Wednesday 9 December 2020

జగన్ నవరత్నాలకు లిక్కర్ గ్రహణం

విజయవాడ

1 డిసెంబరు 2020

 

మిత్రులు వి. లక్ష్మణ రెడ్డి గారికి,

చైర్మన్; మద్య విమోచన ప్రచార కమిటీ 

 

జగన్ నవరత్నాలకు లిక్కర్ గ్రహణం

 

            నేను రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ లో వుంటున్నాను. రోజూ రాత్రి ఓ 60 ఎంఎల్ బ్రాంది తాగితే మంచిదని నాకు డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను డైలీ 90 ఎంఎల్ పుచ్చుకుంటాను. నా రెగ్యులర్ బ్రాండ్ ‘మార్ఫియస్’.   నా కాంప్రమైజ్ బ్రాండ్ ‘మాన్షన్ హౌస్’. ఇప్పుడు తెలంగాణకన్నా రెట్టింపు ధర పెట్టినా ఆ రెండు బ్రాండ్లు ఏపి  ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో అందుబాటులో లేవు. నేను ఓ నలభై ఏళ్ళుగా డ్రింక్ చేస్తున్నాను. ఎన్నడూ కనీ వినీ ఎరుగని బ్రాండ్స్ ను ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో అమ్ముతున్నారు. వాటిల్లో ఏవి చీప్ లిక్కరో? ఏవి మీడియం బ్రాండ్లో? ఏవి ప్రీమియం బ్రాండ్లో? నాలాంటి సీనియర్లకు కూడ అర్థం కావడం లేదు. ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన ధరలే ఎక్కువగా వున్నాయంటే ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో ఇంకాస్త ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. 

            డ్రింక్ చేసే వాళ్ళకు  బ్రాండ్ లాయల్టీ అనేది ఒకటి వుంటుంది. ఈ అంశాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మిస్ అవుతోంది. ఇందులో ఒక ట్విస్ట్ ఏమిటంటే ఫుల్ బాటిల్ కు ఒక మూడు వందల రూపాయలు ఎక్కువగా చెల్లిస్తే   ‘మార్ఫియస్’, ‘మాన్షన్ హౌస్’  రెండూ మా వీధి చివర బార్ లో కావలిసినంత దొరుకుతున్నాయి.  ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బార్లలో ఎలా దొరుకుతున్నాయో మీకే తెలియాలి. 

            నేను సాధారణంగా బార్లకు వెళ్ళను. ఇంట్లోనే కంప్యూటర్ మీద పనిచేస్తూ డ్రింక్ చేస్తాను. ఇంట్లో తాగితే ఆరు  లాభాలు. మొదటిది భద్రత, రెండవది కాస్ట్ ఎకానమీ, మూడవది సమయం  ఆదా, నాలుగవది రాతపని, రీసెర్చ్ పని కొనసాగుతుంటుంది, ఐదవది భార్యాపిల్లలకు దగ్గరగా వుంటాము. ఆరవది; మద్యం మోతాదు కూడ అదుపులో వుంటుంది. ఏపీ లిక్కర్ పాలసీ మాలాంటి వాళ్ళను    కూడ బార్లకు వెళ్ళేలా చేస్తున్నది.

            కావాలంటే టోటల్ ప్రొహిబిషన్ పెట్టవచ్చు. అప్పుడు మందుప్రియులు ఇతర రాష్ట్రాలకు పోయి మందు తాగుతారు. కానీ ఇదేం ప్రొహిబిషన్? ఇదేం ప్రొహిబిటివ్ కాస్ట్?. ఈ చిత్ర విచిత్ర మద్యం బ్రాండ్లు ఎక్కడి నుండి వచ్చాయీ? ఈ అనామక కంపెనీల తయారీదార్లు ఎవరూ? చాలా చిరాకుగా వుంది. 

            రాష్ట్రంలో మద్యం అమ్మకాలను భారీగా తగ్గించినట్లు మీరు మీడియా సమావేశాల్లొ వివరిస్తున్నారు. నిజం అదికాదు. పేదవాళ్ళు తాగే చీప్ లిక్కర్ ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో  ఇప్పటికీ సాధారణ స్థాయిలో సేల్ అవుతున్నది. పేద ప్రజల తాగుడు తగ్గలేదు. చీప్ లిక్కర్ డిమాండ్ అలాగే కొనసాగుతోంది. మధ్యతరగతి, ఎగువ తరగతులు ఇష్టపడే మీడియం, ప్రీమియం బ్రాండ్ల సేల్ తగ్గింది. మధ్య తరగతి, ఎగువతరగతివాళ్ళు ఏపీలో తాగడం తగ్గించి పొరుగురాష్ట్రాలకు పోతున్నారు. లేదా అక్కడి నుండి మద్యం తెప్పించుకుని ఇక్కడ తాగుతున్నారు.  

            ఇటలీ వంటి యూరప్ దేశాల్లో ఇంట్లోనే వైన్ చేసుకుకునే సాంప్రదాయం వుంది. క్రైస్తవులు క్రిస్మస్ సందర్భంగా వైన్ తయారుచేసుకునే సాంప్రదాయం మన దేశంలోనూ వుంది. నా అంచన ప్రకారం త్వరలో ఏపీలో ఎగువ తరగతి,  మధ్యతరగతి వర్గాలు హోమ్ మేడ్ ఫారిన్ వైన్ (HMFW) తాగడం మొదలెడతారు. దిగువ తరగతి పేద వర్గాలు నాటుసారా భట్టిలు మొదలెడతారు. నాటుసారా క్రమంగా కల్తీసారాగా మారుతుంది. అది గుంపు మరణాలకు దారితీస్తుంది. అలాంటి అనివార్య పరిస్థితి ఏపీలో వుంది. 

            ఏపీలో లిక్కర్ షాపుకు వెళ్ళిన వాళ్ళకు రెండు అభిప్రాయాలు కలుగుతున్నాయి. మొదటిది; ఎకైజ్ శాఖకు లిక్కర్ నిర్వహణ సామర్థ్యం లేదని.  రెండోది; లిక్కర్ తయారీ కంపెనీలు, ఎకైజ్ శాఖ, లిక్కర్ షాపుల నిర్వాహకులు ముగ్గురూ కలిసి  ప్రజల్ని అడ్డంగా దోచేస్తున్నారు అని. ఇలాంటి ధోరణి ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. 

            ఏపీలో సంక్షేమ పథకాలన్నీ నిజానికి చాలా గొప్పగా వున్నాయి. సమర్థంగా పనిచేస్తున్నాయి కూడ. ఆ విషయంలో అభద్రలోకం సంతృప్తిగా వుంది. నవరత్నాల్లోని లిక్కర్ విభాగంలో మాత్రం ప్రభుత్వం మీద ప్రతికూల ధోరణి తీవ్రంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు ఇసుక విషయంలోనూ తీవ్ర అసంతృప్తి వుండేది. అయితే దాన్ని ఇటీవల  కొంత సంస్కరించారు. నవరత్నాల్లో మిగిలిన ఎనిమిది సంక్షేమ పథకాలు సృష్టిస్తున్న ప్రభుత్వ అనుకూల వాతావరణాన్ని లిక్కర్ పాలసీ ఒక్కటే మింగేస్తున్నదని నాకు అనిపిస్తున్నది.  రేపు స్థానిక ఎన్నికలు జరిగితే  ప్రజలు ఆ మేరకు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఆ నింద మొత్తం ఎక్సైజ్  విభాగానిదే అవుతుంది.  

             మీకు మిత్రునిగా, వైయస్సార్ సిపి శ్రేయోభిలాషిగా ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

 

మీ శేయోభిలాషి

డానీ

సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు

No comments:

Post a Comment