Friday, 26 July 2024

కమ్యూనిస్టులు మొదటి నుండి ఆరంభించాలి

 కమ్యూనిస్టులు మొదటి నుండి ఆరంభించాలి

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.


కమ్యూనిస్టు అభిమానులకు, కమ్యూనిస్తు పార్టీలకు భారత దేశంలో నూరేళ్ళకు పైబడిన  చరిత్రవుంది. ఇందులో ఘనమైన చారిత్రక ఘట్టాలూ అనేకం వున్నాయి. ఆయా సందర్భాలలో ప్రజల అభిమానాన్ని పొందిన కమ్యూనిస్టు నాయకుల జాబితా కూడా చాలా పెద్దది. వీరి ప్రభావం సామాజిక రంగంలో ఇప్పటికీ ఎంతో కొంత కొనసాగుతున్నది. , రాజకీయ రంగంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీల ప్రభావం దాదాపు అంతరించిపోతున్నది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం 4 స్తానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. దేషం మొత్తమ్మీద ఈ మూడు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు రెండున్నర శాతానికి మించలేదు. 

సమాజంలో అప్పుడయినా ఇప్పుడయినా పాలించే అవకాశాలు కొందరికే వుంటాయి. అత్యధికులు పాలితులుగా వుంటారు. ఒకరి మీద ఆధిపత్యాన్ని చెలాయించడం బాగుంటుందిగానీ, మరొకరికి లొంగివుండడం ఎవరికీ ఇష్టంగా వుండదు. వాళ్ళు సహజంగానే సమానత్వాన్ని కోరుకుంటారు. దానికి ఏ పేరయిన పెట్టుకోవచ్చు. సామ్యవాదం అనవచ్చు, కమ్యూనిజం అనుకోవచ్చు. సోదరభావం అనుకోవచ్చు.  ఇంకేదయినా అనుకోవచ్చు.

మనం గతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాముగానీ, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడుకోము. 

ఆధిపత్య వ్యతిరేకత, సమానత్వ భావన భారత షడ్దర్శనాల్లో ఎలా కొనసాగిందీ? బుధ్ధుడు, జైనుడు ఏం బోధించారు? మొదలు వేదాలు, ఉపనిషత్తుల్లో కనిపించే తిరుగుబాటు ఛాయలు, భక్తి ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు, ద్రావిడ సంస్కృతి, ఆర్య వ్యతిరేక ధోరణులు వరకు గతం మొత్తం మన శిరస్సుల మీద సవారీ చేస్తుంటుంది. 

ఫ్రెంచ్ విప్లవం, పారీస్ కమ్యూన్, చికాగోలో మేడే పోరాటం, రష్యాలో అక్టోబరు విప్లవం, యూరప్ లో ఫాసిస్టు పాలనలు, కార్ల్ మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావో, భారత జాతియోద్యమం. గాంధీజీ, నెహ్రు, జిన్నా, భగత్ సింగ్, అంబేడ్కర్ వీరి మధ్య భిన్నాభిప్రాయాలు, భిన్న దృక్పథాలు, ఏకాభిప్రాయాలు అన్నీ నిరంతరం చర్చల్లో వుంటాయి.   రెండో ప్రపంచ యుధ్ధం, తెలంగాణలో సాయుధపోరాటం, క్లెమెంట్ అట్లీ ప్రధాని కావడం, డిమిట్రావ్ ఫాసిస్టు సిధ్ధాంతాలు, భారత దేశానికి  స్వాతంత్ర్యం, అధికార మార్పిడి, భారత రాజ్యాంగ అవతరణ, ఆంధ్రా థీసిస్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, నూతన ప్రజాస్వామిక విప్లవం,   దేన్నీ మనం వదలం. 

చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎస్ ఎం డాంగే, బిటి రణదీవె, చారుమజుందార్, కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి, ఎస్ ఎం రవూఫ్,  చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య ఒక్కర్నీ మనం మరిచిపోం. టైమ్ మిషన్ లో వెనక్కి వెళ్ళి ఆ కాలంలో వాళ్ళతో ఇప్పటికీ వాదిస్తుంటాము.  

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి విభజిత కమ్యూనిస్టు పార్టి అయ్యింది. ఆ తరువాత గ్రూపులు, శాఖలు, ముక్కలు వందేళ్ళలో వంద కమ్యూనిస్టు పార్టీలు/గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఒక్కరికీ మరొకరంటే పడదు. ఒక్క పదం తేడావస్తే ఒకరిని మరొకరు చంపుకోవడానికి కూడ వెనుకాడరు. ఒకప్పుడు సిధ్ధాంతాల కోసం తలపడుతున్నారనుకునేవారు. ఇప్పుడు నిధులు, ఆస్తులు అంతకన్నా నీచమైన అంశాల కోసం కూడ చంపుకుంటున్నారు.

ఇన్ని తప్పులు కడుపులోవుంచుకుని పైకి ఏమీ తెలియనట్టు  కొత్తతరం కలిసిరావడంలేదు; ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలు ఉద్యమాలను వదిలి వెళిపోతున్నారు అని నిందించడం మొదలెట్టారు. 

పాతవాళ్ళలో అతివాద మితవాద తప్పులు అనేకం వున్నాయి. అయినా, వాళ్ళు విప్లవానికి బధ్ధ్దులై వున్నారని జనం నమ్మేవారు.  వాళ్ళు పిలుపిస్తే యువతరం చదువుల్ని,        ఆస్తుల్ని, బంధుమిత్రుల్ని, భార్యాపిల్లల్ని వదిలి ఉద్యమాల్లో మమేకమయ్యారు. అలాంటి ఉత్తేజాన్నిచ్చే నాయకుడు ఒక్కరయినా ఈరోజు వున్నారా? ఒక్క పేరయినా మనం చెప్పగలమా? 

తూర్పు యూరోపు పతనమై, రష్యా విఛ్ఛిన్నమై, చైనా పెట్టుబడీదారీ మార్గం పట్టాక ప్రపంచ బ్యాంకు గ్యాట్ ఒప్పందాన్ని కుదుర్చుకుని ప్రపంచ వాణిజ్య సంస్థను నెలకొల్పి ప్రపంచదేశాల్లో నూతన ఆర్ధిక సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. మరోవైపు, ఐటి విప్లవంతో శ్రామికవర్గాన్ని కొత్త పధ్ధతుల్లో పునర్ నిర్వచించింది. మెజారిటీ మతాన్ని అడ్డదారిలో రాజకీయాధికారాన్ని సాధించిపెట్టే బలమైన అత్యాధునిక ఆయుధంగా మార్చుకుంది. 

ఈ దశలో వర్గపోరాటాన్ని నిర్వచించే కమ్యూనిస్టు పార్టీగానీ, నాయకుడుగానీ మనకు ఎక్కడయినా కనపడుతున్నారా? “దున్నేవానికే భూమి నినాదంతోసాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగాగల నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం” మన కార్యక్రమం అంటే కొత్త తరం ముఖం మీద నవ్వుతుంది. ఇది 1920లలో చైనాలో చెలామణీ అయిన  సిధ్ధాంతం. ఇంతకు  మించి కొత్త అవగాహనతో కూడిన ఒక కొత్త వాక్యాన్ని ఎవరూ భారత దేశంలో ఇప్పటి వరకు కనిపెట్టలేదు. 

వర్తమాన భారత సమాజ స్వభావం ఏమిటీ అనేది అర్ధం కాకుండా దాన్ని మార్చడం సాధ్యంఅయ్యే పనేనా? 

కాంగ్రెస్, ఇతర పార్టీలకన్నా కమ్యూనిస్టులు, సంఘపరివారం ప్రచారాందోళనను ప్రభావవంతంగా సాగిస్తాయనే మాట ఒకటి వుండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. సంఘపరివారం ప్రచార వుధృతిని కమ్యూనిస్టు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 

ఒకనాటి సాంప్రదాయ కమ్యూనిస్టు అభిమానుల్లోనూ బహుళ ఉనికిలు వచ్చేశాయి. వాళ్ళీప్పుడు ప్రాపంచిక దృక్పథం రీత్యా కమ్యూనిస్టులు. వారిని కమ్యూనిస్టులు అనడం కూడ తప్పు.  ఒక నిర్దిష్ట కమ్యూనిస్టు పార్టికి వాళ్ళు వేలు విడిచిన అభిమానులు. వృత్తి వ్యాపారాల రీత్యా ఇంకో పార్టికి అభిమానులు. సామాజికవర్గం రీత్యా మరో రాకఇయ పార్టికి అభిమానులు. (తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సామాజికవర్గాలే ప్రధాన ఉనికిగా మారిపోయాయి).

హిట్లర్, ముస్సోలినీలకన్నా వర్తమాన భారత  ఫాసిస్టులు అత్యంత ఆధునికులు. “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అంటూనే కొందరి వికాసాన్ని చప్పుడు చేయకుండా అణిచివేయగలరు. మిలటరీ యూనిఫామ్ వేయకుండా నియంతృత్వాన్ని కొనసాగించగలరు. ఆయుధం పట్టకుండా అసమ్మతిని ఏడు కిలో మీటర్ల లోతున గొయ్యి తవ్వి  పూడ్చిపెట్టగలరు. 

ఇప్పటికిప్పుడు ప్రజలకు ఏ కమ్యూనిస్టు పార్టి మీద కూడ నమ్మకం లేదు. ఏ కమ్యూనిస్టు పార్టి ఆచరణ కూడ ప్రజల నమ్మకాన్ని పొందే స్థితిలోలేదు. దీన్ని కమ్యూనిస్టు పార్టీల ముగింపు అనవచ్చుగానీ అది సరైనది కాకపోవచ్చు.   

ఉద్యమాలకు ఎప్పుడూ ఒక గొప్ప లక్షణం వుంటుంది. ఆ ఉద్యమాలు విజయవంతమయినా విఫలమయినా, వాటికి నాయకత్వం వహించినవారు సమర్ధులు అయినా కాకపోయినా, ఉద్యమాల సందర్భంగా సమాజంలో అనేక కలలు వికశిస్తాయి. అవి సహజ కలలు. ఆర్గానిక్ కలలు. అవి వాడిపోవు. కాలం కలిసివచ్చి అనుకూలమైన గాలులు వీచి, కొంచెం తడి తగిలితే అవన్నీ చిగురిస్తాయి. 

కమ్యూనిస్టు పార్టీలు, వాటి సభ్యుల సంఖ్య, అవి చేసిన పోరాటాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంగా వికశించిన భావావేశాలు, ఆదర్శాలు మరో ఎత్తు. నిజానికి మొదటిదానికన్నా రెండోవే గొప్పవి. సంఖ్యాబలంకన్నా భావ వికాశమే గొప్పది. 

మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహత్తర ఘట్టాలేమిటీ?   నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డిని గడియ నుండి తరిమికొట్టడం; వరంగల్  జిల్లాలో విసునూరు దొర రాంచంద్రారెడ్డి గడియ మీద దాడి చేయడం.  అంతకు మించి ఏమున్నదీ? అయితే ఆ పోరాట ప్రభావాన్ని ఆ రెండు సంఘటనలకే పరిమితం చేయడం సాధ్యంకాదు. “తెలంగాణలో రైతు కూలీ రాజ్యం” అనే నినాదానికి చాలా కాలం చాలా ప్రభావం వుండింది; ఇప్పటికీ వుంది. రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ సందర్భంగా ఆర్ధిక మంత్రి మల్లు భట్టి  ఒక మాటన్నారు. వ్యవసాయంలో నష్టాలొచ్చి భూముల్ని కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నవారికి ఏడాదికి 12 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నట్టు వారు ప్రకటించారు.

 నిజానికి తెలంగాణ శాసనసభలో కమ్యూనిస్టు పార్టి ప్రతినిధి ఒక్కరంటే ఒక్కరే వున్నారు. ఏపిలో ఆ ఒక్కరు కూడ లేరు.  అది లెఖ్ఖకాదు. వ్యవసాయ కూలీలను ఆదుకోకపోతే ప్రజాస్స్వామిక వ్యవస్థ మనుగడకే ముప్పు వస్తుందని ప్రభుత్వం ఇప్పటికీ భయపడుతుండడం అసలు విషయం. 

 శ్రీకాకుళ గిరిజన సాయుధపోరాటాన్నీ, 1970లలో ఎంఎల్ పార్టీల నాయకత్వంలో కరీంనగర్, ఆదిబాద్ జిల్లాల్లో సాగిన రైతుకూలీల పోరాటాలను కూడ అలాగే చూడాలి. ఆ పోరాటాలు, వాటి నాయకులు, వాటి అభిమానులు ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఆ పోరాటాలవల్లనే కొంచెం ముందో వెనకో భూ పరిమితి చట్టాలు, చౌక బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళూ, భూపంపిణితోసహా అనేక సంక్షేమ పథకాలు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలి.   

పాతతరం నాయకులందరూ తమకు తోచిన మేరకు మెరుగైన సమాజం కోసం నిజాయితీగానే పనిచేశారు. మనం ఊహించలేనన్ని త్యాగాలు చేశారు. అయితే, ప్రతి మనిషి జ్ఞానానికి కాలం ఒక పరిమితి విధిస్తుంటుంది. కాలం మారినపుడు పాత జ్ఞానం పనికి రాదు. తమకు కాలం చెల్లిందని ఏ నాయకుడూ ఒప్పుకోడు. వాళ్ళను ఇతరులు భరించలేరు. ఈ సమస్యలు, వివాదాలు దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోనూ వున్నాయి. అసలు విషయం ఏమంటే, భారత సమాజాన్ని మార్చే కార్యక్రమం ప్రస్తుతం ఎవరి దగ్గరా లేదు. 

ఇప్పుడు మనం మొత్తం మొదటి నుండి మొదలెట్టాలి. భారత సమాజ స్వభావం ఏమిటీ? అనే ప్రశ్నతో ఆరంభించాలి. దేశంలో ప్రతి చిన్న  విభాగంలోనూ అణగారిపోతున్న సమూహాలేవీ? ఈ లెఖ్ఖలు తీయాలి? వీరి ఆశలు ఆకాంక్షలు ఏమిటీ? ఈ జాబితా కావాలి. వర్గనిర్మూలన కమ్యూనిస్టుల పని అయితే, కుల నిర్మూలన అంబేడ్కరిస్టుల పని. మైనారిటీల లక్ష్యం మత సామరస్యం, షెడ్యూలు తెగలు మైదానుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. స్త్రీలు పురుష పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు. ఈ జాబితాను ఓపిగ్గా రాసుకుంటూపోతే ఒక ఐక్యతా మార్గం కనిపించవచ్చు. మనం అటుగా నడవాలి. 

27 జులై 2024


No comments:

Post a Comment