Thursday, 1 August 2024

Karamchedu - People's War and Danny

 

కారంచేడు –పీపుల్స్ వార్ – డానీ

ఖమ్మం మిత్రుడు గుర్రం సీతారాములు మూడు రోజుల క్రితం ఫోన్ చేసి కారంచెడు ఉద్యమం గురించి అనేక వివరాలు అడిగాడు. అతను ఈ అంశం మీద ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని రాస్తున్నట్టున్నాడు. ఒక అరగంట తరువాత మా ఫోన్ కు సిగ్నలింగ్ ప్రాబ్లం వచ్చింది.

అప్పటి అనుభవాల్ని నేను తనకు పాయింట్ బై పాయింట్ రాసి పంపించాను.

ఆసక్తి గలవారు చదవవచ్చు.

 

 

డియర్ గుర్రం శ్రీరాములు

మొన్నటి మన ఫోన్ కాల్ మధ్యలో ఆగింది.

కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదని ముఖ్యమైన  విషయాలను రాతపూర్వకంగా స్పష్టం చేస్తున్నాను.

 

1.      1980లో నేను పీపుల్స్ వార్ లో హోల్ టైమర్ గానేగాక కృష్ణాజిల్లా కమిటీకి కార్యదర్శిగా వున్నాను.

2.      అయితే అది పూర్తిస్థాయి కమిటి కాదు. అడహాక్ గా వున్న కమిటి. నేను అడ్ హాక్ కార్యదర్శిని.

3.       ఆ ఏడాది డిసెంబరు నెలలోనే నాకు పీపుల్స్ వార్ కార్యక్రమం మీద, నాయకుల సమర్ధత మీద, వాళ్ళ నిజాయితీ మీద అనుమానాలొచ్చాయి. 

4.      పార్టీలో సైధ్ధాంతిక స్తోమతకన్నా విధేయులకు  పెద్దపీట వేస్తున్నారని అర్ధం అయింది.

5.      నేను ఘర్షణ పడకుండ కుటుంబ కారణాలు చెప్పి  1981 మే 1న హోల్ టైమర్ జీవితం నుండి సాధారణ జీవితం లోనికి వచ్చేశాను. మాలాంటి వాళ్ళను పార్ట్ టైమర్లు అనేవారు.

6.      నాకు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో వంశపారంపర్యంగా కొంత నైపుణ్యంవుంది.

7.      అంతకు ముందు ఉద్యమంలో ఆయుధాల విభాగంతో సహా అనేక విభాగాల్లో నేను కొన్ని టాస్కుల్ని విజయవంతంగా పూర్తిచేశాను.

8.      నేను బయటికి వచ్చే సమయంలో ఒకమాట చెప్పాను. ఛాలెంజింగ్ పని వచ్చినపుడు నాకు   కబురుపెట్టండి తప్పక వచ్చి పూర్తి చేస్తాను అన్నాను.

9.      అలాంటి సందర్భం ఒకటి కారంచేడు సందర్భంగా వారికి వచ్చింది.

10. కారంచెడు గ్రామంలోనే రాడికల్ యూనిట్ వుంది. ఐసాక్, ప్రభాకర్ తదితరులు వుండేవారు.

11. 1985 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా రాడికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్  AIRSF  మహాసభలకు కారంచెడు యూనిట్ కూడ వచ్చింది.

12. కారంచెడు సంఘటన 1985 జులై 16న మొదలై జులై17 ఉదయం దాడి జరిగింది.

13. గాయపడిన వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. బాధితులు చీరాల చర్చిలో ఆశ్రయం పొందారు. చీరాలలో అవి రెండూ దగ్గరలోనే  వుంటాయి.

14. ఈ వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకునివెళ్ళే ప్రయత్నం మొదట కారంచెడు-చీరాల రాడికల్సే చేశారు.

15. అనుకోకుండా ఆరోజు ఆ హాస్పిటల్ కూ వచ్చిన  కత్తి పద్మారావు మీడియా పనుల్ని చేపట్టారు.  ఇది రాడికల్స్ కు కూడ మేలు చేసింది.

16. అప్పట్లొ పీపుల్స్ వార్ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది. పౌరహక్కుల నాయకులకు కూడ రక్షణలేని సమయం అది.

17. అప్పట్లొ ప్రకాశం జిల్లాకు గురువయ్య అని ఒక ముసలాయన ఇన్ చార్జీగా వుండేవారు.

18. రీజినల్ కమిటి (RC) కి నిమలూరి భాస్కరరావు ఇన్ చార్జి. కృష్ణాజిల్లాకు సుధాకర్ – చెలం ఇన్ చార్జి.

19. నేను అప్పుడు ఆటోమోబైల్ రంగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వుంటున్నాను. టూర్ లో వున్నాను. ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ కు కాంటాక్టులో వుండేవాడిని.

20. సంఘటన జరగ్గానే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు చీరాల చర్చికి వచ్చారు. బాధితులు ముఖ్యమంత్రిని అడ్డుకున్నారు.

21. ఇది చర్చీవారికి నచ్చలేదు. వ్యవహారం రాజకీయంగా మారుతోందని భయపడి వారు బాధితుల్ని బయటికి పొమ్మన్నారు.

22. అప్పుడు ఐక్యనగర్ లో హుటాహుటిన ఒక ఇసకపర్ర కొని కొన్ని తాటాకు పాకలు వేశారు. దానికే విజయనగర్ కాలనీ అని పేరుపెట్టారు.

23. కారంచెడు ఉద్యమంలో ఐదు  సంఘాలున్నాయి. మొదటిది; కారంచెడు నుండి వచ్చిన బాధితులది. దీనికి తేళ్ళ జడ్సన్ నాయకుడు. ఇతనే కేంద్ర బిందువు.  రెండోది; కాంగ్రెస్ నాయకత్వం లోనిది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారంచెడు మాదిగ సామాజికవర్గం కాంగ్రెస్ కు ఓటేశారు.  మూడోది; క్రైస్తవుల నాయకత్వంలోనిది, నాలుగోది; కత్తి పద్మారావు బృందం నాయకత్వంలోనిది. ఐదవది; రాడికల్స్ నాయకత్వం లోనిది.

24. ఐక్య నగర్ లోని బొక్కా పరంజ్యోతి ఇల్లు ఉద్యమ కార్యాలయంగా వుండేది. పరంజ్యోతి ఏయూలో రాడికల్ నాయకుడు.

25.  కారెంచెడు సంఘటన జరగ్గానే పీపుల్స్ వార్  RC ద్రోణవల్లి అనసూయమ్మ, చలసాని ప్రసాద్ లను చీరాల పంపింది. వాళ్ళిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడాన లోపలికి చొచ్చుకు పోలేకపోయారు. ఆ సమయంలో కమ్మ వ్యతిరేకత చాలా తీవ్రంగావుంది.

26. అప్పుడు RCకి నేను గుర్తుకు వచ్చాను. గతంలో నేను చేసిన వాగ్దానం కూడ గుర్తుకు వచ్చింది. చెలం / సుధాకర్ ద్వార నిమలూరి భాస్కర రావు నాకు కబురు పెట్టారు. దీనికి రెండు కారణాలున్నాయి. నేను లీడ్ తీసుకోగలను అనే నమ్మకం ఒకటి. నేను మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడిన కావడం మరొకటి.

27. అలాగే ప్రకాశం జిల్లా ఇన్ చార్జీగా గురువయ్యను తొలగించి బాలయ్య అనే కొత్తాయన్ను నియమించారు. నేను మరోమారు హోల్ టైమర్ కావడానికి నిర్ణయించుకున్నాను. దానికి కొన్నాళ్ళ ముందు ఢిల్లీలో జరిగిన శిక్కుల ఊచకోత నన్ను బాగా ప్రభావితం చేసింది. మైనారిటీల మీద జరుగుతున్న దాడుల మీద నేను ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలనుకున్నాను. కారంచెడు బాధితులు మతపరంగా క్రైస్తవులు.

28. నేను చీరాల చేరిన డేట్ సరిగ్గా చెప్పలేను. విజయనగర్ కాలని ఏర్పడిన రెండు మూడు రోజులకు అక్కడికి చేరాను. బహుశ అది జులై 22, 23 కావచ్చు.

29. కత్తి పద్మారావు, కాంగ్రెస్, చర్చి సంఘాల మధ్య నాయకత్వం కోసం గట్టి పోటీ నడుస్తోంది. చర్చికి అంతటి శక్తి లేదుగానీ కాంగ్రెస్ ఎంపి సలగల బెంజిమన్ కొడుకు సలగల రాజశేఖర్ ఉద్యమాన్ని తమ పార్టీ వైపుకు లాక్కోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కత్తి పద్మారావు మంచి వక్త. కానీ ఆయనకు ఉద్యమ వ్యూహాలు తెలియవు.

30. ఆ నిర్బంధ కాలంలో బహిరంగ  నాయకత్వం తీసుకునే అవకాశం పీపుల్స్ వార్ కు ఏమాత్రం లేదు.

31. మిగిలిన ముగ్గురిలో కత్తి పద్మారావు మెరుగైన ఛాయిస్ అని నేనూ , పరంజ్యోతి భావించాము. ఆ విషయాన్నే  పీపుల్స్ వార్ RCకి తెలియపరిచాము.  వాళ్ళూ సరే అన్నారు.

32. నేను వెళ్ళీన రోజు రాత్రే పరంజ్యోతి చొరవతో కత్తి పద్మారావుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాను.

33. కాంగ్రెస్, క్రైస్తవ సంఘం మనల్ని తట్టుకోలేదు.  రాడికల్స్  మొత్తంగా మీ వెనుక వుంటాము మీరు ముందుండి నడిపించండి. అని కత్తి పద్మారావుతో  ఒక అవగాహనకు వచ్చాం. ఈ సమావేశంలో ఏయూ ప్రొఫెసర్ సుబ్బారావు (అప్పటికి స్టూడెంట్) నాగార్జున యూనివర్శిటీ స్టూడెంట్ విష్ణు (ఇప్పుడు అడ్వకేట్) వున్నారు.

34. చాన్నాళ్ళు కత్తి పద్మారావుతో మా ఐక్యత చాలా బాగా  నడిచింది. ఆయన పోలీసులకు తెగ భయపడేవారు. వరంగల్లులో డాక్టర్ రామ నాధం హత్య తరువాత వారిలో భయం మరీ పెరిగింది. వారి కొసం ఒక సెక్యూరిటీ దళాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మన లాంటి పబ్లిక్ ఫిగర్స్ ను ఎన్ కౌంటర్ చేయరు అన్నా వారు నమ్మే వారు కాదు.

35. వియ్యంకూడు చెంచు రాయయ్య పాత్ర వివాదంగా మారడంతో ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు నైతికంగా ఇరకాటంలో పడ్డారు. పోలీసులు కూడ మమ్మల్ని హెర్రాస్ చేయలేదు. వచ్చేపోయేవారి మీద నిఘావుండేది. పికెట్స్ పెట్టి తనిఖీలు చేసేవారు. దురుసుగా మాత్రం లేరు.

36. ఆగస్టు 15న గడియారం స్థంభం దగ్గర బ్లాక్ డే నిర్వహించాము. కారంచెడు ఉద్యమంలో అదే తొలి బహిరంగ సభ.

37. అంతకు ముందు విజయనగరం శిబిరంలో కొన్ని సమావేశాలు జరిగేవి. అవి బహిరంగ సభలు కావు.

38. సెప్టెంబరు మొదటి వారంలో కత్తి పద్మారావు తారకం కలిసి దళిత మహాసభను నిర్వహించారు. ఇంతకు ముందే దళిత మహాసభ ఒకటి వుండివుండవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. పీపుల్స్ వార్ రాడికల్స్  సంఘాలు పెట్టడానికి ముందే తిరుపతిలో ఒక రాడికల్ సంఘం వుంది. పెద్దవాళ్ళు చేపట్టినపుడే దేనికైనా పాపులారిటీ వస్తుంది.

39. ఉద్యమ్కాన్ని తీవ్రతరం చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ క్రైస్తవ సంఘాలు బయటికి పోయాయి. సెప్టేంబరు 10న రాస్తారోకో నిర్వహించాము. బస్సుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశాము. మద్రాసు-విజయవాడ రూటులో అన్ని రైళ్ళనూ ఆపేశాము. కొన్ని చోట్ల బస్సుల్ని తగలబెట్టారు. కొన్ని చోట్ల రైల్వేస్టేషన్లకు నిప్పు పెట్టారు. అది ఉద్రిక్తంగా మారింది. నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుల పర్వం మొదలుకావడంతో కత్తి పద్మారావు మరీ భయపడిపోయారు.

40. అరెస్టయిన వారిని విడుదల చేయాలని సెప్టెంబరు 11 సాయంత్రం పెద్ద ఊరేగింపు తీశాము.

41. ఆ ఊరేగింపులో పాల్గొనడానికి కత్తి పద్మారావు ఇష్టపడలేదు.  

42. ఊరేగింపు మధ్యలోనే వెనక్కి మళ్ళి గుంటూరు కన్నమ రాజా దగ్గరికి వెళ్ళీపోయారు. వెళ్ళడానికి ముందు ఇకనుండి డానీ లీడ్ చేస్తారని ఒక ప్రకటన చేశారు.

43. ఆ రోజు తరువాత ఉద్యమం ముగిసే వరకు కత్తి పద్మారావు చీరాలలో కాలు మోపలేదు. మొత్తం ఉద్యమం రాడికల్స్ చేతుల్లోనికి వచ్చేసింది.

44. పోలీసు యాక్టీవ్ గా మారాక ఆ ఉద్యమానికి విజయనగరం శిబిరానికి నేనే నాయకునిగా వున్నాను. 

45. 11 సాయంత్రం లాఠీ చార్జి జరిగింది. చాలామంది గాయపడ్డారు.

46. 12వ తేదీ ఉదయం అరెస్టయిన వారిని కోర్టులో  ప్రవేశ పెడితే కోర్టూల్ని బహిష్కరించి బయటికి తీసుకుని వచ్చేశాము. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. పోలీసులు రెచ్చిపోయారు.

47. 13వ తేదీ తెల్లవారుజామున నన్నూ, పరంజ్యోతిని మరో ఐదారుగుర్ని అరెస్టు చేశారు. కాస్సేపు ఎన్ కౌంటర్ డ్రామా ఆడారు.

48. పోలీసు వున్నతాధికారి మంచి మనిషి. థర్డ్ డిగ్రీని ఉపయోగించనివ్వలేదు.

49. మీడియా మమ్మల్ని బాగా ఆదుకుంది. హైకోర్టులొ, సుప్రీం కోర్టులొ హెబియస్ కార్పొస్ పిటీషన్లు పడ్డాయి.

50. రైల్వేస్టేషన్లు, బస్సుల్ని తగులబెట్టామని మా మీద కేసులు పెట్టారు

51. మరునాడు చీరాల కోర్టు మాకు ఒంగోలులో 15 రోజులు జుడీషియల్ రిమాండ్ కు పంపింది.

52. ఒంగోలు చేరే సమయానికే మాకు పై కోర్టునుండి కండీషనల్ బెయిల్ వచ్చింది.

53. అప్పటి నుండి విజయనగరం శిబిరం కార్యాలయంలో  నేనొక్కడినే నాయకునిగా వున్నాను.

54. ఆ సమయంలోనే ప్రభుత్వం ఆర్ ఆర్ ప్యాకేజీని ప్రకటించింది. చాలా మంచి ప్యాకేజి అది. మా కోరికలన్నింటినీ తీర్చింది.

55. ఒక ఏడాది పాటు చీరాలలో అడుగు పెట్టరాదనే కండీషన్ మీద నాకు పూర్తి బెయిల్ ఇచ్చారు.

56. బహుశ ఆరోజు అక్టోబరు 5 అనుకుంటాను.

57. మా కేసు 1989 వరకు నడిచింది. ప్రాసిక్యూషన్ వారు మా మీద ఆరోపణల్ని రుజువు చేయలేకపోవడంతో 1989 మే నెలలో మా కేసు కొట్టి వేశారు.

ఈ సందర్భంగా ఇంకో రెండు అంశాలు చెప్పాలనిపించింది.

58. చీరాల నుండి తిరిగి వచ్చాక ఫుల్ టైమర్ పాత్రను వదిలి  మళ్ళీ పార్ట్ టైమర్ గా మారిపోయాను.

59. కారంచెడు ఉద్యమంలో పీపుల్స్ వార్ నాకు ఇచ్చిన టాార్గెట్ ను నేను సంతృప్తిగా పూర్తి చేశాను.

60. అప్పట్లో ఎస్సీ ఆట్రాసిటీస్ చట్టం లేనప్పటికీ మంచి ఆర్ ఆార్ ప్యాకేజీ వచ్చింది.

61. ఆ తరువాత అనుకూల చట్టం వచ్చినప్పటికీ మంచి ఆర్ ఆర్ ప్యాకేజీని సాధించిన ఉద్యమం ఒక్కటీ నాకు తెలీదు.

62. అప్పట్లో నాకో పేరు వుండేది. డానీకి పని అప్పచెపితే అది జరిగిపోయినట్టే అనుకునేవారు. పెర్ఫెక్షనిస్టు అనేవారు.

63. 1990 మే నెలలో పీపుల్స్ వార్ తో నా విబేధాలు పెరిగాయి. ఆ ఏడాది జూన్ నెలతో ఆ పార్టీతో నా సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నాను.

64. 2000లో విరసం నుండి కూడ బయటికి వచ్చేశాను.

65. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చినపుడు సుధాకర్ ను ఒరిస్సాలో దించాల్సి వచ్చింది. అప్పుడు అతను ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ AOB కార్యదర్శిగా వున్నాడు.

66. అప్పుడు వాళ్ళు ఆ టాస్క్ ను నాకే అప్ప చెప్పారు. నేను నా భార్యతోసహా వెళ్ళి సుధాకర్ ను ఒరిస్సాలో సేఫ్ గా దించి వచ్చాను.

67. ఇక్కడ వాళ్ళ గొప్పతనం గురించి కూడ చెప్పాలి.

68. తిరిగి వచ్చాక నా భార్యకు రెండు రకాల మలేరియాలు, డెంగూ సోకి మల్టి ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగింది. ఆ స్థితికి చేరుకున్నవారు అప్పటికి ఇండియాలో ఒక్కరూ బతకలేదు.

69. పీపుల్స్ వార్ అప్పటికి మావోయిస్టు పార్టీగా మారిపోయింది. ఆ పార్టియే నా భార్య వైద్యానికి అవసరమైన ఖర్చులన్నీ పూర్తిగా చాలా బాధ్యతగా భరించింది. నేను ఈ విషయంలో వరవరరావుకు రుణపడి వున్నాను.

70. నక్సలైట్ నాయకుల్లో అత్యధికులు అంకిత భావం కలవారు. మహత్తర త్యాగాలు చేశారు.

71. వారు వర్తమానాన్ని విశ్లేషించగలిగినంతగా భవిష్యత్తు పరిణామాల్ని ప్రమాదాల్ని అంచనా కట్టలేకపోయారు. ఇది వారిలో ప్రధానలోపం.

72. మన దేశ నాయకుల్లో ఏ ఒక్కరూ మార్క్స్, ఏంగిల్స్, లెనిన్ లతో పోల్చదగ్గవారుకాదు.

73. అందరిలో కొండపల్లి సీతారామయ్యను నేను ఎక్కువగా గౌరవిస్తాను. ఆయన కూడ నేను చెప్పిన పరిమితుల్ని అధిగమించలేకపోయారు.

74. ఆ మూడు నెలల కాలంలో చీరాల వచ్చిన వారు చాలామంది వున్నారు. పీపుల్స్ వార్ కు చెందిన  ఆర్ ఎస్ యూ, ఆర్ వైఎల్, జననాట్యమండలి, విరసం, ఏపిసిఎల్ సి సభ్యులు ఆయా సందర్భాలలో వచ్చి రెండు మూడు రోజులు వుండి వెళ్ళేవారు. 

75. తొలి దశలో విరాళాలు కూడ నాగార్జున యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీల రాడికల్ స్టూడెంట్స్ నుండే వచ్చాయి.

76. దళిత మహాసభ ఆరంభం రోజు  గద్దర్ తో పాటు, సభలో వరవరరావు కూడ వున్నారు.

77. దివాకర్, డప్పు రమేష్, కుమారి, కలేకూరి ప్రసాద్ నాలుగయిదు రోజులుండి ఒగ్గు కథ రాశారు.

78. దళితపులులమ్మా పాట గద్దర్ పేరుతో పాపులర్ అయ్యింది గానీ అందులో దివాకర్ చెయ్యి కూడ వున్నట్టు గుర్తు. అంతా ఒక గదిలోనే వున్నారు.

79. చెంచు రామయ్య మీద యాక్షన్ టీమ్ నాయకుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన అతనే. యాక్షన్ లో కీలక పాత్ర కూడ అతనిదే అని విన్నాను. ఏసూ, విరపని ఇతర సభ్యులు.

80. అంతిమంగా ఒక విషయం చెప్పాలి. పీపుల్స్ వార్ నన్న్ను ఒక మిషన్ మీద పంపింది. నా పేరు అనేక డాక్యుమెంట్లలో నాయకునిగా నయోదయ్యింది. బయటికి కనిపించేవారు కనిపించనివారు కొన్ని వందలుకాదు కొన్ని వేలమంది అభిమానం చూపితేనే ఒకరు నాయకులు కాగలుగుతారు.

81. సెప్టెంబరు 11 రాత్రి లాఠీచార్జి తరువాత గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్ళాను. అప్పుడు నాకు అర్ధం అయింది నా వెనుక ఎంత మంది వున్నారో.

82. వారిలో పట్టుమని ఓ పదిమంది పేర్లు కూడా నాకు తెలీదు. కానీ వాళ్లంతా నా వెనుక వున్నారు. రిక్షావాళ్ళు, చిన్నచిన్న దుకాణదారులు, పాదచారులు, డాక్టర్లు, నర్సులు.

83. హీరో నేనుకాదు; వాళ్ళు నన్ను హీరోను చేశారు.  

84. అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఒక మంచిపని కోసం గట్టిగా నిలబడినప్పుడే మనకోసం ఎంతమంది నిలబడతారో తెలుస్తుంది.

85. అంతిమంగా కారంచెడు ఉద్యమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం సమైక్యత. బాధితులు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. కత్తి పద్మారావు మాల సామాజికవర్గానికి చెందినవారు, బొజ్జా తారకం అమలాపురం మాల. వారిని ఆదిఆంధ్రులు అంటారు. కొంచెం పెద్ద స్థాయి. నేను ముస్లిం పఠాన్. బాలగోపాల్ బ్రాహ్మణుడు, మాకు బెయిల్ తెచ్చిన న్యాయవాది వైకేది బిసి సామాజికవర్గం.   ఇక ప్రాపంచిక దృక్పథాలపరంగా కత్తి పద్మారావు హేతువాది. మరొకరు క్రైస్తవ ధార్మికుడు, ఇంకొకరు జాతీయ కాంగ్రెస్, తారకానిది ఒక ఎంఎల్ పార్టి అభిమానం. నాది ఇంకో ఎంఎల్ పార్టి అభిమానం. ఇంతమంది ఏకమై పనిచేయడం వల్లనే ఆ ఉద్యమం విజయవంతమైంది. 


No comments:

Post a Comment