Saturday, 18 June 2022

అబ్బా! మీరు నాకు నిత్యం గుర్తుంటారు.

 అబ్బా! మీరు నాకు నిత్యం గుర్తుంటారు.

సోషల్ కేపిటల్ ఇచ్చినందుకూ,

స్ట్రాంగ్ బాడీ ఇచ్చినందుకు.

నిస్సహాయుల్ని పరామర్శించే వ్యసనాన్ని అంటించినందుకు.

 

చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన ప్రదేశం మా నాన్న ఛాతి. ఆయన ఛాతీ విశాలంగానూ, దట్టమైన వెంట్రుకలతో మెత్తటి పరుపుగా వుండేది. వీలున్నప్పుడెల్లా ఆయన ఛాతీ మీద బోర్లా పడుకునేవాడిని. భలే నిద్రపట్టేది.

 

మానాన్న పేరు తరాజేష్ ఖాన్. ఆయనది చాలా పెద్ద కుటుంబం. దాన్ని ‘వంశం’ అన్నా తప్పుకాదు. నరసాపురంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లోనూ ఆయన బంధువులు ఓ వంద వరకు వుండేవారంటే అతిశయోక్తికాదు.  నిజాం సంస్థానంలోనూ ఆయన సమీప బంధువులు వుండేవారు. మా పూర్వికులు ‘గవర్నర్ సాబ్’ అని గౌరవంగా పిలుచుకునే అబ్దుల్ సత్తార్  పాషా  గారు నైజాంలో ఓ మండలానికి పెద్ద అధికారి. వారు మా నాన్న పెద్ద అక్కగారికి భర్త. వారి అల్లుడే మాజీ మంత్రి, ప్రస్తుత నిజాం ట్రస్ట్ కార్యదర్శి అసిఫ్ పాషాగారు. వారు మా నాన్నకు మేనల్లుడు.

 

సింధూనాగరీకతలా నరసాపురం టేలరుపేట మసీదు వీధికీ ఒక ‘నాగరీకత వుంది. దానికి ఆద్యులు అయిన అహ్మద్ షరీఫ్ గారి పెద్ద కూతురు అమీరున్నీసాకు మూడో  కొడుకు మానాన్న.  తండ్రి గులాం మొహిద్దీన్ ఖాన్. అహ్మద్ షరీఫ్ గారిని మేము మా వంశ వ్యవస్థాపకునిగా భావిస్తాము.  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ గా పనిచేసిన అహ్మద్ షరీఫ్ పేరు అక్కడి నుండి వచ్చిందే.  నా పేరులోని అహ్మద్ కూడా అక్కడిదే.

 

మానాన్న పెద్ద సంపదలో పుట్టారు చాలా పేదరికాన్ని అనుభవించారు. రెండో ఏటే తల్లి చనిపోయి, తండి మరో పెళ్ళి చేసుకోవడంతో అమ్మమ్మ దగ్గర  అనాధగా పెరిగారు. వారసత్వంగా న్యాయంగా రావలసిన ఆస్తులు రాలేదు. వచ్చిన కొద్దిపాటి ఆస్తులు కూడ అనుభవంలేక హరించుకుపోయాయి. మానాన్న జీవితంలో సంతోషాలకన్నా విషాదమే ఎక్కువ.  ఆయన్ని ప్రకృతి పీడించింది; సమాజమూ ఓడించింది. ఆయన గొప్పతనం సంతోషాన్ని, శోకాన్నీ సమానంగా స్వీకరించడం. ఆయనో కర్మ యోగి. మనిషి ఎప్పుడూ నవ్వుతూ వుండేవారు. పక్కన వున్నవాళ్ళని  నవ్విస్తూ వుండేవారు.

 

చివరి రోజుల్లో ఒక సందర్భంలో వారన్న మాట నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతుంటుంది..  నాకు ఆడపిల్లలు లేరని గుర్తుచేస్తూ ఆడపిల్లలు లేనివారి జీవితం అసంపూర్తి (అధూరా) అన్నారు. మనిషికి ఆడపిల్లల బాధ తెలియాలి అనేది వారి అభిప్రాయం.

 

ఆయన చాలా పెద్ద మెకానిక్. యంత్రాలతో ఆడుకునేవారు. ఆయన జీవితంలోని ఒక విరాటపర్వంలో ఓ రెండేళ్ళు లూధియానాలో వున్నారు. దానితో, మా కుటుంబానికి పంజాబ్ తో ఒక అనుబంధమూ  ఏర్పడింది; మెకానికల్ రంగంలో వారి నైపుణ్యం పెరిగింది.  షీట్ పట్టుకుని గేజ్ చేప్పేసేవారు; తీగను వంచి టెంపర్ చెప్పేసేవారు. మొదటితరం యంత్రాల్ని బాగు  చేసేవారు చాలామంది వుంటారు.  మానాన్న, ఏకంగా లేతు మిషిన్ మీద కొత్త కొత్త యంత్రాల్నే సృష్టించేసేవారు. ఆ నైపుణ్యంతోనే ‘పీపుల్స్ వార్’ మెకానికల్ విభాగంలో తన సేవలు కొన్నింటిని అందించారు.

 

మనిషి ఎంత మంచివారో మాటల్లో చెప్పలేను. ఇతరుల ఆకలిని చూడలేకపోయేవారు. భోజన సమయంలో ఎవరు ఎదురుపడినా  భోజనం చేశారా?  అని అడిగేవారు. వాళ్ళను ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టమనేవారు. దానివల్ల మేము కొన్ని ఇబ్బందుల్ని కూడ అనుభవించాము. అది వారి వ్యసనం.

 

ఇలా మానాన్న గురించి చెప్పుకుంటూ పోతే అదొక మహా గ్రంధం అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే మానాన్న ద్వార నాకు రెండు ప్రయోజనాలు కలిగాయి. మొదటిది; సోషల్ కేపిటల్.  పఠాన్ గా పుట్టించి ఖాన్ అనే తెగ పేరు ఇచ్చారుగా!. వుభయగోదావరి జిల్లాల్లోనేగాక కృష్ణా, విశాఖ జిల్లాల్లోని కొంత భాగంలో ఏదైనా ప్రముఖ ముస్లిం కుటుంబం వుందటే అది నాకు  గత రెండు మూడు తరాల్లో ఏదో ఒక బీరకాయ పీచు సంబంధం కలిగి వుంటుంది.

 

రెండోది; నాకు ఒక అద్భుతమైన శరీరాన్ని ఇచ్చారు.  నా కళ్ళు, ముక్కు, పెదాలు మా అమ్మవే అయినా తల, శరీర ధృఢత్వం పూర్తిగా మా నాన్నవే. ఇందులో సగ భాగం డిఎన్ ఏ, జీన్స్ మూలంగా సహజంగా వచ్చినవి; ఇంకో సగ భాగం ఆయన స్వయంగా సృష్టించినవి.

 

నాకు తొమ్మిదో ఏటనే వుబ్బసం బయట పడింది. అప్పట్లో వుబ్బసానికి ఇంగ్లీషు వైద్యం లేదంటూ అనేక నాటు వైద్యాలు చేసేవారు. పొగాకు పొడి (నశ్యం) పీల్చడం, పొగాకు చుట్టతో నుదిటి మీద కాల్చడం వగయిరాలు. మా అమ్మ మీద మిశన్ హాస్పిటల్ మిస్సమ్మ డాక్టర్ల ప్రభావం వుండేది. ఆమె ఈ నాటు వైద్యానికి ఒప్పుకోలేదు. పైగా, ఉబ్బసంవల్ల చాలా బక్కగా వుండేవాడిని. అసలే ఎత్తు తక్కువ ఆపైన రివట్లా వుండేవాడిని. సాటి స్నేహితులు నాతో  ఒక ఆట ఆడుకుంటుండేవారు. తిరిగికొట్టలేననే ధైర్యంతో అప్పుడప్పుడు అసందర్భంగా కొడుతుండేవారు.  

 

మా నాన్నకు కసరత్తుల అనుభవంవుంది. ఆయన నాకోసం ఒక పరిష్కారం కనిపెట్టారు. నా చేత వర్కవుట్ మొదలెట్టించారు. నా వయసు వాళ్ళను  ఓ పది మందిని పోగేసి ఓ చిన్న సైజు వీధి వ్యాయామశాల మొదలెట్టారు. కాలువలోనేగాక ఏకంగా గోదావరి నదిలోనూ ఈత కొట్టడం నేర్పించారు.  వీటితోపాటు గుర్రపు స్వారీ, కర్ర సాము సహితం నేర్పించే ప్రయత్నం చేశారు. ఆ రెండు విభాగాల్లో నేను అంతగా రాణించలేదుగానీ వర్కవుట్, స్వీమ్మింగ్ చాలా బాగా అబ్బాయి. దెబ్బలు తినే స్థాయి నుండి క్రమంగా దెబ్బలు కొట్టగలిగే వరకు ఎదిగాను. స్మాల్ టౌన్ స్ట్ రీట్  ఫైటర్ అన్నమాట. నా పేరు యజ్దానీ కాస్తా  ఎస్ డానీ గా మారిపోయింది. “డానీ ఈజ్ నాట్ మై నేమ్; ఇట్స్ మై యాటిట్యూడ్” అనే స్థాయికి వెళ్ళింది కత.  

 

శారీరక శ్రమ చేస్తే అలిసిపోతారని చాలా మంది అనుకుంటారు. నిజానికి వ్యాయామం చేసేకొద్దీ శరీరం బలపడుతుంది. మనలో చాలామంది హాబీస్ అనగానే ఓ పెద్ద జాబితా చదువుతారు. ఆరోగ్యం కూడ మన హాబీస్ లో వుండి తీరాలి. నాకు పుస్తకాలు చదవడంతోపాటు వంట చేయడం, ఈత కొట్టడం, వర్కవుట్ చేయడం చాలా ఇష్టం. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా వేగంగా మార్నింగ్ వాక్ చేసేవాళ్ళలో నేనూ ఒకడిగా వుండేవాడిని. శరీర నిర్వహణ మీద విపరీతమైన ఆసక్తి వుండేది. ఆ ఆసక్తితోనే కృష్ణాజిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కు కొన్నాళ్ళు సహాయ కార్యదర్శిగానూ పనిచేశాను.  ఉబ్బసం నుండి బాక్సింగ్ అసోసియేషన్ వరకు ప్రయాణం!

 

వర్కవుట్ చేయడానికి సమయ పాలన చాలా ముఖ్యం.  ప్రతి రోజూ 24 గంటల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇతర వ్యాపకాలు వచ్చిపడినపుడు వర్కవుట్ అటక ఎక్కుతుంది. శరీరం బలహీన పడుతుంది రోగాలు వస్తాయి. చిన్నప్పుడే ఎడమ కన్ను తెగింది. ఒకసారి మోకాలు జాయింట్ డిస్ లొకేట్ అయ్యింది.  కనీసం ఒక అరడజను సందర్భాల్లో డాక్టర్లు నన్ను  చాలా భయపెట్టారు. ఒకరు; గ్లూకోమాతో గుడ్డివాడివైపోతున్నావు అన్నారు. ఇంకొకరు; తుంటి కీలు మార్చాలన్నాడు. మార్చినా  మెట్లు ఎక్కలేవు అన్నారు. మరొకరు; మధుమేహం ఎక్కువై సంభోగ సామర్ధ్యాన్ని కోల్పోతావు అన్నారు. కోవిడ్ తరువాత రాబోయే ఆర్థో సమస్యల గురించి అనేక హెచ్చరికలు  చేశారు.  

 

మనుషులకు సమస్యలు రావడం చాలా సహజం. సమస్యల్ని ఎలా అధిగమించాలీ అనేదే  అసలు సమస్య. 

ఆరోగ్య సమస్యలు వచ్చినపుడేకాదు;  సామాజిక, ఆర్ధిక, బౌధ్ధిక  సమస్యలు వచ్చినపుడు కూడ నేను మా పాతసామాన్ల గదిని తెరచి మా నాన్న అలనాడు నా కిచ్చిన దాగళ్ళను (ఎలక్ట్రిక్ పోల్ ముక్కలు) బయటికి తీస్తాను. వాటి మీదే బస్కీలు (పుష్ –అప్స్), మధ్యలో రాడ్ పెట్టి దండీలు (బైసెప్స్) చేస్తాను.  వారం రోజుల్లో బాడీ ఫిట్ అయిపోతుంది; మైండ్ కూడ ఫిట్ అయిపోతుంది.  ఇప్పుడయితే అంత మొరటు పరికరాలు అవసరంలేదు. సున్నితమైన పరికరాలు అనేకం వచ్చాయి. వాటిని ఉపయోగించవచ్చు.

 

రోగాలు తమంతట తాము రావు; మనం రప్పించుకుంటాము అని నాకు తరచూ అనిపిస్తూ వుంటుంది. ఎక్కువ మంది రుచిని పొట్టను మాత్రమే ప్రేమిస్తారు. నిజానికి మనం మొత్తం శరీరాన్ని ప్రేమించాలి. తల వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు ప్రతిరోజూ జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలి. మనం స్వీకరిస్తున్నది ఆహారమో విషమో పరీక్షించుకుంటుండాలి.  వ్యాయామం ద్వార అకాల వృధ్యాప్యాన్ని చాలా వరకు అధిగమించవచ్చు.  70 ఏళ్ళ లోపు ఒక్కరోజు కూడ ఇన్ - పేషెంట్ గా  హాస్పిటల్ లో వుండకూడదనేది నా లక్ష్యంగా వుండేది.  హాస్పిటల్ బెడ్ చూడకుండ అరవై తొమ్మిదిన్నరేళ్ళు లాగించాను. ఇది మానాన్న దీవెనే అనుకుంటాను. ఇంకో వంద రోజుల్లో  70 ఏళ్ళు పూర్తి చేస్తాననగా కరోనా నా లక్ష్యాన్ని దెబ్బకొట్టింది. ఓ పది రోజులు హాస్పిటల్ బెడ్ ఎక్కక తప్పలేదు. “ఒక మిరాకల్ గా చావు నుండి తప్పించుకున్నావు. ఇంకో మిరాకల్ గా చాలా త్వరగా రికవర్ అయ్యావు. గ్రేట్” అన్నారు నాకు వైద్యం చేసిన వైద్యులు. ఈ గ్రేట్ లోనూ మా నాన్నకు వాట దక్కుతుంది.  

 

ఇప్పటి వరకయితే, ఎదురయిన ప్రతి సమస్యనూ జయించాను. వయసు మరీ పెరిగిపోయినపుడు శరీరంలో కొన్ని సహజ మార్పులు వస్తాయి. ముందు ముందు వాటిని కూడ అధిగమించవచ్చేమో  ఆలోచిస్తాను. నాలాంటి సీనియర్ సిటిజన్లకు ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం వర్కవుట్ ఫొటోలను అప్పుడప్పుడు ఫేస్ బుక్ లో పెడుతుంటాను. వాటిని కొందరు అర్ధం చేసుకుంటారు. మరోవైపు, వాటికి విపరీత అర్ధాలు తీసేవారూ వుంటారు.

 

నచ్చిన పరిసరాలు, మెచ్చుకునే సమూహాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం మన శరీరంలో కొన్ని సానుకూల గ్రంధుల్ని (Hormones, enzymes) ఊరిస్తుంది. అది శరీరానికీ ఆరోగ్యం; మనసుకూ ఆరోగ్యం.  ఒకప్పుడు ఆత్మవిశ్వాసం బయటి నుండి పుష్కలంగా అందేది. ఇప్పుడు కాలం మారింది. సమిష్టి భావన అంతరించి వ్యష్టి భావన పెరుగుతోంది. ఆత్మవిశ్వాసాన్ని మనమే సృష్టించుకోవాలి.

 

అబ్బా! మీరు నాకు నిత్యం గుర్తుంటారు. సోషల్ కేపిటల్ ఇచ్చినందుకూ, స్ట్రాంగ్ బాడీ ఇచ్చినందుకు. నిస్సహాయుల్ని పరామర్శించే వ్యసనాన్ని అంటించినందుకు.  

 

నేను సాఢారణంగా బోర్లాపడుకుంటాను. దాన్ని చాలా మంది తప్పుపట్టేవారు. కోవిడ్ కాలంలో డాక్టర్లు చెప్పిందేమంటే శరీరానికి ప్రాణవాయువు పుష్కలంగా అందాలంటే దిండును ఛాతీ కింద పెట్టుకుని బోర్లా పడుకోవాలని.  మానాన్న ఛాతీ మీద బోర్లా పడుకున్న రోజులు మరొక్కసారి గుర్తుకొచ్చాయి.

 

19 జూన్ 2022

 

(ఫాదర్స్ డే మదర్స్ డే అంటూ విడదీయడం మంచిది కాదు; పేరెంట్స్ డే పెట్టుకుంటే సరిపోతుంది)

 

No comments:

Post a Comment