Falsifying Nizam
నిజాం మీద ఇన్ని అబధ్ధాలా?
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
తెలంగాణ ఉద్యమ నేత కేసిఆర్ కు ఉద్యమ కారణాలవల్లనో, వ్యక్తిగత ఆసక్తులవల్లనో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నచ్చివుండవచ్చు. అలాగే, సంస్థగత రాజకీయ కారణాలవల్లనో, వ్యక్తిగత ద్వేషాల కారణంగానో మరొకరికి నిజాం నవాబు నచ్చి వుండకపోవచ్చు. మనకు నచ్చనంత మాత్రాన అబధ్ధాలు రాయాల్సిన అవసరంలేదు. 'నిరంకుశ నిజాంకు ప్రశంసలా?" (ఆంధ్రజ్యోతి , 28 ఏప్రిల్ 2015) వ్యాసంలో దుగ్గినేని సత్యనారాయణరావు ఆలోచనలకన్నా అబధ్ధాలు ఎక్కువగా రాశారు.
1.
బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే, దానికి రెండు నెలల ముందే భారతదేశం లోని సంస్థానాలకు స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని వ్యాసకర్త దాచిపెట్టారు. భారత స్వాతంత్ర్య
చట్టం ప్రకారం భారత ఉపఖండంలోని సంస్థానాలకు మూడు ఆప్షన్లు వుండినాయి.
ఎ. స్వతంత్ర దేశంగా వుండడం.
బి. ఇండియన్ యూనియన్ లో విలీనం కావడం.
సి. పాకిస్తాన్ రిపబ్లిక్ లో విలీనం కావడం.
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటిదాన్ని ఎంచుకున్నాడు. అది అతనికి చట్టం
ఇచ్చిన ఛాయిస్; హక్కు.
అప్పటికి
సంస్థానంలో రజాకార్ల ఆగడాలు లేవు. సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసేస్తారనే
భయాలు వ్యాపించాక 1948 ఆరంభంలో ఒక నిస్పృహతో
రజాకార్ల ఆగడాలు మొదలయ్యాయి.
2.
ముందు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఎనిమిదేళ్ల తరువాత నిజాం-తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటుచేశారు. ఇటీవలి తెలంగాణా ఉద్యమం సాగిందే ఈ నిర్ణయంలోని తప్పును సరిదిద్దడానికి. ఈ పరిజ్ఞానం రచయితకు వున్నట్టులేదు.
3.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించినందుకు చాకలి ఐలమ్మను నైజాం పోలీసులు నరికారు అని సత్యనారాయణరావు రాశారు. చాకలి ఐలమ్మ పోరాటం చేసింది విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రా రెడ్డి మీద. ఆమె చనిపోయింది 1985లో. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పటికి 18 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. రామ్ గోపాల్
వర్మ సినిమాల్లో కనిపించే ఆత్మలు రచయితను
పూనినట్టున్నాయి. ఒకవేళ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆత్మ వచ్చి చాకలి ఐలమ్మను
చంపింది అనదలిచినా అది సినిమాటిక్ జస్టిఫికేషన్ కూడా అవ్వదు.
4.
'మా భూమి’ నాటకంలో ‘బండెనక బండి కట్టి...' పాట వుందనేది ఒక అబధ్ధం. ఆ పాటను నిజాం నవాబు మీద రాశారని చెప్పడం మరో అబధ్ధం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కార్యకర్త, ప్రజాకవి,
బండి యాదగిరి వేరే సందర్భంలో ఆ పాటను వరంగల్ జిల్లా దేశ్ ముఖ్ ఎర్రపాడు దొర జన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద రాశాడు. యాదగిరి పాటలో ఎక్కడా నిజాం నవాబు ప్రస్తావన లేదు. ఉద్యమ గాయకులు సాధారణంగా ప్రాంతీయ జానపద బాణుల్ని తీసుకుని తమ ఉద్యమానికి
అవసరమైన రీతిలో తిరగ రాస్తారు. అలా బండి యాదగిరి పాటకు కూడా ఒక మూలం వుంది. మూలం
లోని పాటను మల్లెల బీరప్ప రాశాడని అంటారు. బీరప్ప పాట పల్లవిలోని నాలుగో
పాదంలో ”బలిజొల్లా తిరుమలయ్య” వున్నదాన్ని “నా కొడక ప్రతాపరెడ్డి” అని
యాదగిరి మార్చాడు. బండి యాదగిరి రాసిన పల్లవి ఇది; బండెనక బండికట్టి / పదహారు బండ్లు కట్టి/ ఏ బండ్ల పోతవ్ కొడుకో / నా కొడక ప్రతాపరెడ్డి/.
5.
'మాభూమి' సినిమాలో వున్న ‘బండెనక బండి కట్టి పదారు బండ్లు కట్టి కట్టి’ అనే పాటను నక్సలైట్ కవి-గాయకుడు గద్దర్ రాసి పాడాడు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన దేశ్ ముఖ్ మీద తిరుగుబాటుగా
బండి యాదగిరి రాసిన పాటను సినిమాలో పెడితే సెన్సార్ ఇబ్బందులు వస్తాయని సంకోచించి, పాటలో “నా కొడుకో ప్రతాపరెడ్డి” అని వున్నచోటేల్లా “నైజాము సర్కరోడా!” అని మార్చేశారు. అప్పటి సినిమా
సెన్సార్ బోర్డులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ సభ్యుడు వున్నాడు. అతన్ని
మెప్పించడానికి చరిత్రను వక్రీకరించారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి
కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం దీనికి మరో కారణం. నిజాం నవాబు రోల్స్ రాయిస్ కారులో తిరుగుతాడుగానీ ఓ పదారు ఎడ్లబండ్లు కట్టుకుని హైదరాబాద్ నగర
వీధుల్లో తిరగడు అని పుర్రెలో కాసింత మెదడు అనే పదార్ధం వున్నవాడెవడికయినా అర్ధం అవుతుంది. దుగ్గినేని సత్యనారాయణరావుకు
ఆత్మల మీద నమ్మకం వున్నట్టు గద్దర్ కు ఆత్మల మీద నమ్మకం లేదు. కనీసం మాభూమి సినిమా
నాటికి లేదు. చనిపోయిన నిజాం నవాబు ఆత్మవచ్చి పరువునష్టం దావా వేయదనే ధైర్యంతో, హైదరాబాద్ ముస్లింలు తెలుగు సినిమాలు చూడరన్న నమ్మకంతో బరితెగించి ఒక చారిత్రక అపచారానికి గద్దర్ ఒడిగడ్డాడు. అక్కడితో ఆగక విప్లవ
కమ్యూనిస్టులకు చెందిన జననాట్యమండలి వేదికల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో
వాడవాడలా ఈ పాటను వేల సార్లు పాడి దొరల దౌష్యన్ని నిజాం మీద గెంటేస్తూ భారీ ప్రచారాన్ని
సాగించాడు. మొదట్లో ఈ పాటను బండి యాదగిరి
రాశాడని గద్దర్ చెప్పేవాడు. అయితే
ఆయన రాసిన వందలాది పాటల్లో ఈ పాటకు వచ్చినంత ప్రాచూర్యం మరే పాటకు రాలేదు. దానితో
బండి యాదగిరి పేరును పక్కన పెట్టి తన పాటగానే దాన్ని కొనసాగించాడు. ఒక జానపద
బాణీని బండి యాదగిరి విప్లవీకరిస్తే, బండి యాదగిరి పాటను గద్దర్ ‘మాతాంతీకరణ’ చేశాడు. అలా
ఆరెస్సెస్-బీజేపి సంస్థలకు ఇష్టుడు కూడా అయ్యాడు. అలాయ్ బలాయిలు ఆడాడు. నిజాం మీద ముస్లింలకు
ప్రత్యేక అభిమానం వుండాల్సిన పనిలేదు.
నిజాంను ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు ఆనాడే వ్యతిరేకించారు.
పోరాట కాలంలో ఒక పోరాట కవి ఒక రెడ్డి దొర మీద రాసిన ఒక పాటను సినిమా కవిగా మారిన గద్దర్ ఒక సినిమా కోసం నిజాం మీద రాసిన పాటగా మార్చాడు. ఇది చారిత్రక వక్రీకరణ. దీనినే వర్తమాన ముస్లిం సమాజం ప్రశ్నించ దలిచింది.
ఈ పాటకు పాలకుల కోణం నుండి ఇప్పటికీ ఒక ప్రాసంగికత వుంది.
భారత సామాజిక
వ్యవస్థ పెట్టుబడీదారీ నియంతృత్వం దశ నుండి పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వ దశకు
చేరుకుంది. దీనినే మనం ఫాసిజం, నాజిజం అంటున్నాం. పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వ
దశలో పాలకులు సాధారణంగా మైనార్టీల మీద తరచూ సాంస్కృతిక దాడి చేస్తుంటారు. ముస్లింలు అనాగరీకులు, ముస్లిం పాలకులు నిరంకుశులు
అని తరచూ గుర్తు చేస్తుంటారు. 1947 నాటికి దేశంలో దాదాపు ఆరు వందల సంస్థానాలున్నాయి.
అందులో నిజాం ఒకటి. మిగిలిన సంస్థానాధీశులు ఎలాంటి రాచరిక పాలన చేశారో నిజాం కూడా
అలాంటి రాజరిక పాలనే చేశాడు. కానీ, ప్రత్యేకించి నిజాం ఒక్కడినే ఇప్పటికీ విమర్శించడంలోని
మర్మం ఏమంటే గతం వంకతో వర్తమాన ముస్లిం
సమాజాన్ని దోషులుగా బోనులో నిలబెట్టడం. ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ
వారంలో సంఘపరివారకులు ఎవరో ఒకరు
దినపత్రికల్లో ఒక వ్యాసం రాస్తుంటారు. తెలంగాణా అంతటా ప్రజలు గోల్కొండ ఖిలా కింద
నిన్ను గోరి కడతం నైజాము సర్కరోడా! అని పాడుకుంటూ పోరాటానికి సిధ్ధమయ్యారు అనే
అర్ధం వచ్చే వాక్యాలు అందులో తప్పనిసరిగా వుంటాయి. దానికి సాక్ష్యంగా వాళ్ళు
చూపించేది మాభూమి-గద్దర్ పాటను. అంచేత ఇది గతానికి సంబంధించిన అంశంకాదు. వర్తమానానికి
సంబంధించిన వివాదం. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలంలో ప్రజాకవులు రాసిన పాటలన్నీ
స్థానిక దొరల మీద రాసినవే. తరువాతి కాలంలో
కొందరు విశ్రాంత కవులు వాటిని నిజాం వ్యతిరేక పాటలుగా మార్చిరాశారు. నల్గొండ-వరంగల్ జిల్లాలకూ తెలంగాణాకూ, తెలంగాణాకూ నిజాం సంస్థానికి తేదా
తెలియని అమాయకులు ఇప్పుడు కూడా వుంటారు. వాళ్ళు ఈ మోడిఫైడ్ వెర్షన్లు (ప్రక్షిప్తాలు)
చదివి నల్గొండా, వరంగల్ జిల్లాల రైతులు
నిజాం వ్యతిరేక పాటలు పాడుకునేవారని నమ్ముతారు. పాసిస్టు యుగంలో పాలకులకు ఒక సాంస్కృతిక ఆయుధాన్ని
అందించిన గద్దర్ ను ముస్లిం సమాజం అంత సులువుగా క్షమించదు.
6. ఇంతకీ జనం నిజాం నవాబును గోరీ కడతామని
ఏ భాషలో రాసి పాడుకున్నారూ? నిజాం సంస్థానంలో మరాఠా, కన్నడ, తెలంగాణాల పేరిట మూడు
ప్రాంతాలుండేవి. ఏ ప్రాంతం వారు ఆ భాషనే మాట్లాడేవారు. హైదరాబాద్ లో ఉర్దూ, మరాఠీ,
కన్నడ భాషలు ప్రధానంగా వుండేవి. తెలంగాణ భాష మాట్లాడేవారు చాలా తక్కువగా
వుండేవారు. చరిత్రలో మహత్తరంగా భావించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది కేవలం తెలంగాణలోని
ఆంధ్రాప్రాంత సరిహద్దుగా వున్న వరంగల్, నల్గొండ జిల్లాలలో మాత్రమే. ఇప్పటి అర్ధంలో ఖమ్మంజిల్లా కూడా వుంది గానీ అది అప్పటికి ప్రత్యేక జిల్లాగా ఏర్పడలేదు. రాజధాని హైదరాబాద్ నగరంలో ఆ పోరాట
అలికిడి లేదు. కొందరు కమ్యూనిస్టు ప్రముఖుల జన్మక్షేత్రం హైదరాబాద్ కావచ్చుగానీ
వాళ్ల పోరాట కార్యక్షేత్రం వరంగల్, నల్గొండ జిల్లాలే. మగ్ఢూం మొహియుద్దీన్
సుప్రసిధ్ధ కవిత శీర్షిక ‘తెలంగాణ యే గానీ ‘నిజాం’ కాదు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు,
దేవులపల్లీ వెంకటేశ్వర రావు, రావి నారాయణ రెడ్డి తదితర పోరాట అగ్ర నాయకులు దాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
అన్నారేగానీ, నిజాం రైతాంగ సాయుధ పోరాటం అనలేదు. ఆలోచనాపరులకు ఈ చిన్నపాటి తేడా కూడా తెలియకపోతే
ఎలా? ఆంధ్రా కమ్యూనిస్టు నాయకులు తమ
ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటాలు చేయకుండా నిజాం పాలనలోని తెలంగాణ సరిహద్దు
జిల్లాలలోనే స్థానిక కమ్యూనిస్టులతో కలిసి పోరాటాలు చేశారనే విమర్శ కూడా వుంది.
7.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలన్నీ నిజానికి దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు సాగించిన పోరాటాలే. మహారాష్ట్ర నుండి దిగుమతి అయిన ఆర్యసమాజ్ ఆరెస్సెస్
శక్తులు మాత్రం తమ గురిని నిజాం మీద పెట్టాయి. క్షేత్రస్థాయిలో వాళ్లకు మద్దతు లేదు. గానీ, ఢిల్లీలో, ముఖ్యంగా సర్దార్
వల్లభ్ భాయి పటేల్ దగ్గర వారికి పరపతి వుండేది.
8.
నిజాం హయాంలో జరిగిన దురాగతాల్లో నూటికి తొంభై ఐదు శాతం దేశ్ ముఖ్ లు సాగించినవే. నిజాం స్వఛ్ఛంద సేవకులైన
రజాకార్లు సాగించిన దురాగతాలు చాలా చాలా స్వల్పం. అవి కూడా చివరి రోజుల్లో అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి నిస్పృహతో చేసిన చర్యలే. నాలుగు వందల సంవత్సరాల కుతుబ్ షాహీ - నిజాంల పాలనలో రజాకార్ల దురాగతాల కాలం ఆరు నెలలే.
9.
నిజాంది రాజరిక వ్యవస్థ. అంతర్గతంగానే అది పీడక వ్యవస్థ. అంతమాత్రాన అప్పట్లో దేశ్ ముఖ్
లు సాగించిన ప్రతి హింసాత్మక ఘటననీ నిజాం ఖాతాలో వేసేయడం చరిత్రకారులు చేయాల్సిన పనికాదు. ఇప్పుడు దాన్ని
హిందూ- ముస్లిం ఘర్షణగా చిత్రించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారుగానీ నిజాం రాచరిక
పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ముందు
పీఠిన నిలిచింది ముస్లింలే. కామ్రేడ్స్ అసోసియేషన్ లో దేవులపల్లి
వెంకటేశ్వరరావు తప్ప మిగతా వారందరూ ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు. పోరాటంలో బందగీ, ఉద్యమంలో ‘ఇమ్రోజ్’ పత్రిక
సంపాదకుడు షోయబుల్లా ఖాన్ అమరులయ్యారు. నిజాం మీద ఇంతగా ప్రాణాలొడ్డి పోరాడిన
వీరులు ఎవరూ ఇతర సామాజికవర్గాల్లో కనిపించరు. కమ్యూనిస్టు కార్యకర్తలుతప్ప. షోయబుల్లా
ఖాన్ దారుణ హత్య నెపంతోనే జవహర్ లాల్ నెహ్రు నిజాం మీద పోలీస్ యాక్షన్ కు పచ్చ
జండా ఊపాడు. 1948 ఆగస్టు 22న షోయబుల్లా ఖాన్ ను రజాకార్లు హైదరాబాద్ నడిరోడ్డు మీద
క్రూరంగా నరికి చంపేశారు. మహమ్మదాలీ జిన్నా కరాచీలో సెప్టెంబరు 11న చనిపోయాడు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 12 జరిగాయి. సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో ఆరంభమయింది. ఇదీ
చారిత్రక క్రమం.
10.
తెలుగు పత్రికల ఎడిట్ పేజీలు ఆలోచనల సంఘర్షణలకు అద్దంపట్టే రోజులు పోయాయి. ఇప్పుడు ముస్లిం సామాజికవర్గాల మనోభావాల్ని దెబ్బతీసేలా అబధ్ధాలని కూడా అవి ప్రచారం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇటీవల పెరుగుతోంది. ఇది మరికొన్ని అనర్ధాలకు దారితీస్తుంది.
(సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు,
మొబైల్ : 9010757776
రచన : 29 ఏప్రిల్ 2015
ప్రచురణ : ఆంధ్రజ్యోతి , 3 మే 2015
ముస్లిం సమాజానికి గద్దర్ చేసిన గద్దారీ
2 Oct 2018
కొండపల్లి కొటేశ్వరమ్మ స్మారక సభ రాత్రి మఖ్దుం భవన్ లో జరిగింది. ఈ
సందర్భంగా ‘మాభూమి’ సినిమాలోని ‘బండెనక బండికట్టి’ పాటను కొందరు ఆలపించారు. ఆ పాటకు కోటేశ్వరమ్మకు
సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పాటను పాడాలనుకుంటే
యాదగిరి పాటను పాడాలి. కానీ, గద్దర్ రాసిన
సినిమా పాటను పాడడంలో ఔచిత్యం లేదు. ఆ పాటను
విన్నప్పుడెల్లా గద్దర్ ముస్లిం సమాజానికి చేసిన గద్దారీ గుర్తుకు వస్తుంటుంది
నాకు.
నిజాం మీద నాకేమీ ప్రత్యేక అభిమానం లేదు. నిజాంను ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు ఆనాడే వ్యతిరేకించారు.
నిజాంను పొగడమని నేనేమీ అనలేదు. పోరాట కాలంలో ఒక పోరాట కవి ఒక రెడ్డి దొర మీద రాసిన ఒక పాటను సినిమా కవిగా మారిన గద్దర్ ఒక సినిమా కోసం నిజాం మీద రాసిన పాటగా మార్చాడు. ఇది చారిత్రక వక్రీకరణ. దీనినే వర్తమాన ముస్లిం సమాజం ప్రశ్నించ దలిచింది.
ఘంటా చక్రపాణి ! ఇది నేను ఈరోజు రాసిన వ్యాసం కాదు.
దుగ్గినేని సత్యనారాయణరావు అనే
ఆయన 'నిరంకుశ నిజాంకు ప్రశంసలా?" అని 28 ఏప్రిల్ 2015న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన
వ్యాసానికి నేను ఇచ్చిన సమాధానం ఇది. తప్పు ఎప్పుడు జరిగినా ప్రశ్నించడం తప్పుకాదుకదా? ఆ పాటవల్ల ఒక
లెజిటిమసీని ముస్లిం సమాజం కోల్పోయింది. ఆ నష్టం, ఆ బాధ నాకు తెలుస్తుందిగానీ
ముస్లిమేతరులకు తెలీదు. కొండపల్లి కోటేశ్వరమ్మ స్మారక సభలో ఈ పాటను పాడడంతో అక్కడున్న ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్లను
సముదాయించడానికి ఈ వ్యాసాన్ని మళ్ళీ ఫెస్ బుక్ లో పెట్టాను. గత నాలుగు రోజులుగా మహా కమ్యూనిస్టులుగా
పేరున్నవారు సహితం గద్దర్ ను వెనకేసుకు రావడానికో, నిజాంను మరో నాలుగు తిట్లు
తిట్టడానికో చేస్తున్న వాదనలు
చదువుతుంటే కమ్యూనిస్టుల్లో పేరుకు పోయిన
హిందూత్వ ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఇది నాకు అన్నింటికన్నా బాధాకరం.
No comments:
Post a Comment