Wednesday 3 July 2024

Who is Hindu? What is Hindutva?

 Who is Hindu? What is Hindutva? 

ఏది హిందూధర్మం? ఏది హిందూత్వ? 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

“మీరు హిందువులు కారు; కాలేరు”. ప్రధాని నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమత్రి అమిత్ షాలను ఉద్దేశించి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాహుల్ అంతటితో ఆగలేదు. మోదీజీ, బిజెపి, ఆరెస్సెస్ హిందూమతాన్ని గుత్తకు తీసుకోలేదన్నారు. కొత్త లోక్ సభలో రాహుల్ తొలి ప్రసంగంలో చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త రాజకీయ సంచలనంగా మారాయి.  

 

మోదీజీ అమిత్ జీలు ప్రజాసమూహాలను భయపెట్టి అధికారాన్ని చెలాయిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం అన్నారు. హిందూమతం సహనాన్నీ, అహింసను బోధిస్తూ అపన్నులకు అభయహస్తాన్ని అందించాలని చెపుతోందని గుర్తు చేశారు. కానీ, మోదీజీ, అమిత్ జీ, బిజెపి, హింసా ద్వేషాల్ని రెచ్చగొట్టి ప్రజల్ని వేధిస్తున్నారన్నారు.

 

హిందూ సమాజాన్ని హింసావాదులనడం చాలా తీవ్రమైన అంశమని ప్రధాని అభ్యంతరం చెప్పగా. రాజ్యాంగ నియమాల వుల్లంఘనకు పాల్పడిన రాహుల్ గాంధి సభకు క్షమాపణలు చెప్పాలని  హొంమంత్రి కోరారు. దినితో ఏది హిందూధర్మం? ఏది హిందూత్వ? అనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 

జాతీయవాదం అంటేనే రాజకీయ సమీకరణ. భారత ప్రజల్ని రాజకీయంగా  సమీకరించడానికి  హిందూ మత జాతీయవాదాన్ని (religious nationalism) సృష్టించిన ఘనత వినాయక్ దామోదర్ సావర్కర్ కు దక్కుతుంది. దానికి ఆయన హిందూత్వ అని పేరు పెట్టారు.  సావరర్కర్ వేసిన బాటలో ఆరెస్సెస్ పుట్టింది. ఆరెస్సెస్ ఆశిస్సులతో బిజెపి ఆవిర్భవించింది. బిజెపి మీద ఆరెస్సెస్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందా? లేక అరెస్సెస్ ను బిజెపి అధిగమించిందా? అనే ఒక కొత్త చర్చ ఇటీవల మొదలయ్యింది. అది వేరే అంశం.

 

భారతదేశంలో అత్యధికులు విశ్వసించేది హిందూమతాన్ని.  ఎన్నికల్లో ఎక్కువ ఓట్లను రాబట్టుకున్న రాజకీయ పార్టీలకే పరిపాలన అధికారం దక్కుతుంది. మనదేశంలోని ఓటర్లలో అత్యధికులు హిందూమతస్తులే కనుక  వాళ్ళే పాలకపార్టిని నిర్ణయిస్తుంటారు. దేశంలోని రాజకీయ పార్టీల నాయకుల్లో దాదాపు అందరూ హిందువులే. అదేమీ తప్పు కూడ కాదు.  హిందూత్వ అనేది అందుకు భిన్నమైనది. హిందూత్వ అంటే హైందవ రాజ్యాధికారం. మరోమాటల్లో చెప్పాలంటే, హిందూ ధర్మం ప్రకారం పరిపాలన సాగించడం.

 

ఇస్లాం, క్రైస్తవం, శిక్కిజం తదితరమతాలు ఏకేశ్వరోపాసన సాంప్రదాయం కలవి. హిందూమతానిది బహుదేవతారాధన సంస్కృతి.  హిందూమతంలో ముక్కోటి దేవతలున్నారంటారు. ఒక సమూహం ఒకే సందర్భంలో ఇంతమంది దేవుడు/దేవతలను ఆరాధిస్తున్నారంటే మతసహనం దాని అంతర్గత లక్షణం అయ్యుండాలి. అయితే, హిందూత్వ ఆలోచనలు వేరు. ఒక పాలకుడు ఇన్ని దేవతల ధర్మాలను పాటించడం అసాధ్యం కనుక హిందూత్వవాదులు సులభ మార్గంగా  మనుస్మృతిని రాజ్యాంగంగా ముందుకు తెచ్చారు. అలాగే, ముక్కోటి దేవతల్లో శ్రీరాముడ్ని ఎంచుకుని రాజకీయ రంగంలో ముందు పీఠిలో నిలబెట్టారు.   సరిగ్గా ఇక్కడే విశ్వాసం స్థానాన్ని  రాజకీయం ఆక్రమించింది.  అదే ఘర్షణకు దారి తీస్తుంది. 

 

మతం అంటే దైవం మీద  విశ్వాసం, రాజకీయం అంటే అధికార పీఠానికి చేర్చే మార్గం. విశ్వాసులు కానివారు రాజకీయ దాహంతో మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే అర్ధంలోనే రాహుల్ గాంధి వారిని హిందువులుకారు; కాలేరు అన్నారు. “ముస్లింలందరూ ఉగ్రవాదులుకాదు; కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే” అని బిజెపి అగ్రనేతలు 1990లలో తరచూ ఒక ప్రచారం సాగించేవారు. సరిగ్గా అదే పధ్ధతిలో రాహుల్ గాంధీ “హిందువులు హింస ద్వేషాల్ని ఆమోదించరు; కానీ హిందూ ముసుగు కప్పుకున్నవాళ్ళు హింస ద్వేషాల్ని రెచ్చగొడుతుంటారు” అన్నారు.  తాను హిందూ విశ్వాసుల్ని  ఏమాత్రం విమర్శించడం లేదు లేదు లేదు అన్నారు. (నహీ నహీ నహీ).

 

లోక్ సభ ఎన్నికల్లో మోదీ మాజిక్ గతంలోలా పని చేయలేదు. లోక్ సభలో కూడ మోదీ అమిత్ షాల పదును తగ్గినట్టు కనిపిస్తున్నది. నిన్నటి దాక మోదీజీ అంటే ఒక బ్రాండ్‍. బ్రాండ్‍ మోదీ అనే మాటను అట్టహాసంగా ప్రచారం చేశారు. ఇప్పుడు సీన్ మారింది. ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ అని ప్రచారం చేసుకుంటే ‘తీన్ సౌ పార్’ కూడ సాధ్యం కాలేదు. మోదీజీ తన స్వంత నియోజకవర్గమైన వారణాసిలోనూ గెలవడానికి ఆపసోపాలు పడాల్సివచ్చింది. అక్కడ వారు ఓడి గెలిచారు.

 

ఇంతకీ  బ్రాండ్‍ మోదీని తగ్గిస్తున్నదెవరూ? అనే   ప్రశ్నకు ఇప్పటికే కొన్ని వేలమంది కొన్ని వేల కారణాలు చెప్పారు. ఇంకా కొందరు కొత్త కారణాలూ చెపుతున్నారు. కాంగ్రెస్ బలం పెరగడంతో బిజెపి బలం తగ్గిందనేది వీటిల్లో ఒక కారణం. ఇది ప్రధానంగా ప్రచారంలో వున్న కారణమేగానీ నిజానికి అదొక్కటే కారణం కాదని అందరికీ తెలుసు.

 

ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడిపోయింది. విడిగా చూస్తే; ఏదో ఒక నియోజకవర్గంలో ఒక పార్టి ఓడిపోవడం విశేషం ఏమీ కాదు. బహు అరుదుగాతప్ప ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ గెలవడం ఏ పార్టీకీ సాధ్యంకాదు. (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ జనసేన ఇందుకు మినహాయింపు).  ఫైజాబాద్ విశేషం ఏమంటే ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే అయోధ్య అసెంబ్లీ స్థానం వుంది. అయోధ్య అంటే శ్రీరాముని జన్మస్థలం. సామాన్య ఓటర్లకు శ్రీరాముని మీద వుండే నమ్మకాన్ని రాజకీయ  అస్త్రంగా ప్రయోగించడం బిజెపి ఎన్నికల  వ్యూహం. ఆ పార్టి  రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని ముందుకు తెచ్చి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రమంగా బలపడుతోంది.

 

ఈసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం  రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి విగ్రహ ప్రాణప్రతిష్ట చేశారు. ఇంతాచేస్తే,  ఫైజాబాద్ లో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన లల్లూ సింగ్ 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి నాలుగు వందల సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చేస్తామని లల్లూ సింగ్ గట్టిగా ప్రచారాన్ని సాగించారు. రామమందిరాన్ని కట్టారన్న ఆనందంకన్నా రాజ్యాంగాన్ని మార్చేస్తారనే భయమే పైజాబాద్ ఓటర్లను డామినేట్‍ చేసింది. వాళ్లు బిజెపిని ఓడించారు. ఇంకోలా చెప్పాలంటే వాళ్ళు సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు. అక్కడ సమాజ్ వాదీ పార్టి అభ్యర్ధిగా పోటీ చేసిన  అవధేశ్ ప్రసాద్ ను గెలిపించారు.

 

సెక్యూలర్ అనే పదాన్ని కొందరు మతాతీత, మతవ్యతిరేక అనే అర్ధంలో చూస్తుంటారు. సెక్యూలర్ పదాన్ని రాజ్యాంగ ప్రధాన ఆదర్శాల్లో ఒకటయిన సోదరభావం (fraternity)తో కలిపి చూడాలి. అప్పుడే మతసామరస్య ఆదర్శం ఆవశ్యకత అర్ధం అవుతాయి.  

 

ఉత్తర ప్రదేశ్  లోని బందా నియోజకవర్గంలోనూ బిజెపి ఓడిపోయింది. సమాజ్ వాదీ పార్టికి చెందిన కృష్ణదేవీ శివశంకర్ పాటిల్  బిజెపికి చెందిన ఆర్ కే సింగ్ పాటిల్ మీద 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడా ఒక విచిత్రం వుంది. బందా పార్లమెంటరీ నియోజకవర్గంలోనే చిత్రకూట్  అసెంబ్లీ సిగ్మెంట్ వుంది. ఇది ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల సరిహద్దు ప్రాంతం.  చిత్రకూట్ కు ఒక పౌరాణిక ప్రాధాన్యం వుంది.

 

పౌరాణిక అన్నా చారిత్రక అన్నా ఇప్పుడు ఒక్కటే!! కొత్తతరం అకడమిషియన్లు పురాణాలకు చరిత్రకు మధ్య వున్న రేఖల్ని చెరిపేస్తున్నారు. చరిత్ర పురాణంగానూ పురాణాలు చరిత్రగానూ చెలామణి అవుతున్న కాలం ఇది.

 

          శ్రీరాముని 14 ఏళ్ళ వనవాసంలో సీతా, లక్ష్మణులతో  తొలుత చిత్రకూట లోనే వున్నారని పురాణం చెపుతోంది. భరతుడు వచ్చి, పట్టాభిషేకం చేయడానికి శ్రీరాముని పాదుకల్ని తీసుకుని వెళ్ళింది చిత్రకూట్ నుండే అని చెపుతారు. అయోధ్య నుండి మొదలయిన ఆధునిక రామాయణం చిత్రకూట్ మీదుగా నాసిక్ చేరింది. మహారాష్ట్రలోని నాసిక్ లోనూ బిజెపి ఓడిపోయింది.

 

చిత్రకూట నుండి సీతారాములు లక్ష్మణుడు గోదావరినది జన్మస్థలానికి వచ్చి పంచవటి ఆశ్రమాన్ని కట్టుకున్నారు. అక్కడే శూర్పణఖ ముక్కు (నాసిక)ను  లక్ష్మణుడు  కోశాడు. అలా ఆ ప్రాంతం నాసిక్ అయ్యిందని స్థల పురాణం చెపుతోంది.

 

 నాసిక్ లో శివసేన (యూబిటి) అభ్యర్ధిగా పోటీచేసిన రాజ్ భావు ప్రకాశ్ వాజే భారీ మెజారిటీతో గెలిచారు. శివసేన అభ్యర్ధిగా పోటీ చేసిన హేమంత్ తుకారాం గాడ్సే ఓడిపోయారు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏలో శివసేన సభ్యపార్టిగా వుంది. శివసేన (యూబిటి) ఇండియా కూటమిలో వుంది.

 

రేఖాగణితంలో ఒక బిందువు దగ్గర 360 డిగ్రిలు వుంటాయి. అప్పుడు దాని దిశనూ గమనాన్నీ నిర్ధారించడం కష్టం. రెండవ బిందువు చేరినప్పుడు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. మరికొన్ని బిందువులు చేరితే వాటి గమనాన్ని గమనించవచ్చు.  శ్రీరాముణ్ణి ముందు పెట్టి రాజకీయం నడపాలనుకున్న బిజేపి, ఆ అవతార పురుషుడు నడిచిన మూడు ముఖ్యమైన స్థానాల్లో ఓడిపోయిందంటే అర్ధం ఏమిటీ?  సాక్షాత్తు శ్రీరాముడే ఓడించాడనేనా?

ఒక నమ్మకంగా వున్నంత కాలం దైవ భావన బాగుంటుంది! మతం రాజ్యమైపోయి నిర్బంధంగా మారితే అస్సలు బాగోదు. ఇది దేవునికి కూడ నచ్చదు!!. “అతిగా ఆశపడేవారికి భంగపాటు తప్పదు” అన్నారు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి.  ఆరెస్సెస్ సర్సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ లా వారేమీ పరోక్షపు వ్యాఖ్యానాలు చేయలేదు. స్పష్టంగా ప్రధాని మోదీజీని ఉద్దేశించే ఆ మాటలన్నారు.

ఓపినింగ్ బ్యాటింగ్ రాహుల్ గాంధి బాగా చేశారు. బ్రాండ్ మోదీని ఏమేరకు తట్టుకుంటారో, అధిగమిస్తారో ముందుముందు చూడాలి.

 

04-07-2024

No comments:

Post a Comment