Mohan- Chittaprasada of Our Times
మనకాలపు చిత్తప్రసాద్ మోహన్
డానీ
చిత్రకారుడు మోహన్ గురించి గత మూడేళ్ళుగా అనేక మంది అనేక
వ్యాసాలు రాశారు. ఈరోజు మోహన్ కళాసేవల విస్తృతి గురించి మాట్లాడుకుందాము.
మోహన్ చనిపోయిన రోజు
(21 సెప్టెంబరు 2017) ఆంధ్రజ్యోతి కోసం రాసిన వ్యాసంలో తనను ‘మన కాలపు చిత్త ప్రసాద్’
అన్నాను. ఈ సభానిర్వాహకులు తాడి శకుంతల, కాగితాల రాజశేఖర్ అప్పటి నా వ్యాఖ్యానాన్నే
ఆహ్వానపత్రానికి శీర్షికగా స్వీకరించడం సంతోషంగా వుంది.
చిత్త ప్రసాద్ కు
ఒక సౌలభ్యం వుంది. ఆయన ప్రధానంగా వుమ్మడి కమ్యూనిస్టు పార్టీతో వున్నాడు. కమ్యూనిస్టు
పార్టి పార్లమెంటరీ పంథాను స్వీకరించాక ఆయన దానికి దూరమయినా 1978లో చనిపోయే వరకు శ్రామికుల
చిత్రకారునిగా కొనసాగాడు. అలా చిత్తప్రసాద్ చిత్రాలు స్థూలంగా ఒకే అంశంతో వుంటాయి.
విఖ్యాత కథకుడు గై
డి మొపాసా నిజానికి ఓ పది పదిహేనేళ్ళు మాత్రమే రచనలు చేశాడు. 1870ల నాటి ఫ్రాంకో-ప్రష్యన్
యుధ్ధాలే ఆయన కథలకు నేపథ్యంగా వున్నాయి. ఇంకో ప్రఖ్యాత కథకుడు సాదత్ హసన్ మంటో కథలకు
కూడ నేపథ్యం భారత దేశవిభజనే. మోహన్ కాన్వాస్ అలా homogeneous కాదు.
ఆంధ్రప్రదేశ్ లోనేగాక
జాతీయంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ 1970-2020 మధ్య కాలం ఒక కల్లోల యుగం. కమ్యూనిస్టు
పార్టీలు, గ్రూపులు ఓ 40-ప్లస్ అయ్యాయి. అనేకానేక అస్తిత్వవాద ధోరణులు తలెత్తాయి. తూర్పు
యూరప్ తో పాటూ ఏకంగా కమ్యూనిస్టుల ‘మక్కా’ రష్యాలోనే సోషలిస్టు వ్యవస్థ పతనమైంది. ప్రపంచ
వాణిజ్య సంస్థ ఆవిర్భావంతో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (LPG) ఆర్థిక విధానాలు
పడకగదుల్లోనూ వచ్చేసి కవులూ, కళాకారులు, ఆలోచనాపరులకు కొత్త సమాళ్ళు విసిరాయి.
మోహన్ ఈ సవాళ్ళను
స్వీకరించాడు. కమ్యూనిస్టు పార్టీలు, వాటి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలకేకాక దళిత మహాసభ,
మాదిగ దండోర, మాల మహానాడు, ఆదివాసులు, స్త్రీవాదులు,
మైనార్టివాదులు, మలి దశ తెలంగాణ ఉద్యమం వగయిరాలు
అన్నింటికీ తన క్రోక్విల్ సేవలు అందించాడు. మోహన్ చిత్రాలు వైవిధ్య భరితం;
heterogeneous. వేదికల మీద మాట్లాడేది నల్లమల గిరిప్రసాద్, కొరటాల సత్యనారాయణ, సురవరం
సుధాకర రెడ్డి, కాళోజీ నారాయణరావు, వరవరరావు, బాలగోపాల్, కత్తి పద్మారావు, మంద కృష్ణ
మాదిగ, కేసిఆర్ కావచ్చు. ఆ వేదికలన్నింటి వెనుక మోహన్ సృష్టించిన బ్యాక్ డ్రాప్ లే
వుండేవి.
కార్ల్ మార్క్స్ ఒక
సందర్భంలో “లార్డ్ బైరన్ ఆలోచనలు ప్రమాదకరమైనవిగాబట్టి అతను 36వ ఏట చనిపోయినందుకు మనం
ఆనందించాలి. పెర్సీ బైషే షెల్లీ సామ్యవాద ఆలోచనలు గలవాడు కాబట్టి అతను 29వ ఎట చనిపోయినందుకు
మనం బాధపడాలి” అన్నాడు. మంచి మనిషి కాకుండ
ఎవరూ గొప్ప కళాకారులు, ఆలోచనాపరులు కాలేరు.
కమ్యూనిస్టు పార్టీల్లోనో,
వాటి అనుబంధ సంస్థల్లోనో సభ్యులుగా వున్నంత మాత్రానా మనుషులు కమ్యూనిస్టులు అయిపోరు.
వర్తమాన సమాజంలో కమ్యూనిస్టులుగా చెప్పుకునేవాళ్ళలో
ఎక్కువ మంది బూటక స్వభావులు. Hippocrates. జీవితంలో ఎన్నడూ కమ్యూనిస్టులుగా బతికినవారుకాదు;
కమ్యూనిస్టు నీతి నియమాలను పాటించినవారూ కాదు. మన మధ్య కమ్యూనిస్టుగా బతికిన బహుకొద్ది
మందిలో మోహన్ ఒకడు. కమ్యూనిస్టు అంటే వున్నంతలో కమ్యూన్ జీవితాన్ని గడపాలి. మనం సాటి
‘కామ్రేడ్’ ‘కమ్యూనిస్టు’ అనుకుని పలకరించడానికి వెళితే వాళ్ళు లివింగ్ రూమ్ లోనే కాఫీ
టీ ఇచ్చి వెనక్కి పంపించేస్తే ఒళ్ళు మండదూ? ఆ పని కమ్యూనిస్టేతరులు చేస్తారు. అదే పని
వీళ్ళూ చేస్తే ఎలా? మరి కమ్యూనిస్టులు అందుకు భిన్నంగా ఏం చేయాలీ?
చనిపోవడానికి ముందు
మోహన్ ఓ 10-15 యేళ్ళు ఓ కమ్యూన్ ను నడిపాడు. ఎవరయినా సరే అందులోనికి ప్రవేశించవచ్చు.
నేరుగా వంట గదిలోనికి పోవచ్చు. స్వయంగా వండుకొని తినవచ్చు. వండింది ఇతరులకు కూడ వడ్డించవచ్చు.
గ్రామాల్లో ఓ గీత
గీయగానే తమలో ఓ చిత్రకారుడు వున్నాడని భావించిన ప్రతి ఒక్కడూ బస్సో రైలో ఎక్కి మోహన్
కమ్యూన్ లో వాలిపోయేవారు. మోహన్ కమ్యూన్ లో చేరాక గీత నేర్చుకున్నవారూ వున్నారు. ఆ
రోజుల్లో హైదరాబాద్ లో వేమన వసంత లక్ష్మి, వాసిరెడ్డి శరత్ కూడా తమదైన పధ్ధతుల్లో కమ్యూన్
లు నిర్వహించేవారు. మోహన్ కమ్యూన్ కు శ్రామికవర్గ సంస్కృతి ఎక్కువగా వుండేది. మమ్మ
మాస్ !
1980 – 96 మధ్య కాలంలో విజయవాడ సున్నపు భట్టీల సెంటరులో
మా ఇల్లు కూడ ఒక కమ్యూన్ గా వుండేది. 11 ద్వారాలున్న ఇల్లు అయినా ద్వారాలు, కిటికీలకు
తలుపులు వుండేవి కావు. కామ్రేడ్స్ లోపలికి రావడానికి అడ్డంకులు లేవు. కామ్రేడ్స్ అర్థరాత్రి వచ్చి భార్యాభర్తలు పడుకునివున్న మంచాన్ని చడీచప్పుడు కాకుండ దాటి వంట గదిలోనికి
వెళ్ళి మైదా ఉడికించుకుని వెళ్ళిపోయేవారు.
నిరంతరం ఓ ఇద్దరు (కొన్నిసార్లు అంతకు మించి)
శాశ్విత అతిథులుగా వుండేవారు. “ద్వారములు తెరిచియే వున్నవి”.
గ్రీకు తత్వవేత్త
సోక్రటీస్ గొప్పతనం ప్లేటోకు గురువుకావడం. ప్లేటో గొప్పతనం అరిస్టాటిల్ కు గురువుకావడం. శిష్యుల సృష్టి కూడ గురువుల గొప్పతనానికి ఒక కొలమానం.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప చిత్రకారులుగా
వున్నవారి జాబితా తీస్తే వారిలో చాలా మంది మోహన్ కమ్యూన్ నుండి వచ్చినవారే అయ్యుంటారు.
మొహన్ గొప్పదనానికి అదొక కొలమానం. ఈ కమ్యూన్
లో అనేకమంది కవులూ కళాకారులూ తమ నైపుణ్యాలకు పదును పెట్టుకున్నారు.
రష్యాలో బోల్షివిక్
విప్లవం 1917లో విజయవంతమైంది. అప్పట్లో అమెరికాలోనూ బోల్షివిక్ అభిమానులు వుండేవారు.
వాళ్ళలో చాలా మందిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్ళలో పడేసింది. విఖ్యాత
రచయిత
జాక్ లండన్ అప్పట్లో రాడికల్ సాహిత్య సమూహం ‘ద క్రౌడ్’ లో చురుగ్గా వుండేవాడు. తను సృష్టించిన నవలలేగాక, స్క్రిప్టు రాసిన సినిమాలు కూడా హాలీవుడ్
లో భారీ విజయాలను సాధించడంతో జాక్ లండన్ సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. అరెస్టు అవ్వాల్సిన
జాబితాలో అతని పేరు కూడ వుందిగానీ ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా జాక్ లండన్ కు వున్న ప్రజాదరణ రీత్యా ప్రభుత్వం జంకింది.
1908 నాటి జాక్ లండన్
నవల ‘ఉక్కుపాదం’ (The Iron Heel) ఒక తిరస్కార సమాజాన్ని (dystopian) చిత్రిస్తుంది.
నవల చివర ఒక ఆదర్శ సమాజాన్ని (utopian) సూచిస్తుంది. నిజజీవితంలోనూ జాక్ లండన్ కు అలాంటి
ఆదర్శధామ ఆలోచనలు వుండేవి. వాటిని సాకారం చేయడానికి ఒక సువిశాల వ్యవసాయ క్షేత్రాన్ని
కొనుగోలు చేశాడు. అందులో ఒక ఎస్టేట్ నిర్మాణం
మొదలెట్టాడు. “మన కలల సామ్యవాద సమాజం ఏర్పడడానికి ఇంకా సమయం పట్టవచ్చు. మనమేమీ నిరాశ
చెందవద్దు. మీరు జైళ్ళ నుండి విడుదలయ్యాక నేరుగా నా ఎస్టేట్ కు వచ్చేయండి. అక్కడ సామ్యవాద
జీవితాన్ని గడుపుదురుగాని. మనం ఒక దేశాన్ని విముక్తి చేయలేకపోవచ్చు; కానీ ఒక వ్యవసాయ
క్షేత్రాన్ని కమ్యూన్ గా మార్చలేమా” అనే అర్థం వచ్చేలా సోషలిస్టు ఖైదీలకు 1916లో ఉత్తరాలు
రాశాడు. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు భారీ అగ్నిప్రమాదం జరిగి ఆ ఎస్టేట్ కాలిబూడిదయిపోయింది.
సామ్యవాద సమాజం కోసం తను కన్న చివరి కల కూడ చితికిపోవడంతో ఆ రాత్రే జాక్ లండన్ ఆత్మహత్య
చేసుకున్నాడు.
ఇప్పుడు జాక్ లండన్
ప్రస్తావన తేవడానికి ఒక ప్రత్యేక కారణం వుంది. సమాజంలో ఆలోచనాపరులు, కవులు కళాకారులు,
యాక్టివిస్టులు తగ్గిపోతున్నారనీ, వున్న కొద్దిమంది కూడ వలసపోతున్నారనీ, ప్రభుత్వంలో చేరిపోతున్నారనీ ఇటీవల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన
సమంజసమైనదే గానీ ఈ ఆరోపణలో ఒక నిజాయితీ లోపం వుంది. ఆలోచనాపరులు, కవులు కళాకారులు,
యాక్టివిస్టులు ఉత్సాహంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని మనం కల్పిస్తున్నామా? అనేది
సామ్యవాద అభిమానులు ఆలోచించుకోవాలి.
ఆలోచనాపరులు స్వభావరీత్యానే అనేక అవకాశాల్ని (advantages) కోల్పోతుంటారు. వాళ్ళకు కొన్ని గౌరవాలు (privileges) అయినా మనం సమకూర్చుతున్నామా? గతంలో కవులూ కళాకారులు కలిసినపుడు స్తోమత కలిగినవాళ్ళు వాళ్ళకు పుస్తకాలు కొనిపెట్టేవారు. భోజనం-వసతి కల్పించేవారు. వాళ్ళ ప్రయాణాలకు చేతనైన సహాయం చేసేవారు. వాళ్ళ రచనల ప్రచురణకు తోడ్పడేవాళ్ళు. అందుకే ఆ రోజుల్లో అంతమంది ఆలోచనాపరులు, కవులు కళాకారులు, యాక్టివిస్టులు వుండేవారు. మనం మన కర్తవ్యాలను నిర్వర్తించడం మానేశాం. సానుకూల వాతావరణం లేకపోవడంతో వాళ్లు తగ్గిపోయారు. ఇప్పుడు మనమే వాళ్లు తగ్గిపోయారని నిందిస్తున్నాం. ఏది కారణం? ఏది కార్యం? నారువేయకుండ, నీరు పోయకుండ పంట దిగుబడి రావాలంటే ఎలా వస్తుందీ?
1970ల చివర్లో 1980ల ఆరంభంలో విజయవాడలో ఒక గొప్ప సానుకూల వాతావరణం వుండేది. మోహన్, పతంజలి, నేను, ఖాదర్, గౌస్, విశ్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, సురేంద్రలు యువతరం. పెద్దిభట్ల సుబ్బరామయ్య, వేగుంట మోహన్ ప్రసాద్, సోదుం రామ్మోహన్, పి. రామకృష్ణారెడ్డి, టిఎల్ కాంతారావు మా పైతరం, మహీధర రామ్మోహన రావు, కంభంపాటి సీనియర్ ఆ పైతరంగా వుండేవాళ్లం. మూడు తరాలు కలిసి వుండడంవల్ల మామధ్య ఒక సహజ అనుబంధం (organic link) ఉండేది. సమిష్టి జ్ఞానసముపార్జన స్థాయి గొప్పగా వుండేది. సోషల్ కేపిటల్ అంటే కులం నుండి, వంశం నుండి సంక్రమిస్తుందని చాలా మంది అనుకుంటారు. మనం నివశించే పట్టణాల నుండి, మనం తిరిగే సమూహాల నుండి కూడ సోషల్ కేపిటల్ సమకూరుతుంది.
తరువాతి కాలంలో ఊసా,
ఎన్ వేణుగోపాల్, వసంతలక్ష్మి, త్రిపురనేని శ్రీనివాస్, కే శ్రీనివాస్, కే బాలగోపాల్,
సతీష్ చందర్, ప్రసేన్, అఫ్సర్, బిఎస్ రాములు, అల్లం నారాయణ తదితరులు కూడ విజయవాడకు
నివాసాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. అప్పట్లో విజయవాడ మీడియా సెంటర్ కావడంవల్ల
వాళ్ళొచ్చారు అనవచ్చుగానీ అదొక్కటే కారణంకాదు. విజయవాడలో ఆలోచనాపరులకు ఆదరణ గొప్పగా
వుండేది. మా సమూహానికి నాగేంద్ర ప్రెస్ బాబూరావుగారు చాలాకాలం ఒక ఆశ్రయంగా వుండేవారు.
అప్పుడుకదా విజయవాడను ప్రేమించ బుధ్ధి వేసేదీ? అలాంటి పాత్రని ఇప్పుడు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు
నిర్వహిస్తున్నట్టున్నాడు.
ఒకటి మాత్రం నిజం.
మనం కమ్మర్షియల్ బతుకు బతికితే మన చుట్టూ కమ్మర్షియల్ కళాకారులు వుంటారు. మనం కమ్యూన్
బతుకు బతికితే మన చుట్టూ కమ్యూనిస్టు కళాకారులు వుంటారు.
మారుతీనగర్ లోని దాసరి
శిరీష ఇంట్లో 1978 చివర్లో నేను మోహన్ ను మొదటిసారి కలిశాను. అది యాధృఛ్ఛికంగా చిత్తప్రసాద్
చనిపోయిన సంవత్సరం. అప్పుడు నా వయస్సు 27. తను నాకన్నా ఓ ఏడాది మాత్రమే పెద్ద. అయితే,
ఓ సీనియర్ కార్మిక నాయకుని కొడుకు కావడంవల్ల ఇంటా బయట కమ్యూనిస్టు పార్టి వాతావరణంలో
పెరిగాడు. జాతీయ (అంతర్జాతీయ?) యవజనోత్సవాలకు కలకత్తా వెళ్ళి వచ్చాడు. అక్కడ అరెస్టు
కూడా అయ్యాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనల విస్తృతి మాకన్నా విశాలంగా వుండేది.
నేను అప్పట్లో రాడికల్
యూత్ లీగ్ కు కృష్ణా జిల్లా అధ్యక్షునిగా వుండేవాడిని. నరసాపురం అనే ఓ సముద్రపుగట్టు
చిన్న పట్టణం నుండి వచ్చినవాడిని. అంచేత నా మదర్ బోర్డు, ర్యామ్ రెండూ విజయవాడతో పోలిస్తే
చిన్నవి. అయితే, ఎదుటి వ్యక్తిలోని బలమైన అంశాన్ని
కనిపెట్టగలిగే కొన్ని తెలివితేటలు కూడ నాకు వుండేవి. ఆర్టిస్టుగా మోహన్ కు అది ఆరంభదశ.
విపరీతంగా పుస్తకాలు చదివేశాడు. అది అతని స్ట్రాంగ్ పాయింట్. పరిచయం అయిన రెండోరోజే ఒక విన్నపం చేశాను. “మాలాంటి
కార్యకర్తలకు రోజూ ఏవో పార్టి పనులుంటాయి. అదే పనిగా పుస్తకాలు చదవడం అస్సలు కుదరదు.
అలాగని పుస్తకాలు చదవకపోయినా అస్సలు కుదరదు. అంచేత నాకు ఒక హెల్ప్ చేయి. నువ్వు పదిపుస్తకాలు
చదివినపుడు వాటిల్లో ల్యాండ్ మార్క్ పుస్తకాన్ని సెలెక్ట్ చేసి నాకు చెప్పు. అది నేను చదువుతాను. టెన్ ఈస్టు ఒన్!”
అన్నాను. “అదేం పెద్ద పనబ్బా” అన్నాడు. అలా ఆ కాలంలో మోహన్ చెప్పిన ల్యాండ్ మార్క్
పుస్తకాలన్నీ చదివి నేను వుంటాను. బుక్ రీడింగ్ లో బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోయినా స్నాతకోత్సవం
జరిగింది అనిపించుకున్నాను. మోహన్ స్కూల్లో
ఈ ‘క్రాష్ కోర్స్’ పుణ్యమా అని పుస్తకాలు చదవడంలో నేను ఓ పదేళ్ళు ఆదా చేయగలిగాను.
“నాతో మాట్లాడడమే
ఒక ఎడ్యుకేషన్” అంటాడు గిరీశం. మోహన్ తో సినిమా చూడడం కూడ ఒక ఎడ్యుకేషన్. హాలివుడ్ నటి ఆడ్రీ హెప్ బర్న్ (Audrey
Hepburn) అంటే మోహన్ కు చాలా ఇష్టం. ఆమె నటించిన ‘మై ఫెయిర్ లేడీ’, ‘రోమన్ హాలీడేస్’
ను మోహన్ తో కలిసి చూశాను. బెర్నార్డ్ షా 1913లో రాసిన ‘పిగ్మాలియన్’ నాటకాన్ని ‘మై ఫెయిర్ లేడీ’ పేరుతో సినిమాగా తీశారు. ఆ నాటకాన్ని
నేను చదవలేదు. మోహన్ రన్నింగ్ కామెంట్రీ సహితంగా ఆ సినిమాను చూడడంవల్ల ఆ నాటకం చదివినంత
జ్ఞానం వచ్చేసింది.
ప్రసంగాన్నీ చిత్తప్రసాద్
తో మొదలెట్టానుగాబట్టి చిత్తప్రసాద్ తోనే ముగిస్తాను. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
ఆందోళన సాగిస్తున్న రైతులకు సంఘీభావాన్ని తెలపడానికి ఇటీవల నేను ఢిల్లీ వెళ్ళాను. నా
చిరకాల మిత్రుడు బిబిజి తిలక్ నాకు స్థానికంగా సహకరించాడు. తను ఇటీవల సర్రియలిస్టిక్
పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఆ సింఘూ బోర్డర్ లో, గాజీపూర్ బోర్డర్ లో రైతు ఆందోళనకారులతో
వున్నంత సేపూ నాకు చిత్తప్రసాద్, మొహన్ లే గుర్తుకు వచ్చారు. వాళ్ళయితే ఈ చారిత్రక
ఘట్టాన్ని ఎలాంటి చిత్రాలుగా మలిచేవారనే ఆలోచనలు వెంటాడాయి.
చిత్తప్రసాద్ చిత్రాలకూ
మోహన్ చిత్రాలకూ చాలా పోలికలు కనిపిస్తాయి. అదే ఆవేదన; అదే ఆర్తి; అదే ధిక్కారం; అదే
ప్రతిఘటన, అదే తిరుగుబాటు; బానిస సంకెళ్ళను తెంచుకోవడం, బలిష్టంగా భారీ కాయులైన రైతులు,
చీమలు దోమలు ఈగల్లా పోలీసులు, పాలకులు, నిరంకుశులు!. ఇవన్నీ ఇద్దరిలోనూ దాదాపు ఒకేలా
వుంటాయి. అయితే మోహన్ చిత్రాల్లో ఒక అదనపు
గుణం వుంటుంది. అదే వెటకారం; అవహేళన. నిరంకుశుని ముందు నిటారుగా నిలబడి “పోభే కుయ్యా!” అంటాయి మోహన్ బొమ్మలు. చిత్రకళలో వెటకారం
మోహన్ సంతకం. భవిష్యత్తులో చిత్రకళా పరిశోధకులు కొందరు తవ్వకాలు జరిపి “ మోహన్ కు గోదావరి
మండలము నుండి ఈ వెటకారము అబ్బేను” అని నిర్ధారిస్తే మనలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ వుండాల్సిన పనిలేదు.
చివరగా ఒకమాట, నా
జ్ఞాన సంపదను వాటాలు వేసి పంచాల్సివస్తే అందులో మోహన్ కు కూడ కొంత వాట వుంటుంది. నా
మిత్రునికి నివాళి.
(తాడి మోహన్ 70వ జయంతి సందర్భంగా డిసెంబరు 24, 2020న విజయవాడ ఎంబి విజ్ఞాన భవన్ లో జరిగిన
సభలో చేసిన ప్రసంగ పాఠం)
(నా రచనల ప్రచురణ కోసం తపించే చిరకాల మిత్రురాలు శబరికి ఈ
వ్యాసం అంకితం)
రచన : 24 డిసెంబరు 2020
No comments:
Post a Comment