Wednesday 18 November 2020

Unity and Struggle and People's War

 పీపుల్స్ వార్ తో ఐక్యత ఘర్షణ

 

ముందు నేను 1978లో  సివోసిలో చేరాను. సివోసి రద్దు అయి మరో పార్టీతో కలిసి 1980లో పీపుల్స్ వార్ గా మారింది. కృష్ణాజిల్లాతో పాటూ వుభయగోదావరి జిల్లాల ప్రాంతీయ కమిటీలో బరువైన బాధ్యతల్నే నిర్వర్తించాను. పీపుల్స్ వార్ నాకు నచ్చినంత కాలం అందులో వున్నాను. క్రమంగా అందులో బ్యూరాక్రటికి ధోరణి పెరిగింది. దాన్ని అప్పుడే విమర్శించాను. 1989 ఎన్నికల తరువాత పీపుల్స్ వార్ నాకు అస్సలు నచ్చలేదు. అందులో బ్యూరాక్రటిక్ ధోరణి భరించలేనంతగా పెరిగిపోయింది. 1990లో పూర్తిగా బయటికి వచ్చేశాను. అయితే, దాని మీద కొంత కాలం ఒకరకం గౌరవం కొనసాగింది.  మనం పుట్టిన ఊరి మీద, మనం పని చేసిన పార్టి మీద మనకు ఒకరకం భావోద్వేగం వుంటుంది. ఇదీ అలాంటిదే. 2004లో పీపుల్స్ వార్ రద్దు కావడంతో ఆ చివరి అనుబంధం కూడా తెగిపోయింది.

 

పీపుల్స్ వార్ జత కలిసిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ మీద నాకు ఎన్నడూ సదభిప్రాయంలేదు. నక్సల్ బరీ పంథాలో ప్రజా సంఘాలను జత చేసిన ఘనత పీపుల్స్ వార్ కు వుండేది.  ఎంసిసి ప్రజా సంఘాలకు వ్యతిరేకం. అది అతివాద పార్టి. ఆ పార్టి పెట్టిన షరతుల మేరకు పీపుల్స్ వార్ తన ప్రజా సంఘాలను కూడ రద్దు చేసుకుంది. అది చాలా స్పష్టంగా వెనకడుగు అని నా అభిప్రాయం.

 

2004లో కొత్తగా ఏర్పడిన సిపిఐ మావోయిస్టు పార్టి తాత్విక రంగంలో గానీ, సామాజిక రంగంలోగానీ, ఉద్యమ విభాగంలోగానీ గత పీపుల్స్ వార్ తో పోలిస్తే కొత్తగా  ఆవిష్కరించిన అంశం ఒక్కటంటే ఒక్కటీ నా దృష్టికి రాలేదు. అంచేత నేను ఎన్నడూ మావోయిస్టు పార్టీని పట్టించుకోలేదు.

 

ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు  ప్రస్తావిస్తున్నారని కొందరు అడుగుతున్నారు. నిన్న రాత్రి నెల్లూరు రాజశేఖర్ – విశ్లేషణలో డా. కె. విజయకుమార్ ప్రసంగాన్ని విన్నాను.  వారు తమ ప్రసంగంలో పీపుల్స్ వార్ ప్రస్తావన అనేక సార్లు చేశారు. సామాజిక అంశాల మీద ఆ పార్టి అవగాహనను గొప్పగా వివరించారు. కానీ సిపిఐ మావోయిస్టు ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అంచేత వారి ఉపన్యాసం గతానికి సంబంధించింది అనిపించింది. అది ముగిసిన అధ్యాయం అని చెప్పడం అవసరం అనుకున్నాను. డా. కె. విజయకుమార్ ఇప్పుడు పీపుల్స్ వార్ ను పునరుధ్ధరించ దలిస్తే అది వేరే విషయం.

 

నేను ముస్లిం సామాజిక వర్గంలో పుట్టాను. ముస్లిం సామాజికవర్గ ప్రతినిధిగానూ భావిస్తాను. నేను దేవుడ్ని నమ్ముతాను. మార్ క్సిస్టులు మతం పేరుతోసాగే  దోపిడిని వ్యతిరేకించాలిగానీ  మత విశ్వాసాలని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చనిపోయాక కామ్రేడ్స్‍ చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్యలను దహనం చేశారు; ముజఫర్ అహ్మద్, మగ్ధూం మొహియుద్దీన్, ఎంటీ ఖాన్, ఎస్ ఎం రవూఫ్ తదితరుల్ని ఖననం చేశారు. అంటే ఆ కామ్రేడ్లకు చనిపోయాక మతం వచ్చింది. ఇవన్నీ వాళ్ల కుటుంబీకులు చేసిన అంత్యక్రియలుకావు. పార్టీలు జరిపించిన అంత్యక్రియలు. తేడా ఒక్కటే భౌతిక కాయం మీద ఎర్రజెండా కప్పుతారు. ఖననం ఖననం ఖననమే. దహనం దహనమే. చివరకు కార్ల్ మార్ క్స్ ను కూడ యూదుల శ్మశానంలోనే ఖననం చేశాడు ఏంగిల్స్. మార్ క్స్ ఏంగిల్స్ కన్నా గొప్ప మార్ క్సిస్టులు మన కాలంలో వున్నారనుకోను.  

 

పీపుల్స్ వార్ అధ్యాయాన్ని నేను ముగించలేదు. ఆ పార్టీయే తన అధ్యాయాన్ని తానే ముగించుకుంది. ఒక పార్టీలో వున్నా లేకున్నా స్వతంత్ర  మార్ క్సియన్లు చాలా మంది వుంటారు. నేను ఆ కోవకు చెందుతాను. మార్ క్సిస్టుగా వుండడం నాకు ఇష్టం. చాలా మంది కమ్యూనిస్టు, మావోయిస్టు అభిమానులమనే  పేరుతో   పిచ్చి భాషల్లో మాట్లాడుతుంటారు. మార్ క్సియన్ భాషలో మాట్లాడేవారితో సంవాదానికి  నేను ఎప్పుడూ సిధ్ధమే.

No comments:

Post a Comment