Monday, 25 January 2021

Andhrapradesh Political Scenario - 2021

 Andhrapradesh Political Scenario

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 1

-        డానీ

 

            సారం తన రూపాన్ని వ్యక్తీకరణనీ ఎంచుకుంటుందని జీవశాస్త్రంలో, తత్వశాస్త్రంలో చెప్పుకుంటాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ సూత్రం చెల్లదు.  కనీసం వర్తమాన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వరకు ఇది వాస్తవం.  ఇప్పటి రాజకీయ పార్టిల రూపసారాలు ఒకటిగా వుండవు.  ప్రతి పార్టీలోనూ  ప్రకటిత ఆశయాలకూ, ఆచరణకు పొంతన వుండడంలేదు.  రాజకీయ పార్టీలు  ఒకటి చెపుతాయి; ఇంకొకటి చేస్తాయి.

 

            ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం 49.95 శాతం ఓట్లు, 151 సీట్లతో వైఎస్ ఆర్ సిపి అధికార పార్టిగా ఆవిర్భవించింది.  39.17 శాతం ఓట్లు, 23 సీట్లతో టిడిపి ప్రధాన ప్రతిపక్ష పార్టిగా నిలిచింది. 5.53 శాతం ఓట్లు, ఒకే ఒక్క సీటుతో జనసేన సాంకేతికంగా మూడవ పార్టిగా మిగిలింది. ఈ మూడు పార్టిలకు తప్ప రాష్ట్రంలో మరే ఇతర పార్టీకీ శాసనసభలో  ప్రాతినిథ్యం దక్కలేదు.  ఓట్ల ప్రాతిపదికన 1.17 శాతం ఓట్లతో (ఇందిరా) కాంగ్రెస్, 0.84 శాతం ఓట్లతో బిజెపి, 0.28 శాతం ఓట్లతో బిఎస్పి మిగిలాయి. వామపక్షాలయిన సిపిఐ, సిపియంలకు అరపావు శాతం  ఓట్లు కూడ రాలేదు.

 

            రాజకీయాల్లో ప్రతి పార్టికి కొన్ని దీర్గకాలిక విధానాలు వుంటాయి. ఇవే ఆ పార్టీలకు సాపేక్షంగా స్థిర ఓటు బ్యాంకును ఏర్పాటు చేస్తుంటాయి. ఇవిగాక ప్రతిసారీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టిలన్నీ ఓ కొత్త ప్రణాళికను విడుదలచేస్తాయి. తాము అధికారంలోనికి వస్తే ఏఏ వర్గాల అభ్యున్నతి కోసం ఎలాంటి పథకాలను చేపడతాయో అందులో వివరిస్తాయి. ఈ ఎన్నికల వాగ్దానాలు స్వల్పకాలికమైనవి. అవి ఆ ఎన్నికల వరకే పరిమితం. ఈ దీర్ఘకాలిక విధానాలనైనా, తాత్కాలిక హామీలనైనా ఆయా పార్టీలు చిత్తశుధ్ధితో పాటిస్తాయా అంటే అదీ అనుమానమే. అవసరాలను బట్టి, అవకాశాలనుబట్టి, ప్రభుత్వాధినేతల ఆసక్తుల్ని బట్టి ఈ విధానాలు, హామీలు మారిపోతుంటాయి.

 

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 2

-        డానీ

 

 (ఇందిరా) కాంగ్రెస్

 

            అభివృధ్ధి-మతసామరస్యం అనేవి చాలాకాలం కాంగ్రెస్ కు జాతీయ విధానాలుగా వుండేవి. నెహ్రూ మార్కు ఒక పలుచని సామ్యవాదం కూడ ఆ పార్టి విధానాల్లో కొంచెం మసగ్గా అయినా కనిపించేది. రాష్ట్రాల్లో భూస్వామ్యవర్గం దానికి అండగా వుండేది. ఎస్సీలు, మైనార్టీలు ఆ పార్టికి నమ్మకమైన ఓటు బ్యాంకుగా వుండేవారు.

 

 

            అయితే, ఈ సమీకరణకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రోజుల్లోనే బీటలు పడ్డాయి. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఛిన్నాభిన్నమైపోయింది. కాంగ్రెస్ మితవాద బిజెపి అయితే బిజెపి మతవాద కాంగ్రెస్ అనేమాట రాజకీయాల్లో స్థిరపడింది. సోనియాగాంధి మళ్ళీ మతసామరస్యం- అభివృధ్ధి  విధానాలను ముందుకుతెచ్చి ఆ పార్టికి ఓ పదేళ్లు  జీవం పోశారు. ఏపిలో వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టికి కొత్త తరహా సంక్షేమ పథకాలతో కొత్త శక్తి నిచ్చారు. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం కాంగ్రెస్ లో ఎక్కువగా వుండేది.

 

            2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయాక ఆ పార్టీలో  స్థానిక, ప్రాంతీయ నాయకులు తిరుగుబాట్లు సాగించారు. బలమైన, ఉత్తేజకరమైన నిర్ణయాత్మకమైన జాతీయ నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టి కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బలహీనపడిపోయింది. తెలంగాణ ఏర్పాటు చేసిన తీరు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు చావు దెబ్బ కొట్టింది. పదేళ్ళు అధికారంలో వున్న పార్టికి 2014, 2019 ఎన్నికల్లో శాసన సభలో ప్రాతినిధ్యమే దక్కలేదు.  అయితే, కేంద్రంలో బుల్ డోజింగ్ ప్రజాస్వామ్యాన్ని సాగిస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలవరించాలంటే ప్రత్యామ్నాయ కూటమిలో కాంగ్రెస్ వుండితీరాలనే మాట ఒక్కటే ఆ పార్టిని ఇప్పటికీ బతికిస్తున్నది.

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 3

-        డానీ

 

చంద్రబాబు - టిడిపి

            తెలుగు జాతి ఆత్మగౌరవం, సమాఖ్య విలువలు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి వంటి విధానాలతో తెలుగుదేశం పార్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం రేపింది. “రెండు రూపాయలకు కిలో బియ్యం” వంటి హామీ   పేద ప్రజానీకాన్ని గొప్పగా ఆకర్షించింది. పేదల ఆర్థిక విధానంతో ఎన్ టిఆర్-టిడిపి కాంగ్రెస్ పునాదుల్ని పెకళించింది.  బిసిలు, ఎస్సీల్లో ఒక వర్గం టిడిపికి అండగా నిలిచారు.

 

            ప్రాంతీయ పార్టి కావడాన దానికి కుటుంబ స్వభావం వుంది. కాంగ్రెస్ లో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం వున్నట్టు టిడిపిలో కమ్మ సామజికవర్గం ప్రాబల్యం వుంది.

 

            చంద్రబాబు హయాంలో టిడిపి పేదల ఆర్థిక విధానం, ఫెడరల్ ఆదర్శం రెండూ మారిపోయాయి. సరళికరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పి జి) ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావు – మన్మోహన్ సింగ్ రూపశిల్పులు అయితే దానికి సిసలైన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. తనే పలుసార్లు చెప్పుకున్నట్టు ఆయనొక నిపుణుడైన సిఇవో. రియల్ ఎస్టేట్ అభివృధ్ధిని రాష్ట్ర అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడంలో వారు దిట్ట.

 

            కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పాలనే ఆశతో చంద్రబాబు సమాఖ్య స్పూర్తికి దూరం అయిపోయారు. ఈరోజు కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడి ‘బుల్ డోజింగ్ ప్రజాస్వామ్యం’తో రాష్ట్రాల హక్కుల్ని కాలరాయడానికి దోహదపడినవారిలో చంద్రబాబు ముఖ్యులు. ఆ విషయాన్ని మరో పధ్ధతుల్లో వారు చాలాసార్లు గొప్పగా చెప్పుకున్నారు.

 

            ప్రాయోజిత పెట్టుబడీదారీ (క్రోనీ కేపిటలిజం) విధానాలకు పెద్ద పీట వేయడం ద్వార చంద్రబాబు పేదప్రజలకు  అభద్రలోకానికి దూరం అయిపోయారు. బిజెపితో జతకట్టి మైనారిటీలకు దూరం అయిపోయారు. విద్యుత్ సంస్కరణలతో రైతులకు దూరం అయిపోయారు.  వెరసి తొలి దశలోని ఎన్టీఆర్-టిడిపి ఆదర్శాలన్నింటికీ వారు తూట్లుపోడిచారు.

            ఎన్టీ రామారావు ప్రభావంతో రైతులు టిడిపికి అభిమానులుగా వుండేవారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే రైతులు  గుర్తుకు వస్తారు. రైతుల రుణమాఫీ ఫైలు మీద తొలి సంతకం చేస్తానని 2014 ఎన్నికల్లో వారు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. వారు వేల సంతకాలు చేశారుగానీ పూర్తిగా రుణమాఫీ చేసే సంతకం మాత్రం చేయలేదు. అప్పుల్ని ఐదు విడతల్లో రద్దు చేసేలా జీవో జారీ చేశారు.  ఐదేళ్ళ పాలనలో  మూడు విడుతలే ఇచ్చారు. చివరి రెండూ గాల్లో కలిసిపోయాయి.  ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని చంద్రబాబు-టిడిపి సమర్ధించడం  ఆ పార్టి  రైతుల మీద చూపించే కపట  ప్రేమకు సరికొత్త ఉదాహరణ.  

 

            చంద్రబాబు - టిడిపివి కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు (Centralised Growth Economics). ఇవి అభివృధ్ధి పేరిట సాగే  వైపరీత్యాలు. ఆయన అతిశయాలతో నింపేసి, పెంచేసి ప్రచారం చేసిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు కూడ వైపరీత్యాలే (pervercities). 

 

            చంద్రబాబు పాలనలో ఒక విచిత్రం వుంటుంది. ఆయన అధికారంలో వున్నంత వరకు అంతా బాగానే వున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన పాలనకు లబ్దిదారులు సంపన్నులు. రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పినట్టు అమరావతి భూముల్లో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ జరగలేదని అనుకున్నా ఆ భూముల్ని కొన్నవాళ్ళు,  సంపదను పెంచుకున్న వాళ్ళు అందరూ సంపన్నులే అనే వాస్తవాన్ని మాత్రం హైకోర్టుతోసహా ఎవరూ కాదనలేరు.  సంపన్నులు ప్రాబల్యం నోరున్న వర్గం కనుక మీడియా కూడ వాళ్ళ భజన చేస్తుంటుంది. అంచేత రాష్ట్రం వెలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎన్నికల్లో కళ్ళు బైర్లుకమ్మే ఫలితాలు వస్తాయి.  2004లోనూ అదే జరిగింది, 2014లోనూ అదే జరిగింది. అభద్రలోకం చంద్రబాబు-టిడిపి ఆర్థిక విధానాలకు రెండుసార్లు గట్టి గుణపాఠం చెప్పింది.  

 

            తాను అనుసరించిన కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు తనను ఒటమి దిశగా నడుపుతున్నాయని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు చాలా స్పష్టంగానే తెలిసివచ్చింది. నష్టనివారణ చర్యగా ‘పసుపు కుంకుమ’ పేరిట నగదు బదిలీ పథకాన్ని రూపొందించారు. నగదు బదిలీ పథకాల సృష్టికర్త చంద్రబాబే అయినప్పటికీ అవి ఆయన్ను ఆదుకోలేదు. అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. 

 

            మళ్ళీ బిజెపితో జట్టు కడితేగానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  గట్టెక్కలేమని చంద్రబాబు టిడిపికి అర్థం అయింది. చంద్రబాబు బిజెపిల మధ్య పూర్వపు దోస్తీని పునరుధ్ధరించడానికి బిజెపి  నాయకులైన సుజన చౌదరి, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు గట్టి కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిజెపిని మించిన మతరాజకీయాలు నడపడానికి చంద్రబాబు నడుం బిగించారు. టిడిపి బలగాలతోపాటూ, బిజెపి శ్రేణులకు కూడ సంయుక్తంగా నాయకత్వం వహించాలని వారు ముచ్చట పడుతున్నారు. మనువాద ఓట్ బ్యాంకును ఆకర్షించడానికి కొన్ని నెలలుగా క్రైస్తవ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. మైనారిటీ వ్యతిరేకిగా ముద్ర వేసుకోవడానికి ఉవ్వీళ్ళూరుతున్నారు. ఒకప్పుడు వాజ్ పాయిని నడిపానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు బండి సంజయ్ ను  అనుసరిస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్ ఉపన్యాసాల్లో ‘ముస్లింలు’ అని తిట్టిన చోటెల్లా  ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ‘క్రీస్టియన్లు‘ అని మార్చుకుని వాడుకుంటున్నారు. అదొక్కటే తేడా!

 

            ఎన్నికల తరువాత తలవంచి తెలంగాణలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న చంద్రబాబుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలంగా మారే  అవకాశం కల్పించింది జగనే. అధికార వికేంద్రీకరణ పేరిట జగన్ ముందుకు తెచ్చిన మూడు రాజధానుల చట్టం చంద్రబాబుకు మళ్ళీ ఏపీలో కాలుపెట్టే అవకాశాన్ని కల్పించింది. ఆ కృతజ్ఞతా భావంతో కావచ్చు చంద్రబాబు కూడ జగన్ కు ఒక మేలు చేశారు. ఏపీ పోలీసుల దౌర్జన్యాలు మితిమీరడంతో ఆ మధ్య ఎస్సీల్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం మీద అసమ్మతి రగిలింది. ఎస్సీల నిరసనను  తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు  పూర్తిగా విఫలం అయ్యారు. ఇప్పుడు వారు క్రైస్తవుల మీద సాగిస్తున్న  ద్వేష ప్రచారంతో  క్రైస్తవులేగాక ఎస్సీలు సహితం వైయస్సార్ సిపీలోనికి పోలరైజ్ అయిపోతున్నారు.

 

            మరోవైపు, మొదటి నుండీ టిడిపిలో ప్రాబల్యాన్ని సాగించిన కమ్మ సామాజికవర్గానికి వైయస్సార్ సిపి పాలన సహజంగానే నచ్చదు. చంద్రబాబు – టిడిపిని ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారంలోనికి తెచ్చుకోవాలని ఆ సమూహం రాత్రింబవళ్ళు అదనపు శ్రమ చేస్తున్నది. జగన్ ను అడ్డంగా వ్యతిరేకించడం, నవరత్నాలను అవహేళన చేయడం, అమరావతి సింగిల్ రాజధాని అనడం, ఎస్ ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెనకేసుకు రావడం వంటివి ఈ ప్యాకేజీలో భాగం. ఈ విధానాలకు మద్దతు ఇస్తున్నవారిలో  సామ్యవాదులు, కమ్యూనిస్టు అభిమానులు కూడ వున్నారు. చంద్రబాబు మతోన్మాద ఉగ్రరూపం దాలుస్తున్నా వాళ్ళకు పెద్దగా అభ్యంతరం లేకపోవడం హాశ్చర్యకరం.

 

            క్లిష్ట దశలో చంద్రబాబుకు  గొప్ప నైతిక మద్దతుగా నిలబడుతున్నది వర్ల రామయ్య, కంచికచర్ల బాలకోటయ్య, తాడికొండ శ్రీనివాస్ వంటి ఎస్సీ నేతలే. అయితే, క్రైస్తవ వ్యతిరేక ప్రచారాన్ని రోజురోజుకు వుధృతం చేస్తున్న చంద్రబాబు  ఆ దళిత నేతల్ని ఎంత కాలం నిలబెట్టుకుంటారన్నది అనుమానమే.  

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 4

-        డానీ

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టి

            కొంత కాంగ్రెస్ విధానాలు, కొంత జగన్ స్వంత ఎజెండా వగైరాలను కలిపి వైఎస్సార్ సిపి విధానాలు రూపుదిద్దుకున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మరికొన్ని చేర్చి నవరత్నాలను రూపొందించడంతో అభద్రలోకం ఆ పార్టికి ఓటు బ్యాంకుగా మారింది. ఎస్సీలు, మైనారిటీలతో కూడిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఇప్పుడు వైఎస్సార్ సిపి వైపుకు మళ్ళింది.

 

            ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  రెడ్డి సామాజిక వర్గం జనాభా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రాల్లో విస్తరించి వుండేది. అప్పట్లో రాజకీయ ప్రాబల్యం కూడ వాళ్ళకు ఎక్కువగా వుండేది. రెడ్ల కుల వృత్తి రాజకీయం అన్నంతగా సన్నివేశం వుండేది. కమ్మ సామాజికవర్గం జనాభ తెలంగాణలో ఓ రెండు జిల్లాల్లోనూ, రాయలసీమలో ఇంకో రెండు జిల్లాల్లోనూ కొంత వున్నప్పటికీ ప్రధానంగా మధ్య ఆంధ్రాలో కేంద్రీకృతమై వుండేది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ  సందర్భంగా రెడ్డి సామాజికవర్గం జనాభా రెండు రాష్ట్రాల్లోను చెరి సగంగా విడిపోయింది. కమ్మ సామాజికవర్గం జనాభాలో అలాంటి విభజన లేకపోవడంతో కొత్త ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యరీత్యా వాళ్ళ రాజకీయ అవకాశాలు పెరిగాయి. పైగా, కమ్మ సామాజికవర్గంలో ఏక పార్టి అభిమానం ఎక్కువగా వుండే రెడ్డి సామాజికవర్గంలో బహుళ పార్టి అభిమానం వుంది. ఆ నేపథ్యంలో, 2014 ఎన్నికల్లో, స్వల్పతేడాతో అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మార్గం సులువయ్యింది.

 

            అధికారాన్ని చేపట్టడానికి తనకు స్వీయ సామజికవర్గం మద్దతు సరిపోదని 2014 ఎన్నికల అనంతరం జగన్ కు తెలిసి వచ్చింది.  పాదయాత్ర సందర్భంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర పేదవర్గాలను ఒక ప్రణాళిక ప్రకారం చేరదీసి జగన్ తన ఓటు బ్యాంకును 50 శాతానికి పెంచుకున్నారు. ఈ ప్రయత్నం ఫలించి వారు  ముఖ్యమంత్రి అయ్యారు.

 

            కాంగ్రెస్ లో వున్నట్టే వైఎస్సార్ సిపిలోనూ రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‍ కన్నా కొంచెం ఎక్కువే కనిపిస్తోంది. టిడిపిలో కమ్మ సామాజికవర్గానిదే ప్రాబల్యం అనేది బహిరంగ రహాస్యం అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో సోషల్ ఇంజినీరింగ్ ను ప్రదర్శించడంలో చంద్రబాబు  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. వారు పాల్గొనే వేదికల మీద దేవేందర్ గౌడ్ (బిసి-గౌడ), యనమల రామకృష్ణూడు (బిసి -యాదవ) ఎలిమినేటి మాధవరెడ్డి / నాగం జనార్దన రెడ్డి  (రెడ్లు) లాల్ జాన్ బాషా (ముస్లిం)  జిఎంసి బాలయోగి / ప్రతిభా భారతి/ కడియం శ్రీహరి  (ఎస్సీ)లకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో నాయకునికి సాధారణంగా ఆయన వేదికల మీద అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలాంటి సోషల్ ఇంజినీరింగ్ ను ప్రదర్శించడంలో జగన్ చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇతర సమూహాల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం రాజకీయాల్లో మేలు చేయదు.

 

            వ్యక్తిగత ఎజెండాలో చంద్రబాబు, జగన్ మధ్య ఒక సారూప్యం వుంది. శాశ్విత ముఖ్యమంత్రిగా  వుండాలనేదే ఇద్దరి కోరిక. ఆ మాటకొస్తే పార్టీ పెట్టిన ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు. ఇందులో చిన్న తేడా కూడ వుంది. ముఖ్యమంత్రిగా వున్న తన తండ్రి చనిపోతే  ఆ స్థానంలో తాను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా వున్న తన మామను తప్పించి తాను ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు.

 

            ఆర్థికరంగంలోనూ చంద్రబాబు-టిడిపికి పూర్తిగా విరుధ్దమైన విధానాలను జగన్ అనుసరిస్తున్నారు. చంద్రబాబు – టిడిపి అనుసరించిన కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు (Centralised Growth Economics). సృష్టించిన విధ్వంసానికి విరుగుడుగా వైయస్సార్ సిపి వికేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలను (De-Centralised Growth Economics) ముందుకు తెచ్చింది. నవరత్నాలు, నగదు బదిలీలు, ప్రభుత్వ పాఠషాలల్లో ఇంగ్లీషు మీడియం వగయిరాలు  అందులో భాగమే.

 

            ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక తప్పును సరిదిద్దబోయి ఇంకో తప్పు చేస్తున్నట్టు నగదు బదిలీ పథకాల మీద విమర్శలున్నాయి. కేంద్రీకృత పెరుగుదల ఆర్థిక విధానాలు సాగించిన విధ్వంసానికి నష్టపరిహారంగా ఇలాంటి పథకాలు తప్పవనే సమర్థనలూ వున్నాయి.         

 

            పేటల్లోనే సచీవాలయం అనే విధానం గొప్పది. ఇది కొన్ని మేళ్ళు చేస్తున్నా, కొన్ని కొత్త ఇబ్బందుల్ని కూడ తీసుకు వచ్చింది.  అక్కడి సిబ్బంది  అధికార స్వామ్యంతోపాటూ పార్టి పక్షపాతాన్ని కూడ ప్రదర్శిస్తున్నది. ఇసుక, లిక్కర్  పంపిణీలో  వైయస్సార్ సిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏడాదికి పైగా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇటీవల ఇసుక సరఫరాను క్రమబధ్ధం చేసినా, లిక్కర్ ధరల్ని కొంచెం తగ్గించినా ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రీమియం లిక్కర్ అంటూ వైన్ షాపుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన అనామక  బ్రాండ్లతో, వాటి అధిక ధరలతో మధ్యతరగతి, ఆ పైతరగతి సమూహాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎన్నికల్లో వీటి ప్రభావం వుంటుంది.

 

            చంద్రబాబుకన్నా తాను మృదువైన ప్రత్యర్థి (సాఫ్ట్ అప్పోనెంట్)  అని జగన్ తరచూ బిజెపికి సంకేతాలు పంపిస్తున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జగన్ దగ్గరున్న  22 లోక్ సభ సీట్లకన్నా  6 రాజ్యసభ సీట్లు చాలా విలువైనవి. పైగా పార్లమెంటు వుభయ సభల్లోనూ జగన్ ప్రభువును మించిన ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు మద్దతును ఇవ్వడమేగాక ఇంకా బిల్లుల దశలోనే వున్న కేంద్ర విద్యుత్ సంస్కరణల్ని అప్పుడే రాష్ట్రంలో అమలు చేయడానికి జగన్ సన్నాహాలు మొదలెట్టేశారు.

 

            చంద్రబాబులా జగన్ ను కూడ మనువాద ఫోబియా వెంటాడుతోంది. తాను చంద్రబాబును మించిన ‘హిందువు’నని చెప్పుకోవడానికి ఆయన ఈ మధ్య చాలా తంటాలు పడుతున్నారు. వాటివల్ల కొత్త ఓటు బ్యాంకు రాకపోగా వున్న ఓటు బ్యాంకుకు బీటలు పడే ప్రమాదం వుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 5

-        డానీ

 

బిజెపి

 

            గుజరాత్ ను అభివృధ్ధి నమూనాగా ప్రచారం చేయడంలో బిజెపి సఫలమయింది. గుజరాత్ లో సాగింది, సాగుతున్నదీ అభివృధ్ధా, పెరుగుదలా అనేది ఒక చర్చ అయితే, అక్కడ ఆ పెరుగుదల అయినా నరేంద్ర మోదీజీ హయాంలోనే మొదలయిందా? లేక అంతకు ముందే వుందా? అనేది ఇంకో చర్చ. 2002 నరమేధంతో రాష్ట్రంలో నెత్తుటి కాలువలు ప్రవహిస్తున్న కాలంలో ‘గుజరాత్ సుగంధం’ (గుజరాత్ కి ఖుష్ బూ) అని ప్రచారం చేసుకో గలిగిన గొప్ప నైపుణ్యం బిజెపి ప్రచార విభాగానికి వుంది. 

 

            ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అభివృధ్ధి మంత్రంకన్నా మతపరమైన భావోద్వేగాలే నమ్మకంగా పనిచేస్తాయని బిజెపికి అనుభవపూర్వకంగా తెలుసు. అలా ఆ పార్టి చాలాసార్లు లాభపడింది కూడ. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అవకాశం తక్కువగా వున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో  మాత్రమే అది గుజరాత్ మార్కు అభివృధ్ధి నమూనాను ప్రచారం చేస్తుంది.

 

            ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధికి ప్రధాని నరేంద్ర మోదీజీ దోహద పడతారంటే నమ్మేవారు మొత్తం రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరూ వుండరు. విదేశాల్లోని నల్ల ధనాన్ని వెనక్కి తీసుకు రావడంలోగానీ, స్వదేశంలోని నల్లధనాన్ని రూపుమాపడంలోగానీ, జిడిపి గ్రోత్ రేటును పరుగులు పెట్టించడంలోగానీ నరేంద్రమోదీజీ సాధించిన ఘనవిజయాల గురించి తెలియనివారు ఎవరూ వుండదు. గత ఎన్నికల్లో ఆ పార్టికి గుజరాత్ అభివృధ్ధి నమూనాకు, మత రాజకీయాలకు కలిపి పడిన ఓట్లు ఒక్క శాతం కూడ కాదు. అంచేత అభివృధ్ధి మంత్రాన్ని పక్కన పెట్టి మతపరమైన  భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఏపీలో  తమ విధానంగా ఆ పార్టి మార్చుకుంది. కేంద్రంలో తిరుగులేని అధికారంలో వుండడం దానికి అదనపు సౌకర్యంగా మారింది. 

 

            కాంగ్రెస్ లా, ప్రాంతీయ పార్టీల్లా బిజెపిలో కుటుంబ పాలన లేదు. అయితే, కుల కోణం స్పష్టంగావుంది.  ఏపిలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు చంద్రబాబు-టిడిపి, వైయస్సార్ సిపిల మధ్య చీలిపోవడంతో బిజెపి కాపు సామాజికవర్గం మీద దృష్టి పెట్టింది. ఆ పార్టి రాష్ట్రశాఖ ప్రస్తుత  అధ్యక్షులు సోము వీర్రాజూ, ఇంతకు ముందు అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అంతేకాక, రాష్ట్ర బిజేపి ఔటర్ యార్డులో తెచ్చిపెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడ  కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అలాగే రాయలసీమలో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి కూడ ఆ పార్టి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నది.

 

            ఒకే జాతి ఒకే భాష ఒకే చట్టం బిజెపి విధానం అనే మాట తరచూ వినబడుతుంటుంది. వాస్తవం అదికాదు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో బిజెపి నాయకులు అమరావతి సింగిల్ రాజధాని అంటారు. ఉత్తరాంధ్రా బిజెపి నాయకులు విశాఖపట్నం పాలనా రాజధాని అంటారు. రాయలసీమ బిజెపి నాయకులు న్యాయ రాజధాని కర్నూలు అంటారు. ఢిల్లీ నుండి వచ్చే బిజెపి నేతలు కొందరు అమరావతే రాజధానిగా వుంటుందని హామీలు కురిపిస్తుంటారు.  బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజధాని విషయంలో తమ జోక్యం ఏమీ వుండదని హైకోర్టులో అఫిడవిట్ అందిస్తుంది.  ఒకే పార్టి ఒకే అంశం మీద ఒకే రాష్ట్రంలో ఇన్ని రకాలుగా వ్యవహరించడం ఒక రాజకీయ విచిత్రం.           

 

            హిందూ విగ్రహాలను అవమానించేంత ఆలోచనలుగానీ, అవకాశంగానీ రాష్ట్రంలోని క్రైస్తవ సామాజికవర్గాలకు లేవని బిజెపి కూడ తెలుసు. ఈ వివాదం నుండి ఎక్కువ లబ్దిని పొందడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారని కూడ ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయితే, ఈ సంఘటనల దోషులు ఎవరయినా ఈ వివాదం తమకు అనుకూలంగా మారుతుందని ఆ పార్టి ధీమాగా వుంది.

 

            కేవలం కాపు సామాజికవర్గం మద్దతుతో శాసన సభలో ప్రవేశించడం కుదరదని బిజెపికి స్పష్టంగా తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘోరపరాజయం వారి కళ్ళముందే వుంది. బ్లహీనవర్గాలను ఆకర్షించే విధానాలు కావి బిజెపివి. ఒక దశలో బిసిల్ని ఆకర్షించవచ్చుగానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడ లేదు. రెడ్డి సామాజికవర్గం నుండి కొందరిని నాయకత్వం లోనికి చేర్చుకున్నా జగన్ బలంగా వున్నంత కాలం ఆ సమూహాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడం సాధ్యం కాదు. ఇక కమ్మ సామాజికవర్గం మీద కన్ను వేయడమే దానికి మిగిలిన మార్గం.

 

            కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని వంటివారు ఎలాగూ మొదటి నుండీ వైయస్సార్ సిపిలో వున్నారు.  2019లో టిడిపి ఓటమి తరువాత కమ్మ సామాజికవర్గం నుండి ఇంకో భాగం కూడ చంద్రబాబుకు దూరమై జగన్ కు దగ్గరయ్యింది. ఇక మిగిలిన కమ్మ సామాజికవర్గాన్ని తను  ఆకర్షించాలని బిజెపి ఆశిస్తోంది. దానికి కావలసింది చంద్రబాబు సహిత టిడిపి కాదు; చంద్రబాబు రహిత టిడిపి.

 

            కాంగ్రెస్ ను  తీవ్రంగా ద్వేషిస్తున్న కారణంగా బిజెపికి జగన్ మీద చంద్రబాబుకన్నా సాపేక్షంగా ఒక సాఫ్ట్ కార్నర్ వుంది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టడాన్ని బిజేపి ఇంకా మరిచిపోలేదు. 

 

           

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 6

-        డానీ

 

పవన్ కళ్యాణ్

 

            రాజకీయాల్లో ఉత్సవ విగ్రహానికి పవర్ స్టార్ గొప్ప ఉదాహరణ. 2014 నాటికే పార్టిని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో అభ్యర్ధిల్ని నిలబెట్టకుండానే ఆయన టిడిపి బిజెపి కూటమిలో మూడో భాగస్వామిగా కొనసాగారు. “ప్రశ్నించడానికే నేను వచ్చాను” అని గంభీర ప్రకటనలు చేయడమేతప్ప ఆధిపత్యాన్ని వారు  ప్రశ్నించిన సందర్భంలేదు.

 

            జనసేనను ఒక ప్రాంతీయ పార్టి అనడమూ కష్టమే.  అదొక ద్వి సభ్య కమిటి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.

 

            కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలోనూ అక్కడ కేంద్రంలోనూ అధికారంలో లేనపుడు “కాంగ్రెస్ కో హటావో - దేశ్ కో బచావో” అని పవర్ స్టార్ గర్జిస్తే  జనం గట్టిగానే నవ్వారు.  వారు  ట్రెండును ఫాలో కాకుండ రెండు స్థానాల్లో పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయి ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించారు. రాష్ట్రంలో టిడిపి పాలన మీద అసంతృప్తిగా వున్నవాళ్ళు జగన్ వైపుకు మళ్ళకుండ చేసేందుకు  ‘చంద్రబాబు ఏజెంటు’గా  పవన్ కళ్యాణ్ ను రంగంలోనికి దించారనే అపవాదూ వుంది.

            సాధారణంగా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ఎన్నికలు కాగానే బిజెపితో పొత్తు పెట్టుకుని అక్కడా వారు ఒక ట్రెండ్ సృష్టించారు. స్కూళ్ళకు ఏడాదిలో మూడుసార్లు సెలవులిచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఎడాదిలో మూడుసార్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి  రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. అదీ కొత్త ట్రెండే.

 

            తెలంగాణలో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు, ఏపిలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు వంటి కీలక సమయాల్లో ఇద్దరు సభ్యుల కమిటి ఢిల్లీ వెళుతుంది. అక్కడ  ప్రధాని అప్పాయింట్ మెంట్  కోసమో, కనీసం హోంమత్రి అప్పాయింట్ మెంట్ కోసమో ఎదురు చూస్తుంది.  చివరకు జెపి నడ్డాను కలువ గలుగుతుంది.  వీళ్ళు “ మేము పోటీ చేస్తాము” అంటారు. వారు “మేమే పోటీ చేస్తాము; మీరు ప్రచారం చేయాలి” అంటారు. ఇద్దరు సభ్యులు బయటికి వచ్చి “చర్చలు సహృద్భావ వాతావరణంలో సాగాయి. ఎకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం” అని ఒక ప్రకటన చేస్తారు. ఏకగ్రీవం, ఏకపక్షం ఒకటే అని వారి భావన కావచ్చు.

 

            రాష్ట్ర రాజకీయాల్లో తన ఆరుశాతం ఓట్ల కన్నా ఒక్క శాతం ఓట్లున్న బిజెపి శక్తివంతమైనదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు నెలలకు ఒకసారి నిరూపిస్తుంటారు. చే గువేరా టీ షర్టులతో రంగప్రవేశం చేసిన పవర్ స్టార్ ను బిజెపి స్టాండ్ బైగా మార్చుకుంది. 

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 7

-        డానీ

 

బహుజన సమాజ్ పార్టి

 

            రాజ్యాంగం ద్వార భారత ప్రజలకు రాజకీయ సమానత్వాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబేడ్కర్ ది. యుక్త వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ ఒక ఓటు; ప్రతి ఓటుకూ సమాన విలువ అనేది చాలా గొప్ప ఆదర్శం.

 

            అంబేడ్కర్ కేవలం రాజకీయ సమానత్వాన్ని మాత్రమే కోరుకోలేదు. ఆర్ధిక సమానత్వాన్నీ, సామాజిక సమానత్వాన్నీ కూడ కోరుకున్నాడు.  ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించకపోతే  రాజకీయ సమానత్వం కూడ నిలవదని గట్టిగా హెచ్చరించాడు. ఇతర పార్టీలు ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించకపోగా రాజ్యాంగబధ్ధ   రాజకీయ సమానత్వానికి కూడ  తూట్లుపొడుస్తారని అంబేడ్కర్ సరిగ్గానే ఊహించాడు. ఆర్ధిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని సాధించే భారాన్ని కూడ తానే భుజాలకు ఎత్తుకోవాలనుకున్నాడు.

 

            1936లో పెట్టిన ఇండిపెండెంట్ లేబర్ పార్టి, (ఐఎల్ పి) 1942లో మొదలెట్టిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్ సి ఎఫ్) ప్రయోగాలు అనుభవాల తరువాత రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఆర్ పిఐ) ను ఆరంభిస్తున్నట్టు 1956  సెప్టెంబరు 30న అంబేడ్కర్ ప్రకటించాడు. అది కార్యరూపం దాల్చకముందే 1956 డిసెంబరు 6న ఆయన చనిపోయాడు. అంబేడ్కర్ ప్రధాన అనుచరులు 1957 అక్టోబరు 3న నాగ్ పూర్ లో  రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియాను ఆరంభించారు. అయితే అంతర్గత కొట్లాటల కారణంగా  ఆర్ పిఐ యాభై ముక్కలైంది. ఇప్పుడో అరడజను  ఆర్ పిఐ లు పనిచేస్తున్నాయి. వీటిల్లో రామ్ దాస్ అథవాలే నాయకత్వంలోని ఆర్ పిఐ కేంద్రంలో అధికార కూటమిగావున్న  ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వుంది.

 

            ఆర్ పిఐలో చాలాకాలం పనిచేసిన కాన్షీరామ్ 1984లో అంబేడ్కర్ పుట్టిన రోజైన  ఏప్రిల్ 14న బహుజన్ సమాజ్ పార్టిని ఆరంభించాడు.  బిఎస్పీ ఆవిర్భావంతో అంబేడ్కర్ ఆశయాల ప్రచారానికి బలమైన వేదిక లభించింది. మూడు అగ్రవర్ణాలు తప్ప మిగిలిన 85 శాతం ప్రజలు బహుజనులే అనే నిర్వచనం కొన్ని ప్రాంతాల్లో గట్టిగానే పనిచేసింది. 1994 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాన్షీరామ్ –బీఎస్పీ ఒకదశలో ‘ఇప్పుడు వీస్తున్న గాలి’లా కనిపించింది. కానీ, ఎన్టీఆర్ ధాటికి అది నిలబడలేకపోయింది. రాష్ట్ర బిఎస్పీ నాయకులకు ఎన్నికల నిర్వహణ సామర్ధ్యం బొత్తిగా లేకపోవడమూ ఆ ఓటమికి ప్రధాన కారణం.

 

                        తన శిష్యురాలు మాయావతిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనువాదులంటూ తనే చిత్రించిన  బిజెపితో కాన్షీరామ్ జత కట్టడంతో  బిఎస్పీ ఆమోదాశం సన్నగిల్లడం మొదలయింది. అప్పుడప్పుడు బిజెపిని ప్రేమించి, అప్పుడప్పుడు ద్వేషించి ‘లోపట-బయట’ ఆటలతో మాయావతి  బిఎస్పీ ప్రతిష్టను దిగజార్చారు.

 

            2014 ఎన్నికల్లో వైయస్ జగన్ గాలి గట్టిగా వీస్తున్నట్టు కనిపించింది. జగన్ కు హిందూ క్రైస్తవ మతాల్లో ద్వంద్వ సభ్యత్వం వుంది. దానిని చూసి భయపడిన చంద్రబాబు – టిడిపి  జగన్ శిబిరం నుండి ఎస్సీ, క్రైస్తవ  ఓట్లను చీల్చడానికి కొందరు ఎస్సీ నాయకుల్ని ఎజెంట్లుగా నియమించారు. ఆ ఎజెంట్లు ఎవరూ? వాళ్ళ కార్యకలాపాల కోసం ఎన్ని నిధుల్ని కేటాయించారూ? చంద్రబాబు పాలనలో వాళ్ళు ఏఏ పదవులు పొందారు అన్నది రాజకీయ విశ్లేషకులకు ఇప్పటికీ మంచి పరిశోధనా అంశమే. సాక్ష్యాధారాలు ఇంకా శిధిలమైపోలేదు. ప్రజలకు అన్నీ తెలుసు! వాళ్లు చాలా తెలివైన వాళ్ళు. జేమ్స్ బాండ్ - ఓఓ7 ను మించిన గూఢాచారులు వాళ్ళు!.

 

            2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు-టిడిపి మళ్ళీ అదే ఎత్తు వేసింది. తన పాలనకు వ్యతిరేక ఓటు (incumbency factor) జగన్ వైపుకు  పోకుండ అడ్డుకోవడానికి జనసేన పవన్ కళ్యాణ్ ను వాడారు. ఎస్సీ, క్రైస్తవ ఓట్లు  దారి మళ్ళకుండ అడ్డుకోవడానికి బిఎస్పీనీ వాడారు. నామినేషన్ల ఘట్టం ఆరంభమం అవుతుండగా జనసేన, బిఎస్పీల మధ్య హడావిడిగా పొత్తు కుదిర్చింది చంద్రబాబు మనుషులు. మొత్తం 175 స్థానాల్లో జనసేన 140 సీట్లు తను వుంచుకుని బిఎస్పీకి 21 స్థానాలు కేటాయించింది. ఈ ముక్కోణ గేమ్ తెలియని అమాయకపు వుభయ కమ్యూనిస్టులు మిగిలిన  సీట్ల కోసం ఈ కూటమిలో చేరారు. నాలుగు పార్టీలు కలిసి పోటీచేస్తే  ఈ కూటమికి మొత్తం రాష్ట్రంలో దక్కింది రాజోలు సీటు ఒక్కటే.

 

            బిఎస్పీ మీద ఆశలు పెట్టుకుని రెండు మూడేళ్ళ ముందే రంగంలోనికి దిగి ఎన్నికల సన్నాహాలు చేసుకున్న అంబేడ్కరిస్టులు రాష్ట్రంలో చాలా మంది వున్నారు. సీట్ల పంపకాలలో దాదాపు వాళ్లందరికీ అన్యాయమే జరిగింది. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండ రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ బిఎస్పి పోటీ చేసుంటే ఒకళ్ళిద్దరైనా గెలిచి వుండేవారు. అంతకన్నా ముఖ్యంగా ఓట్ల శాతం 4-5 మధ్య వుండేది.

 

             

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం - 8

-        డానీ

-         

వామపక్షాలు

 

            స్వాతంత్ర్యం వచ్చాక  జాతీయ కాంగ్రెస్ మిశ్రమ ఆర్థిక విధానాన్ని ఎంచుకుంది. పెట్టుబడిదారీ విధానం,  సామ్యవాదం రెండూ కలిసి జీవించాలనేది దీని అర్థం.  ఫ్యాక్టరీ కార్మికులు, వ్యవసాయ కూలీల పార్టీగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి రూపుదిద్దుకుంది.  సాయుధ పోరాట మార్గాన్ని విరమించి పార్లమెంటరి పంథాను చేపట్టాక ఆంధ్రరాష్ట్రంలో తొలిసారిగా  జరిగిన 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ హోరాహోరీ వర్గ పోరాటాన్ని చేసింది.

 

            ఆ ఎన్నికల్లో 39.35 శాతం ఓట్లతో 119 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. క్రిషికార్ లోక్ పార్టీ  22 సీట్లతో రెండవ స్థానంలో నిలిచినప్పటికీ దానికి పడ్డ ఓట్లు 7.26 శాతం మాత్రమే. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 15 సీట్లు మాత్రమే దక్కినా 31.13 శాతం ఓట్లు పడ్డాయి. ఓట్ల పరంగా, ప్రజల మద్దతు పరంగా  ద్వితీయ స్థానం కమ్యూనిస్టులదే.

 

            కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ సిపి, జనసేన వంటి ‘పాపులిస్టిక్’ పార్టీలకు ఒక సిధ్ధాంత ప్రాతిపదిక వుండదు. ఓట్లు రాలుతాయన్న ప్ర్తతి అంశాన్నీ అవి తమ ఎన్నికల ప్రణాళికల్లో చేర్చేసుకుంటుంటాయి. కమ్యూనిస్టు పార్టీలు అలా కాదు. వాటికి ఒక బలమైన సిధ్ధాంత పునాది వుంటుంది.  అది శ్రామికవర్గ దృక్పథం. అదే వాటికి ప్రాణం.

 

            కాంగ్రెస్ పొలిటికల్ మెనూ “అందరికీ అన్నీ” అనే పధ్ధతిలో విస్తరించడంతో స్వంత దృక్పథాన్ని స్వంత వ్యక్తిత్వాన్నీ, స్వంత అస్తిత్వాన్నీ కాపాడుకోవడం కమ్యూనిస్టులకు చాలా కష్టం అయిపోయింది. అయినప్పటికీ దేశరాజకీయాల్లో చాలాకాలం రెండవ అతిపెద్ద పార్టీగా సిపిఐ కొనసాగింది.

 

            1962లో ఈశాన్య సరిహద్దు (నేఫా) ప్రాంతం  మీదికి చైనా   దూసుకు రావడాన్ని సమర్ధించడంతో మొదలయిన కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదాలు చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ 1975లో విధించిన ఎమెర్జెన్సీని సమర్థించే వరకు కొనసాగాయి. ఆ తరువాత వామపక్షాల గ్రాఫ్ లో చలన సగటులు దిగువముఖంగా ప్రయాణించాయి. సిపిఐ, సిపిఐ – ఎంల రాజకీయ చరిత్రల్లో భిన్నత్వం వైవిధ్యం వున్నప్పటికీ ప్రస్తుతం ఆ రెండు పార్టీలకు ఏపి శాసనసభలో ఒక్క స్థానం కూడ లేదు. ఈ దుస్థితికి  కారణం ఏమిటో వామపక్ష పార్టీల నాయకత్వమేగాక, సామ్యవాద భావాలున్న వారు, అబిమానులు  సహితం ఓ సారి సమీక్షించుకోవాలి.     

 

            కమ్యూనిస్టు పార్టీల్లో కుటుంబ పాలన వుండదు. అదొక సానుకూల అంశం. అయితే; కుల ప్రాబల్యం వుంటుంది. ఇతర బూర్జువా పార్టీల్లో ప్రాబల్యాన్ని కొనసాగించే విభిన్న సామాజికవర్గాలే వామపక్షాల్లోనూ తమ  ప్రాబల్యాన్ని సమిష్టిగా కొనసాగిస్తుంటాయి.  ఎన్నికల్లోనూ అంతే. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాత్రమే  వామపక్షాలు  ఎస్టీ ఎస్సీ అభ్యర్ధుల్ని పోటీకి దింపుతాయి. మిగిలిన స్థానాల్లో  స్థానికంగా సామాజికవర్గ బలం వున్న అభ్యర్ధులకే పార్టి టిక్కెట్లు ఇస్తారు. కులమత వ్యవహారం ఇంత బాహాటంగా వుంటున్నప్పటికీ తమకు కులం మతం లేదని వామపక్షాలు బుకాయిస్తుంటాయి. ఇలాంటి బూటకపు ప్రకటనల్ని  అణగారిన కులాలు ఆమోదించవు. ఈ క్రమంలో వామపక్షాల నిజాయితీ మీద ప్రజలకు నమ్మకం సడలిపోతోంది.

 

            వర్గపోరు కేవలం ఆర్థిక రంగంలోనే వుండదు; సమస్త రంగాలలోనూ వుంటుంది. దేశంలో కులాల మధ్య, మతాల మధ్య వర్గపోరు కొనసాగుతున్నదన్న వాస్తవాన్ని వామపక్షాలు గుర్తించే స్థితి సమీప భవిష్యత్తులో కనిపించడంలేదు.

           

            కమ్యూనిజాన్ని ప్రపంచ మ్యాపు నుండి తొలగించడానికి  బహుళజాతి సంస్థలు ఎలాగూ ప్రపంచ బ్యాంకు కేంద్రంగా వ్యూహాలు పన్నుతుంటాయి. అదొక నిరంతర ప్రక్రియ. వాటిని ముందుగానే పసిగట్టి ప్రతివ్యూహాలతో తరిమికొట్టే నైపుణ్యాన్ని మన కాలపు వామపక్షాలు సమకూర్చుకోలేదు. రోగి చనిపోయాక విషాదంగా రోదించడంకన్నా రోగనిరోధక మందుల్ని కనిపెట్టాలనే వ్యూహం  వామపక్ష వ్యూహకర్తల్లో  లోపించింది.

 

            కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక వామపక్ష నాయకులు కమ్యూనిజానికి సంబంధించి ఉత్తేజకర వ్యాఖ్యానాన్ని చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటీ  కనిపించదు. అసలు వాళ్ళలో కొందరయినా  ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను చదివారా? అనే అనుమానం కలుగుతుంది. ప్రతి అంశంలోనూ బూర్జువావర్గానికి విరుధ్ధమైన విధానం కమ్యూనిస్టులకు వుండాలనే స్పృహ కూడ మనకు నేటి వామపక్షాల్లో కనిపించడం లేదు.

           

            ప్రజలు మునుపటిలా లేరనీ, కరప్ట్  అయిపోయారనీ, అన్యవర్గ ధోరణులు ప్రబలిపోయాయనీ, అత్యాశపరులుగా మారిపోయారనీ వామపక్ష ఎన్నికల వ్యూహకర్తలు తరచుగా అంటున్నారు.  ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని శ్రామికవర్గానికి అన్యవర్గ ధోరణుల్ని అలవాటు చేసిందే వామపక్షాలు.  వామపక్ష పార్టీల నాయకులే కాంగ్రెస్ నో, టిడిపినో, పవన్ కళ్యాణ్ నో నమ్ముకుని వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తుంటే ప్రజలు నేరుగా ఆ కాంగ్రెస్ నే, ఆ టిడిపినే నమ్మడం సహజం.  అది వామపక్ష నాయకులు నేర్పిన విద్యేకదా?

 

            ఈ ఎన్నికల పొత్తులవల్ల ఇతర పార్టీలను వామపక్షాలు ఏమేరకు ప్రభావితం చేశాయో మనకు తెలీదు. విచక్షణా రహితంగా పొత్తులు పెట్టుకోవడంతో ప్రత్యర్ధి పార్టీల ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా  వామపక్షాల్లో కనిపిస్తున్నది. భ్రష్టాచారంతో పెట్టుకున్న రాజకీయ పొత్తులు సాంస్కృతిక పొత్తులుగా మారిపోతున్నాయి. శ్రీశ్రీ విశ్వనాధ సత్యనారాయణల మధ్య ఏకత్వాన్ని దర్శించే వరకు ఈ ప్రభావం సాగుతోంది. యుక్త వయస్సు దాటినవారు పరస్పర అంగీకారంతో  పెట్టుకునే వివాహేరత సంబంధాల్ని  రెండేళ్ళ  క్రితం సుప్రీం కోర్టు చట్టబధ్ధం చేసినపుడు ఆ తీర్పు మీద వామపక్షాలు కూడ విరుచుకుపడడం ఆశ్చర్యకరం. స్త్రీపురుష సంబంధాల్లో తాము ఫ్యూడల్ ‘పాతివ్రత్య’ వాదనను బలపరుస్తున్నామన్న స్పృహ కూడ వాళ్ళలో లోపింది.

 

            వామపక్ష నాయకులు తమ పార్టి ప్రయోజనాలను సాధించుకోవడంలోకన్నా ఇతర బూర్జువా పార్టీల ప్రయోజనాలను నెరవేర్చి పెట్టడంలో ఎక్కువ ఉత్సుకతను ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఏపిలో కమ్యూనిస్టు నాయకులు, అభిమానులు చేస్తున్న రాజకీయ వాదనలు వామపక్ష విధానాలను బలపరిచే బదులు టిడిపిని బలపరిచేవిగా వుంటున్నాయి.  అమరావతి వివాదం మీద నారాయణ, మధు ప్రకటనల్ని చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది. చంద్రబాబు రూపొందించిన పథకాల మీద వామపక్షాలకు భిన్నమైన దృక్పథం వుండాలా? వద్దా? టిడిపి చేయాల్సిన యుధ్ధాన్ని వామపక్షాలు తమ భుజాలకు ఎత్తుకోవడం ఆత్మహత్యా సదృశ్యం. క్రైస్తవ ద్వేషిగా మారిన చంద్రబాబును ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చీదరించుకుంటున్నారు. ఇక ముందు వాళ్ళ నిరసన వామపక్షాల మీదకు కూడా వ్యాపిస్తే ఆ తప్పు ఎవరిదీ?

 

            “అమరావతి, పోలవరంల మీద తెలుగు దేశం కాన్సెప్ట్ ఇది. వైయస్సార్ సిపి కాన్సెప్ట్ ఇదీ. ఇవి రెండూ ‘బూర్జువా’ దృక్పధాలు. భద్రలోకాన్ని సంతృప్తిపరచే విధానాలు.  కమ్యూనిస్టులు ఈ దృక్పధాలనీ, ఈ విధానాలనీ  వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులది అభద్రలోకాన్ని పరిరక్షించే కాన్సెప్ట్. అమరావతి మీద కమ్యూనిస్టుల కాన్సెప్ట్ ఇది” ...  అని చెప్పిన సందర్భం మనకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా టిడిపి చేస్తున్న వాదననే యధాతధంగా ఇప్పటి వామపక్షాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల దృష్టిలో  టిడిపికి  వామపక్షాలకూ తేడాలేదు. తేడాయే లేనపుడు వామపక్షాలను ఎందుకు ఎంచుకోవాలనే సందేహం ప్రజలకు రావడం సమంజసమే. “కాంగ్రెస్‍ భూస్వాముల  పక్షం, కమ్యూనిస్టులు వ్యవసాయ కూలీల పక్షం” అని 1955 ఎన్నికల్లో చెప్పినంత కరాఖండిగా ఇప్పటి వామపక్షాలు చెప్పలేకపోతున్నాయి. “ధోభీ కా గధా నా ఘర్ కా నా ఘాట్  కా” అనే సామెతలా వామపక్షాల్ని ప్రజలూ నమ్మడం లేదు; పాలకులూ నమ్మడంలేదు.

 

            ఇప్పుడు వామపక్ష నాయకుల కాలమంతా సంఘటిత ఉద్యోగ వర్గాల జీతాలను పెంచడానికో, ఎన్నికల్లో పొత్తుల కోసం  వెంపర్లాడడానికో సరిపోతున్నది. ఎన్నికల్లో మాస్ హిస్టీరియా కమ్యూనిస్టులకు అనుకూలంగా ఎప్పుడూ పనిచేయలేదు. ఓ ఏడాదిపాటు రోజుకు రెండుసార్లు “పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి” అని ప్రకటనలు గుప్పిస్తుంటే  మాస్ హిస్టీరియా ఎలా పనిచేస్తుందీ? పోటీచేసిన రెండూ చోట్లా ఓడిపోయే ఓ ఛోటా నాయకుడ్ని మహానాయకునిగా ప్రచారం చేసే వామపక్షాల్ని నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇంతా చేసి సాధించింది ఏమిటీ? అరపావు శాతం ఓట్లా? తమకు ఎన్ని ఓట్లు పడబోతున్నాయో సర్వేలు జరిపి అంచనా వేసే సెఫాలజిస్టులు (ప్రజలనాడి చెప్పే నిపుణలు) సహితం వామపక్షాల్లో కనుమరుగైపోయారు.

 

            పవన్ కళ్యాణ్, మాయావతిలతో జట్టుకట్టకపోయినా సిపియం, సిపిఐలకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. స్వతంత్రంగా పోటీ చేస్తే ఏ పార్టీనయినా సరే విమర్శించే అవకాశం వస్తుంది. తాము చెప్పదలుచుకున్నది చెప్పే స్వేఛ్ఛ వస్తుంది. అంతిమంగా తమకంటూ ఒక అస్తిత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు వామపక్షాలు చేయాల్సింది  అదొక్కటే.

 

            గత 70 యేళ్ళ చరిత్ర చెపుతున్నదేమంటే మన వామపక్షాలకు సాయుధపోరాటం చేసే తెగువా లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాణించే చొరవాలేదు. మినహాయింపులు ఎప్పుడూ వుంటాయి.

 

No comments:

Post a Comment