Farmers are neo
Vanguards of Neo India
‘నవభారతానికి దారి
చూపుతున్న రైతాంగం’
డానీ
1. రైతాంగ ఉద్యమ నేపథ్యం
1.
వ్యవసాయరంగలో సంక్షోభం ఇవ్వాళ కొత్తగా పుట్టిందేమీకాదు. దశాబ్దాలుగా
కొనసాగుతూనే వుంది.
2.
ఆధునిక దేవాలయాలుగా భావించి భాక్రానంగల్, నాగార్జునసాగర్ నిర్మించినపుడు దేశంలో ఆహార కొరత, పేదరికం
పోతుందని అందరూ భావించారు. విచిత్రం ఏమంటే నీటిపారుదలా ప్రాజెక్టుల సంఖ్య పెరిగేకొద్దీ దేశంలో పేదరికం
కూడ పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల
రూపకల్పనల్లోనే మౌలిక లోపం వుందనే వాదనలూ బలంగా ముందుకు వస్తున్నాయి.
3.
ఇవ్వాల్టి గణాంకాల్లో చెప్పాలంటే భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో
వ్యవసాయరంగం వాట 15-16 శాతం. వ్యవసాయరంగం మీద ఆధారపడిన జనాభా 45-50 శాతం.
అంతటి వత్తిడి కారణంగా ఆ రంగంలో సహజంగానే పేదరికం వుంటుంది.
4.
ఈ సంక్షుభిత రంగంలో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు, ధనిక
రైతులు, భూస్వాములు, వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం, వ్యాపారులు, మార్కెట్
యార్డు దళారులు, ప్రభుత్వ అధికారులు వంటి ఆర్థిక అంతస్తుల దొంతర వుంటుంది.
5.
ఈ దొంతరల్లోనే కులాల దొంతర కూడ వుంటుంది. వ్యవసాయ కూలీల్లో ఎస్టీలు,
ఎస్సిలు, పేద రైతుల్లో, బిసిలు, ఓసిలు మధ్యతరగతి, ధనిక రైతులు, భూస్వాములు,
వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గంలో ఓసిలు, వ్యాపారులు, మార్కెట్ యార్డు దళారుల్లో వైశ్యులు ఎక్కువగా వుంటారు.
6.
ఒక ఆర్థిక దొంతరలో ఒక కులమే వుంటుంది అని చెప్పడం అతి ఉత్సాహం. ప్రతి
ఆర్థిక దొంతరలోనూ అన్ని కులాలు వుంటాయనడం అర్థ సత్యం. అలాకాకుండ ఒక్కో ఆర్థిక
దొంతరలో కొన్ని కుల సమూహాలకే ఆధిపత్యం వుంటుంది అని చెప్పడం సమంజసం.
7.
వ్యవసాయ కూలీల్లోనూ కొందరు ఓసిలు
వున్నట్టే, వ్యాపారులు, మార్కెట్ యార్డు దళారుల్లోనూ అరుదుగానైనాసరే కొందరు
ఎస్సీలు, ఎస్టీలు కూడా వుంటారు.
ప్రభుత్వాధికారుల్లో దాదాపు అన్ని కులాల వాళ్ళు వుంటారు.
8.
ఆర్థిక దొంతరల్లో కింది దొంతరల్ని పై దొంతరలు దోచుకుంటున్నట్టు కుల దొంతరల్లోనూ
కింది దొంతరల్ని పై దొంతరలు దోచుకుంటుంటాయి.
9.
నగరీకరణ వేగాన్ని పుంజుకుంటున్నపుడు గ్రామాల ప్రాధాన్యత తగ్గి అవి క్రమంగా
కళాహీనంగా మారిపోతాయి.
10. వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోవడంతో సాగు
భూములు క్రమంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస భూములుగా మారిపోతుంటాయి. ఇలాంటి క్రమాన్ని
మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృధ్ధి సాధికార సంస్థలో చూడవచ్చు.
11. సాగుదార్లు వ్యవసాయాన్ని
వదిలిపెట్టకుండా వుండేందుకుగాను ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, వడ్డీలేని పంట రుణం, స్వల్ప
వడ్డీకి గోల్డ్ లోన్లు వంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస
మద్దతు ధరల్ని (ఎంఎస్పీ) ప్రకటిస్తుంది. అయితే ఇందులో అనేక నిబంధనలు, అధికారుల
బ్యూరాక్రసీ, ప్రజాప్రతినిధుల ఆధిపత్యం, బ్యాంకు అధికారుల నిర్లిప్త వైఖరి తదితర
కారణాలవల్ల ఈ ప్రోత్సాహకాల అమలులో అనేక అవకతవకలు జరుగుతుంటాయి.
12. కనీస మద్దతు ధర మీద మన నేరేటివ్ లోనే
ఒక లోపం వుంది. పండిన పంట చివరి గింజ వరకు కనీస మద్దతు ధర దక్కేలా చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు హామీ
ఇవ్వాలి.
13. ఆచరణలో కనీస మద్దతు ధర అర్థమే
మారిపోతున్నది. ఆహార భద్రత, ప్రజాపంపిణీ పథకాలకు అవసరమైన మేరకే ప్రభుత్వాలు కనీస
మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేస్తున్నాయి. మిగిలిన పంటను రైతులు అంతకన్నా
తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఫలితంగా కనీస మద్దతు ధర అనేది రైతులకు దక్కే గరిష్ట ధరగా
మారుతోంది.
14. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే
మార్కెట్లో రైతుకు కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ ధర లభిస్తుంది.
15. 1981-82 వ్యవసాయిక సంవత్సరంలో ధాన్యం,
గోధుమలు కామన్ రకాలకు కనీస మద్దతు ధర 115, 142 రూపాయలు వుండేది. దాన్ని 2013 – 14 వ్యవసాయిక సంవత్సరంలో 1310, 1400
రూపాయలుగా నిర్ణయించారు. ఆ 32 సంవత్సరాలలో ఎంఎస్పీ పది రెట్లు పెరిగింది. ఈ కాలంలో
విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల ధరలు, కూలీ
రేట్లు అంతకన్నా ఎక్కువ రెట్లు
పెరిగాయి.
16. అంటే వ్యవసాయరంగంలో ఇన్ పుట్ కాస్ట్
పెరుగుతున్నంతగా ఔట్ పుట్ కాస్ట్ పెరగడంలేడు.
17. హరిత విప్లవం తరువాత దేశంలో ఆహారోత్పత్తి
భారీగా పెరిగిన మాట వాస్తవం. ఈ కాలంలో వైద్య ఆరోగ్య వ్యయం దానికి అనేక రెట్లు
పెరిగినమాట అంతకన్నా వాస్తవం.
18. హరిత విప్లవానికి కర్మ భూమిగా భావించే
పంజాబ్ లో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ప్రతిరోజూ రాత్రి భటిండాలో
బయలుదేరి మర్నాడు బికనీర్ చేరుకునే రైలు ‘క్యాన్సర్ ఎక్స్ ప్రెస్’ అనే అపవాదును
కూడగట్టుకుంది.
19. గత ఆరు దశాబ్దాల్లో ఫార్మారంగం
సాధించిన ఇబ్బిడిముబ్బిడి లాభాలతో పోలిస్తే వ్యవసాయరంగానికి జరుగుతున్న అన్యాయం
గురించి మనకు ఒక అవగాహన వస్తుంది.
20. ప్రూనింగ్, గ్రీన్ హౌస్, సెల్వీకల్చర్
తదితర ఆధునిక సాంకేతిక విధానాలవల్ల తక్కువ విస్తీర్ణంలో అత్యధిక దిగిబడిని
సాధించే పధ్ధతులు వ్యవసాయరంగంలో వచ్చాయి.
అయితే, ఇవి స్థిర ఆర్థిక విధానాలు కావు. అస్థిర (Volatile) ఆర్థిక విధానాలు. ఇంటెన్సివ్ వ్యవసాయ పధ్ధతులు.
21. భారీ ఆర్థిక స్తోమత, అత్యంత ఆధునిక
సాంకేతిక నైపుణ్యం అందుబాటులోవున్న సమూహాలు మాత్రమే ఇంటెన్సివ్ వ్యవసాయ పధ్ధతుల్లో
రాణీంచగలరు. సాంప్రదాయ సాగుదార్లు అస్థిర ఆర్థిక విధానాలను తట్టుకోలేరు.
22. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో వరి,
గోధుమలు వంటి ఆహారపంటల్ని పండించే వారికన్నా
మిర్చి, ప్రత్తి వంటి వాణిజ్య పంటల్ని
పండించేవారే ఎక్కువమంది వుంటున్నారు.
23. ఎక్స్ టెన్సివ్ సాగు విధానాల్లోనే
రాణించలేకపోతున్న సాంప్రదాయ రైతులు సెమీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ సాగు పధ్ధతుల్లో
అస్సలు రాణించలేరు. వాళ్ళకు అంతటి ఆర్థిక స్తోమత వుండదు, అత్యంత ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానం అందుబాటులోనూ వుండదు.
24. ఇంటెన్సివ్ సాగు పధ్ధతులు
కార్పొరేట్లకు మాత్రమే అనువుగా వుంటాయి. అటూ నుండి చూస్తే ఇవి కార్పొరేట్ల కోసమే
రూపొందిన సాగు విధానాలు.
25. వ్యవసాయ కుటుంబాల పిల్లలు అమెరికాకు
వలస పోయే క్రమం మనకు 1960లలో మొదలయింది. ఇప్పుడు అమెరికా నుండి తిరిగివచ్చి మళ్ళీ
వ్యవసాయాన్ని చేపట్టడం కొత్త ధోరణి. దీనినే కొందరు ‘రివర్స్ మైగ్రేషన్’
అంటున్నారు. అయితే, వాళ్ళు చేపట్టేది 1960వ దశకపు వ్యవసాయ పధ్ధతుల్ని కాదు; 21వ
శతాబ్దపు ఇంటెన్సివ్ పధ్ధతుల్ని. ఈ
గుణాత్మక మార్పు అర్థం కాకపోతే ‘రివర్స్ మైగ్రేషన్’ అర్థంకాదు. వాళ్లు రైతు
బిడ్డలుగా వలస వెళ్ళి కార్పొరేట్ ప్రచారకులుగా తిరిగివస్తున్నారు.
26. కొన్ని అనువైన ప్రాంతాల్లో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా 10 – 20 సెంట్ల
విస్తీర్ణంలో ఇంటెన్సివ్ పధ్ధతుల్లో సాగుచేసి భారీ లాభాలు సాధిస్తున్న వార్తలు మనకు అప్పుడప్పుడు మీడియాలో
వస్తుంటాయి. ఇవి ప్రయోగాలకు మాత్రమే పరిమితం. భారీ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఈ
విధానాలు సాధారణ రైతులకు పనికిరావు.
27. భారత దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 4 వేల
లక్షల (40 కోట్ల) ఎకరాలు. నీటిపారుదలా సౌకర్యంవున్న భూమి 2 వేల లక్షల (20 కోట్ల) ఎకరాలు.
28. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఎరువుల సబ్సిడీ మొత్తాన్నీ, ఉచిత విద్యుత్తు మొత్తాన్నీ నేరుగా రైతులకు నగదు
రూపంలో ఇవ్వడం మొదలు పెట్టాయి. ఎన్నికల సమయంలో రైతుల్ని ప్రలోభపెట్టడానికి అధికార
పార్టీలకు ఇలాంటి నగదు బదిలీ పథకాలు వుపయోగపడవచ్చు.
29. అయితే, నగదు బదిలీ పథకాల చాటున
వ్యవసాయానికి సబ్సిడీలను రద్దు చేసే ప్రమాదం పొంచివుంది.
30. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను అమర్చడం
మొదలు పెట్టడంతో ప్రభుత్వాల మీద ఈరకం అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.
31. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ
ఏడాది జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణల్ని చేపడుతూ మూడు
ఆర్డినెన్స్ లను తీసుకుని వచ్చింది.
32. భారత రాజ్యంగంలోని ఏడవ షెడ్యూలులో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణి గురించి వివరించారు. ఇందులో
కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, వుమ్మడి జాబితాలు వుంటాయి.
33. భారత రాజ్యాంగంలో వ్యవసాయాన్ని
రాష్ట్రాల జాబితాలో చేర్చారు. వ్యవసాయరంగం మీద కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త
చట్టాలను తేవడం సమాఖ్య (ఫెడరల్ ) స్పూర్తికి వ్యతిరేకం.
34. వీటిల్లో మొదటిది; వ్యవసాయ ఉత్పత్తుల
వ్యాపార వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు. రెండవది; రైతులకు సాధికారత
పరిరక్షణ ధరల హామీ బిల్లు, మూడవది; నిత్యావసర సరుకుల సవరణ బిల్లు.
35. వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లో ఇప్పటి వరకు జరుగుతున్న అవకతవకల్ని
సరిదిద్దడానికి ఈ బిల్లుల్ని రూపొందించివుంటే వీటిని అందరూ ఆహ్వానించాలి.
36. రైతుల్ని మార్కెట్ యార్డుల దోపిడి
నుండి బయటపడేయడం ఈ బిల్లుల లక్ష్యం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల్ని కార్పొరేట్లకు (మాత్రమే)
అమ్మేలా ఈ బిల్లుల రూపకల్పనలో భారీ కసరత్తు చేశారు.
37. రైతుల్ని దోపిడీ చేసే హక్కును మార్కెట్
యార్డుల నుండి కార్పొరేట్లకు మార్చడం. దోపిడి అప్ గ్రేడ్ అన్నమాట. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే.
38. రైతులు తమ పంటను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC)లలోనే అమ్ముకోవాల్సిన పనిలేదనీ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళి లాభసాటి ధరకు
అమ్ముకోవడానికి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు
అవకాశం కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది.
39. ఒకే దేశం ఒకే మార్కెట్ అనేది కొత్త
నినాదం.
40. భారతదేశంలో
90 శాతం కమతాల విస్తీర్ణం ఒక హెక్టారు (రెండున్నర ఎకరాలు) మాత్రమే.
41. భారతదేశపు
ధాన్యాగారంగా భావించే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో హెక్టారుకు సాలీన గరిష్టంగా సగటున 3,322 కిలో గ్రాముల (33 క్వింటాళ్ళు)
ధాన్యం దిగుబడి వస్తుంది. విశాఖపట్నం జిల్లాలో ఈ దిగుబడి కేవలం 1,430 కేజీలు (14 క్వింటాళ్ళు)
మాత్రమే.
42. టన్నున్నర
నుండి మూడున్నర టన్నుల వరకు వున్న దిగుబడిని ట్రాక్టరులో వేసుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోవడం ఏ రైతుకైనా సాధ్యమా? ఒకవేళ వెళ్ళినా
కనీస మద్దతు ధర ప్లస్ రవాణా వ్యయం, ప్లస్ ఇతర ప్రయాణ ఖర్చులు పోగా కొంచెమయినా అదనపు
ధర వస్తుందా? దీనికి సమాధానం బిగ్ నో.
43. భారతదేశమంతటా
నైరుతీ రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాలు దాదాపు ఒకే సమయంలో వస్తాయి. ఫలితంగా ఖరీఫ్, రబీ
పంటలు కూడ ఒకే సమయంలో కోతకు వస్తాయి.
44. దాదాపు
40 కోట్ల ఎకరాల పంట ఒకేసారి మార్కెట్ కు వచ్చి పడిపోవడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో
గిరాకీ పడిపోయి నిరంతరం కొనుగోలుదారునిదే పైచేయి (Purchaser’s Market)గా వుంటుంది.
45. ప్రపంచ
వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)తో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మన దేశం కొన్ని ఇతర దేశాల
నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని విధిగా దిగుమతి చేసుకోవాల్సి వుంటుంది. ఇథియోపియా తదితర
ఆఫ్రికా దేశాల నుండి పప్పుధాన్యాలు అతి తక్కువ ధరకు దిగుమతి అవుతుంటాయి. అవి కూడ పంట
సమయంలో దిగుమతి అయితే దేశీ మార్కెట్లో ధరలు భారీగా పడిపోతాయి.
46. ముందే ఇంతపోటీ వున్నప్పుడు తమ మార్కెట్లోనికి
ఇతర ప్రాంతాల రైతుల్ని స్థానిక రైతులు
రానిస్తారా?
47. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్
చౌహాన్ డిసెంబరు 3న ‘కిసాన్ కళ్యాణ్ యోజన’
పథకాన్ని ఆరంభిస్తూ ఇతర రాష్ట్రాల రైతులకు ఒక హెచ్చరిక చేశారు. “మధ్యప్రదేశ్
మార్కెట్ యార్డుల్లో మధ్యప్రదేశ్ రైతులకు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకునే
హక్కు వుంటుంది. ఇతర రాష్ట్రాల రైతుల్ని మధ్యప్రదేశ్ లోనికి రానివ్వం. ఎవరైనా అలా
వస్తే వాళ్ళ సరుకునీ, వాహనాలనీ స్వాధీనం చేసుకుంటాం. అలా వచ్చిన రైతుల్ని అరెస్టు
చేసి జైళ్లకు పంపిస్తాం” అన్నారాయన. (https://www.hindustantimes.com/india-news/farmers-from-other-states-won-t-be-allowed-to-sell-crops-in-madhya-pradesh-says-shivraj-singh-chouhan/story-JCkOxWYXNJ2QXrlV6eFIEK.html)
48. భారతీయ జనతా పార్టికే చెందిన శివరాజ్
సింగ్ చౌహాన్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారంటే ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార
వాణిజ్యాలకు ప్రోత్సాహం సౌకర్యాల కల్పన బిల్లు’ ప్రకటిత లక్ష్యాల డొల్లతనం
ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు కూడా అర్థం అవుతుంది.
49. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ
(APMC)ల్లో జరిగే లావాదేవీల మీద వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సెస్సును వసూలు
చేస్తుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఈ సెస్సు ద్వార లభించే సాలీన రెవెన్యూ వేల
కోట్ల రూపాయల్లో వుంటుంది.
50. ఈ సెస్సు మొత్తాన్ని మార్కెటింగ్ విభాగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగిస్తారు.
51. పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్
శాఖ సెస్సు ద్వార సాలీన 3,800 కోట్ల
రూపాయల ఆదాయం వస్తుంది.
52. వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల బయట వ్యవసాయ ఉత్పత్తుల
కొనుగోలుకు కొత్త బిల్లులు అవకాశం కల్పించడమేగాక, సెస్సును కూడ రద్దు చేశాయి. ఇది
రాష్ట్రాల ఖజానాకు భారీగా గండి కొడుతుంది.
53. మూడవ బిల్లు ద్వార నిత్యావసర సరుకుల
నిల్వల మీద నియంత్రణల్ని ఎత్తివేయడం అంటే నేరుగా బ్లాక్ మార్కెట్ కు చట్టబధ్ధత
కల్పించడమే.
54. అలా ఈ బిల్లు రైతులకు వ్యతిరేకమైనది
మాత్రమేకాక నిత్యావసర సరుకుల
వినియోగదారులందరికీ కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది.
55. కరోనా – లాక్ డౌన్ కాలంలో మాస్
డిస్ప్లేస్ మెంట్ కారణంగా అనేక మంది
ఉపాధిని కోల్పోయారు. ఆదాయాలు పడిపోయాయి. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు
పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ‘సవరణ’ చట్టం అమల్లోనికి వస్తే వినియోగదారుల
కష్టాలు మరింతగా పెరిగిపోతాయి.
56. చట్టాల విషయంలోగానీ, వాటి అమలు
విషయంలోగానీ వివాదం ఏర్పడితే పరిష్కారం కోసం కోర్టుల్ని ఆశ్రయించే అవకాశం ప్రతి పౌరునికీ
వుంటుంది. అది ప్రజాస్వామిక హక్కు. చాలా విచిత్రంగా ఈ బిల్లుల్లో కోర్టులకు వెళ్ళే అవకాశం లేదంటూ ఒక దుర్మార్గపు
క్లాజ్ ను పెట్టారు. ఇది నిరంకుశ పోకడ. ఈ బిల్లుల్ని తేవడం వెనుక కేంద్ర ప్రభుత్వం
పెద్ద కుట్రనే రచించిందని ఈ ఒక్క అంశాన్ని బట్టే చెప్పవచ్చు.
57. ఎంతటి వివాదాస్పద బిల్లునైనా లోక్ సభలో
ఆమోదం పొందడానికి కావల్సిన సంఖ్యాబలం, రాజ్యసభలో ఆమోదం పొందడానికి అవసరమైన
చాకచక్యం ఇవ్వాల్టి అధికార పార్టికి వున్నాయి. అంతటి బలం వున్నప్పటికీ ఆర్డినెన్స్
ను తీసుకురావడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
58. ఈ మూడు బిల్లులు సెప్టెంబరు 20న
మూజువాణీ ఓట్లతో పార్లమెంటు ఆమోదాన్ని
పొందాయి. సెపెంబరు 27న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీటి మీద ఆమోదముద్ర వేశారు.
59. వ్యవసాయరంగంలో 21వ శతాబ్దం విసిరే
సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా భారతీయ రైతుల్ని
సన్నధ్ధం చేయడం ఈ చట్టాల లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్
షా, వ్యవసాయశాఖా మంత్రి నరేంద్ర సింగ్
తోమర్, ఆహారం ప్రజాపంపిణి వినియోగదారుల వ్యవహారాల మంత్రి పియుష్ గోయల్ పెద్ద గొంతుతో ప్రచారం చేస్తున్నారు.
60. 1990ల నాటి ఆర్థిక సంస్కరణల సందర్భంగా
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల్ని (ఎల్ పి జి) అప్పటి ప్రభుత్వం సరిగ్గా ఇలాగే
గొప్ప విలువలుగా భారీ ప్రచారం చేసింది.
61. చివరకు ఆర్థిక సంస్కరణలు అంటేనే
అభద్రలోకం నోరుకొట్టి భద్రలోకం సంపదను పెంచడం
అని తేలింది.
62. ఇప్పుడు భారత వ్యవసాయ రంగంలో అలాంటి
విషాదకర ఘట్టం మరొకటి ఆరంభం అవుతోంది.
63. ప్రమాదాన్ని అడ్డుకోకుంటే అది మన
జీవితంలో భాగం అయిపోతుంది. మనల్ని జీవితం నుండి గెంటి వేస్తుంది.
‘నవభారతానికి దారి
చూపుతున్న రైతాంగం’
డానీ
2. ఢిల్లీ మార్గం పట్టిన రైతాంగం
64. హరిత విప్లవాన్ని జోరుగా సాగించి దాని
సత్ఫలితాలను, దుష్ఫలితాలను కూడ అనుభవించిన పంజాబ్ హర్యాణ రాష్ట్రాల రైతులు ఈ కొత్త చట్టాలు సృష్టించబోతున్న విధ్వంసాన్ని
ముందుగా పసిగట్టారు.
65. కాంగ్రెస్ కు చెందిన పంజాబ్
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్తచట్టాలను ‘దురదృష్టకరం’ ‘ఆందోళనకరం’ అని
ముందుగానే ప్రకటించారు.
66. ఈ వివాదాస్పద బిల్లుల్ని పార్లమెంటులో
ప్రవేశపెట్టినందుకు నిరసనగా పంజాబ్ కు చెందిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్
మంత్రి, శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్
సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి సెప్టెంబరు 17న రాజీనామా చేసి ప్రభుత్వం నుండి
తప్పుకున్నారు. ఆ తరువాత శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ తాము కేంద్రంలో అధికార కూటమిగా వున్న ఎన్ డిఏ
నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
67. తొలుత పంజాబ్ హర్యాణాల్లో మొదలయిన
రైతాంగ ఆందోళన క్రమంగా ఉత్తర ప్రదేశ్, మధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు
వ్యాపించింది.
68. ఇప్పుడు ఈ సెగ దాదాపు అన్ని
రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నది.
69. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వున్న
కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతాంగ ఆందోళనకు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
70. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడ రైతుల
ఆందోళనను సమర్థించారు.
71. మరోవైపు, హర్యాణ, ఉత్తర ప్రదేశ్ లో
వున్న బిజేపి ప్రభుత్వాలు రైతాంగ ఉద్యమం మీద కత్తి ఝళిపించాయి. నిర్బంధాన్ని
ప్రయోగించాయి.
72. దానితో ఏకంగా దేశరాజధాని ఢిల్లీనే
రైతాంగం ఉద్యమ కేంద్రంగా మార్చుకుంది.
73. గత ఏడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ
చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలయిన షాహీన్ బాగ్ ఉద్యమం దేశ రైతాంగానికి ఆదర్శంగా మారింది.
74. పంజాబ్, హర్యాణ, ఉత్తర ప్రదేశ్ రైతులు
నవంబరు 26న నాలుగు వైపుల నుండి ఢిల్లీ చేరుకుని సింఘూ బోర్డర్, గాజీపూర్ బోర్డర్, టిక్రి, ఝరోద, ఔచందీ, పియావో మనియారి, మంగేష్ బోర్డర్లలో హైవేలకు అడ్డంగా
శిబిరాలు వేసి ఆ మార్గాల్లో రాకపోకల్ని నిలిపివేశారు.
75. తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనకు
దిగినప్పుడెల్లా ఆదివాసుల్ని మావోయిస్టులు అనడం. ఎస్సీల్ని రాడికల్ బహుజనులు (
భీమ్ ఆర్మీ – చంద్రశేఖర ఆజాద్ –రావణ్) అనడం, (భీమా-కోరేగావ్ కేసులో ఎస్సీల్నీ
మావోయిస్టుల ఖాతాలో వేశారు), ముస్లింలను జిహాదీలు అనడం, శిక్కుల్ని ఖలిస్తానీయులు
(శిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నాయకులు గుర్పత్ వంత్ సింగ్ పన్నూన్, హర్దీప్ సింగ్
నిజ్జార్) అనడం మోదీ-షా కేంద్ర ప్రభుత్వానికి
అలవాటు అయిపోయింది.
76. తమ వేర్పాటువాద ఎజెండాను
నెరవేర్చుకోవడానికి ఖలిస్తానీయులు రైతుల్ని వాడుకుంటున్నారని హర్యాణ ముఖ్యమంత్రి
మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్రంగా ఆరోపించారు.
77. రైతాంగ ఆందోళన వుధృతం అయ్యేకొద్దీ భారత రాజకీయాల్లో సమీకరణలు
మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రెండేళ్ళుగా
బిజేపి విధానాలతో తీవ్రంగా ఘర్షిస్తున్నారు. రైతాంగ ఉద్యమానికి ఆయన మద్దతు పలకడంలో
ఆశ్చర్యం ఏమీలేదు.
78. ఎన్డీఏలో భాగస్వామి కానప్పటికీ
పార్లమెంటు వ్యవహారాల్లో ఆ కూటమికి నమ్మకమైన మిత్రునిగా బయటి నుండి మద్దతు ఇస్తున్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి
సహితం డిసెంబరు 8 నాటి భారత బంద్ కు
పాక్షికంగా అయినా మద్దతు తెలుపక తప్పలేదు.
79. కౌరవులు పాండవుల మధ్య దాయాదిపోరు వున్నప్పటికీ
బయటివాళ్ళు కురు సామ్రాజ్యం మీదికి వస్తే నూట ఐదు మంది దాయాదులు ఏకమయిపోతారు అనే మాట
మన పురాణాల్లో వుంది.
80. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమీటీలు
(APMC) రద్దు కాబోతున్నాయని తెలియగానే, అప్పటి వరకు మండీల్లో పెత్తనాన్ని
చెలాయించిన ధనికరైతులు, వ్యాపారులు, దళారులు సహితం రైతుల ఆందోళనకు మద్దతు
ప్రకటించడం మొదలెట్టారు.
81. దాదాపు ప్రధాన ఉద్యమాలు అన్నింటిలోనూ
ఇలాంటి ‘వర్గసంకరం’ వుంటుంది. దీన్ని వర్గ
ఐక్యత అనాలేమో.
82. 1970ల నుండి 1990ల వరకు వుధృతంగా సాగిన నక్సలైట్
వుద్యమంలోనూ విద్యాధిక మధ్యతరగతి వర్గం కదిలి వచ్చి శ్రామిక వర్గంతో కలిసి పనిచేసింది.
క
83. పదేళ్ళ క్రితపు తెలంగాణ వుద్యమంలోనూ
వర్గాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన ఐక్యత కనిపించింది.
84. మధ్య తరగతి రైతులు, ధనిక రైతులు
కలిసివచ్చిన రిచ్ నెస్ ఢిల్లీ రైతుల ఆందోళనలో కొట్టొచ్చినట్టు కనిపించింది.
85. పంజాబ్ హర్యాణ వ్యవసాయ సంపదను ఢిల్లీ
రోడ్ల మీద పరిచేశారు.
86. ఢిల్లీలోని శిక్కు వాణిజ్య
వ్యాపావేత్తలే కాకుండ ఇతర సామాజికవర్గాలకు చెందిన వారు సహితం రైతులకు అండగ
నిలుస్తున్నారు. ఆందోళనకారులకు కొందరు రగ్గులు, శాలువలు పంచుతున్నారు.
87. సందర్శకులు సింఘూ బోర్డర్ లో
ప్రవేశించగానే నిర్వాహకులు మాస్క్ లు పంచుతున్నారు. కొన్ని చోట్ల వెల్కం డ్రింక్ అన్నట్టు బాదం పాలు ఇస్తున్నారు.
కొన్ని సభల్లో బాదం పప్పు కూడ గుప్పెడు చేతిలో పోస్తున్నారు. జామ, యాపిల్ ముక్కలతో
ఫ్రూత్ సలాడ్ ఇస్తున్నారు. కిలో మీటరుకు రెండో మూడో మెడికల్ కియోస్కోలు
వుంటున్నాయి. వైద్య పరీక్షలు, మందులు కూడ ఉచితంగా అందిస్తున్నారు. ఇక భోజనాలకు,
వాటర్ బాటిళ్ళకు అంతేలేదు. కిలో మీటర్ల కొద్ది రోడ్ల మీద రోడ్ల మీద భోజనాల
పంక్తులు కనిపిస్తున్నాయి. ఫుల్కాలు, ఆలూ గోబీ. ఫ్రైడ్ రైస్ వడ్డిస్తున్నారు.
88. పంజాబీ మహిళలు ట్రాక్టర్లు తోలుకుని
రావడం ఈ ఉద్యమంలో ఒక ఆకర్షణ. ఆ ట్రాక్టర్ల ట్రాలీల్లోనూ మహిళలు వుంటున్నారు.
89. ట్రాక్టర్ల కొద్ది గోధుమ పిండి,
కూరగాయలు నిరంతరం వస్తూనే వున్నాయి.
90. కొన్ని ట్రాక్టర్లకు పైన సోలార్
ప్యానల్స్ వున్నాయి.
91. వాళ్లు మామూలు రైతులు కాదు. ఆరు నెలల
ఆందోళనకు సిధ్ధమై వచ్చాము అంటున్నారు. అక్కడ నిల్వ చేసిన గ్రాసాన్ని బట్టి చూస్తే
కనీసం మూడు నెలల నిల్వలు వుణ్నట్టే కనిపిస్తున్నాయి.
92. శానిటేషన్ సమస్య తలెత్తకుండ ఢిల్లీ
ప్రభుత్వం అన్ని బోర్డర్స్ లోనూ భారీగా మొబైల్
టాయిలెట్స్ ను ఏర్పటు చేసింది.
93. షాహీన్ బాగ్ లా తైతుల ఉద్యమానికి కూడ
ఒక వేదిక లేదు. దాదాపు 34 రైతు సంఘాలు అందులో వున్నాయి. మరి కొన్ని త్వరలో
కలుస్తాయి.
94. ప్రతి రైతుసంఘంవాళ్ళు ఆ ప్రాంగణంలో పగలంతా
అనేక చోట్ల అనేక సభలు నిర్వహిస్తున్నారు.
95. పంజాబీ, హర్యాణ్వీ భాషల్లో సాగుతున్న ఆ
ప్రసంగాలు ఇతరులకు అర్థం అయినాకాకున్నా కొన్ని సందేశాలు మాత్రం స్పష్టంగా
తెలుస్తున్నాయి. భగత్ సింగ్, ఉధ్ధాం సింగ్ పేర్లు తరచుగా వినబడుతున్నాయి. వాళ్ళ
పేర్లు వినబడినప్పుడెల్లా రైతులు
ఉద్వేగంతో తప్పట్లు కొడుతున్నారు.
96. ఇందిరాగాంధీతోనే తలపడినవాళ్లం నరేంద్ర
మోదీతో తలపడలేమా అనే మాటలు కూడ వినబడుతున్నాయి.
97. ధనిక రైతులు కూడా చేరడంతో మీడియా కూడ ఈ
ఉద్యమం మీద ఆసక్తిని కనపరుస్తున్నది. ప్రధాన స్రవంతి మీడియాలోనూ సానుకూల కవరేజి
వస్తున్నది.
98. మీడియా కెమేరాలకు కరిష్మ కావాలి.
ఎర్రగా, పొడుగ్గా, అందంగా వుండి ఇంగ్లీషు-హిందీలో ధారాళంగా మాట్లాడే ఓసీ అమ్మాయిలు
ఉద్యమాల్లో మీడియాను గొప్పగా ఆకర్షిస్తుంటారు. అలాంటి కరిష్మ ఢిల్లీ రైతాంగ
ఉద్యమంలోనూ ఇప్పుడు కావలసినంతగా వుంది.
99. మధ్యతరగతి కదిలి వచ్చినపుడు ఉద్యమాలకు
ఒక ప్రదర్శన స్వభావం (Vigiblity) వస్తుంది. అది ఢిల్లీ ఉద్యమంలో ప్రస్పుటంగా
కనిపిస్తున్నది.
100. పంజాబ్ మార్కెట్ యార్డుల్లో ఇంతవరకు
పెత్తనాన్ని చెలాయించినవాళ్ళు రాజకీయంగా సహజంగానే కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ లకు
చెందినవారు. వాళ్లు ఇప్పుడు ఆందోళనలో చేరారు. దానితో ఈ ఉద్యమాన్ని వెనుక నుండి కాంగ్రెస్
నడుపున్నదనే మాట కూడ వినిపిస్తోంది.
101. ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక
ఏ రాజకీయ శక్తులున్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార
మాధ్యమాలను కోరడం వెనుక వుద్దేశ్యం నెపాన్ని విపక్షాల మీదకు నెట్టడమే .
102. ఉద్యమంలో విపక్ష పార్టీల అభిమానులు
వున్నమాట వాస్తవమేగానీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక మహా
ఉద్యమాన్ని నిర్మీంచే శక్తి ఇప్పటి విపక్షాలకు లేదు.
103. ఇప్పటికి ఇది స్వతంత్ర రైతు వుద్యమమే.
‘నవభారతానికి దారి చూపుతున్న
రైతాంగం’
డానీ
3.
అసలు శత్రువును గుర్తించిన రైతాంగం
104. ప్రస్తుత రైతు వుద్యమంలో ప్రముఖంగా
వినిపిస్తున్న పేరు గుర్నామ్ సింగ్ చాగుని. భారతీయ కిసాన్ యూనియన్ కు హర్యాణ
విభాగం అధ్యక్షునిగా వుంటున్న గుర్నామ్ వృత్తి రీత్య వ్యవసాయదారుడేగాక మార్కెట్ బ్రోకర్ కూడ.
105. దేశంలోని అనేక రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్
మోర్చ (ఎస్ కే ఎమ్) పేరిట ఒక సమాఖ్యగా
ఏర్పడ్డాయి.
106. భారతీయ కిసాన్ యూనియన్ (చాదుని) (గుర్నామ్ సింగ్
చాదుని)
107. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ (విఎం
సింగ్)
108. జైకిసాన్ ఆందోళన్ (అవిక్ సహ, డాక్టర్
అషీష్ మిటల్)
109. ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (వి
వెంకటరామయ్య)
110. ఆల్ ఇండియా కిసాన్ సభ (డాక్టర్ అశోక్
ధావల్, హన్నాన్ మొల్లా)
111. క్రాంతికారి కిసాన్ యూనియన్ (డాక్టర్
దర్శన్ పాల్)
112. బికెయు (దకౌంద) (జగ్మొహన్ సింగ్)
113. ఆశా – కిసాన్ స్వరాజ్ (కవిత కురుగంటి)
114. కర్ణాటక రాజ్య రైత సంఘ (కొడిహళ్ళి
చంద్రశేఖర్)
115. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్
మెంట్ (మేథా పాట్కర్)
116. లోక్ సంఘర్ష్ మొర్చా (ప్రతిభా షిండే)
117. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ (రాజారామ్
సింగ్, ప్రేమ్ సింగ్ గెల్హాట్)
118. స్వాభిమాని షేత్కారి సంగ్హటన్ (రాజు
షేట్టి)
119. సగ్తీన్ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (రిచా
సింగ్)
120. జమ్హూరి కిసాన్ సభ (సత్నామ్ సింగ్
అజ్నాల)
121. ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘటన్
(సత్యవాన్).
122. కిసాన్ సంఘర్ష్ సమితి (డాక్టర్
సునీలమ్)
123. తెరాయి కిసాన్ సభ (తాజిందర్ సింగ్
విర్క్)
124. జైకిసాన్ ఆందోళన్ (యోగేంద్ర యాదవ్)
125. బికెయు (రాజేవాల్) (బల్బీర్ సింగ్
రాజెవాల్)
126. గన్నా సంఘర్ష్ సమితి – భడ్సన్ (రాంపాల్
చాహల్)
127. గన్నా సంఘర్ష్ సమితి –షాజాద్ పూర్
(వినోద్ రానా)
128. కిసాన్ సంగర్ష్ సమితి (సత్యవాన్ దనోద)
129. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (జోగిందర్
సింగ్ ఉగ్రహాన్)
130. అనేక రాష్ట్రాల నుండి అనేక రైతు సంఘాలు
సంయుక్త కిసాన్ మోర్చ లో చేరనున్నాయి.
131. ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను క్రిమినలైజ్
చేయడం, పౌరసత్వ సవరణ బిల్లు తేవడం వంటి వేధింపులకు గురిచేసినపుడు ముస్లిం సమూహం లౌకిక
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించింది.
132. రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కు కాదని సుప్రీం
కోర్టు అన్నపుడు ఎస్సీలు, ఎస్టీలు కూడ సంక్షేమ రాజ్యాంగ పరిరక్షణ నినాదాలు ఇచ్చాయి.
133. కర్మిక హక్కుల్ని కాలరాసే చట్టాలు తెచ్చినపుడూ
కార్మికులు ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలు
ఇచ్చాయి.
134. ఈ వేధింపు చట్టాలన్నీ అస్మదీయ కార్పొరేట్ల
సంపదను పెంచడానికేనని తొలిసారిగా గుర్తించింది రైతాంగమే. ఇది గుణాత్మక మార్పు.
135. ఆడానీ, అంబానీలకు ప్రయోజనాలను
సమకూర్చడానికే ఈ వ్యవసాయ సంస్కరణలు చేపట్టారని రైతాంగ నాయకులు బాహాటంగానే
విమర్శిస్తున్నారు.
136. వ్యవసాయ సంస్కరణ బిల్లుల మీద
రాష్ట్రపతి సంతకం పెట్టిన రెండు రోజుల్లోనే అక్టోబరు 2న పంజాబ్ రైతులు పాటియాల,
సంగ్రూరు పట్టణాల్లో మాల్స్, ప్రైవేటు ధర్మల్ స్టేషన్ల ముందు ధర్ణాలు చేశారు.
137. కేంద్ర ప్రభుత్వంతో ఆరు రౌండ్ల చర్చలు
విఫలం అయ్యాక డిసెంబరు 9న జరిగిన సమావేశంలో రైతు సంఘాల నాయకులు కొన్ని కఠిన
నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వం మూడు చట్టాలను ఉపసంహరించుకోని పక్షంలో రియన్స్
మాల్స్, ఆడానీ టోల్ గేట్స్ లను లక్ష్యంగా చేసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
138. ఇప్పుడు రైతాంగం దృష్టిలో నరేంద్ర మోదీజీ
– అమిత్ షాజీల ప్రభుత్వానికి ఆడానీ, ఆంబనీ
తదితరులు అస్మదీయ కార్పొరేట్లు.
139. అస్మదీయ కార్పొరేట్లు వున్నప్పుడు
తసమదీయ కార్పొరేట్లు కూడా వుంటారు. ఈ
చారిత్రక సందర్భంలో తసమదీయ కార్పొరేట్లు
ఏం చేస్తారన్నది కీలక అంశం.
140. సామ్రాజ్యవాదుల మీద సాగే పోరులో
జాతీయ బూర్జువావర్గం కూడా కలిసి వస్తుందని
మావో సే టుంగ్ ఒక దశలో చెప్పాడు. చైనాలో జపాన్
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట దశలో కమ్యూనిస్టులు, జాతీయ బూర్జువావర్గం కలిసి
పనిచేశారు. చైనా నుండి సామ్రాజ్యవాదుల్ని
తరిమి కొట్టడంలో విజయాన్ని సాధించారు.
141. భారత దేశంలో కూడ జాతీయ బూర్జువావర్గం
ఒకటి ఆవిర్భవిస్తుందని 1970వ దశకంలో విప్లవ కమ్యూనిస్టులు ఆశించేవారు. కానీ
ఎప్పుడూ జాతీయ బూర్జువావర్గం ఉనికిలోనికి రాలేదు.
142. ఆర్థికంగా కొంచెం బలపడగానే మన కార్పొరేట్లు ఎంఎన్ సి లతో వాణిజ్య
ఒప్పందాలు చేసుకోవడానికి ఉవ్విళ్ళూరడాన్నే మనం ఇంతకాలం చూస్తూవస్తున్నాం.
143. ఆటో మోబైల్స్ రంగంలో హీరో-హోండా,
బజాజ్-కవాసాకి, టివిఎస్ – సుజికి వంటి పేర్లు అలా వచ్చినవే.
144. కేంద్రప్రభుత్వాలు కార్పొరేట్లను
ప్రోత్సహించడం అనేది చాలా కాలంగా వున్నదే.
అలాగే ఎన్నికల ఖర్చు కోసం రాజకీయ పార్టీలు కార్పొరేట్ల నుండి నిధుల్ని
సేకరించే సాంప్రదాయమూ పాతదే.
145. ప్రభుత్వం నుండి లైసెన్సులో, భూములో,
రాయితీలో పొందకుండ బలపడిన కార్పొరేట్లు మన
దేశంలో ఒక్కరూ వుండరంటే అతిశయోక్తికాదు. దీనినే ప్రాయోజిత పెట్టుబడీదారీ వ్యవస్థ
(క్రోనీ కేపిటలిజం) అంటున్నాము.
146. ఇప్పుడు మొట్టమొదటిసారిగా భారత
కార్పొరేట్ రంగంలో అస్మదీయ కార్పొరేట్లు, తస్మదీయ కార్పొరేట్లు అనే విభజన
కనిపిస్తున్నది.
147. కేంద్ర ప్రభుత్వం ఆడానీ, అంబానీలను
అతిగా ప్రోత్సహిస్తూ ఇతర కార్పొరేట్లను పక్కన పడేస్తున్నదనే విమర్శలున్నాయి.
148. ఈ పరిణామాలతో ఇతర కార్పొరేట్లు కేంద్ర ప్రభుత్వ
తీరు మీద అసంతృప్తితో వున్నారనే మాట ఇటీవల తరచుగా వినిపిస్తున్నది.
149. కొత్తగా వునికి లోనికి వస్తున్న తసమదీయ
కార్పొరేట్ల తదుపరి అడుగు ఎటువైపు అని దేశం (ముఖ్యంగా కార్మిక కర్షకులు) ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
150. బజాజ్ ఆటోస్ కు చెందిన వృధ్ధ కార్పొరేట్
రాహుల్ బజాజ్ కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను బాహాటంగానే తప్పు
పడుతున్నారు. కార్పొరేట్ రంగంలో ఒక రకం భయం వెంటాడుతున్నదని ఆయన విమర్శిస్తున్నారు.
151. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని
మహాత్మా గాంధీజీకి ‘ఐదవ కొడుకు’గా పేరు తెచ్చుకున్న జమ్నాలాల్ బజాజ్ మనవడే రాహుల్
బజాజ్.
152. రాహుల్ బజాజ్ లా అసంతృప్తితో వున్న
కార్పొరేట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదనే వార్తలు వినవస్తున్నాయి. వారు బయటపడతారా
లేదా అనే సందేహాలూ వున్నాయి.
153. తసమదీయ కార్పొరేట్లు మరి కొందరు బయటపడి
రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తారనే మాట సామాజిక విశేషకుల్లో వినిపిస్తున్నది. అదే జరిగితే
భారత రాజకీయార్థిక రంగంలో కొత్త చరిత్ర మొదలవుతుంది.
154. అలా జరుగకపోతే, షాహీన్ బాగ్ ఉద్యమాన్ని
అణిచివేసినట్టు కోవిడ్ వ్యాప్తి వంకతోనో, శాంతిభద్రతల వంకతోనో రైతాంగ ఉద్యమాన్ని
అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఓ పది
పదిహేను రోజులు కూడ పట్టదు.
155. అయితే, ఈసారి రైతాంగ ఉద్యమం కొన్ని మహత్తర అంశాలను చర్చకు తెచ్చింది. అవి ఒకవేళ ఇప్పటికి
అణిచివేతకు గురయినా సమీప భవిష్యత్తులో కొత్త ఉత్సాహంతో ముందుకు నడుస్తాయి.
(అయిపోయింది)
Three Farm
Acts
1.
The Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Act
- 2020
2.
The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance
and Farm Services Act- 2020 and
3.
The Essential Commodities (Amendment) Act- 2020.
రచన : 14 డిసెంబరు 2020
ప్రచురణ :