Tuesday, 27 November 2018

Very Costly Crony Democracy


అత్యంత ఖరీదైన  ప్రాయోజిత ప్రజాస్వామ్యం  

డానీ


ఇప్పుడు మనం చూస్తున్నవి స్వేఛ్ఛాయుత సాంప్రదాయిక   ఎన్నికలు కావు. ఇవి ఆర్థిక (ఫైనాన్స్) ఎన్నికలు. సాంప్రదాయిక ఎన్నికలు సామ్యవాదమా? మధ్యేవాదమా? పెట్టుబడీదారీ వాదమా? అంటూ సిధ్ధాంతాల పరంగా సాగేవి.  కొంతకాలం రైటిస్టు, లెఫ్టిస్టు,  సెంట్రిస్టు,  లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్, రైట్ ఆఫ్ ద సెంటర్ అంటూ కొన్ని  శిబిరాలు కొనసాగాయి.  ఇప్పుడు అవన్నీ పోయాయి. ఆర్ధిక శక్తిని బట్టి ప్రచార ఆర్భాటంతో ఓట్లను మంచి ధర పెట్టి కొనుక్కోవడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రక్రియ.  

ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఓ ఏడాది ముందే  ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ బూతుకు ఓ పది మందిని క్రియాశీల కార్యకర్తలుగా ఎంపిక చేసి చెరో లక్ష రూపాయలు చేరవేసేస్తాయి. ఆ క్రియాశీల సభ్యులు చెరో వంద మంది ఓటర్లను ప్రభావితం చేసి వాళ్ళ ఓట్లు తమ పార్టికి పడేలా ప్రయత్నిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 240 నుండి 250 వరకు పోలింగ్ బూతులుంటాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 43 వేల  పోలింగ్ బూతులున్నాయి. అంటే సీడ్ క్యాపిటల్ 4,300 కోట్ల రూపాయలు. 

రాజకీయాల్లో ఏ పనికైనా డబ్బే ప్రధానం. అయితే, కేవలం డబ్బు తోనే అన్ని పనులు జరగవు. డబ్బుకు తోడుగా కొంచెం ఆప్యాయపు పలకరింపులు కూడా చాలా ముఖ్యం. ఓ ఏడాది ముందు నుండే ఓటర్లను పలకరించే కార్యక్రమం - Interactive Voice Response System (IVRS) సర్వే-  మొదలయిపోతుంది. ఒక్కో కాలర్ రోజుకు సగటున 250 ఫోన్ కాల్స్ చేసేదయితే, దాదాపు 4 కోట్ల 30 లక్షల మంది ఓటర్లను నెలకు రెండుసార్లు పార్టి పక్షాన ఆప్యాయంగా పలకరించాలంటే కనీసం 12 వేల మంది సిబ్బంది పనిచేసే కాల్ సెంటర్లు కావాలి.  ఏడాదిపాటు ఈ సిబ్బంది జీత భత్యాల కోసం సులువుగా ఓ మూడు  నాలుగు వందల కోట్ల రూపాయలు  ఖర్చు అవుతాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వచ్చే ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే వారి ఓట్లు తొలగిస్తున్నారని  కొన్ని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరంటే వారు ఇష్టానుసారంగా ఓట్లు తీసేయడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆర్పీ సిసోడియా ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. గానీ, ప్రజాస్వామిక వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో అవధులు అన్నింటినీ దాటేసిన నరేంద్ర మోదీ-అమిత్ షాల  పాలనలో అలా జరగడంలేదని నమ్మడం కష్టమే.

రాజకీయాల్లో కొన్ని సామాజికవర్గాలు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటాయి. కమ్మ సామాజికవర్గంలో తెలుగుదేశానికీ, రెడ్డి సామాజికవర్గంలో వైసిపికి, కాపు సామాజికవర్గంలో జనసేనకు ఇలాంటి వీరాభిమానులు వేల సంఖ్యలోనే వుంటారు. వీళ్ళుగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సామాజికవర్గాల్లోనూ కొందరు కొన్ని పార్టీలకు వీరాభిమానులుగా వుంటారు. ప్రధాన పార్టీలన్నీ ఒక క్రమపధ్దతిలో వీరాభిమానుల సేవల్ని వాడుకుంటాయి. ఈ వీరాభిమానులు స్వఛ్చంద సేవకులు కనుక వాళ్ళకు   జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ వాళ్లను కార్యక్షేత్రంలోనికి  దించి ఓటర్లను ప్రభావితం చేయడానికి పెద్ద ఖర్చే అవుతుంది. అదో వంద రెండు వందల కోట్ల రూపాయలు!.

మీడియాలో తమకు వ్యతిరేక వార్తలు రాకుండా ఆపి, తరచుగా అనుకూల వార్తలు వచ్చేలా చేసుకోవడం చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే కాదు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఇప్పుడు చాలా పెరిగింది.  వీటన్నింటినీ  సానుకూలంగా మార్చుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇంకో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించక తప్పదు.

ప్రధాన పార్టీలకు చెందిన సిట్టింగ్ అభ్యర్ధులేగాక, కొత్తగా రంగంలో దిగే అభ్యర్ధులు సహితం ఏడాది ముందు నుండే  అనేక ప్రచార  కార్యక్రమాలను చేపట్టి పార్టి అధిష్టానవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రధాన పార్టీల పక్షాన పోటీలో వున్నామనిపించుకోవడానికి ఎన్నికల సంవత్సరంలో ఒక్కొక్కరికి సులువుగా రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆశావహులు పార్టి టిక్కెట్టు కోరడానికి అది దరఖాస్తు రుసుము లాంటిది. ఇవి గాక, ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తమ దగ్గర స్వంత నిధులు కనీసం పది కోట్ల రూపాయల వరకు వున్నాయని రుజువు చూపని అభ్యర్ధులకు ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా ఇవ్వవు. ఎంపీ టిక్కెట్టు ఆశించే అభ్యర్ధుల  ఆర్ధిక అర్హతలు దీనికి ఓ ఏడెనిమిది రెట్లు  ఎక్కువగా వుంటాయి.

మరో మాటల్లో చెప్పాలంటే, చెరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయలను  నేల మీద పరిచేశాకే రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిధ్ధం అవుతాయి. జాతీయ స్థాయి ప్రధాన రాజకీయ పార్టీలు దీనికి ఓ పాతిక ముఫ్ఫై రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఈ లెఖ్ఖలన్నీ 2014 ఎన్నికల ఖర్చు అంచనాతో వేసినవి. ఇప్పటి ధరల ప్రకారం సవరించాలంటే మరో 30-40 శాతం అదనంగా కలపాల్సివుంటుంది. ఓ సీనియర్ ఎం.పీ మాటల్లో చెప్పాలంటే “ఓటరుకు నికరంగా రెండు వేల రూపాయల నోటు  చేర్చాల్సిందే. అలా చేర్చడం కోసం ఇంకో వెయ్యి రూపాయలు పైఖర్చు పెట్టాల్సిందే”. ఇదొక బండ లెక్క.

  శాసనసభకు 28 లక్షల రూపాయలు, లోక్ సభకు 70 లక్షల రూపాయల్ని ఎన్నికల గరిష్ట ప్రచార వ్యయంగా  కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది నిర్ణయించింది. ఇది సిగరెట్టు ప్యాకెట్ల మీద ధూమపానం హానికరం అంటూ రాసే హెచ్చరిక లాంటిది.  దేశం మొత్తమ్మీద ఒక్కరంటే ఒక్కరూ దాన్ని పట్టించుకోరు.

అనైతిక సాంప్రదాయాలు ఎక్కడ మొదలయినా, ఎంత చిన్నగా మొదలయినా అవి మొత్తం సమాజానికి చాలా వేగంగా చాలా విస్తృతంగా వ్యాపించేస్తాయి. మొదట్లో కార్మికవాడలు, మురికివాడల్లో నివశించే నిరుపేద ఓటర్లు మాత్రమే డబ్బు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సాంప్రదాయం మధ్యతరగతి కుటుంబాలకు కూడా వ్యాపించింది. “తీసుకోక పోతే మమ్మల్ని ప్రత్యర్ధి ఖాతాలో పడేస్తారు” అనే భయంతో వాళ్ళు ఓటుకు నోట్లు తీసుకోవడం మొదలెట్టారు. “ఎవర్ని వద్దన్నా ఇబ్బంది కదా?” అంటూ  ఇప్పుడు గడుసరిగా ఇరుపక్షాల దగ్గరా నోట్లు తీసుకుంటున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన విద్యార్ధులు సహితం ఓటుకు నోటు సంస్కృతికి చాలా సులువుగా అలవాటు పడిపోతున్నారు. ఓ వీకెండ్ పార్టి ఖర్చు ఆ ఖాతాలో పోతుందని వాళ్ళ ఆనందం. కొనుక్కుంటున్నారు గాబట్టి అమ్ముకుంటున్నారో అమ్ముకుంటున్నారు గాబట్టి కొనుక్కుంటున్నారో తేల్చడం ఇప్పుడు చాలా కష్టం.  

అంత మాత్రాన సమాజం మొత్తంగా గొడ్డుపోయిందని కాదు. విధానాలు, సిధ్ధాంతాల ఆధారంగా ఓటింగు జరగాలని కోరుకునే ఆదర్శ ఓటర్లు ఇప్పుడూ వుంటారు. కానీ వాళ్ల సంఖ్యం క్రమంగా క్షీణించి 15-10 శాతానికి పడిపోయింది. ఈ సమూహం ప్రధానంగా విద్యావంతులు. నిజానికి వీళ్ళ కొసమే  రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతుంటాయి. ఆదర్శవంతమైన వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తుంటాయి.  ఇప్పుడు ఎంతో కొంత చాటు పాటిస్తున్నారుగానీ, ఈ విద్యాధిక ఆదర్శ సమూహం ఎంతోకొంత లేకుంటే, రాజకీయ పార్టీలు ఏనాడో ఓట్లను చేపల సంతలా మార్చేసేవారు.

ఇంతటి భారీ నిధుల్ని సమీకరించడం, నిఘా సంస్థల కళ్ళుగప్పి వాటిని పంపిణీ చేయడం ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా కష్టమైన పని. ఆయా రాజకీయ పార్టిలు అధికారంలోనికి వస్తే తాము పెట్టిన పెట్టుబడికి పది రెట్లు  లాభాలు దండుకోవచ్చని ఆశించే మెగా కార్పొరేట్లు ఈ భారాన్ని తమ నెత్తిన వేసుకుంటాయి. నిజానికి ఎన్నికల తరువాత ప్రభుత్వ నిర్ణయాలను నియంత్రించేవి ఈ మెగా కార్పొరేట్లే. దీనిని పెట్టుబడీదారీ ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనవచ్చు. మనం తరచూ పత్రికల్లో అదానీ లాభాలు ఇన్ని వేల కోట్లు, అంబానీ లాభాలు అన్ని వేల కోట్లు అని చదువుతున్నది ఈ  ప్రాయోజిత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఫలాలే.

‘The Industrial Vagina : The Political Economy of the Global Sex’ పుస్తకాన్ని రాసిన Sheila Jeffreys  ఈ సమయంలో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో వుండి వుంటే  The Industrial Vote : The Political Economy of the Indian Democracy’ అనే గ్రంధాన్ని తప్పకుండా రాసివుండేది. అసలు కథ ఇది. దీన్నీ దాచి పెట్టడానికి  “ముఖ్యమంత్రిగా మారిన ఆరణాల కూలీ”, “ప్రధానమంత్రి కుర్చీ ఎక్కిన చాయివాలా” వంటి ముసుగుల్ని ఈ మెగా కార్పొరేట్లు అప్పుడప్పుడు కప్పుతుంటాయి. అలా దేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంటుంది. 

 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

రచన : 27 నవంబరు 2018
ప్రచురణ : ప్రజాపక్షం దినపత్రిక, 28 నవంబరు 2018


No comments:

Post a Comment