Saturday 13 February 2021

MOSCOW to POSCO

 రష్యా మాస్కో – టూ – కొరియా పోస్కో

డానీ

 

ఆంధ్రప్రదేశ్ ను ఒక భూతం వెంటాడుతోంది. దానిపేరు పోస్కో. ఇది దీని పొట్టి పేరు. పొడుగు పేరు పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. దక్షణ కొరియా తీర ప్రాంత నగరం పోహాంగ్ దీని కేంద్ర కార్యాలయం. మరో తీర నగరం గ్వాంగ్ యాంగ్ లో మరో యూనిట్ వుంది. సాలీన 43 మిలియన్ (430 లక్షల) మెట్రిక్  టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పోస్కో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఉక్కుకర్మాగారంగా కొనసాగుతోంది.      

 

దక్షణ కొరియా మాజీ మేజర్ జనరల్  పార్క్ తాయి జూన్  1968లో పోస్కోను నెలకొల్పాడు. పార్క్ తాయి జూన్ కు వాణిజ్యం, యుధ్ధం ఒకటే. కార్మిక చట్టాలనుగానీ, పర్యావరణ నిబంధనల్ని గానీ  పాటించదని పోస్కోమీద ఆరోపణలున్నాయి. పార్క్ తాయి జూన్  2011లో  చనిపోయాడు. అప్పటి నుండి చోయి జెఓంగ్ వూ పోక్సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వుంటున్నాడు.

 

పోస్కోకు మనుషుల మీదకన్నా యంత్రాల మీద నమ్మకం ఎక్కువ. ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అతిగా పెంచి కార్మికుల సంఖ్యను కుదించి భారీ లాభాలను అర్జించడం ఈ సంస్థ మార్కెట్ వ్యూహం. 430 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 34 వేలు మాత్రమే. టన్నుకు పది పనిగంటలు అనేది దాని కొలమానం;  అంటే 1.25 పని దినాలు. ఈ 34 వేల మందిలోనూ సగం మంది ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు  ఉద్యోగులు. పోస్కో అనుసరించే విచక్షణారహిత విధానాల వల్ల ప్రపంచ దేశాలు దాన్ని దూరంగా పెడుతున్నాయి. ఒక విధంగా పారిశ్రామిక వెలి వేశాయి.  

 

అమెరికా కాలిఫోర్నియా  రాష్ట్రంలోని పోర్ట్ సిటి పీట్స్ బర్గ్ లో యూఎస్ స్టీల్ తో కలిపి పోస్కో USS- POSCO కర్మాగారాన్ని నెలకొల్పింది. రెండు సంస్థలకూ ఆ యూనిట్ లో చెరో 50 శాతం వాటాలుండేవి. POSCOతో పడలేక గత ఏడాది పిబ్రవరిలో  మొత్తం కార్మాగారాన్ని యూఎస్ స్టీల్ స్వాధీనం చేసుకుంది. 50 శాతం వాటాను పోస్కోకు చెల్లించి బయటికి పంపించేసింది.

 

పోర్ట్ సిటీల మీద ఆసక్తివున్న పోస్కో భారత దేశంలో అలాంటి అవకాశం కోసం పదేళ్ళకు పైగా వెంపర్లాడుతోంది. జగత్ సింగ్ పూర్ జిల్లాలోని పారదీప్ రేవు సమీపంలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఒడిశా  ప్రభుత్వంతో పోస్కో 2005లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 4 వేల ఎకరాల భూమి కేటాయించడమేగాక, నీరు, విద్యుత్ వినియోగంపై భారీ రాయితీలు ఇవ్వడానికి ఒడిశా  ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విచక్షణా రహితంగా అడవుల్ని నరికివేయడంతో స్థానికులు తిరగబడ్డారు. పర్యావరణ చట్టాలను కఛ్ఛితంగా పాటించాలని ఒడిశా ప్రభుత్వం పట్టుబట్టింది. అది నచ్చని పోస్కో  అక్కడి నుండి తప్పుకుంది. ఇనుప గనులు పుష్కలంగావున్న ఛత్తీస్ గడ్, జార్ఖండ్ లలో కూడా పోస్కో ప్రయత్నాలు చేసింది. అవి ఫలించలేదు. అప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోస్కోను ఆహ్వానించింది.

 

 “భారత దేశంలో ఉక్కు పరిశ్రమాభివృధ్ధి –  ఒరిస్సా సన్నివేశం’ అనే అంశంపై 2007 సెప్టెంబరు 27న భవనేశ్వర్ లో ఒక సదస్సు జరిగింది. అందులో పోస్కో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్  డైరెక్టర్ ఛాంగ్ హో క్వాంగ్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.  ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి.  కానీ; భారీ పరిశ్రమల్ని నెలకొల్పే విధానం లేదు. పొరుగున వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భిన్నమైనది. అక్కడున్న వామపక్ష ప్రభుత్వానికి పెట్టుబడుల్ని ఎలా తీసుకురావాలో తెలుసు” అని వివరించాడు.

 

“… three mineral rich states of Orissa, Chhatishgarh and Jharkhand remained more or less the same. They had abundant minerals but no clues to implement projects. …. But the situation in neighbouring West Bengal is totally different, ….. the Left Front Government knew how to promote investments”.

 

-        Posco Research Institute's Director Chang-ho Kwang (in 2007)

 

విదేశీ పెట్టుబడుల విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించినప్పటికీ స్థానిక రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోస్కో ప్రయత్నాలు అక్కడా ఆగిపోయాయి. ఆ తరువాత పోస్కో కన్ను విశాఖపట్నం మీద పడింది.

 

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు విదేశీ పెట్టుబడుల విషయంలోగానీ, ఆర్థిక సంస్కరణల విషయంలోగానీ బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ల మధ్య స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. తేడా ఏమంటే ప్రైవేటీకరణలో  కాంగ్రెస్ ఎక్కువ మందికి అవకాశం కల్పించేది; బిజెపి అస్మదీయులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నది.  బిజెపికి మద్దతు తెలపడమే జనసేన పని కనుక అదీ ఈ  చెట్టు పిలకే.   

 

 

వామపక్షాల వ్యవహారం మరీ విచిత్రం. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలో వున్నప్పుడు ఇంకోలా వ్యవహరిస్తుంటాయి. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో వున్నప్పుడు వామపక్షాలు ఎర్రజెండాలు పట్టుకుని  సరళీకృత ఆర్థిక విధానానికి ఎర్ర తివాచీ పరిచాయి. దాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టారు. నందిగ్రామ్ ఆందోళన దానికి పెద్ద ఉదాహరణ. “పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే సురక్షిత రాష్ట్రం కేరళ” అని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకో  విచిత్రం వుంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న  చట్టాలు అన్నింటికి ప్రధాన పక్షాలైన వైసిపి, టిడిపిలు పార్లమెంటులో బేషరతుగా మద్దతు పలుకుతుంటాయి. ఇక్కడ మాత్రం “నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ” అంటూ రాజకీయ ప్రహసనం ఆడుతుంటాయి.

 

బిజెపి తీరు మరీ విచిత్రం. “ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే భాష” దాని నినాదం. కానీ ఆ పార్టి నేతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో మాట్లాడుతుంటారు. విశాక ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ కరించాలని కేంద్ర కేబినెట్ ముహూర్తం చూసి ‘రిపబ్లిక్ డే’ రోజున తీర్మానించింది. ఫిబ్రవరి 6న బిజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధి సాగుతున్న కొద్దీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటివాటిని ప్రావేటీకరించక తప్పదని వివరించారు. ఆ మరునాడు విశాఖపట్నం వచ్చిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే నిర్ణయం బిజేపిది కాదన్నారు.

 

ఎప్పటిలాగే రాష్ట్రంలో టిడిపి వైసిపి బురదజల్లుడు ఆట ఆడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కేంద్రంలో బిజెపికి ‘లొంగిపోయి’ విశాఖ ఉక్కు మీద హక్కును వదులుకున్నారని టిడిపి విమర్శిస్తోంది. పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్  గత ఏడాది అక్టోబరు చివర్లో ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి నివాసంలో కలిసినప్పుడే ఈ కుట్రకు నాందీ పలికారనేది వాళ్ళ ఆరోపణ.  

 

మరోవైపు, వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి విశాఖ ఉక్కు ఫ్యాకటరీ ఆవరణలో  పోస్కోకు కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మించే అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు. దానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 10న లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోస్కో వాళ్ళు మూడేళ్ళుగా తమతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో సౌత్ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారనీ,  ఆ ఏడాది అక్టోబరు 22న ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో సమావేశమయ్యారని ప్రకటించారు. ఆ సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వుంది. పివి నరసింహారావు- మన్మోహన్ సింగ్ ద్వయం రూపొందించిన నూతన ఆర్థిక విధానానికి తానే అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ అని ఘనంగా చెప్పుకునే చంద్రబాబు ఈ కీలక సమావేశంలో నిర్వహించిన  పాత్ర  ఏమిటీ? అనేది కూడ ఒక కీలక సందేహం. 

 

 

“జియో ఉచితంగా ఇచ్చి లాభాలు సంపాదిస్తుంటే బిఎస్ ఎన్ ఎల్ చార్జీలు  పెంచి నష్టాల్లో కూరుకుపోతుంది” అని ఒక కార్పొరేట్ జోక్ వుంది. ప్రైవేటు సంస్థలు లాభాల్ని సంపాదిస్తుంటే ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల ఊబిలో ఎందుకు కూరుకుంటున్నాయన్నది చాలా కాలంగా మనల్ని వేధిస్తున్న ప్రశ్న.  ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్ని స్వంత బిడ్డల్లా, పబ్లిక్ రంగ సంస్థల్ని సవతి బిడ్డల్లా చూస్తుందనేది దీనికి సిధ్ధంగా దొరికే సమాధానం. పబ్లిక్ రంగ సంస్థలు మరీ వేల కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయినపుడు దాని మీద ఒక పబ్లిక్ డిబేట్ జరిగితీరాలి.

 

క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో కూరుకుపోతున్నదని కొందరు అంటున్న మాట అర్థ సత్యం మాత్రమే. క్యాప్టివ్ గనులు లేని ప్రైవేటు సంస్థలు అనేకం వున్నాయి.  అవి ఎలా లాభాలను అర్జిస్తున్నాయన్న ప్రశ్న ముందుకు వస్తుంది. పైగా; 2018-19 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరపు నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా దాదాపు 100  కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన రికార్డు కూడ ఈ సంస్థకు వుంది. అప్పుడు అదెలా సాధ్యం అయిందీ? ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడంలేదు?  ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగస్వామ్యం కారణంగా పని సంస్కృతి నీరసించిపోతుందనే విమర్శలున్నాయి. దీనికి కూడ ఒక సమాధానం కావాలి.

 

ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినపుడు మాత్రమే ఏ సంస్థ అయినా నష్టాల్లోనికి పోతుంది.  విశాఖ ఉక్కు ఫ్యాకటరీకి 20 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. ప్రతి ఏడాది వీటి బుక్ వాల్యూ పెరుగుతూనే వుంటుంది. ఉత్పత్తి ద్వార లాభాలు రాకపోయినా రియల్ ఎస్టేట్ విలువ పెరగడం వల్ల కూడ  బ్యాలెన్స్ షీట్ లో లాభాలు వస్తాయి. అలాంటి అస్సెస్ మెంటును ఇప్పటి వరకు ఎవరయినా జరిపారా?

 

ఇక్కడొక తాత్విక చిక్కు ముడి వుంది. జంతువులు వేల సంవత్సారాలుగా ఒకే రకంగా ఆహారాన్ని సేకరిస్తుంటాయి. మనిషి అందుకు భిన్నంగా, తనకు సహాయకారిగా పనిముట్లు, యంత్రాలను సృష్టిస్తాడు. యంత్రాలు అభివృధ్ధి చెందే కొద్దీ మనుషులకు మొరటు చాకిరీ నుండి విముక్తి లబిస్తుంది. కొత్త టెక్నాలజీ పాత ఉపాధిని రద్దు చేసి కొత్త ఉపాధిని సృష్టిస్తుంది. కొత్త టెక్నాలజీ మీద మన విధానం ఏమిటో ప్రకటించాల్సిన సందర్భంఇది.

 

“విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే వుంటుంది” అని బిజెపి ప్రతినిధులు అంత గట్టిగా చెపుతున్నారంటే; కథ ముగిసిపోయిందనే అర్థం.  ఒకప్పుడు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని నినదించిన ప్రజలు  ఇప్పుడు నిర్లిప్తంగా వుండిపోవడానికి కారణం ఎవరూ? కనీసం విశాఖపట్నం బంద్ కూడ జరపలేక గాజువాక బంద్ జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది?   1980లలో రష్యా మాస్కో సాంకేతిక సహకారంతో ఆరంభమయిన విశాఖ ఉక్కు కథ దక్షణ కొరియా పోస్కోకు చేరడంతో ముగియాల్సిందేనా? దాన్ని అడ్డుకునే  మార్గం ఏదైనా వుందా?

 

 

ఫేస్ బుక్

13 ఫిబ్రవరి 2021

No comments:

Post a Comment