనలో బాధితుల్లో బాధితులు ముస్లింలు.
నికరంగా జరుగుతున్నదేమిటంటే ఆర్ధిక రంగంలో దేశ సహజ సంపదంతా ఆడానీ, అంబానీ వంటి కొన్ని
మెగా కార్పొరేట్ల ఖాతాలోనికి చేరిపోతోంది. అమిత్ షా కుటుంబ సంపద పెరిగింది. బిజెపి
ఆస్తులు భారీగా పెరిగాయి. సంఘపరివారానిది అంబా సాంస్కృతిక విధానం; అంబానీ అర్థిక విధానం
అంటే ఇప్పుడు ఎవరూ కాదనకపోవచ్చు.
ప్రభుత్వ ప్రాయోజిత
(క్రోనీ) పెట్టుబడీదారీ విధానం మన దేశంలో ఓ మూడూ దశాబ్దాలుగా కొనసాగుతూనే వుంది. ఈ
ప్రాయోజిత కార్యక్రమాన్ని సంఘపరివారం వుధృతంగా మార్చింది. ఐటి నిపుణులు, టెక్నాలజీ
దిగ్గజాలతో ఎర్పాటు చేసిన ‘ఐ టు వుయి’ చర్చా గోష్టిలో పాల్గొన్న ప్రధాని “కార్పోరేట్లను
తిట్టడం ఫ్యాషనైపోయింది” అని బాధపడ్డారు. దేశ సహజ సంపదను కొన్ని మెగా కార్పొరేట్లకు
ధారాదత్తం చేసి, మిగిలిన దేశ ప్రజల జీవితాలను
దుర్భరంగా మార్చేసిన ఘనత సంఘపరివారానిదే. దీని
కోసం దేశ రక్షణ వ్యవస్థతో సహా సిబిఐ, ఆర్ బిఐ,
ఐటి, ఇడీ, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం తదితర ప్రజాస్వామిక వ్యవస్థలు అన్నింటినీ మోదీజీ
భ్రష్టు పట్టించడాన్ని గత నాలుగున్నరేళ్ళలో దేశప్రజలంతా చూస్తున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ఏఏ పార్టీలున్నాయో సామాన్య
ప్రజలకు తెలీదు. బిజెపి మిత్రపక్షాలు అంటే సిబిఐ, ఆర్ బిఐ, ఐటి, ఇడీ, సుప్రీం కోర్టు,
ఎన్నికల సంఘం మరియూ మాంసం ఎగుమతిదారులే గుర్తుకు
వస్తున్నారు. మోదీజీ ‘మిత్రపక్షాల’ భయంతో దేశీయ మీడియా సహితం మోడియాగా మారిపోయింది.
అడ్డూ ఆపూ
లేకుండా సాగిపోతున్న ఈ అపచారం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి సంఘపరివారం మైనారిటీ
ద్వేషాన్ని రెచ్చగొడుతోంది. స్విస్ బ్యాంకులోని నల్లధనాన్ని మోదీజీ తెచ్చి తమకు
పంచుతారని నమ్మినట్టే, “భారతదేశంలో ముస్లింలు లేకుంటే వాళ్ళ సంపదతో
హిందువులు మరింత సౌఖ్యంగా బతకవచ్చు”
అని సాగుతున్న విద్వేష ప్రచారాన్ని కూడా చాలా మంది నమ్ముతున్నారు. దేశప్రజల్ని అలా
నమ్మించడాన్నే ఇటలీలో ఫాసిజం అనేవారు. జర్మనీలో
నాజిజం అనేవారు. దీనిని తెలుగులో ‘పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం’ అనవచ్చు. దీనికి
బాధితులు సామాన్య ప్రజలు. ఆ బాధితుల్లో బాధితులు మైనార్టీలు.
మోది ప్రధాని
అయ్యాక దేశంలో అసహన వాతావరణం విజృంభించింది.
గోగ్రవాదం పుట్టింది. ముస్లింల మీద మూక హత్యలు (మాబ్ లించింగ్) పెరిగిపోయాయి. ముస్లింలను
వేధించడానికి అనేక చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయి. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వానికి మతసామరస్యం ఒక్కటే విరుగుడు. అదే ఇప్పుడు ముస్లింలకు
ప్రాణరక్షణ ఔషధం.
రూపంలో ఫాసిజం
మైనార్టీలను మాత్రమే వేధిస్తున్నట్టు కనిపిస్తుందిగానీ, సారాంశంలో మెజార్టీలలోని సామాన్య
ప్రజలందర్నీ కూడా అది అణిచివేస్తుంది. ఫాసిజానికి తొలి బాధితులు మైనార్టీలేగానీ మలి
బాధితులు మెజార్టీలు. హిట్లర్ అలనాడు రష్యా
మీద ప్రత్యేక పగ పెంచుకున్నట్టు, ముస్సోలినీ ఆఫ్రికా ఖండం మీద కసిని పెంచుకున్నట్టు
ఇప్పుడు మోదీ-అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ మీద
ప్రత్యేక పగతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అందరూ ముస్లింలు కారు! ఫాసిజం-నాజీజంల అసలు ఎజెండాను తెలుసుకోవడానికి మెజార్టీ సామాజికవర్గానికి ఇటలీలో మూడు దశాబ్దాలు పట్టింది, జర్మనీలో రెండు
దశాబ్దాలు పట్టింది. భారతదేశంలో 2019 ఎన్నికలకు
ముందే మెజార్టీ సామాజికవర్గానికి ఈ అవగాహన
వస్తుందనీ ఆశిద్దాం.
పెట్టుబడీదారీ
మతతత్వ నియంతృత్వానికి తొలి బాధితులు వాళ్ళే
కనుక సహజంగా ముస్లింలే అందరికన్నా ముందుగా ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతారు.
ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో మైనార్టీలే నమ్మకమైన కాల్బలం.
(రచయిత సమాజ విశ్లేషకులు) మొబైలు – 9010757776
రచన : 27 అక్టోబరు 2018
ప్రచురణ : మనతెలంగాణ, 28 అక్టోబరు 2018
ప్రజాశక్తి,
28 అక్టోబరు 2018
"...ఇప్పుడు మోదీ-అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక పగతో రగిలిపోతున్నారు..."
ReplyDeleteప్రజలు ఓటుకు అమ్ముడుపోతున్నన్నాళ్ళు ఇది తప్పదు. ప్రజలలో మార్పు రావాలి.