Monday, 22 June 2020

Scarf is the Women's Protector


మహిళలకు రక్షణ స్కార్ఫ్
-       డానీ



          కరోనా వచ్చి షాహీన్ బాగ్ ఉద్యమం ఆగింది. ఇప్పుడు దాని నిర్వాహకుల మీద తీవ్ర నిర్భంధం కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన షాహీన్ ఎడ్యుకేషనల్ అకాడమీ విడుదల చేసిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు వివాదంగా మారింది. ఇంటర్ లో తమ విద్యార్ధులు సాధించిన ర్యాంకుల గురించి ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన అది. అందులో అమ్మాయిల ఫొటోలు వేయకుండ హిజబ్ బిట్ మ్యాపులు వేశారు. అమ్మాయిల ముఖాలను దాయడం కొత్త వివాదంగా మారింది. 

            దీన్ని ఒక కోణంలో చాదస్తం అనవచ్చు. కానీ, అకాడమీ వాళ్ళ ఉద్దేశ్యం వేరు. అమ్మాయిలు, అందులోనూ ముస్లిం అమ్మాయిలు. వాళ్ళ భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలు అంటారు అకాడమీ వాళ్ళు. ఇదేమీ కొట్టిపడేయదగ్గ వివరణ కాదు.

            ముస్లింలకు సంబంధించి ఏది జరిగినా ఒక వివాదాన్ని రేపేందుకు కొందరు సిధ్ధంగా వుంటారు.  లుకేమియాలా కొందరికి స్కార్ఫేమియా అనే వ్యాధి వుండును.  వారు బుర్ఖాలను భరించలేరు.  హిజబ్ బిట్ మ్యాపుల్ని చూడగానే వారికి ఎలర్జీ కలిగి సోషల్ మీడియా వీధుల్లో పరుగులు తీస్తుందురు.  

            భారతదేశంలో ముస్లిం మహిళల్ని ఉధ్ధరిస్తున్నామని అంతర్జాతీయ వేదికల మీద చాటుకునేందుకు ఉవ్విళ్ళూరే వ్యక్తులు కొందరుంటారు. అలా లోపలి నుండే  ముస్లిం సమాజాన్ని విమర్శిస్తే  ముస్లిమేతర సమూహాలు తమను ఆధునికులనీ, హేతువాదులనీ గౌరవిస్తారనే భ్రమల్లో వీరుంటారు.   సాంప్రదాయ ముస్లిం సమాజం వీరిని దగ్గరకు కూడా రానివ్వదు. మరోవైపు ఇతర సమాజాలు కూడ వీరిని ముస్లీం ప్రతినిధులుగా చూడవు. వీరు ఒక విధంగా రెంటికీ చెడ్డ రేవళ్లు. వాస్తవం ఏమంటే విద్యారంగంలో ముస్లిం మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్నది  సాంప్రదాయ ముస్లిం సంస్థలే. ఈ సోకాల్డ్ ఆధునికులు విద్యారంగంలో చేసే కృషి ఏమీ వుండదు.

            సాంస్కృతిక సాంప్రదాయాలు ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఒక భౌతిక అవసరంగానే ఆవిర్భవిస్తాయి. మొదట్లో అవి ఆరోగ్య సూత్రాలుగానే వుంటాయి.  వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చాక కూడా అవి కొనసాగుతుంటే వాటిని సాంస్కృతిక  సాంప్రదాయం అంటారు. ఇళ్ళ ముందు ముగ్గులేయడం, కళ్ళాపి జల్లడం ఇవన్నీ ఒకప్పుడు క్రిమికీటకాదుల నుండి రక్షణ కోసం  ఏర్పడిన ఆరోగ్య సూత్రాలు.  ఫినాయిల్, డీడీటీలు అందుబాటులోనికి వచ్చాక వీటి అవసరం తీరిపోతుంది. అయినప్పటికీ అవి ఒక సాంస్కృతిక  సాంప్రదాయంగా కొనసాగుతుంటాయి.

            కరోనా వచ్చాక షేక్ హ్యాండ్లు వద్దు నమస్తే ముద్దు అని హిందువులు అంటున్నారు.  మాకు కూడా మాస్క్, పిపిఇ వంటి హిజబ్, బుర్ఖా సాంప్రదాయం ఆనాదిగా వుంది అని ముస్లింలు అంటున్నారు.  ముస్లింలలో సాంప్రదాయ పురుషులు సహితం ఒకరకం హిజాబ్ ధరిస్తారు. అది ఎడారి ప్రాంతంలో ఒక అవసరంగా వచ్చింది. ఇప్పుడు ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. రాజస్తాన్, గుజరాత్ ఎడారి ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడ వాళ్ళ పధ్ధతుల్లో పర్దా వేస్తారు. వాళ్ళు ఎడారిని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినా పర్దా సాంప్రదాయాన్ని మాత్రం  కొనసాగిస్తుంటారు.
మహిళలకు రక్షణ స్కార్ఫ్- 2
-       డానీ


            షాహీన్ కాలేజీ యాడ్ మీద అభ్యంతరానికి ఇంకో కారణం కూడ వుంది. అందులో అమ్మాయిల బొమ్మల్లో మాస్క్ లేదు. కరోనా కాలంలో దేశమంతా స్ త్రీలకేకాదు పురుషులకు కూడ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వచ్చాయి. అందరూ గంటకోసారి  హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. పూటకోసారి శానిటైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫుల్ ఫేస్ మాస్కులు కూడా వచ్చేశాయి. ఇప్పటికయితే డాక్టర్లు, నర్సులు మాత్రమే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ వాదుతున్నారు. రేపు సామాన్యులు సహితం  పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ పెట్టుకుని తిరగాల్సి రావచ్చు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఇది మన సాంప్రదాయ కాస్ట్యుమ్ అయిపోవచ్చు!.

            అంతెందుకూ హైదరాబాదీలు ఇష్టంగా తినే పానీపూరీలు, గప్ చుప్ లు ఒక ఆరోగ్య జాగ్రత్తగానే మొదలయ్యాయి. కలరాకు విరుగుడుగా నిజాం నవాబు వాటిని ప్రవేశపెట్టాడు. పుదీనా రసం, చింతపండు, మిరియాలు వగయిరా దినుసుల ద్రావణాన్ని తాగితే కలరా అదుపులోనికి వస్తుందని వైద్యులు చెప్పారట. ఆ ద్రావణాన్ని తాగడానికి వీలుగా పూరీలను జత చేశారు. కలరా తగ్గింది గానీ పానీ పూరీలు ఇష్టమైన స్నాక్స్ గా కొనసాగుతున్నాయి.

            ఒక ఇరవై ఏళ్లుగా హైదరాబాద్ ను గమనిస్తే ముస్లిమేతర స్త్రీలలో హిజాబ్ వేసే సాంప్రదాయం రోజురోజుకూ పెరుగుతోంది. దాన్ని వాళ్లు ఒక భద్రత ఏర్పాటుగా  భావిస్తున్నారు. ఆఫీసులు, కాలేజీలు వదలగానే ప్రతి మహిళా రోడ్డు మీద రావడానికి ముందు స్కార్ఫ్ / హిజాబ్ వేసుకుంటున్నారు. ఇది నిత్యం రోడ్ల మీద కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం. ఇప్పుడు అసంఖ్యాక రంగుల్లో అసంఖ్యాక డిజైన్లలో స్కార్ఫులు మార్కెట్లో వున్నాయి. భారత మహిళలు విపరీతంగా ఆసక్తిని చూపుతుండడంతో ఆసియా ఖండపు కార్పొరేట్ దిగ్గజం ఆలీబాబా  సంస్థ భారిగా స్కార్ఫుల  ఉత్పత్తి మొదలెట్టి  షిప్పులతో ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ మహిళలను అడిగినా చెప్పేది ఒక్కటే; మహిళల రక్షణ స్కార్ఫ్.  హిజాబ్ ఇప్పుడు ఎంతమాత్రం ముస్లిం మహిళలకు మాత్రమే పరికితమైన వ్యవహారం కాదు.
 
            ప్రతిదానికీ మరో కోణం వుంటుంది. సాంప్రదాయాన్ని సవరించాల్సిన సందర్భం కూడా ఒకటి వస్తుంది. సమాజ పురోగతికి సాంప్రదాయం అడ్డంకిగా వున్నప్పుడు తప్పనిసరిగా సంస్కరించాలి. అది సామాజిక అవసరం. దీనికి రెండు కండీషన్లు వుండాలి. హిజాబ్ వల్ల ముస్లిం స్త్రీలు వెనుకబడిపోతున్నట్టు చెప్పడానికి గణాంకాల ఆధారాలుండాలి. హిజాబ్ వల్ల తాము అణిచివేతకు గురవుతున్నట్టు ముస్లిం స్త్రీలు ఆందోళన వ్యక్తం చేస్తుండాలి.  

            ఒక ఔత్సాహిక (ఇంగ్లీషులో అమెచ్యూర్  అంటారు ) సంఘ సంస్కరణ సంస్థ ఆ మధ్య హైదరాబాద్ లో బుర్ఖాలు వేసుకునే స్త్రీల మీద ఒక సర్వే జరిపింది. అప్పుడు ముస్లిం అమ్మాయిలు ఇచ్చిన సమాధానాలు విని ఆ సర్వేరాయుళ్ళ పెద్ద మెదడు పగిలిపోయింది. “ఇతరులు మమ్మల్ని చూడలేరు; మేము మాత్రం మొత్తం ప్రపంచాన్ని చూస్తుంటాము. ఇదో థ్రిల్. ఇదో అడ్వాంటేజ్” అన్నారు వాళ్ళు. చాలామందికి తెలియని విషయం ఏమంటే ఆ బుర్ఖాల లోపల కాలేజీ అమ్మాయిలు, సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చాలా మోడ్రన్ డ్రెస్సుల్లో కూడ వుంటారు. 

మహిళలకు రక్షణ స్కార్ఫ్- 3
-       డానీ

            రాజకీయ రంగంలో హిజబ్ కు ఒక గుర్తింపు వుంది. ఓ మూడేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును నియమించడానికి సన్నాహాలు మొదలెట్టింది. అందులో ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలనుకున్నారు. ప్రభుత్వంలో ముస్లిం ప్రతినిధిగా వున్నాయన నన్ను విద్యాధికురాలయిన ఓ మహిళ పేరు చెప్పమన్నారు. అయితే దానికాయన ఓ కండీషన్ పెట్టారు.”హిజబ్ వుండాలిసుమా” అన్నారు. పురుషులకు స్కల్ క్యాప్ లేకపోయినా, మహిళలకు, హిజబ్ లేకపోయినా రాజకీయాల్లో ముస్లిం అనే గుర్తింపు వుండదు. ఒక ముస్లింగా ప్రభుత్వ సౌకర్యాలు పొందాలనుకునేవారు తాము ముస్లిం అని నిరూపించుకోవాల్సి వుంటుంది. ఇదొక చట్టపరమైన ఆబ్లిగేషన్. ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఇతర సామాజికవర్గాలకు కూడ వుంటాయి. ఎస్సీ రిజర్వేషన్లు పొందాలనుకునేవారు తాము హిందూ ఎస్సీలని ధృవపరచాల్సి వుంటుంది.

            బుర్ఖా హిజబ్ లు ముస్లింలకు ఐడెంటిటీగా మాత్రడమేగాక సోషల్ కేపిటల్ గానూ మారాయి. హిజబ్ వేసే మహిళలకు ముస్లిం సమాజంలో అదనపు గౌరవం లభిస్తున్నది. బుర్ఖాలు వేసుకుని ముస్లిం మహిళలు అనేక దేశాలను ఏలారు. ఆ రికార్డు ఇంతవరకు మరో సామాజికవర్గాలకు లేదు. ఇప్పుడు బుర్ఖా వేసుకుని బోయింగ్ విమానం నడుపుతున్న అమ్మాయి హైదరాబాదీయే!

            ముస్లిం ఆలోచనాపరులు హిజబ్ వివాదంలో వున్న సమయంలో ముస్లిమేతర ఆలోచనాపరులు ఇంకో కొత్త వివాదానికి తెర లేపారు. దేశంలోని శ్రామిక కులాలు, శ్రామిక మతాల మధ్య ఐక్యత ఏర్పడాలని మనం తరచుగా నినదిస్తుంటాము. అలాంటి ఐక్యత ఏర్పడితే ఎప్పుడో ఒకప్పుడు సమిష్టిగా రాజ్యాధికారం వస్తుందని నమ్మకం. సందర్భం వచ్చినప్పుడెల్లా ఎవరో ఒకరు ఈ ఐక్యతకు పుల్ల పెడుతూనే వున్నారు. ఒకటిమాత్రం నిజం ఈ ఐక్యతకు భంగం కలిగిస్తున్నది ముస్లిం ఆలోచనాపరులు మాత్రం కాదు. 

            జయధీర్ తిరుమలరావుగారు  తెలంగాణ రచయితల వేదిక నాయకులు. విద్యాధికులు.  పురాతత్వశాస్త్రంలో ప్రముఖులు. వారు హఠాత్తుగా “ముస్లింలలో చైతన్యం తక్కువ, అవగాహన తక్కువ, ముస్లిం ఆలోచనాపరుల్లో ఐక్యత లేదు” అంటూ ఈ హిజాబ్ మీద  చర్చ సందర్భంగా సోషల్ మీడియాలో బోల్డు కామెంట్స్ పెట్టారు.  

            ముస్లింలు వెనుకబడిన సమాజం; ముస్లిం మహిళలు ఇంకా వెనుకబడిన సమాజం అనేది ప్రచారంలోవున్న నేరేటివ్. అది వాస్తవంకాదు. ముస్లిం మహిళల నాయకత్వంలో సాగిన ఒక జాతీయ స్థాయి ఉద్యమం; షాహీన్ బాగ్. భారత ముస్లిం మహిళల చైతన్యానికి ఇది నిదర్శనం.  దేశవ్యాప్తంగా బుర్ఖాలతోనే ముస్లిం స్త్రీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సఫూరా జర్గర్ వంటివాళ్ళు హిజబ్ తోనే తీహార్ జైల్లో వున్నారు.  షాహీన్ బాగ్ ఉద్యమంతో పోల్చదగ్గ జాతీయ స్థాయి మహిళా చైతన్య ఉద్యమం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరొకటి వుందేమో చెప్పాలని నేను జయధీర్ తిరుమలరావుగారిని వినయంగా అడిగాను. వారు సమాధానం చెప్పలేదు.  పురాతన చరిత్రను తవ్వి తీసే ప్రొఫెసర్ కు మూడు నెలల క్రితపు ఒక చైతన్యయుత ఉద్యమం గురించి తెలీదా? లేక దాన్ని వారు దాచ దలిచారా? పైగా ‘ప్రగతిశీల హిందూ వాదులు’ ముస్లింల మీద  చేస్తున్న విమర్శల్ని పరిగణనలోనికి తీసుకోవాలంటూ వారు ఇంకో విచిత్ర వాదనను ముందుకు తెచ్చారు. 

            చైతన్యం స్థాయి తేలిపోయింది. ఇక ఐక్యత స్థాయి గురించి మాట్లాడుకుందాం. లోహియైట్ గా, అంబేడ్కరిస్టులుగా వీరావేశంతో ఊగిపోయిన రామ్ విలాస్ పాశ్వాన్, రామ్ దాస్ అధవాలే, ఉదిత్ రాజ్ వగయిరాలు ఇప్పుడు ఎక్కడున్నారూ వారి అభిప్రాయాలతో ప్రొఫెసర్ ఏకీభవిస్తున్నారా? నరేంద్ర మోదీజీ ప్రధాని అయ్యాక ఇతర శ్రామిక కులాలు, మతాలకు బిసి సమూహాలు దూరంగా జరుగుతున్న అంశాన్ని ఈ పురాతత్వ పరిశోధకులు గమనించారా? అది బలహీనవర్గాల ఐక్యతకు భంగకరమనీ,  చారిత్రక తప్పిదమని స్వీయ సమాజానికి పిలుపిచ్చారా?



మహిళలకు రక్షణ స్కార్ఫ్- 4
-       డానీ

            చర్చ జాతీయస్థాయిలో వద్దనుకుంటే ప్రాంతీయంగా తెలంగాణకే పరిమితమవుదాం. బ్రాహ్మణ వగయిరా పాలక సామాజికవర్గాలను కూడా మినహాయిద్దాము. జయధీర్ తిరుమలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న  బిసి సామాజికవర్గాల ఆలోచనాపరుల వరకే పరిమితమై మాట్లాడుకుందాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు మీద ఇతర బిసీ ఆలోచనాపరులతో అయినా  జయధీర్ కు ఏకాభిప్రాయం వుందా? సమాధానం బిగ్ నో.

            అన్ని సామాజికవర్గాల్లోనూ బేధాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వుంటాయి. ఐక్యత అనైక్యతలు అన్ని సమూహాల్లోనూ వున్నాయి. వుంటాయి. వుండాలి. లేకుంటే మేధోమధనం, భావసంచయనం సాగదు. ఈ లాజిక్ ను మన ప్రొఫెసర్ మిస్సవుతున్నారు.

            షాహీన్ అకాడెమీ విడుదల చేసిన ఆ ప్రకటనను సరిగ్గా చూస్తే కొన్ని అందులో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఆ సంస్థలో మొత్తం 27 మంది విద్యార్దులు టాప్  ర్యాంకులు సాధించారు. వాళ్ళల్లో అబ్బాయిలు 12 మంది అమ్మాయిలు 15 మంది. ఫస్ట్ ర్యాంకు ఒక అబ్బాయికి వచ్చింది; ఒక అమ్మాయికీ వచ్చింది. ఆ యాడ్ లో ముగ్గురు అబ్బాయిల ఫొటోలకు కూడ బిట్ మ్యాపులే వేశారు. విద్యారంగంలో ముస్లిం అబ్బాయిలకన్నా అమ్మాయిలే గొప్ప మార్కులు సాధిస్తున్నారని ఈ యాడ్ చెప్పకనే చెపుతోంది. ఈ సంఘ సంస్కర్తలు దానిని గుర్తించదలచలేదు.

            ఇటీవల వెలుగులోనికి వచ్చిన రెండు విశేషాలను గుర్తు పెట్టుకోవాలి. మొదటిది; ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న కుటుంబాలు తమ పిల్లలకు హిజబ్, బుర్ఖాలను ప్రోత్సహిస్తున్నాయి. రెండోది; స్కార్ఫ్ సాంప్రదాయం లేని కుటుంబాలకన్నా స్కార్ఫ్ సాంప్రదాయంవున్న కుటుంబాల అమ్మాయిలు విద్యారంగంలో ముందంజలో వుంటున్నారు.  షాహీన్ అకాడెమీ విడుదల చేసిన ఆ ప్రకటన కూడ తాజాగా ఆ విషయాన్నే నిరూపిస్తున్నది.

            లోకంలో ఏదీ అనవసరంగా వుండదు. ప్రయోజనం వున్నవే వునికిలో వుంటాయి. ప్రయోజనం లేనివి అంతరించిపోతాయి. ఇది బేసిక్ సైన్స్. ఈ స్కార్ఫేమియా పీడితుల దగ్గర ప్రత్యామ్నాయ డ్రెస్ కోడ్ లేదు. వీళ్ళకు ముస్లిం అమ్మాయిల పురోగతి ముఖ్యం కాదు; స్కార్ఫ్ తీయించడం ముఖ్యం. ప్రపంచంలో ప్రతి మతానికీ ఒక డ్రెస్ కోడ్ వుంటుంది. అలాగే ప్రతి డ్రెస్ కోడ్ వెనక ఒక మతం వుంటుంది. ముస్లిం అమ్మాయిలు స్కార్ఫులు బుర్ఖాలు తీసేసి ఏ డ్రెస్సు కోడ్ ను స్వీకరించాలీ?  అయినా ఎవరూ ఏ డ్రెస్సు వేయాలో, ఏ తిండి తినాలో ఇతరులు నిర్ణయిస్తారా? ఇదేనా హేతువాదం? ఇదేనా ప్రగతిశీలత?

రచన  : 20 జూన్ 2020
ప్రచురణ : డానీ తెలుగు టీవీ, 22 జూన్ 2020

No comments:

Post a Comment