Friday, 19 June 2020

Now the Hash Tag is Social Capital

ఇప్పుడు హ్యాష్ ట్యాగ్  #సోషల్ క్యాపిటల్

Building Goodwill
Creating Social Capital
         
రచన నచ్చినపుడు
రచయిత నచ్చుతాడు   
రచయిత నచ్చినపుడు
అతని సామాజికవర్గం మీద సదభిప్రాయం కలుగుతుంది.

గుర్రం జాషువా
శివసాగర్
పద్యాలు, కవితలు చదివినపుడు
వాళ్ల మీద అభిమానం కలుగుతుంది.
అది వాళ్ళ  స్వీయసామాజికవర్గాలైన
దళితుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది.
అలా ఆ సామాజిక వర్గాల మీద ఒక సానుకూల భావన ఏర్పడడానికి భూమిక సిధ్ధం అవుతుంది.  

లేకపోతే ఎస్సీ  సామాజికవర్గాల్ని అనాదిగా తక్కువ చేసి చూస్తున్న నేరేటివ్స్  మనలో స్థిరపడి కొనసాగుతుంటాయి.   

గురజాడ అప్పారావు శ్రీశ్రీ , కాళిపట్నం
ముందు వాళ్ళ రచనల్ని ప్రేమిస్తాం
తరువాత వాళ్ళను అభిమానిస్తాం.
ఆ పైన బ్రాహ్మణ సామాజికవర్గం  మీద ఒక సానుకూల దృక్పధాన్ని కూడ ఏర్పరచుకుంటాం.

అలా
తాపి ధర్మారావు వంటివారి
రచనల ద్వార
కాపు సామాజికవర్గం మీద

కట్టమంచి రామలింగారెడ్డి, కేవి రమణా రెడ్డి వంటివారి రచనల ద్వార
రెడ్డి  సామాజికవర్గం మీద

త్రిపురనేని రామస్వామి చౌదరి
నార్ల వేంకటేశ్వరరావు  వంటివారి రచనల ద్వార
కమ్మ  సామాజికవర్గం మీద

ఒక సానుకూల  భావన ఏర్పడుతుంది.

ముస్లిం ఆలోచనాపరులు ఇప్పటి అసహన వాతావరణంలో
అలాంటి సానుకూల భావనను
సృష్టించడానికి కృషిచేయాలి. 

1984 ఊచకోత తరువాత శిక్కులు
ప్రతీకార దాడులు చేయలేదు.
తమ మీద దాడిచేయాలన్నంత ద్వేషం ఇతరుల్లో ఎందుకు కలిగిందని ఆలోచించారు.

శిక్కేతరుల్లో శిక్కు సానుకూల భావనను కలిగించడానికి
ఒక ప్రణాళిక బధ్ధంగా ప్రయత్నించారు.

1986లో ఢిల్లీ వెళ్ళినపుడు ఒక విషయాన్ని గమనించాను.
అప్పటికి శిక్కుల మీద దాడులు సాగి ఏడాదిన్నర అయింది.
తిరిగి వచ్చే రోజు సాధారణంగా షాపింగ్ కు వెళతాం.
నేను మా ఆఫీసులో ఒకతన్ని తోడు రమ్మన్నాను.
అప్పట్లో ఢిల్లీ ఆటోరిక్షాలవాళ్ళు చాలా మోసకారులుగా వుండేవారు.
నాలుగు వీధులు తిప్పి వందరూపాయలు అయ్యిందనేవారు.
నా ఆఫీసు మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు.
“నువ్వు సర్దార్జీ ఆటో ఎక్కు. నిన్ను కరెక్టుగా దింపుతాడు. కరెక్టు చార్జీ తీసుకుంటాడు. ఏదైనా రిపైర్ పని వున్నా సర్దార్జీ దగ్గరకు పో. ఏదైనా కొనాలన్నా సర్దార్జీ షాపుకు పో. మోసం వుండదు. క్వాలిటీకి తగ్గ కరెక్టు రేటు వుంటుంది” ఆ తరువాత చాలా తక్కువ సమయంలోనే ఢిల్లీలో శిక్కులు అన్ని రంగాల్లోనూ పుంజుకున్నారు.

ఇప్పుడు ముస్లింలు ఆ మార్గంలో నడవాలి. లేకుంటే వాళ్లు వ్యాపారాలు వాణిజ్య కార్యకలాపాలు చేసుకోలేరు.  

భారత దేశం ఎవ్వరూ ఎవ్వరితోను కులం మతం తెలియకుండ ఐదు నిముషాలకు మించి మాట్లాడలేరు.

వాళ్ళ కులం మతం గురించి తెలియగానే  మనకు ఆ సామాజికవర్గంలో పుట్టిన ఒక గొప్ప ఆలోచనాపరుడు గుర్తుకు వస్తాడు.
ఆ మహానుభావుని మీద వుండే గౌరవంతో అతనితో సంభాషిస్తాము.

ఓ శిక్కు  పరిచయం కాగానే మనకు భగత్ సింగ్, ఉధ్ధాం సింగ్, గుర్తుకు వస్తారు. వాళ్ళ మీదున్న అభిమానాన్ని ఎంతో కొంత కొత్తగా పరిచయ అయిన వారి మీద కూడ చూపిస్తాం.

Intellectuals are goodwill ambasidors of their own communities.

సరస్వతివున్న చోట లక్ష్మీ వుండదంటారు.  
అది నిజమే కావచ్చుగానీ
ఆలోచనాపరుడు ఒక సామాజిక పెట్టుబడిని సృష్టిస్తాడు.
అది కొన్ని చోట్ల ఆర్ధిక పెట్టుబడీకన్నా గొప్పగా పనిచేస్తుంది.

ఇదొక సామాజిక సూత్రం.

సామాజిక సూత్రాలు గణితశాస్త్ర సూత్రాలంత కఛ్ఛితంగా వుండవన్న మాట నిజమే. 
అయినా సమాజానికి,
మనుషుల ప్రవర్తనకు
కూడ కొన్ని సూత్రాలుంటాయి.

వెనుకబడిన సమూహాలకు
సామాజిక పెట్టుబడి,
సామాజిక ఆమోదాంశాన్ని
నిర్మించడం తెలీదు.

ఒక సామాజికవర్గం వెనుకబడి వున్నదని తేల్చడానికి
ఒక కొలమానం వుంది.
ఆ సమూహానికి తమ  ఆలోచనాపరుడు ఎవరో తెలియకపోయి అయినా వుండాలి. .
ఒకవేళ  ఆలోచనాపరుడు లేకుంటే
అలాంటి వాడ్ని  తామే సృష్టించుకోవాలని
తెలియకపోయి అయినా వుండాలి.

అభివృధ్ధి చెందిన సమూహాలు
ఒక ప్రణాళిక బధ్ధంగా
Goodwill building మీద
Social capital మీద దృష్టిపెడతాయి.
దానికోసం కొంత బడ్జెట్ ను కేటాయిస్తాయి.  


దీనికి ఇంగ్లీషి సాహిత్యంలో ఒక గొప్ప ఉదాహరణ వుంది.

19వ శతాబ్దపు బ్రిటీష్ మహారచయిత ఛార్లెస్ డికెన్స్
సోషలిస్టు భావాలు కలవాడు.
పెట్టుబడీదారీ వ్యవస్థకు
బధ్ధ  వ్యతిరేకి.

నెలకోసారి డికెన్స్ తాను రాసిన నవలా భాగాలను ఒక ఆడిటోరియంలో స్వయంగా చదివి వినిపించేవాడు.
దానికి డబ్బున్నోళ్ళు టిక్కెట్లు కొని  మరీ వచ్చేవారు.
‘ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్’ లో లేడీ గెరిల్లా   మేడం డిఫార్జ్ పాత్ర గుర్తుందిగా. ధనవంతుల తెగిపడ్డ తలకాయల్ని లెఖ్ఖబెడుతుంటుంది.
నవల్లోని అలాంటి  సంఘటనల్ని డికెన్స్ చదువుతున్నప్పుడు కొందరు ధనిక స్త్రీలు భయపడిపోయి వెర్రి కేకలు వేసేవారు. మూర్చపోయేవారట.
డికెన్స్ ను అంతగా ద్వేషించేవారు డికెన్స్ షోకు అంతగా ఎందుకు వెళ్ళేవారూ?
దీనికి ఒక లాజిక్కు వుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో “మీరు భలే లంజకొడుకండీ బాబూ’ అని మర్యాదగా తిట్టుకున్నట్టు; డికెన్స్ పాత్రలు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాయి.

‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్’ లో కథానాయకుడు పిప్ తన గ్రామాన్ని వదిలి మొదటిసారి లండన్ కు వస్తాడు.
అతను లండన్ చేరే సమయానికి చీకటి పడిపోతుంది.
ఒక జట్కావాడు వచ్చి ఎక్కడికి పోవాలి అని అడుగుతాడు.
ఫలానా లాయర్ గారి ఇంటికి పోవాలి.
“లాయర్ గారి ఇల్లు నాకు తెలుసండి. ఆయన చాలా మంచోరు” అంటాడు జట్కావాడు.
బేరం ఆడకుండ జట్కా ఎక్కుతాడు పిప్.
లాయర్ ఇంటికి చేరుతారు.
“లైటు వెలుగుతోంది. లాయర్ గారు అఫీసులోనే వున్నారు. మీ పని వెంతనే అయిపోతుంది” అంటాడు జట్కావాడు.
తనే పిప్  సామాన్లు లోపల పెడతాడు.
దబ్బులు ఇవ్వాల్సి వచ్చినపుడు “నేను నీకు ఎంత రుణపడ్డానూ?’ అని అడుగుతాడు హీరో.
“అబ్బే ఎంతో కాదండి. మామూలుగా అయితే పది పెన్నీలు. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీ దయ అండి” అంటాడు.

ప్రపంచంలో ఎక్కడా జట్కావాడు, ప్రయాణీకుడు ఇంత మర్యాదగా మాట్లాడుకోరు. డికెన్స్ అలా రాస్తాడు.
డికెన్స్ వాళ్లకు వ్యతిరేకే కావచ్చు. అయినా అతని రచనల్ని  ప్రమోట్ చేయడంలో బ్రిటీష్ పెట్టుబడీదారులకు మూడు దశల్లో మూడు ప్రయోజనాలున్నాయి.

మొదటిది, డికెన్స్ రచనలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మీద ఆసక్తి పెరుగుతుంది.
రెండు; బ్రిటీష్ వాళ్ళు ఇంతటి మర్యాదస్తులు అని ప్రపంచం నమ్ముతుంది.
మూడు; అలా ఏర్పడిన సానుకూల వాతావరణం బ్రిటీష్ ఉత్పత్తులకు మార్కెట్ గా మారి తమకు లాభాలను తెచ్చి పెడుతుంది.  

అభివృధ్ధి చెందిన సామాజికవర్గాల్లో సాంస్కృతిక ప్రోత్సాహం ఒక ప్రస్పుట లక్షణంగా వుంటుంది.

ఈ సాంప్రదాయాన్ని బలహీనవర్గాలు అనుసరించాలి.















ముగింపు

ఎస్టీలు, ఎస్సీలు, బిసిలు, మైనారిటీలు తదితర అణగారినవర్గాలు తరచూ రాజ్యాధికారం గురించి మాట్లాడుతుంటారు.

అదేమీ పిల్లల ఆటబొమ్మ కాదు ఎవరో తెచ్చిఇవ్వడానికి.
“రాజ్యాధికారం” నినాదం రాజ్యాంగం వచ్చిననాటి వున్నది.
కొత్తగా వచ్చిన హక్కులకన్నా పోతున్న హక్కులే ఎక్కువ.

రాజ్యాధికారాన్ని సాధించడానికి అనేకం కావాలి.

వాటిల్లో మొదటిది సోషల్ కేపిటల్.
ఆ తరువాత ఎకనామికల్ కేపిటల్
ఆ తరువాత పొలిటికల్ కేపిటల్.

మొదటి రెండు లాంఛనాలను పూర్తి చేయకుండ  రాజ్యాధికారం ఎన్నటికీ రాదు.

ఇప్పుడు హ్యాష్ ట్యాగ్
#సోషల్ క్యాపిటల్.

రచన : 17 జూన్ 2020
ప్రసారం : 18 జూన్ 2020
(హర్యాలీ ఆన్ లైన్ వీక్లీ ప్రోగ్రాం

No comments:

Post a Comment