Communists failed to compete with the development of machines
యంత్రాల అభివృద్ధితో పోటీ పడలేకపోయిన కమ్యూనిస్టులు
కృత్రిమమేధ కాలంలో కమ్యూనిస్టులు
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.
“రెండుకాళ్ళ జీవులు
ప్రమాదకరమైనవి; నాలుగుకాళ్ళ జీవులు గొప్పవి” అని జార్జ్ ఆర్వెల్ నవల
‘యానిమల్ ఫార్మ్’ లో జంతువులన్నీ కలిసి ఒక తీర్మానం చేస్తాయి.
కాళ్ళు రెక్కలు తోకలు
మాత్రమే కాదు సృష్టిలో మనుషులకు ఇతర జీవులకు తేడాలను చూడాలనుకుంటే
అనేకానేక వైవిధ్యాలు కనిపిస్తాయి. జంతువులు గుంపులుగా సంచరిస్తాయి;
మనుషులు సమాజంగా కొనసాగుతారు. ఇతర జీవులు సంతతిని కని వాటి జీవిక కోసం
ఆహారాన్ని సేకరిస్తాయి. మనిషి ఆహార సేకరణతో ఆగిపోడు; అవసరమైనప్పుడు తానే ఆహారాన్ని
ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి అవసరాల కోసం పనిముట్లను, యంత్రాలను సృష్టిస్తాడు. ఇతర
జీవులకు మనిషికి మధ్య ఇదే అన్నింటికన్నా ప్రధానమైన, గుణాత్మకమైన తేడా.
‘పనిముట్లను తయారు చేసే
జీవి మనిషే’ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ (అమెరికా రాజనీతిజ్ఞుడు, రచయిత, శాస్త్రవేత్త
1706–90) అన్నాడు. ఆయన అంతటితో ఆగలేదు. ‘మనిషి సృష్టికర్త’ (Man the Maker), ‘మనిషి
ఆలోచనాపరుడు’ (Man the Thinker) అని కూడా అన్నాడు.
తొలి పనిముట్ల నుంచి నేటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్ దాకా యంత్రాల చరిత్రలో అనేక
తరాలు సాగిపోయాయి. ప్రతి తరంలోనూ యంత్రాలు సమాజంలో కొత్త ఆలోచనల సంచయానికి కూడ దోహదం
చేస్తాయి. పారిశ్రామిక విప్లవం సంభవించి వుండకపోతే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్నీ,
ఫ్రాయిడ్ మనోవిశ్లేషణను, కార్ల్‌మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయగలిగేవారు
కాదు. యంత్రాల అభివృద్ధి–మనిషి ఆలోచనల విస్తృతి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది.
యంత్రాలు మానవ
సంబంధాలను కూడ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముందు అవి సంపద సృష్టికి దోహదపడతాయి.
మరోవైపు, సంపద పంపిణి మనుషుల్ని విభజిస్తుంది. కొన్ని సమూహాలు యజమానులుగా
అవతరిస్తే మిగిలిన సమూహాలు సేవకులుగా మారిపోతారు. దీనికి మూలం ఆర్ధికమే
కావచ్చుగానీ యజమాని సేవకుల విభజన సమస్త రంగాల్లోనూ వుంటుంది.
యంత్రాలు వాళ్ళ ఆధినంలో
వుంటాయి కనుక యజమాని సమూహం సహజంగానే తెలివైనదిగా మారుతుంది. ఏ రంగంలో అయినాసరే తమ
ప్రయోజనాల గురించి యజమానులకు వున్నంత స్పృహ సేవకులకు వుండదు. సకల
రంగాల యజమానుల మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక ఐక్యత వుంటుంది. సకల
వ్యవస్థల యజమానులు క్రమంగా ఏకం అవుతుంటారు.
అన్ని రంగాలలోని
సేవకులు తొలి దశలో తాము కూడ యజమానులయ్యేందుకు కొంత తాపత్రయ పడడం సహజం. సమాజంలో
యజమానులయ్యే అవకాశం కొందరికి మాత్రమే వుంటుందనీ అత్యధికులు సేవకులుగానే వుండాల్సి
వస్తుందని అర్ధం కావడానికి చాలా కాలం పడుతుంది. అప్పుడు సమాజంలో సమానత్వం,
సోదరభావం అనే ఆలోచనలు అపారంగా వికసిస్తాయి. ఇలాంటి నేపథ్యంలోనే కమ్యూనిజం అనే సిధ్ధాంతం
పుట్టింది.
"ప్రతి ఒక్కరి
నుండి అతని సామర్థ్యం మేరకు, ప్రతి ఒక్కరికి అతని అవసరాలకు అనుగుణంగా"
("From
each according to his ability, to each according to his needs") అనేది కమ్యూనిస్టు సమాజానికి ప్రాధమిక కొలమానం. 1875లో రాసిన ‘గోథా కార్యక్రమం మీద విమర్శ’ పుస్తకంలో కార్ల్ మార్క్స్
ఈ వివరణ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా సేవక సమూహాలన్నింటిలోనూ
స్పష్టంగానో అస్పష్టంగానో అంతర్లీనంగా ఇలాంటి భావనలే నిరంతరం బలపడుతుంటాయి.
మరోమాటల్లో చెప్పాలంటే సేవక సమూహాలన్నింటి సమిష్టి స్వప్నం సమానత్వం.
ప్రపంచంలో ఎక్కడయినా
సరే సేవక సమూహాలకు జీవితం దుర్భరంగా మారి సమిష్టి స్వప్నం ముందుకు వచ్చిన
ప్రతీసారీ ఆందోళనలు మొదలవుతాయి. ఉద్యమాలు పోరాటాలు ఊపందుకుంటాయి. సేవక సమూహాల ఆందోళనల్ని
అణిచివేయడానికి యజమాని సమూహాలకు అంతర్గతంగానే ఒక పటిష్టమైన వ్యవస్థ వుంటుంది.
సాయుధ పోలీసులు, తుపాకులు, జైళ్లు, ఉరికొయ్యలు, నిఘా విభాగాలు వగయిరాలు వాళ్ళ
ఆధీనంలోనే వుంటాయి. అంతేకాదు; ఆందోళనల్ని నివారించడానికి ఇంతకన్నా మెరుగైన
తెలివైన ప్రత్యామ్నాయాలు కూడ వాళ్ళ దగ్గర వుంటాయి. అవే సంక్షేమ పథకాలు!.
సంక్షేమ పథకాల ద్వార
సేవకుల తిరుగుబాట్లను నివారించవచ్చు అని తొలిసారిగా గుర్తించిన ఘనుడు అమెరిక
ఆటోమోబైల్ దిగ్గజం హెన్రీ ఫోర్డ్. రష్యాలో అక్టోబరు విప్లవం జరగడానికి
మూడున్నరేళ్ళు ముందే 1914 జనవరి 5న తన కార్మికుల మీద వరాల జల్లు కురిపించాడు.
‘రోజుకు ఐదు డాలర్లు’ వేతనం ప్రకటించాడు ఆరోజుల్లో ఇది చాలా ఆకర్షణీయమైన జీతం.
8 గంటల పనిదినాన్ని అమల్లోని తెచ్చాడు. రోజుకు రెండు షిఫ్టుల పధ్ధతి
స్థానంలో మూడు షిఫ్టుల పధ్ధతిని ప్రవేశ పెట్టాడు. సరుకుల తయారీలో శ్రమ విభజన సహజంగానే
వుంటుంది. ఫోర్డ్ తన సిబ్బందిని ఒక
ఫ్యాక్టరీ కాంపౌండ్ కు పరిమితం చేయకుండా ఒక్కో దేశంలో ఒక్కో రకం యూనిట్ పెట్టాడు.
అంటే శ్రమ విభజనతోపాటు శ్రామికుల్ని కూడ విభజించాడు. కార్మికులకు సౌకర్యవంతమైన
నివాసం, మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించాడు. దానితో ప్రపంచ వ్యాప్తంగా
నిపుణులైన కార్మికులు ఫోర్డ్ సంస్థలో చేరడానికి పోటీ పడడం మొదలెట్టారు.
అంతకు మించి వాళ్ళు ఫోర్డుకు పరమ విధేయులుగా మారిపోయారు. ఫోర్డు సంస్థలో ఉత్పత్తి
పెరిగింది, సరుకు నాణ్యత పెరిగింది, మార్కెట్లో పోటీ లేకుండా పోయింది, అంతిమంగా
కంపెనీకి లాభాలు పెరిగాయి.
ఫోర్డ్ ఫార్మూలా పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లోనూ ప్రవేశించింది. అమెరికాలో
పెద్ద ఎత్తున ఉద్దీపన చర్యలు (affirmative actions) మొదలయ్యాయి. పైగా, సానుకూల వివక్ష
(positive discrimination) అనే కొత్త విలువ కూడ ముందుకు వచ్చింది.
మనదేశంలో ఇప్పుడు అమలవుతున్న
ఉచిత బియ్యం, ఉచిత వైద్య ఆరోగ్య
సేవలు, విద్యార్ధులకు ఫీజుల రీ-ఎంబర్స్ మెంట్, పేదలకు పక్కా ఇళ్ళు,
వ్యవసాయానికి సబ్సిడీలు, భూపరిమితి చట్టాలు, వ్యవసాయ కూలీలకు భూముల
పంపకాలు మొదలైన సంక్షేమ పథకాలన్నీ గతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్ బరీ
ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన పోరాటం, కరీంనగర్ ఆదిలాబాద్ నక్సలైట్ల పోరాటాల
సందర్భంగా వివిధ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు తెచ్చిన డిమాండ్లే. కమ్యూనిస్టుల
డిమాండ్లను ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు హైజాక్ చేసి ఎన్నికల హామీలుగా
మార్చేసుకున్నాయి. ఏదో ఒక మేరకు అమలు కూడ చేస్తున్నాయి. దానితో పార్లమెంటరీ
ప్రజాస్వామ్య రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం తగ్గి అవి ‘అంతరించిపోతున్న
జాతి’గా మారిపోయాయి. దీని అర్ధం దేశంలో కార్మికులు లేకుండాపోయారనీ, వాళ్ళ మీద పీడన
లేదనీ కాదు. కొత్త పధ్ధతుల్లో కొత్త పీడన కొనసాగుతూనే వుంటుంది.
శ్రామిక సమూహాలను పునర్
నిర్వచించే చారిత్రక బాధ్యతను కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటి కప్పుడు
నిర్వర్తిస్తుండాలి. అవి ఆ బాధ్యతను మరచిపోయాయి. శ్రామిక సమూహాల బహుళ
అస్తిత్వాలు కూడ భారత కమ్యూనిస్టు నాయకులకు అర్ధం కాలేదు. వ్యవసాయ కూలీలుగా
వున్నప్పుడు ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీలను కమ్యూనిస్టు పార్టీలు గొప్పగా సమీకరించాయి.
కాంగ్రెస్ తదితర పార్టీలకన్నా అణగారిన సమూగాలకు మెరుగైన రాజకీయ చైతన్యాన్ని
అందించాయి. అయితే, ఆ సమూహాలు తమ సామాజిక ఉనికిని ప్రదర్శించినపుడు
కమ్యూనిస్టు పార్టీల నాయకులు దాన్ని ఒక అనివార్యమైన చారిత్రక పరిణామంగా
గుర్తించలేకపోయారు. అసలు ఈ పరిణామాల్ని వాళ్ళు జీర్ణించుకోలేక పోయారు. ఇప్పుడు
బహుజనులు వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు అనే అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది.
భారత కమ్యూనిస్టు
నాయకుల్లో 1940లు, 50లలో ఒక వెలుగు వెలిగిన అగ్రనేతలందరూ వ్యవసాయిక కుటుంబాల నుండి
వచ్చిన వారు. సహజంగానే వాళ్ళకు వ్యవసాయం, నీటిపారుదల గురించి లోతుగా తెలుసు.
కానీ అప్పటి ఆధునిక యంత్రాల గురించి వారికి అంతగా తెలీదు. నిజానికి అప్పటికి మన
దేశంలో యంత్రాల వుపయోగం కూడ శైశవ దశలో వుంది. కమ్యూనిస్టు పార్టి నాయకుల మేధోశక్తి
కూడ ఆ పరిమితుల్లోనే వుండింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు,
మాకినేని బసవపున్నయ్య, రావి నారాయణ రెడ్డి, మగ్ధూం మొహియుద్దీన్, చారుమజుందార్,
తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య, చండ్ర
పుల్లారెడ్డి వంటి ప్రముఖుల పేర్లను మనం తరచూ వింటుంటాం. యంత్రాలు విధించిన పరిమితుల కారణంగా వాళ్ళలో ఏ
ఒక్కరూ తమకాలం నాటి సమాజాన్ని సమగ్రంగా విశ్లేషించలేపోయారు.
విప్లవం వ్యవసాయరంగంలో మొదలై,
తొలుత గ్రామీణ ప్రాంతాలను విముక్తం చేసి, ఆ తరువాత పట్టణాలను విముక్తం చేస్తుందని వారంతా
గట్టిగా నమ్మేరు. ఇప్పటికీ చాలామంది సీనియర్ కమ్యూనిస్టు అభిమానులు 1950ల నాటి ‘ఆంధ్రా
థీసిస్’ను మహత్తర ప్రతిపాదనగా భావిస్తుంటారు. 1940లలో చైనాలో మావో ప్రతిపాదించిన నూతన
ప్రజాస్వామిక విప్లవంకు అది ఇండియన్ వెర్షన్ తప్ప అందులో మన కమ్యూనిస్టు నేతలు జోడించిన
సృజనాత్మకత పెద్దగా ఏమీ లేదు. దానినే తరువాతి కాలంలో మరికొంత స్థానిక అన్వయంతో కొండపల్లి
సీతారామయ్య ‘వ్యవసాయిక విప్లవం’గా అభివృద్ధి చేశారు. అప్పటికే అత్యంత ఆధునిక, సంక్లిష్ట,
యంత్రాల ప్రవేశంతో సమాజం సామాన్యులు విశ్లేషించలేనంత వైవిధ్యపూరితంగా మారిపోయింది.
తత్కారణంగా కొండపల్లి ఫార్మూలా కూడ పనిచేయలేదు. 1990లలో తూర్పు యూరోప్, రష్యాల పతనాల
తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించాక కమ్యూనిస్టు
నాయకుల నిస్సహాయత మరింత పెరిగింది.
అణగారిన సమూహాలు పాత
పధ్ధతుల్లో జీవించలేని స్థితికి చేరడమేగాక, ఆధిపత్య సమూహాలు సహితం పాత
పధ్ధతుల్ని కొనసాగించలేని స్థితికి చేరుకున్నప్పుడే విప్లవం సంభవిస్తుంది అన్నాడు
లెనిన్. విప్లవకర పరిస్థితి, విప్లవకర సిధ్ధాంతం (పార్టి), విప్లవించడానికి
సిధ్ధపడిన ప్రజా సమూహాలు లేకుండా విప్లవం సాధ్యంకాదని కూడ ఆయనే అన్నాడు. ఇప్పటికి
కూడ ఇదీ భారత సమాజపు సంపూర్ణ స్వభావం,
ఇందులో వీళ్లు వీళ్ళు విప్లవకర శక్తులు, ఇదీ వీరు చేపట్టాల్సిన విముక్తి
కార్యక్రమం అని తేల్చి చెప్పగలిగిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ ఈరోజు
భారతదేశంలో లేదు. ఆత్యాధునిక యంత్రాల గురించీ, అవి సమాజం మీద వేస్తున్న
ప్రభావాల గురించిన పరిజ్ఞానం లేనివాళ్ళు విప్లవ కార్యక్రమాన్ని ఎన్నడూ రూపొందించలేరు.
11-08-2024
//EOM//
No comments:
Post a Comment