Wednesday, 28 February 2024

I could not read Urdu now.

 ఉర్దూ చదవలేకపోతున్నందుకు చాలా బాధగా వుంది.

 

ముస్లిం సమాజంలో పురుషులకన్నా స్త్రీలలోనే అక్షరాశ్యత ఎక్కువగా వుంటుంది. ముస్లిం ఆడపిల్లలకు  ఉర్దూ, అరబ్బి విధిగా నేర్పుతారు. మానాన్న కన్నా మా అమ్మ ఎక్కువగా చదువుకుంది.

 

ఎలిమెంటరీ స్కూల్ లో తెలుగు మీడియంలో చదువుకునే రోజుల్లో సాయంత్రాలు ఖాజీ సాహెబ్ దగ్గర నేనూ ఉర్దూ అరబ్బీ చదివేవాడిని. నలుగురు అమ్మాయిలు నేనూ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ లో నేనే ఫస్ట్. ఉర్దూ బాగా చదివేవాడిని. ఎలిమెంటరీ స్కూలు దాటిన తరువాత ఉర్దూ తాలీమ్ ఆపాల్సి వచ్చింది. నా తెలుగు ఉఛ్ఛారణలో ఉర్దూ ప్రభావం వుండేది. ఇది కొంచెం అవమానకరంగా మారింది. కొంతకాలం మా సమూహంలో ఉర్దూ మాట్లాడేవాడినేగానీ రాసే అభ్యాసం పోయింది. తరువాత ఉర్దూ సమూహం కూడ లేక మాట కూడ పోయింది.

 

రాత్రి పడుకునే ముందు నా భార్య ఎందుకోగానీ “వ్యంగ్యం రాయడం ఎందుకు మానేశావూ?” అని  అడిగింది. “అది నీ స్ట్రాంగ్ పాయింట్” అని గుర్తు చేసింది. రాత్రంతా  దాని గురించే ఆలోచిస్తూ వుండిపోయాను. తెల్లారుగట్ల మెలుకువ వచ్చే సమయానికి కిషన్ చందర్ ఉర్దూ నవల ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ (ఒక గాడిద ఆత్మకథ) గుర్తుకు వచ్చింది. బాల్యంలో మా ఇంటికి ‘షమా’ ఉర్దూ మాస పత్రిక వచ్చేది. అందులో ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ సీరియల్ గా వచ్చేది. మా అమ్మమ్మ చదివి వినిపించేది. అప్పుడు మాకు అదేదో నవ్వులాటగా వుండేది. రచయిత పేరు కూడ తెలీదు.  కొంచెం ఊహ వచ్చాక దాని గంభీరత, దాని రచయిత పేరు తెలిసివచ్చింది. 

 

ఒక విధంగా నాకు తెలిసిన తొలి రచయిత కిషన్ చందర్. నేను రాసిన ‘గొయ్యి’  స్ట్రీట్ ప్లేకు ప్రేరణ కూడ కిషన్ చందర్ ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’.

 

ఉదయం లేవగానే ముందు నెట్ ఓపెన్ చేసి ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ కోసం సెర్చ్ చేశాను. దొరికిందిగానీ ఉర్దూలో హెడ్డింగ్ మాత్రమే చదవగలిగాను. టెస్ట్ మ్యాటర్ చదవడం చాలా కష్టంగా వుంది. అక్షరాలు కూడబలుక్కున్నా (హిజ్జే) ముందుకు సాగడంలేదు. ఇక ప్రత్యామ్నాయంగా హిందీ బుక్ కోసం అమేజాన్ లో ఆర్డరు పెట్టాను. ఈ పుస్తకం తెలుగులో కూడ దొరుకుతుందని తెలుసు. అనువాదం కాకుండ ఒరిజినల్   చదవాలని కోరిక.

 

ఉర్దూ చదవలేక పోతున్నందుకు  బాధ వేసింది.

 

విజయవాడ

29 ఫిబ్రవరి 2024

No comments:

Post a Comment