Monday, 29 April 2019

PAN'S Labyrinth Movie Review - Do not rule with the blood of the helpless!

Do not rule with the blood of the helpless!
నిస్సహాయుల నెత్తురుతో పరిపాలించకండి ! 

ఉష యస్ డానీ

ప్రవేశిక 

మెక్సికన్ డైరెక్టర్ గుల్లెర్మో డెల్ తోరో కథ రాసి, దర్శకత్వం వహించిన 2006 నాటి Dark Fantasy Drama Film Pan's Labyrinth . పాన్ / ఫాన్  అంటే ప్రకృతి దేవత. వనకన్య. లాబిరింత్ అంటే చీకటి గుయ్యారం. 

భావోద్వేగాలతో సాగే సినిమాలను డ్రామా అంటారు, కల్పిత, అద్భుత, మానవాతీత పాత్రలతో సాగే గాథల్ని ఫాంటసీ అంటారు. హింసాత్మక లేదా భయంకర సన్నివేశాలుంటే డార్క్ అంటారు. ఈ మూడు శైలులతో కూడిన సినిమా ఇది.

స్పెయిన్ లో 1944 నాటి సైనిక పాలన  వాతావరణంలో స్పానిష్ భాషలో తీసిన ఈ సినిమాను సబ్ టైటిల్స్ తో ప్రపంచమంతటా విడుదల చేశారు. ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ను డెల్ తోరో స్వయంగా రాశాడు గాబట్టి వాటిని కూడా ఆస్వాదించవచ్చు. అయితే, సినిమాను మొదటిసారి చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ ను పట్టించుకోక పోవడమే మంచిది. అనువాదం కోసం సబ్ టైటిల్స్ మీద దృష్టిని పెడితే సినిమా విజువల్ ప్రభావాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. (కావాలంటే అనువాదం కోసం రెండోసారి సినిమా చూడవచ్చు). 

2007 ఫిబ్రవరిలో జరిగిన 79వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో  Pan's Labyrinth  Best Cinematography, Best Art Direction, Best Make-up విభాగాల్లో మూడు ఆస్కార్లు  అందుకుంది.  అనేక ఇతర ఫిలిం ఫెస్టివల్స్ లో ఇంకా అనేక అవార్డులు గెలుచుకుంది.

133 కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్ తో తీసి 600 కోట్ల రూపాయల భారీ వసూళ్ళు చేసిన సినిమా ఇది. అవతార్ వంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ 8 శాతం మాత్రమే. 

సినిమాను చూసిన తరువాత ఎలాగూ సమీక్ష చేస్తాం కనుక పరిచయంలోనే సినిమా కథను చెప్పడం భావ్యం కాదు. అయితే ఈ సినిమాను ఏ లక్ష్యంతో తీశారో చెప్పాల్సిన అవసరం వుంది.

PAN'S cతరువాత గుల్లెర్మో డెల్ తోరో 2017లో THE SHAPE OF WATER సినిమా తీశాడు. అది అతనికి దర్శకునిగా ఆస్కార్ అవార్డు తెచ్చి పెట్టింది. ఆ సందర్భంగా అతను ఒక టివీ ఇంటర్ వ్యూలో "మన కాలపు విద్వేషాలకు విరుగుడుగా ఆశ, విమోచనల గురించి ఒక అందమైన, సొగసైన కథల్ని సృష్టించాలనుకుంటాను” అన్నాడు. 
Guillermo del Toro 
THE STORY 
“I wanted to create a beautiful, elegant story about hope and redemption as an antidote to the cynicism of our times. I wanted this story to take the form of a fairy-tale in that you have a humble human being who stumbles into something grander and more transcendental than anything else in her life.

 And then I thought it would be a great idea to juxtapose that love against something as banal and evil as the hatred between nations, which is the Cold War, and the hatred between people due to race, colour, ability and gender.”
05-Mar-2018

THE PAST “In a monster movie of the 50s, Michael Shannon’s Colonel Richard Strickland, the square-jawed, good-looking government agent, would be the hero, and the creature would be the villain. In The Shape of Water I wanted to reverse those things.”

ఇదీ ఆయన సినిమాల లక్ష్యం.

Guillermo del Toro 

ఇక ఇప్పుడు మీరంతా సినిమాను చూడండి.


సినిమా వీక్షణానంతర సమీక్ష

సినిమా ఆరంభ సన్నివేశాల్లోనే  14-15 నిముషాల మధ్య ఒక నాటకీయ ఘట్టం వుంటుంది. 

తల్లి కార్మెన్ కడుపులో పుట్టబోయే బిడ్డ కదులుతూ వుంటాడు.  అప్పుడామె తన కూతురు అఫేలియాతో “లోపల నీ తమ్ముడు అశాంతితో గోల చేస్తున్నాడు. వాడికి ఒక కథ చెప్పు. విని వాడు శాంతిస్తాడు” అంటుంది.  

అప్పుడు మన కథా నాయకి, ప్రొటాగోనిస్టు, అఫేలియా తల్లి పొట్ట మీద తల వాల్చి  ఓ కథ చెపుతతుంది. 

 “తమ్ముడా! నా తమ్ముడా!

పూర్వకాలంలో 
విషాదం అలుముకున్న  ఒక ఏకాంత ప్రాంతంలో
ఒక భయంకరమైన పెద్ద నల్లరాయి కొండ వుండేది.
అదొక ముళ్ళదారి. ఆ ముళ్ళ నిండా విషం.

ఆ కొండశిఖరం మీద 
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో 
ఒక గులాబీ పువ్వు వికసించేది. 
అది గొప్ప మహత్తు గలది. 
దాన్ని అందుకున్న వాళ్ళు 
కష్టాల  నుండి విముక్తులు అవుతారు. 
స్వేఛ్ఛ పూర్వక జీవితాన్ని గడుపుతారు. 

ఆ లోకంలో మనుషులందరూ 
హింస గురించీ, కష్టాల గురించి, 
నెత్తి మీద వేలాడుతున్న కత్తి గురించీ, 
నీడలా వెంటాడుతున్న చావు గురించీ 
నిరంతరం  భయపడుతూ బతికేవారు.

అంతేగానీ, 
సాహసించి కొండశిరానికి చేరుకుంటే 
అమరత్వం సిధ్ధిస్తుందని 
ఒక్కరు కూడా ఆలోచించేవారు కాదు.  

గులాబి చెట్టు తన పని తాను చేసుకుంటూ పోయేది.
ప్రతి సాయంకాలం ఒక కొత్త గులాబీ పువ్వు వికసించేది.
దాని మహత్తును గుర్తించేవారు ఎవరూ లేక
అమరత్వాన్ని అందుకునేందుకు ఎవరూ ముందుకు  రాక
ఆ చీకటి కొండ మీద ఆ గులాబి పువ్వులు 
ప్రతి రాత్రి కృశించిపోయేవి.

కాలం అంతమయిపోయే వరకు 
ఈ విషాదం ఇలాగే కొనసాగింది”  - 
- అంటూ కథను ముగిస్తుంది అఫేలియా.

“కష్టజీవులు తిరగబడితే పోయేదేమీలేదు; బానిస సంకెళ్లుతప్ప” అన్నాడు కార్ల్ మార్క్స్. ఎల్లకాలం ఇలా కష్టాలను తలచుకుంటూ కుమిలిపోతూ వుండకండి. కొంచెం తెగిస్తే జీవితం ఆనందమయం అవుతుంది అనే సందేశాన్ని ఈ కథ చెపుతోంది. అలా రాబోయే తరాలకు ఒక సందేశాన్ని పంపుతోంది కథానాయకి. ఇదే PAN'S LABYRINTH సినిమా లక్ష్యం. 

నిర్దిష్టంగా చెప్పాలంటే ఫ్రాన్సిస్కో ఫ్రాంకొ వంటి నియంత అత్యంత క్రూరమైన పధ్ధతుల్లో పాలిస్తున్నపుడు ఆ దేశ ప్రజలు ఏం చేయాలో ఈ సినిమా చెపుతుంది.

సినిమాలో నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాత్ర నేరుగా కనిపించదుగానీ అతని ప్రతిబింబమే మనకు తెర మీద కెప్టెన్ విడాల్ గా కనిపిస్తుంది. ఇటలీలో నియంత ముస్సోలినీ రాజకీయ భావజాలాన్ని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో నియంత హిట్లర్ రాజకీయ భావజాలాన్ని నాజిజం అన్నట్టు స్పెయిన్ లో  ఫ్రాంకో రాజకీయ భావజాలాన్ని 'ఫలాంగిజం' అంటారు. వ్యక్తిగా ఫ్రాంకోకు, భావజాలం పరంగా ఫలాంగిజంకు ప్రతిరూపం కెప్టెన్ విడాల్ పాత్ర.  

ఆ నిరంకుశుని  పేరు వింటేనే ప్రజలంతా భయపడి వణికిపోతున్న కాలంలో ఒక పసిపాప ఆ నియంతను అతని ఇంట్లోనే ఎదుర్కొని అంతం చేయడం ఈ సినిమా సూక్ష్మ కథ. దాన్నే డ్రమాటిక్  యాక్షన్ అంటారు. 

ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు ఎంత గొప్ప సినిమా కథ అయినా డ్రమాటిక్  యాక్షన్ కు చెందిన ఒక్క వాక్యంతోనే మొదలవుతుంది.  ఖనిజాల కోసం ఇతర గ్రహాలకు వెళ్ళిన అంతరిక్ష యాత్రికుల బృందంలోని ఒక సభ్యుడు తన మనసు మార్చుకుని అక్కడి ఆదివాసుల పక్షాన నిలబడడం  ‘అవతార్’ సినిమాలో డ్రమాటిక్  యాక్షన్.

 డ్రమాటిక్  యాక్షన్ లో మళ్ళీ మూడంశాలు వుంటాయి. ఎవరి గురించీ చెపుతున్నాం? ఏం చెప్పబోతున్నాం? ఎక్కడ ఏ వాతావరణంలో  చెప్పబోతున్నాం? అనేవి ఆ ప్రశ్నలు. ఒక మెరుగైన జీవితం కోసం ఓ పదేళ్ళ పాప పడే తపన  గురించి చెప్పబోతున్నాం, నియంతల పాలనను అంతం చేయాలని చెప్పబోతున్నాం, 1944 నాటి స్పెయిన్ లో చెప్పబోతున్నాం అనేవి వాటికి సమాధానాలు.  

సినిమా కథకు జానపద అంశం తోడయితే అది సులువుగా జనం లోనికి వెళిపోతుంది అని వివరిస్తూ గతంలో ఒక విస్తార వ్యాసం రాశాను. కొంచెం తరచి చూస్తే 'ప్యాన్స్ లాబిరింత్' సినిమాలో భాగవతంలోని ప్రహ్లాదుడి కథ ఛాయలు కనిపిస్తాయి. ఈ కథలో అఫేలియా, కెప్టెన్ విడాల్, కమ్యూనిస్టు గెరిల్లాలను వరుసగా ప్రహ్లాదుడు,  హిరణ్యకశిపుడు, నరసింహావతారంగా ఊహించుకుంటే డ్రమాటిక్  యాక్షన్ నిర్మితి సరిగ్గా అతికినట్టు  సరిపోతుంది.

స్పెయిన్ లో 1936-39 మధ్య కాలంలో అంతర్యుధ్ధం సాగింది.  ఒకవైపు విప్లవ కారులు, మరో వైపు విప్లవ ప్రతీఘాత శక్తులు, ఒక వైపు, కమ్యూనిజం మరోవైపు జాతీయ అతివాదం, ఒకవైపు గణతంత్ర ప్రజాస్వామ్యం మరోవైపు నియతృత్వం, ఒకవైపు వర్గపోరాటం మరోవైపు మతయుధ్ధం  బరి గీసుకుని స్పెయిన్ వీధుల్లో భీకరంగా తలపడ్డాయి. చివరకు 1939లో ఫ్రాన్సిస్కో ఫ్రాంకొ నాయకత్వంలోని నియంతృత్వ శక్తులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాయి. నియంత ఫ్రాంకో కర్కశ పాలన ఐదేళ్ళు గడిచాక మన సినిమా కథ మొదలవుతుంది.

  సినిమా క్లైమాక్స్ లో, “స్వార్ధం అంటే ఏమిటో తెలీని  పసిపిల్లవాడి  నెత్తురును  ఆ కొలనులో కలిపితే పాతాళ లోకానికి మహారాణివి అవుతావు?” అని అఫేలియాకు చెపుతాడు ప్రకృతి దేవుడు. అఫేలియా తీవ్రంగా  వ్యతిరేకిస్తుంది. “ఈ కత్తి తీసుకో ఒకే ఒక్క నెత్తుటి చుక్క కావాలి. సూదిమొనతో చిన్నగా గుచ్చినంత నెత్తురు చాలు. పౌర్ణమి ఘడియలు దాటి పోతున్నాయి, ఇంకొక్క నిముషం ఆలస్యం అయితే ఇంకెన్ని జన్మలు ఎత్తినా నీకు మళ్ళీ మహారాణి అయ్యే అవకాశం రాదు.” అంటూ హెచ్చరిస్తాడు ప్రకృతి దేవుడు.  రాజ్యం కోసం  అమాయక జీవుల నుండి ఒక్క రక్తపు చుక్కను పారించడడానికి కూడ అఫేలియా ఒప్పుకోదు.  పసిపిల్లాడిని కాపాడడడం కోసం తన రక్తాన్ని ధారబోయడానికి సిధ్ధం అవుతుంది. అలా చనిపోతుంది. 

సినిమా రిజల్యూషన్ లో అఫేలియా పాతాళ లోకానికి వెళ్ళి యువరాణి 'మొఅన్నా'గా మారిపోయాక పాతాళ రాజు “నిస్సహాయుల్ని, అమాయకుల్ని కాపాడడం కోసం నీ రక్తాన్ని ధారబోశావు. మహారాణి కావడానికి అది అంతిమ పరీక్ష మాత్రమేకాదు అన్నింటికన్నా ప్రాణప్రదమైన పరీక్ష కూడ” అంటాడు.  

   “మహారాణి మొఅన్నా ధర్మ నిబధ్ధతతో, దయా హృదయంతో అనేక శతాబ్దాలు పాలించింది. ఆమె తన ప్రజలకు ప్రేమపాత్రురాలిగా మిగిలిపోయింది. తాను ఈ భూమి మీద కొన్నాళ్ళు బతికినందుకు గుర్తుగా కొన్ని ఆనవాళ్ళను అక్కడక్కడా వదిలి వెళ్ళింది. ఎక్కడ చూడాలో తెలిసినవాళ్ళకు ఆ చిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తాయి” అనే ఎపిలోగ్ లో పాలకులు నియంతలైతే అధికారం కోసం అమాయకుల రక్తాన్ని చిందిస్తారు. పాలకులు ఉత్తములైతే తమ రక్తాన్ని ధారబోసి అమాయకుల్ని రక్షిస్తారు అనే ఒక గొప్ప సందేశంతో సినిమా ముగుస్తుంది.

డ్రమటిక్ యాక్షన్, అందులోని మూడు అంశాలు నిర్ణయం అయిపొయే సమయానికి రచయితకు ప్రధాన పాత్రలు అన్నీ ఊహామాత్రంగా అయినా తెలుస్తాయి. ఆ తరువాత ప్రధాన అంశం మీద, దాని వాతావరణం మీద, పాత్రల స్వభావాల మీద, వాటి జీవన స్థితిగతుల మీద పరిశోధన సాగించాలి.  

ముందు పరిశోధన సాగించి తరువాత డ్రమాటిక్ యాక్షన్ ను నిర్ధారించడం తలకిందులు పధ్ధతి. పరిశోధన సందర్భంగా వెలుగులోనికి వచ్చే అనూహ్య అంశాలు డ్రమాటిక్ యాక్షన్ ను దెబ్బతీయకూడదు. ఒక విప్లవ వీరుడు వలస పాలకుల్ని ఎదుర్కొవడాన్ని డ్రమాటిక్ యాక్షన్ గా నిర్ణయించుకున్నాకే  అల్లూరి శ్రీరామరాజు మీదనో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మీదనో  పరిశోధనలు జరపాలి. వాళ్ళ జీవిత వివరాల్లోనికి మరీ లోతుగా వెళితే డ్రమాటిక్ యాక్షన్ చట్రంలో ఇమడలేని అనేక ఇబ్బందికర వాస్తవాలు వెలుగు లోనికి వచ్చి పాత్ర ఔచిత్యం మీద రచయిత నమ్మకాన్ని దెబ్బ తీస్తాయి.  

హాలివుడ్ స్క్రిప్టు రచయితలు పరిశోధన కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా సాగిస్తారు. తమ కథల్లోని సన్నివేశలను పోలిన సంఘటనలు కొనసాగుతున్న అనేక దేశాలకు సహాయకులను పంపిస్తారు. ఆయా  దేశాల్లోని రచయితలు, సమాజ కార్యకర్తల ద్వార విస్తృతంగా ఇన్ పుట్స్ ను తీసుకుంటారు. అవతార్ సినిమా రచన సందర్భంగా జేమ్స్ కామెరాన్  సహాయకులు విశాఖపట్నం వచ్చి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆ జిల్లాలో గిరిజనులు సాగిస్తున్న ఆందోళనల్ని పరిశీలించి వెళ్ళారు. ప్యాన్స్ లేబరింత్ సినిమాలోని సెటప్ మొత్తంగా ఇప్పటి ఛతీస్ గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టు ఆదివాసులకు, సిఆర్ పిఎఫ్ దళాలకు మధ్య సాగుతున్న ఘర్షణల్ని తలపిస్తుంది. డెల్ తోరో సహాయకులు దంతేవాడ వచ్చి అక్కడి పరిణామాల్ని పరిశీలించి వెళ్ళారన్నా  ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!. హాలివుడ్ సినిమాల స్క్రిప్ట్ పరిశోధన ఆ స్థాయిలోనే వుంటుంది.

అలా పరిశోధించక పోతే సైనిక శిబిరంలో స్థానిక ఆదివాసీలే పనిచేస్తుండడం, వాళ్ళకూ విప్లకారులకూ మధ్య ఒక    సహజ సంబంధాలు (ఆర్గానిక్ కనెక్షన్) వుండడం, వాళ్ళే లోపలి వాళ్లకు  ఆహారం పంపిస్తూ వుండడం, ఉత్తరాలు బట్వాడా చేస్తూ వుండడం, సైనిక  ఆస్థాన డాక్టర్లే విప్లవకారులకూ  వైద్యం చేస్తుండడం, ఉద్యమకారుల దగ్గర కొన్ని  లాటరీ టిక్కెట్లు దొరకడం వంటి వివరాలు వెలుగు లోనికి రావు.  కెప్టెన్ విడాల్ సంగీతాభిమానం, గెడ్దం గీసుకునే పధ్ధతి, అతని మూఢనమ్మకాలు, పగిలిపోయిన వాచీ, అకారణంగా ఓ పేద రైతును చంపి  అతను వేటాడి పట్టుకున్న కుందేళ్లను తను వండుకుని తినడం.  తన గాయానికి తానే కుట్లు వేసుకునే తెగింపు వంటి సూక్ష్మ అంశాలు విస్తృత  పరిశోధనలవల్లే వెలుగులోనికి వచ్చి పాత్రలను పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి తోడ్పడతాయి. నొప్పి తగ్గడానికి విడాల్ మద్యం తాగినపుడు అతని గాయానికి పెట్టిన బ్యాండేజి మీద హఠాత్తుగా రక్తం వ్యాపిస్తుంది. సూక్ష్మస్థాయిలో పరిశోధనలు చేస్తే తప్ప ఇలాంటి వివరాలను స్క్రిప్టుల్లో పొందుపరచడం సాధ్యంకాదు.

          డెల్ తోరో ఈ సినిమాను సమర్పించిన పధ్ధతి చాలా గొప్పగా వుంటుంది.  ఫస్ట్ ఇమేజితోనే డెల్ తోరో తన స్క్రిప్టు సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తాడు. తొలి ఫ్రేమ్ లో ఎనిమిది అంశాలు వుండాలని సిడ్ ఫీల్డ్ వంటి స్క్రిప్టు పండితులు ఒక నియమం పెట్టివున్నారు. మొదటిది; మెటాఫర్  అలంకారాన్ని వాడాలి. Metaphor అంటే directly refers to one thing by mentioning another కదా. నేపథ్యంలో ఒక లాలిపాట వినపడుతుంటే, నియంత జరిపిన కాల్పుల్లో నెత్తుటి ముద్దగా మారిన పదేళ్ల పాప ముఖంతో సినిమా మొదలవుతుంది.  నియంత పాలనకు ఇంతకన్నా రూపకం ఏముంటుందీ? రెండవది, ఆందోళన లేదా ఘర్షణ. ఒక నియంత మీద సాగే పోరాటంలో ఆ పాప చనిపోయింది. మూడవది థీమ్. అమాయకుల రక్తంతో రాజ్యాలు ఏలకూడదు.  నాలుగవది ప్రధాన పాత్ర. సినిమా కథా నాయికే ఆ పాత్ర.  ఐదవది ప్రధాన పాత్ర ప్రధాన సమస్య. పసిపిల్లవాడైన తన తమ్ముడ్ని కాపాడుకోవడమే ఆ పాత్ర ప్రధాన సమస్య. ఆరవది సెట్టింగ్. సినిమా పేరే ల్యాబెరింత్. ఆ పాప ల్యాబరింత్ లోనే పడివుంది. ఏడవది టైమ్ ఫ్రేమ్. నియంత ఫ్రాంకో పాలనా కాలంలోని ఫలాంగిస్టు కెప్టేన్ విడాల్ ఆమెను కాల్చాడు. ఎనిమిదవది ప్రధాన పాత్ర పేరు. గత జన్మలో మొఅన్నా, ఈ జన్మలో అఫేలియా.

Metaphor; directly refers to one thing by mentioning another.

Struggle and anxiety

Theme of the movie

Protagonist

Major Task

Story Setting

Time Frame

Name of the  Protagonist 


ఈ ఎనిమిది అంశాల్లో మొదటి నాలుగు అంశాల్ని తక్షణం గుర్తు పట్టవచ్చు. మిగిలిన నాలుగు అంశాలు కూడా ఫస్ట్ ఇమేజ్ లో వున్నాయిగానీ అవి ప్రేక్షకులకు కథా క్రమంలో మాత్రమే అర్థం అవుతాయి. సినిమా చివర్లో ఇదే ఇమేజితో ముగుస్తుంది. వర్ణణాత్మక సాహిత్యంలో The ending scene should lead to conceive the beginning scene అనే మాట ఒకటుంది. ఆ నియమాన్ని కూడా డెల్ తోరో పాటించినట్టయింది.  

          ఫస్ట్ ఇమేజిని సమర్ధంగా రూపొందిస్తే ప్రేక్షకులకు సగం కథ చెప్పేసినట్టేనని అంటారు. విజయ సంస్థకు చెందిన సుప్రసిధ్ధ తెలుగు నిర్మాత ఆలూరి చక్రపాణి ఫస్ట్ ఇమేజ్ గురించి ఒక మాట అనేవారట. ఎన్ టి రామారావును పెట్టుకుంటే అతన్ని తెర మీద చూడగానే ఈ సినిమాకు ఇతనే హీరో అని ప్రేక్షకులు సులువుగా అర్థం చేసుకుంటారు.  అదే కొత్త నటుడ్ని పెడితే  ఆ సినిమాకు అతను హీరో అని చెప్పడానికి నాలుగైదు సీన్లు అదనంగా పెట్టాలి. అదో డబ్బు దండగ అనేవారట.

సాధారణంగా 120 నిముషాల నిడివిగల ఏ సినిమా కైనా 60 పెద్ద సీన్లు, ఓ ఇరవై చిన్న సీన్లు వుంటాయి. సాధారణ స్క్రిప్టు రైటర్లు ఈ 80 సీన్లను విడివిడి పెట్టెలుగా రాసుకుని అలాగే చిత్రించి, ఎడిటింగ్ సమయంలో  ఫేడ్ఇన్ / ఫేడ్ అవుట్, డిసాల్వ్, వైప్ వంటి ట్రాన్సిషన్స్ ద్వార లంకె ఇచ్చుకుంటుంటారు. డెల్ తొరో అందుకు భిన్నంగా ఐదారు సీన్లను ఒకే గుత్తిగా మార్చి స్క్రిప్టు సిధ్ధం చేస్తాడు. అలాంటి ఒక ఉదాహరణను ప్రిశీలిద్దాం.  

సినిమా 26వ నిముషంలో కెప్టెన్ విడాల్ గ్రామ్ ఫోన్ లో సంగీతం వింటూ గడ్డం గీసుకుంటున్నాడు. మెర్సిడీస్ వచ్చింది. వేటగాని దగ్గర పట్టుకున్న కుందేళ్ళను ఆమెకు ఇచ్చి రాత్రికి వండించ మన్నాడు. కాఫీ బాగోలేదని మండిపడ్డాడు. కుందేళ్ళు అందుకుని మెర్సిడీస్ మెట్లు దిగి కిందికి వంటగది లోనికి వచ్చింది. వాటిని మరొకరికి ఇచ్చి వండమంది. అక్కడున్న పనివాళ్లతో రాత్రి డిన్నర్ ఏర్పాట్ల గురించి మాట్లాడింది. ఆ తరువాత వేడినీళ్ళ బకెట్టు తీసుకుని బాత్ రూమ్ లోనికి వెళ్ళింది.  అక్కడ మరో పనిషితో కలిసి బాత్ టబ్బును వేడినీళ్ళతో నింపింది. మెర్సిడీస్ వెను తిరుగుతుండగానే అక్కడికి వ్హీల్ ఛైర్లో  కార్మేన్ వచ్చింది. అప్పటికే అక్కడ అఫేలియా వుంది. రాత్రి విందు కోసం కుట్టించిన కొత్త డ్రెస్సును అఫేలియాకు చూపించింది కార్మేన్. స్నానం చేయడానికి అఫేలియా బాత్ రూమ్ లోనికి వెళ్ళింది. లోపల ఒక మూలన దాచి వుంచిన మాయా పుస్తకాన్ని బయటికి తీసింది. బాత్ టబ్బు మీద కూర్చోని పుస్తకాన్ని తెరిచింది. బయటి నుండి తల్లి పిలుస్తోంది. లోపల అఫేలియా తన భుజం వెనుక చంద్రుని ఆకారంలో వున్న పుట్టుమచ్చను అద్దంలో చూసుకొంటోంది. కొత్త బట్టల్లో నువ్వు యువరాణిలా వుంటావు అంటోంది బయటి నుండి తల్లి. పుట్టు మచ్చను చూసి నేను నిజంగా యువరాణినే అనుకుంటోంది అఫేలియా. అక్కడి నుండి కొత్త బట్టలు వేసుకోవడం. వంటగదిలోనికి వెళ్ళడం. మెర్సిడీస్ పెరట్లోకి తీసుకెళ్ళి పాలు పితికి గిన్నెలో పోసి ఇవ్వడం.  అంతలో కెప్టేన్ నుండి పిలుపు రావడం. మెర్సిడీస్ గొడౌన్ కు వెళ్ళడం.  విడాల్ సరుకుల్ని రేషన్ కార్డుల్ని పరిశీలించడం. మెర్సిడీస్ దగ్గరున గొడౌన్ తాళం చెవిని వెనక్కి తీసుకోవడం. అడవిలో ఏదో కాలుతున్నట్టు పొగలు రావడం. గుర్రాల మీద బయలుదేరడం. గుర్రాలను తప్పించుకుని అఫేలియా అడవిలోనికి వెళ్ళడం. సైనికులు తిరుగుబాటుదార్లను వెంటాడుతూ వెళ్ళడం. అఫేలియా చెట్టు తొర్రలో దిగడం. గాలికి ఎగిరి కొత్త బట్టలు బురదలో పడడం. గుర్రాలు తిరుగుబాటుదార్లు విడిది చేసిన ప్రాంతాని చేరడం. అక్కడ తనిఖీలు చేయడం. తిరుగుబాటుదార్లకు  కెప్టెన్ విడాల్ సవాలు విసరడం. సైనికులు వెళ్ళిపోయాక తిరుగుబాటుదార్లు మళ్ళీ అక్కడికి రావడం. అఫేలియా రాక్షస కప్ప నుండి తాళంచెవి సంపాదించి బయటికి రావడం వరకు దాదాపు 13 నిముషాల పాటు ఒకే లింకులో అనేక సీన్లు మారుకుంటూ కథ సాగిపోతూ వుంటుంది. అనేక షాట్లు వుంటాయిగానీ ప్రత్యేకంగా సీన్ మారినట్టు ఎక్కడా అనిపించదు. అదేదో నదిలో పడవలా సీన్లు మెత్తగా సాగిపోతుంటాయి. 

PAN'S LABYRINTH  సినిమాకు మరీ ప్రాణప్రదమైనది శైలి.  మాంత్రిక వాస్తవికత. మ్యాజికల్ రియలిజం శైలి అది.  

రెండు ఖండాలకు విస్తరించిన లాటిన్ అమెరికా ప్రాంతంలో  బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, అర్జెంటైనా, వెనెజుల, పెరు,  పెద్ద దేశాలు. లాటిన్ అమెరికన్లు పురాతన రోమన్ల భాషలయిన స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ భాషల్లో రచనలు సాగిస్తున్నప్పటికీ వారి సాహిత్యానికి ఒక ప్రత్యేకత వుంది.  Magic realist movement / Magical Realism / fabulism కు ఆద్యుడిగా భావించే జోర్జ్ లూయిస్ బోర్జెస్ (1899 – 1986) వంటి మహారచయిత అర్జెంటైనా కు చెందిన వాడు. ఒన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ (1967) రచయిత గేబ్రియల్ గార్షియ మార్క్వేజ్  (1927 – 2014) కొలంబోకు చెందినవాడు. 1988లో 'ద ఆల్కెమిస్ట్' నవలతో ప్రపంచ వ్యాప్తంగా  ప్రాచూర్యాన్ని పొందిన పోర్చుగీస్ రచయిత పౌలో కొయెల్హో  కూడా బ్రెజిల్ కు చెందిన వాడే. వీళ్లంతా మాంత్రిక వాస్తవికత సాంప్రదాయాన్ని కొనసాగించినవారే.

మాంత్రిక వాస్తవికత అంటే; సామాన్య మానవులకు సాధారణ పరిస్థితుల్లో సాధ్యంకాని, నెరవేరని అనేక ఆకాంక్షల్ని అసాధారణ మాంత్రిక పధ్ధతుల్లో, అతీత శక్తులు, అద్భుత జీవుల సహాయంతో నెరవేర్చి ఒక సాహిత్య సమర్ధన కల్పించడంగా భావించవచ్చు. fables, myths and allegory మొదలైన శైలులన్నీ ఈ కోవలోనికి వస్తాయి. మాంత్రిక వాస్తవికత  అందరికీ సులువుగా అర్ధం అయ్యే రీతిలో ఒక స్థానిక అన్వయాన్ని పరిశీలిద్దాము.   
          తెనాలి సమీపంలోని చుండూరు గ్రామంలోని పెత్తందారీ కులాలకు చెందినవాళ్ళు  1991 ఆగస్టు 6న దళితవాడ మీద దాడి చేసి ఎనిమిది మందిని క్రూరంగా నరికి చంపారు. అనేక మందిని తీవ్రంగా గాయపరిచారు. శవాలను గోనె సంచుల్లో కుక్కి సమీపంలోని తుంగభద్రా డ్రెయిన్ లో ముంచేశారు. 179 మంది నిందితులుగావున్న ఈ కేసును 16 సంవత్సరాలు విచారించిన ప్రత్యేక కోర్టు 2007లో 21 మందికి జీవిత ఖైదును, 35 మందికి ఏడాది ఖైదును విధించి నేర నిరూపణ జరగని కారణంగా ఇంకో 123 మంది నిందితుల్ని వదిలివేసింది.

          శిక్షలుపడ్డ 56 మంది హైకోర్టులో పిటీషన్ వేశారు. ఇంకో ఏడేళ్ల విచారణ సాగిన తరువాత జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి నాయకత్వంలోని  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 ఏప్రిల్ 23న తీర్పు చెప్పింది.    ప్రాసిక్యూషన్ వాళ్ళు తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోయారనే కారణంతో మొత్తం 56 మందికి కింది కోర్టు విధించిన శిక్షల్ని రద్దు చేసింది.

న్యాయస్థానాల మీద అణగారిన సమూహాల నమ్మకం సడలిన సందర్భం ఇది. ఆ తీర్పు మీద దళిత శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ధర్మాసనం ముందు వాళ్లు నిస్సహాయులుగా వుండిపోయారు. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళిండం తరువాతి పరిణామం.

ఇంత వరకు చెప్పిన కథ అంతా వాస్తవమే. సరిగ్గా ఇక్కడే మేజికల్ రియలిజం లేదా మాంత్రిక వాస్తవికత ప్రవేశిస్తుంది.

శిక్షల నుండి తప్పించుకున్న 179 మంది పెత్తందారీ కులస్తులు  చుండూరు పరిసర గ్రామాల్లో విజయోత్సవ యాత్ర తలపెడతారు.  ఇది నిస్సహాయుల పుండ్ల మీద కారం చల్లినట్టు అవుతుంది.  అణగారిన సమూహాలు కుమిలిపోతాయి. ఎవరి ఇళ్ళలో వాళ్లు దీనంగా మౌనంగా భయంగా రోదిస్తుంటారు.

నరహంతకుల విజయోత్సవం జోరుగా సాగుతున్న సమయంలో ప్రకృతి అసహనంతో ఊగిపోతుంది. భూమి బద్దలయిపోతుంది. రక్కసుల పాపం పండి ప్రళయం ముంచుకు వచ్చేస్తుంది. రోడ్డు పక్కనున్న మర్రి చెట్లు వేళ్లతో సహా ఊగిపోతాయి. మర్రి ఊడలు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాయి.

మరునాడు ఉదయం ప్రకృతి నెమ్మదిగా శాంతిస్తుంది. జనం ఇళ్ల నుండి బయటికి వస్తారు. తలెత్తి ఆకాశం వైపుకు చూస్తారు. ఒక అద్భుతం జరిగినట్టుగా మర్రి చెట్ల ఊడలకు వరుసగా 179 శవాలు వేలాడుతుంటాయి !!!.

మార్మిక వాస్తవికత చేసే సాహిత్య న్యాయం ఇదే.(literary justification)!.

వర్తమాన ప్రపంచ సినిమాను మెక్సికన్లు ఏలుతున్నారంటే  అతిశయోక్తికాదు. వరుసగా 2015లో ‘బర్డ్ మేన్’, 2016లో ‘ద రెవనంట్’  సినిమాలకు ఉత్తమ దర్శకునిగా ఆస్కార్ అవార్డుల్ని అందుకున్న అలెగ్జాంద్రో గొంజాలెజ్ ఇనరిట్టు మెక్సికనే. 2013లో ‘గ్రావిటీ’కీ ఉత్తమ దర్శకునిగా ఆస్కార్ అవార్డుల్ని అందుకున్న అల్ఫోంసో కౌరాన్  కూడా మెక్సికనే. గుల్లెర్మో డెల్ తోరో తో కలిపి  ఈ ముగ్గురు మెక్సికన్ దర్శకుల్ని ఇప్పుడు ప్రపంచ సినిమా విమర్శకులు  ‘మహాదర్శక త్రయం’ అంటున్నారు.

వీళ్ళ సినిమాల్లో హింస పాలు ఎక్కువగానే వుంటుంది. వైన్ బాటిల్ తో పేద రైతు కొడుకును చంపడం, నత్తి వున్న విప్లవకారుడ్ని చిత్రహింసలు పెట్టడం వంటి సన్నివేశాల్లో హింస చాలా జుగుప్సకరంగా వుంటుంది. ఇనరిట్టు దర్శకత్వం వహించిన 2000 నాటి సినిమా ‘అమొరేస్ పెర్రోస్’లో డాగ్ ఫైట్ తదితర సన్నివేశాల్లోని  హింస ప్రేక్షకుల్ని ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. అయితే, సమాజంలో అంతకన్నా ఎక్కువ హింస వుందనేది ఈ దర్శకుల భావన. సమాజంలోని హింసను చూపించకపోతే అంతా బాగుందనే మిధ్య ఒకటి ప్రబలుతుందని వీళ్ళు భావిస్తారు.

మెక్సికన్ ‘మహాదర్శక త్రయం’ ఆ స్థాయికి రావడానికి లాటిన్ అమెరికన్ సాహిత్యం తోడ్పడిందంటే అతిశయోక్తి కాదు. సాహిత్య పునాది లేనివాళ్ళు, సాహిత్య ధోరణులు తెలియనివాళ్ళు గొప్ప కళాఖండాలను సృష్టించలేరు. మాంత్రిక వాస్తవిక సాహిత్య ధోరణి గురించి  తెలుసుంటే మనకు లాటిన్ అమెరికన్ సినిమా దర్శకుల సాహిత్య పునాది కూడా తెలుస్తుంది. ఆ ముగ్గురిలో మాంత్రిక వాస్తవిక సాహిత్య శైలి మీద గొప్ప అవగాహనను కొనసాగిస్తున్న దర్శకుడు గుల్లెర్మో డెల్ తోరో. తమ ప్రాంతపు  సాహిత్య సాంప్రదాయాల మీద గట్టి పట్టు వున్నవాళ్ళే గొప్ప కళాఖండాలను సృష్టించగలుగుతారు. 


 (తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పైడి జయరాజు ప్రీవ్యూ థియేటరులో ఏప్రిల్ 28న  ప్యాన్స్ ల్యాబెరింత్ సినిమాను ప్రదర్శించిన సందర్భంగా క్యూరేటర్ గా చేసిన ప్రసంగం పూర్తి పాఠం.)

(స్పానిష్ భాషలో  ఎవరి పేరును ఎలా ఉఛ్ఛరిస్తారో   నాకు తెలీదు. ఎల్ పక్కన ఎల్ వస్తే ‘య’ అంటారంటా మెక్సికన్లు.  అంటే ‘గుల్లెర్మో’ను ‘గుయ్యెర్మో’ అనాలి. అలా ప్రతి భాషలో కొన్ని ప్రత్యేక ఉఛ్ఛారణలు, నిశ్శబ్ద అక్షరాలు వుంటాయి.  మనం స్పెయిన్ అనే దాన్ని స్థానికులు ఇస్పాన (ESPANA) అంటారు.  అవన్నీ తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. చాలా కాలం క్రితం ఓ పెద్దాయన  నాకు దీనికి ఒక పరిష్కారాన్ని బోధించాడు. “నీకు తెలిసిన ఇంగ్లీషులో ఫొనెటిక్స్ ప్రకారం ఉఛ్ఛరిస్తే  చాలు” అన్నాడు.  నేను దాన్నే అనుసరిస్తున్నాను. బహు భాషా కోవిదులు నా పరిమితిని అర్ధం చేసుకోగలరు). 


రచన :  హైదరాబాద్, 28 ఏప్రిల్ 2019
ప్రచురణ : 

ప్రజాపాలన దినపత్రిక  , 29 ఏప్రిల్ 2019 - 2 మే 2019

No comments:

Post a Comment