Saturday 18 June 2022

మరీ చెలాన్ని కూడా plagiarist అనేస్తారా?

 మరీ చెలాన్ని కూడా plagiarist అనేస్తారా?

NARESH NUNNA గారూ! దాదాపు నెల రోజులుగా తీరికలేని పనుల్లో వుండడం వలన మీ NOTESను చూడలేదు. చెలం భాషలో చెప్పాలంటే "చాలా వాటికి క్షమించాలి డానీని".
చెలం గారి మీదా, పరుగులు తీసే వారి తెలుగు వాక్యాల మీద నాకు అపార గౌరవం వుంది. వారి మీద మొపాసా ప్రభావం వుందని తెలుసు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మీలాంటివాళ్ళు చెలాన్ని పుసుక్కున plagiarist అనేస్తారని భయపడ్డాను.
ప్రపంచ మానవాళికి ప్రాధమిక భావోద్వేగాలు కొన్నే వుంటాయి. వాటిని పురాణాల కాలంలోనే అన్ని భాషల్లోనూ గ్రంధస్తం చేసేసారు. ఆ తరువాతి తరం రచయితలు చేసేదేమిటంటే ఆ భావోద్వేగాలను తమ కాలానికీ, తమ ప్రాంతానికి అన్వయించడం మాత్రమే. ప్రతి రచయితకూ తనదైన సృజనాత్మక శక్తి వుంటుంది. అదే అతని కాంట్రిబ్యూషన్. దానికో మూలాన్ని పీకి plagiarist అనేయడం నాకు నచ్చదు. మూలాన్నీ, అన్వయాన్నీ మెచ్చుకునే సామర్ధ్యం వుండాలి.
అలా కాదంటే, మన కవిత్రయాన్ని సహితం plagiarists అనేయాల్సి వుంటుంది. అది న్యాయమా? ముఖ్యంగా జలపాత హోరులా ప్రవహించే పాత్రల్ని మలచిన తిక్కన రచనా నైపుణ్యం మట్టిలో కొట్టుకు పోవాల్సిందేనా?
ఆ మధ్య Andrey Zvyagintsev దర్శకత్వం వహించిన రష్యన్ సినిమా Leviathan (తిమింగిలగిలం) సినిమా చూసి నిర్ఘాంత పొయాను. ఆకథ అయూబ్ అనే ఇస్లాం ప్రవక్తకు చెందింది. దాని ప్రస్తావన బైబిల్ లో (Naboth's Vineyard) కూడా వుంది. అమేరికాలో రోడ్ల విస్తరణ పథకం మీద తిరుగుబాటు చేసిన Marvin Heemeyer జీవితాన్ని ప్రేరణగా తీసుకున్నట్టు రచయిత ప్రకటించాడు. దీన్ని కూడా plagiarism అనేస్తారా? ఆ సినిమాను తెలుగులో నవలగా తెస్తే బాగుటుందని ఆ రచయితతో కొన్నాళ్ళు ఉత్తరప్రత్యుత్తరాలు సాగించాను. వాళ్ళు ఒప్పుకోలేదు.
వారం క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక పతాక శీర్షికలో ఆధునిక దాంపత్య జీవితం మీద పెద్ద కథనాన్ని ప్రచురించింది. మానసిక వత్తిడి, కుంగుబాటుల కారణంగా పురుషుల్లో లైంగిన పటుత్వం తగ్గిపోవడంవల్ల భార్యా భర్తల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయనేది ఆ కథనం సారాంశం. ఇలాంటి సర్వేలు అంతర్జాతీయ socialogy పత్రికల్లో చాలా కాలంగా వస్తున్నాయి. వీటి ఆధారంగా కథ రాస్తే అది అనివార్యంగా అవి D. H. Lawrence నవల Lady Chatterley's Lover కు దగ్గరగా వుంటుంది. వివాహేతర సంబంధాల మీద ఇప్పటికే తెలుగులో చాలా కథలు వచ్చేశాయి. వస్తున్నాయి. వీటిని D. H. Lawrence కు అంటగట్టేస్తారా? మన జీవితం యూరోప్ ను అనుసరిస్తున్నపుడు మన సాహిత్యం సహితం యూరోప్ ను అనుసరిస్తుంది.
యూరోపియన్ల గొప్పతనం ఏమంటే తాము ఎక్కడ నుండి ప్రేరణ పొందారో వాళ్ళు ముందుగానే ప్రకటిస్తారు. 1933 నాటి King Kong సినిమాను చూసి జీవితంలో అలాంటి సినిమాను తీయాలని దర్శకునిగా మారినట్టు 2005లో అదే కథతో కొత్త సినిమా తీసిన పీటర్ జాక్సన్ చెప్పుకున్నాడు. మొపాసా 'వెన్నముద్ద' కథ ప్రేరణతో హాలీవుడ్ లో Stage Coach' అనే సినిమా వచ్చింది. Citizen Kane సినిమా తీయడానికి ముందు ప్రేరణ కోసం Stage Coach సినిమాను నలభై రోజులు వరసాగ్గా చూసాడటదాని డైరెక్టరు Orson Welles. లూసన్ అయితే Old Stories Retold పేరుతో ఒక కథా సంకలనమే రాశాడు. Vishal Bhardwaj, Sanjay Leela Bansali ఒకరితో ఒకరు పోటీపడి షేక్స్ పియర్ నాటకాలకు ఆడాప్షన్స్ తీస్తుంటారు.
నేను రాసిన 'రాజుగారి కొమ్ము'కు The King and The Tamarind Drum కథ ప్రేరణ, 'కటారా' కు Shaddad and his Paradise కథ ప్రేరణ, గత నెలలో రాసిన 'మదరసా మేకపిల్ల' కు 'తోడేలు-మేకపిల్ల' కథ ప్రేరణ.

తాముమిచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికి సామ్రాజ్యవాదుల రికవరీటీమ్ భారతదేశానికి వస్తే ఎలా వుంటుందనే ఊహతో ఓ నలభై యేళ్ల క్రితం ‘జప్తు’ అనే కథను రాశాను. అది మేజికల్ రియలిజం కథ.  తన జనంతో ఎర్రసముద్రాన్ని దాటిన ప్రవక్త మూసా (Moses) ప్రేరణతో అందులో ప్రొటాగోనిస్టును సృష్టించాను.

మొపాసా కథకు నా అన్వయంలో ఎలిజిబెత్ రూసోను 'వెన్నముద్ద' అనడం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

August 12, 2017

No comments:

Post a Comment