Thursday, 28 March 2019

All Set to Sell Waqf Properties


వక్ఫ్ ఆస్తుల అమ్మకానికి అంతా సిధ్ధం! 

ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)

ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ భూముల్ని అమ్మివేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక్కసారి సిధ్ధమయింది. ప్రజలు ఎన్నికల కోలాహలంలో మునిగి వున్నప్పుడే ఆ పని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసేయాలని ప్రభుత్వ వున్నతాధికారులు, అధికార పార్టి పెద్దలు కుట్రలు చేస్తున్నారు.  గుంటూరు జిల్లా మంగళగిరి మండలం  కాజా గ్రామంలోని అషూర్ ఖానా  భూముల అమ్మకానికి సన్నాహాలు పూర్తి అయ్యాయి. ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్ర ఐటి, పంచాయత్ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం నుండే పోటిచేస్తూ వుండడం విశేషం.

గుంటూరుతో పాటూ   నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలోని వక్ఫ్ భూముల్ని సహితం అమ్మడానికి ప్ఫైళ్ళు కదులుతున్నాయని నమ్మకమైన సమాచారం. వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే  ముస్లిం సమాజపు ఆస్తుల్ని ‘నిరర్ధక ఆస్తుల క్రమబద్దీకరణ’ సాకుతో అమ్మివేసే ప్రక్రియ వుధృతంగా సాగుతోంది. “చచ్చినోడి  పెళ్ళికి వచ్చిందే  కట్నం” అనేది వాళ్ళ వాదన.   

వితరణశీలురయిన ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్నో లేదా మొత్తం ఆస్తినో ‘అల్లా’ పేరున రాసేస్తారు. ఈ ప్రక్రియను ఇస్లాం సాంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు.  ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందినవారికి  కూడ  దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఆ స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి  వినియోగించాలనేది వక్ఫ్  సాంప్రదాయం లక్ష్యం. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల వక్ఫ్ భూములున్నాయని అంచన. 

ఆర్ధిక నిపుణుల అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం సాలీన బడ్జెట్ లో కేటాయించే  నిధులకన్నా అనేక రెట్లు ఎక్కువ ఆదాయం వక్ఫ్ ఆస్తుల ద్వార రాబట్టే అవకాశం వుంది. అయితే, వక్ఫ్ ఆస్తుల్ని సద్వినియోగం చేసే దృక్పథంగల నాయకత్వం ముస్లింలలో లోపించడం, ముస్లింలలో నిరక్షరాశ్యత, న్యాయస్థానాల్లో వాజ్యాలు నడిపే ఆర్ధిక స్తోమత లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం,   ముస్లిం సమాజం మీద అధికారుల చిన్నచూపు, క్షేత్రస్థాయిలో పోలీసులు కబ్జాదారుల పక్షాన నిలబడడం తదితర కారణాలవల్ల వక్ఫ్ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయిపోయాయి; అయిపోతున్నాయి.  

చంద్రబాబు నాయుడు  హైదరాబాద్ లో తాను సైబరాబాద్ ను  నిర్మించినట్టు తరచూ గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే, హైటెక్ సిటీ నిర్మాణానికి బలిపెట్టింది ఎక్కువ భాగం వక్ఫ్ భూముల్నే!  విశాఖపట్నంలో కూడా హజ్రత్ ఇషాక్ రహమతుల్లా అలై  దర్గాకు చెందిన 3500 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు పంచిన ఘనతా వారిదే.

2005లో అప్పటి మైనారిటీల సంక్షేమ శాఖా మంత్రి ముహమ్మద్ ఫరీదుద్దీన్ శాసన సభలో ఒక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో దాదాపు 50 వేల ఎకరాల వక్ఫ్ భూములు  అన్యాక్రాంతం అయ్యాయని ప్రకటించారు. ఆక్రమణ దారుల్ని తొలగించి ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఆరంభిస్తామన్నారు.

కాజా గ్రామం రెవెన్యూ సర్వే నెంబరు 287-1లో 11 ఎకరాల 34 సెంట్లు, సర్వే నెంబరు 287-5లో 2 ఎకరాల 6 సెంట్ల భూములున్నాయి. మొత్తం  13 ఎకరాల 40 సెంట్ల భూముల్ని వందేళ్ళ క్రితం ముస్లిం దాతల బృందం ఒకటి ధార్మిక దానం (వక్ఫ్)గా ఇచ్చారు. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా ల నిర్మాణం కోసం, అంజుమన్, మొహర్రం, దర్గా, మసీదుల నిర్వహణ వ్యయం తదితరాల కోసం షేక్ అహ్మద్ సాహెబ్, షేక్ అబ్దుల్ ఖాదర్, షేక్ రహీమ్ సాహెబ్, ఖాశిం సాహెబ్, మస్తాన్ సాహెబ్ తదితర వితరణశీలురు ఈ భూముల్ని ఇచ్చారు. ఆ వివరాలు జూన్ 28, 1962 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్ దస్త్రాల్లో నమోదు కూడా అయ్యాయి.

ముస్లిం సమాజపు నిస్సహాయత, ప్రభుత్వ నిర్లక్ష్యం, వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలవల్ల ఈ భూముల్లో కొంత రైల్వేశాఖ ఆక్రమించుకోగా, మరి కొంత భాగాన్ని స్థానికులు కొందరు ఆక్రమించు కున్నారు. ఆ భూముల్ని తమ పేరిట క్రమబధ్ధీకరించాలని ఆక్రమణదారులు గతంలో ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. న్యాయస్థానాల్లో వాజ్యాలు కూడ నడిపారు. సీనియర్ లాయర్ ను పెట్టి కేసును పటిష్టంగా సాగించి వక్ఫ్ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పరిరక్షీంచాలనే పట్టుదల ప్రభుత్వంలో లోపించడంతో  ఆ కేసులేవీ సఫలీకృతం కాలేదు.

 నెంబరు 5 చెన్నై- కోల్ కటా ఎక్స్ ప్రెస్‍ హైవే పక్కనే వుండడమే గాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ కూడ అతి సమీపంలో నెలకొనడంతో కాజా  వక్ఫ్ భూములకు విపరీతమయిన గిరాకి పెరిగింది. ఇప్పుడు ఎకరా 10 కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు. డీల్ 130 కోట్ల రూపాయల వ్యవహారంగా మారడంతో సచివాలం పెద్దల కన్ను ఇప్పుడు ఈ భూముల మీద పడింది. వాళ్లు ‘ప్రభుత్వ పంచాయితీ’ నడపడానికి నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ లో  ప్రైవేటు పంచాయితీ అయినా,  ప్రభుత్వ పంచాయితీ అయినా తీర్పు ఒక్కటే. చేయుంచుకున్నోళ్ళకు, చేసిపెట్టినోళ్ళకు చెరి సగం. అదే ధర్మ తీర్పు!

ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సిఇఒ) కొలువు, గాలిలో దీపం రెండూ ఒకటే.  గడిచిన మూడు నెలల్లో ముగ్గురు సిఇవోలను మార్చారు. ఈ ఒక్క రుజువు చాలు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో అంచనా వేయడానికి. వక్ఫ్ బోర్డులో అల్లా నామం జపిస్తారు. సచివాలయంలో శంకరా, గోపాల నామాలు జపిస్తారు. అందరూ పరమభక్తులే; వక్ఫ్ ఆస్తులు మాత్రం వేల ఎకరాలు హరించుకు పోతున్నాయి.

ఖాజా అషూరా ఖానా భూముల వ్యవహారం తేల్చేయండంటూ గత నవంబరు నెలలో సచీవాలయం నుండి రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ఆదేశాలొచ్చాయి. వక్ఫ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్ నవంబరు 13న రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఆ భూమి అన్యుల ఆక్రమణలో వుండడం, న్యాయస్థానాలు కూడ అటుపక్షమే వుండడం,  ఆ భూముల మీద వక్ఫ్ బోర్డుకు ఆదాయం కూడా లేకపోవడం, అది నిరర్ధక ఆస్తిగా మారడం వంటి నైరాశ్యపు అభిప్రాయాలు బోర్డు సమావేశంలో వ్యక్తం అయ్యాయి.

   ఖాజా వక్ఫ్ భూముల వ్యవహారంపై వక్ఫ్ చట్టం – 1995 లోని సెక్షన్ 97 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి” అంటూ బోర్డు ఒక తీర్మానం చేసింది. “నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో బోర్డు పాత్ర నామమాత్రమే. సచీవాలయం లోని పెద్దలే తీర్మానాలు రాసి పంపుతారు. దాన్ని మేము ఆమోదిస్తాము. ఇది ఎప్పుడూ జరిగే తంతే” అని పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డు అధికారి ఒకరు అన్నారు.

సచివాలయం పెద్దలు తెలివైనవారు.  ఏ పని చేసినా రికార్డు మాత్రం సరిగ్గా వుండాలంటారు. వక్ఫ్ బోర్డు సమావేశానికి ముందే   సిఇవో యం.డి.  సుభానీ కాజా భూముల వ్యవహారంపై అక్టోబరు 9న న్యాయసలహా కోసం సీనియర్ అడ్వకేట్ పి. వీరా రెడ్డిని సంప్రదించారు. “కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం – 1995 లోని సెక్షన్ 97 మనకు సహాయకారిగా వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, తాను సమంజసమని భావిస్తే, కొన్ని జటిల సమస్యల పరిష్కారానికి వక్ఫ్ బోర్డుకు దిశా నిర్దేశం చేసే అవకాశాన్ని ఈ సెక్షన్ కల్పిస్తుంది. అలా ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలు అన్నింటినీ వక్ఫ్ బోర్డు   అమలు చేయాల్సి వుంటుంది” అని వీరా రెడ్డి న్యాయ సూక్ష్మాన్ని వివరించారు.

గతంలో ఉరిశిక్ష వేయగానే న్యాయమూర్తులు ఆ కలాన్ని విరగ్గొట్టే సాంప్రదాయం ఒకటి వుండేది. వక్ఫ్ బోర్డులోనూ అలాంటి సాంప్రదాయం ఒకటి కొనసాగుతోంది. కాజా భూముల వ్యవహారంలో F.No. S/19/ GNT/ 2018 లేఖ ద్వార డిసెంబరు 3న  సచివాలయానికి అనుకూల తీర్మానం  చేసి పంపగానే సిఇఒ యం.డి.  సుభానీని అక్కడి నుండి బదిలీ చేసేశారు. జనవరిలో ఇంకో సిఇఒ వచ్చారు. ఆయన ద్వార ఏ తీర్మానం చేయించి ఎక్కడ ఎన్ని భూములు అమ్మేశారోగానీ  నెల తిరక్కముందే వారిని మార్చేశారు. ఫిబ్రవరిలో షేక్ అహ్మద్ ను కొత్త సిఇఒగా నియమించారు. త్వరలో వారూ బదిలీ అయిపోతారని వక్ఫ్ బోర్డు ఆఫీసులో కొంచెం గట్టిగానే అనుకుంటున్నారు.

సాధారణంగా వక్ఫ్ ఆస్తుల్ని అమ్మడానికి వీలు లేదు. నిరర్ధక ఆస్తిగా మారిందనే నెపంతో ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేక నిర్ణయం తీసుకోవడానికి సెక్షన్ 97 ప్రభుత్వానికి అందుబాటులో వుండే పరికరం. బ్రహ్మాస్త్రం చేతికి చిక్కడంతో కాజా వక్ఫ్ భూముల్ని ‘పంచాయితీ ధర్మ తీర్పు’ ప్రకారం  క్రమబధ్ధం చేయడానికి సచివాలయం పెద్దలు నడుంబిగించారు.   ఆ వరసలో అనేక జిల్లాల వక్ఫ్ భూముల్ని అమ్మకానికి సిధ్ధం చేస్తున్నారు.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ – 9010757776

రచన  : 23 మార్చి 2019
ప్రచురణ :

No comments:

Post a Comment