బహుజనులు శ్రామికులకు కలిపి ఒక కొత్త రాజకీయ పార్టి కావాలి.
- డానీ
కాంగ్రెస్ బిజెపిల మధ్య తేడా పలుచని పొర లాంటిది. కాంగ్రెస్ అంటే మితవాద బిజేపి; బిజేపి అంటే మతవాద కాంగ్రెస్ అనే మాట ఎలాగూ వుంది.
పివి నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టి చారిత్రక తప్పిదాలు అనేకం చేసింది. సోనియా గాంధి ఆ పార్టికి పునర్జన్మ నిచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ ఆ పార్టి భారీ తప్పులు చేసింది. ఎన్నికల్లో బిజేపి మీద పైచేయి సాధించాలంటే ఆ పార్టి అనుసరించే మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మతసామరస్య శేణుల్ని ఐక్యం చేయాలనే జ్ఞానోదయం రాహుల్ గాంధీకి కలగలేదు. మతతత్వ రాజకీయాల్ని మతతత్వ రాజకీయాలతోనే ఓడించాలని రాహుల్ గాంధీ భావించారు. మతత్వానికి Original Equipment (OE) బిజేపి రంగంలో వున్నప్పుడు, మతత్వానికి Replacement Equipment (RE) అయిన కాంగ్రెస్ కు ఓట్లేందుకు వేస్తారూ? సరిదిద్దుకోలేని తప్పిదం అది. దానితో భారత రాజకీయాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది.
ఇక బహుజన సమాజ్ పార్టీలో మాయావతిది ఎన్నడూ కాన్షీరామ్ స్థాయి కాదు. లోక్ జనశక్తి, రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (అథవాలే)లా ఇప్పుడు బిఎస్పీ కూడ దళిత నాయకులు గల ఒక రాజకీయ పార్టి మాత్రమే. అంత వరకే దానికి విలువ. ఇతర పార్టీల్లో వుండే అవలక్షణాలన్నీ ఇప్పుడు బిఎస్పీలో కూడ వున్నాయి. బిఎస్పీకి మైనార్టీల మీద ప్రత్యేక అభిమానం వున్నట్టు కనిపించదు. బిజేపితో రాజకీయ హానీమూన్ గడిపిన సందర్భాలు కాన్షిరామ్ హయాంలోనే మొదలయ్యాయి. పైగా, బాబ్రీ మసీదు కూల్చివేత తరువాతనే బిజేపితో బిఎస్పి పొత్తు కుదుర్చుకుంది. ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రముఖ దళిత నేతలు బిజేపి నేతలతో కలిసి బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాలు వున్నాయి. బిజేపికన్నా కాంగ్రెస్ భిన్నం కానట్టే బిఎస్పీ కూడ భిన్నం కాదు.
మరోవైపు, వామపక్షాలు సహితం స్వీయ తప్పిదాలతో క్రమంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయాయి. వామపక్షాలకు ఇప్పుడు సంఘటిత కార్మిక రంగం కొంత వరకు ప్రాణరక్షణ ఔషధంగా వుంది. గత లోక్ సభ ఎన్నికల్లో 1.75 శాతం ఓట్లతో సిపియం 10వ స్థానానికి పడిపోయింది. సిపిఐకు ఒక్క శాతం ఓట్లు కూడ పడలేదు. దానికి పడ్డ ఓట్లు 0.58 శాతం. సాయుధ పోరాటం ఒక్కటే శరణ్యం అని భావించే ‘విప్లవ’ కమ్యూనిస్టు పార్టీలకు ప్రధాన స్రవంతితో సంబంధాలు తెగిపోయి రెండు దశాబ్దాలు అవుతోంది. ప్రధాన స్రవంతి కూడ ఆ ‘విప్లవ’ పార్టీలని మరిచిపోయి చాలా కాలం అయింది.
ఎవరయినా ముచ్చటపడి గ్రేడింగ్ ఇవ్వదలుచుకుంటే, ప్రజలకు బిజేపికన్నా కాంగ్రెస్ తక్కువ ప్రమాదకారి; కాంగ్రెస్ కన్నా బిఎస్పీ తక్కువ ప్రమాదకారి, బిఎస్పీకన్నా వామపక్షాలు తక్కువ ప్రమాదకారులు అనుకోవచ్చు.
ఎస్టీ, ఎస్ సి, బిసి, మైనార్టీలు, మహిళలు, ఓసీల్లోని పేదలు, శ్రామికులకు ప్రాతినిథ్యం వహించే ఒక కొత్త పార్టి ఆవిర్భవించాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు చర్చ ఆ దిశగా సాగితే మేలు జరుగుతుంది.
విజయవాడ
2 నవంబరు 2020
No comments:
Post a Comment