సెక్షన్ 497 రద్దు - సమన్యాయం
-
డానీ
వివాహ
వ్యవస్థలోనే ఒక అణిచివేత వుంటుంది. సాంప్రదాయ
వివాహ వ్యవస్థలో పురుషులు యజమానులు అయితే మహిళలు శ్రామికులు. కొన్ని సందర్భాలలో వాళ్ల
స్థితి శ్రామికులకన్నా హీనం. వాళ్లను వస్తువుగా, సరుకుగా, జంతువులుగా పరిగణిస్తుంటారు.
కొన్ని మత సమూహాల వివాహాల్లో ధన, కనక, వస్తు, వాహనాల దానాలతో పాటు కన్యాదానాలు కూడా
చేస్తుంటారు. మరికొన్ని మత సమూహాల పెళ్ళిళ్లలో కన్యాదానాల వ్యవహారం ఒక లాంఛనంగా ప్రస్పుటంగా వుండకపోవచ్చుగానీ సారం
మాత్రం ఒక్కటే.
అణిచివేత
వున్నప్పుడు వాటి నుండి బయట పడే ప్రయత్నాలూ మొదలవుతాయి. వివాహ వ్యవస్థలోని అణిచివేత
అతి సహజంగానే వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది. వివాహ వ్యవస్థలో సాధారణంగా అణిచివేతకు గురయ్యేది స్త్రీలే. కనుక వివాహ వ్యవస్థ
నుండి బయటపడే అవసరం కూడా ముందుగా వాళ్ళకే వస్తుంది.
వివాహేతర
సంబంధాన్ని కొందరు అక్రమ
సంబంధం అంటుంటారు. అది సరికాదు. క్రమం, అక్రమం అనేది చట్టాలకు సంబంధించిన వ్యవహారం; అది మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన
అంశం కాదు. సమాజ బంధనాలకు అతీతంగా ఏర్పడే ప్రేమ బంధాలను కూడా చట్టం నియంత్రిస్తుంది.
అది సహజ న్యాయానికి విరుధ్ధం.
వయసు,
ఆలోచనల రీత్య పరిపకత్వత కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడే అనుబంధాలు లైంగిక సంబంధాలకు దారితీయడం
సహజమనే అవగాహన నాగరీక సమాజాలు అన్నింటిలోను
ఇప్పుడు పెరుగుతోంది. ఒక వ్యక్తి మీద ఇష్టాన్ని అభిమానాన్నీ వ్యక్తం చేయడానికి అత్యున్నత
మాధ్యమం సంభోగమే అనే భావనలూ బలంగా ముందుకు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా కొన్ని దేశాల్లో
చట్ట సవరణలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇంకా జరగాల్సి వున్నాయి. పరిపకత్వత కలిగిన
వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో సాగే లైంగిక సంబంధాలకు అడ్దంకిగా మారే చట్టాలున్న
దేశాల్లో భారత దేశం ఒకటి.
పరస్పర
అంగీకారంతో సాగినవైనా సరే వివాహేతర లైంగిక సంబంధాలను కొనసాగించిన పురుషుల్ని భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్
497 ప్రకారం చాలా తీవ్రంగా శిక్షించేవారు. ఐదేళ్ల
వరకు జైలు
శిక్షతోపాటూ భారీ జురిమాన విధించడానికి ఈ సెక్షన్ అవకాశం
ఇచ్చేది. వందల ఏళ్ల నాటి ఈ సెక్షన్ ను
సెప్టెంబరు 27న భారత సుప్రీం
కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. పరస్పర అంగీకారంతో సాగే వివాహేతర
లైంగిక సంబంధాలు నేరం కావనీ, మహా అయితే వాటిని పౌర తప్పిదాలు అనవచ్చనీ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
విచిత్రం ఏమంటే, వివాహ వ్యవస్థలో పాతివ్రత్యానికి
అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే భారత దేశంలో పరపురుషునితో లైంగిక సంబంధాన్ని
కొనసాగించే భార్యలకు చట్ట పరిధిలో శిక్ష లేదు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పురుషులకు విధిస్తూ వస్తున్న
శిక్షను రద్దు చేయడంతో సుప్రీం కోర్టు తీర్పు
ఒకవిధంగా సమన్యాయాన్ని ప్రసాదించింది
అనవచ్చు.
ఈ
సెక్షన్ 497లో మూడు అంశాలుండేవి.
అవి:
1. పరస్పర
అంగీకారంతో మరో పురుషునితో వివాహేతర
లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న
భార్యను భర్త మందలించలేడు. కోర్టులు శిక్షించలేవు.
2. భార్యతో
పరస్పర అంగీకారంతో వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న వ్యక్తిని సహితం భర్త మందలించగలడు; కోర్టులు శిక్షించ గలవు.
ఈ
రెండు క్లాజుల్లోనూ పురుషుడే శిక్షార్హుడు. స్త్రీలు ఈ చట్ట పరిధిలోనికి
రారు. వారికి ఈ రకం నేరము శిక్షల నుండి మినహాయింపు (Legal
Impunity) ఇచ్చారు.
న్యాయవ్యవస్త,
చట్టాలు మాయాసభ వంటివి. తీర్పు మనకు అనుకూలంగా వున్న సందర్భాలలోనూ ఆ తీర్పును అలా ఇవ్వడానికి
న్యాయమూర్తులు ఇచ్చే వివరణలు కొన్నిసార్లు మన భావాలకు పూర్తి విరుధ్ధంగా వుంటాయి. అలాగే
తీర్పు మనకు వ్యతిరేకంగా వున్న సందర్భాలలోనూ ఆ తీర్పును అలా ఇవ్వడానికి న్యాయమూర్తులు
ఇచ్చే వివరణలు కొన్నిసార్లు మన భావాలకు పూర్తి అనుకూలంగా వుంటాయి.
వివాహేతర
సంబంధాల కేసుల్లో స్త్రీలకు
శిక్ష నుండి మినహాయింపు
ఇవ్వడం పైకి మహత్తర విషయంగా కనిపిస్తుంది.
కానీ న్యాయ కోవిదులు ఒక దుర్మార్గమైన తర్కాన్ని రూపొందించారు.
బంగారాన్ని ఎవడయినా
దోచుకుపోతే కేసును దొంగ మీద పెడతారా? బంగారం మీద పెడతారా?
దొంగ మీదే పెడతారు?. ఇదీ అంతే. భార్య బంగారం వంటిది. బంగారం ఒక సరుకు. దానికి
వ్యక్తిత్వం వుండదు. మెదడే
వుండదు. పిచ్చివాళ్ళు, స్పృహలో లేనివాళ్ళు చేసే నేరాలకు శిక్షలు వుండవు. అలాగే
వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న స్త్రీలకు కూడా శిక్షలు వుండవు; వాళ్ళు ఆ పనుల్ని స్పృహలో
చేయరని దాని అర్ధం.
497
ప్రకారం తన భర్త మరో స్త్రీతో వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నా అతని మీద భర్య
కేసు పెట్టడానికి వీలు లేదు. భర్తలకు ఇలాంటి వెసులు ఇస్తే భార్యలకు అన్యాయం జరుగుతుందన్నది ఒక వాదన. భర్తలకు
ఈ వెసులుబాటు ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేమీ కాదు. ఈ చట్టం వచ్చినప్పటి నుండి వున్నదే.
భార్య తన భర్త ప్రియురాలి భర్తను కలిసి తన భర్త మీద సరుకు దొంగతనం కేసు పెట్టమని అడిగే
అవకాశం నిన్నటి వరకు వుండింది. అది ఇప్పుడు పోయింది.
వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న భార్యకు
శిక్ష నుండి మినహాయింపు ఇవ్వడానికీ, వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకున్న భర్త మీద
కేసు వేసే హక్కు భార్యకు లేకుండా చేయడానికీ ప్రాతిపదిక ఒకటే; సరుకు. సరుకును శిక్షించడం కుదరనట్టే, సరుకుకు కేసులు వేసే హక్కు కూడా వుండదు.
పురుషులకు
మెదడు వుంటుంది. ఆలోచనాశక్తి వుంటుంది. అందువల్ల
వాళ్ళు మెదడులేని, ఆలోచనాశక్తిలేని ఒక వస్తువుతో (వివాహిత
స్త్రీతో) వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడం నేరం. ఆ లైంగిక సంబంధం పరస్పర
అంగీకారంతో జరిగినా సరే అది నేరమే. మెదడు, ఆలోచనాశక్తి రెండూ లేని వాళ్లకు పరస్పర అంగీకారాన్ని తెలిపే స్తోమత వుండదు గనుక అది మతిస్థిమితం లేని స్త్రీ మీద అత్యాచారం చేయడం అవుతుంది. అందువల్ల ఆ పురుషుడిని
శిక్షించి తీరాలి అనేది ఈ చట్టం వెనుకవున్న
తర్కం.
ఈ
చట్టంలో మూడో క్లాజు కూడా వుంది.
3. ఒక
వివాహిత పురుషుడు యుక్త
వయసు గల ఒక అవివాహిత
స్త్రీతో పరస్పర అంగీకారంతో లైంగిక
సంబంధాన్ని పెట్టుకోవచ్చు. అది నేరం కాదు.
అంటే, పెళ్ళికి
ముందు మాత్రమే స్త్రీలకు మెదడు
వుంటుంది, ఆలోచనాశక్తి వుంటుంది. అయితే, వివాహం కాగానే స్త్రీ ఒక వస్తువు గా
తయారయ్యి, మరొకరికి ఆస్తిగా మారిపోయి మెదడును, ఆలోచనాశక్తిని కోల్పోతుంది అనేది ఈ చట్టం
లోని అంత:స్సూత్రం.
అవివాహిత,
వివాహిత మహిళలకు 497 చట్టం
ఇచ్చిన నిర్వచనాన్ని మహిళా సమాజం ఖండించిందా? లేక శిక్ష
నుండి తప్పించుకోవడానికి ఆ చట్టం ఇచ్చిన
మినహాయింపును ఆస్వాదించిందా? అనేవి కీలక
ప్రశ్నలు. చట్టంలో దాగున్న నిర్వచనాన్ని
వాళ్ళు ఏనాడో
ఖండించి, 'మతిలేనివాళ్ళు' అనే వంకతో తమను 'సరుకు'గా పరిగణించి ఇచ్చిన Legal Impumity వద్దని
తిరస్కరించి వుండాల్సింది. కానీ
అలా జరగలేదు.
తమకు
పురుషులతో సమానంగా
ఆలోచించే శక్తి వుంది
గనుక వివాహేతర సంబంధాల కేసుల్లో తమకు
కూడా పురుషులతో సమానంగా కారాగార
శిక్షలను విధించాలనో, లేకుంటే తాము వివాహేతర లైంగిక సంబంధాన్ని కొనసాగించినపుడు తమకు అందిస్తున్న Legal Impumityని
తమ భర్తలు వివాహేతర
లైంగిక సంబంధాన్ని కొనసాగించినపుడు కూడా అందించాలనో స్త్రీవాదులు కోరినట్టు
ఇప్పటి వరకు వెలుగు
లోనికి రాలేదు.
ఇద్దరు
వివాహిత స్త్రీపురుషులు లైంగిక కార్యకలాపాల్లో పరస్పర అంగీకారంతో పాల్గొన్నపుడే
అది వివాహేతర సంబంధం అవుతుంది.
పరస్పర అంగీకారం లేకపోతే అది
అసలు 497 కేసు
అవ్వదు; అత్యాచార నేరం అవుతుంది. అత్యాచార కేసుల్ని విచారించడానికి నిర్భయ
చట్టాలున్నాయి. వివాహేతర సంబంధాల్లో పాల్గొనే స్త్రీపురుషుల
సంఖ్య దాదాపు సమానంగానే వుంటుంది.
పరస్పర
అంగీకారంతో సాగిన
వివాహేతర లైంగిక సంబంధాల కేసుల్లో 1959 నాటి
నానావతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజా భారత నావికా దళ కమాండర్
కేయం నానావతి భార్య సిల్వియాతో వివాహేతర లైంగిక సంబంధాన్ని కొనసాగించాడన్నది అభియోగం. దానితో
ఆగ్రహించిన నానావతి తన సర్విస్ రివాల్వర్ తో ప్రేమ్ అహుజాను
కాల్చి చంపాడు. నిజానికి
సిల్వియా, ప్రేమ్ అహుజాల మధ్య పరస్పర
అంగీకారంతోనే వివాహేతర లైంగిక సంబంధం కొనసాగింది. నానావతిని వదిలి ప్రేమ్
అహుజాను పెళ్ళి
చేసుకోవాలని సెల్వియా అనుకుంది. అయినప్పటికీ, ప్రేమ్
అహుజాను నానావతి కాల్చి చంపడం శిక్షించదగ్గ
నేరం కాదని జ్యూరీ తీర్పు
చెప్పింది. (తరువాత
వేరే కోర్టు హత్యానేరం కింద నానావతికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం వేరే విషయం). మొన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో సెక్షన్ 497 చరిత్ర ముగిసింది.
పరస్పర
అంగీకారంతో సాగే వివాహేతర లైంగిక సంబంధాలు ఇక ముందు నేరం కానప్పటికీ విడాకులు తీసుకోవడానికి అవి ఒక ఆధారంగా పనికివస్తాయని
సుప్రీం కోర్టు చెప్పింది. ఎప్పుడయినాసరే దాంపత్యంలోని పౌర తప్పిదాలకు విడాకులే పౌర పరిష్కారం. వివాహేతర
సంబంధాలు, విడాకుల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఉదారంగా వ్యవహరిస్తున్న సమయంలోనే ముస్లింల
విడాకుల్ని శిక్షించదగ్గ నేరంగా పరిగణిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కేంద్ర ప్రభుత్వం
జారీ చేయడం విషాదకర మలుపు.
(రచయిత సీనియర్
జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ :
9010757776
రచన : 30 సెప్టెంబరు 2018
ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక 9 అక్టోబరు 2018
No comments:
Post a Comment