*లూసన్ ‘పిచ్చివాని డైరీ - చిన్న పరిచయం*
*లూసన్ ‘పిచ్చివాని డైరీ - చిన్న పరిచయం*
*లూసన్ ‘పిచ్చివాని డైరీ - చిన్న పరిచయం*
ఏం రాయాలో తెలీకుండానే రాయడం మొదలెట్టేస్తాం. ఆ తరువాత ఏం రాయాలీ? ఏ లక్ష్యం కోసం రాయాలి? ఏ శైలీ శిల్పాల్లో రాయాలీ అనే సందేహాలొస్తాయి. పాలకపక్షమా? ప్రజల పక్షమా? పురుషుల పక్షమా? మహిళల పక్షమా? మెజారిటీ మతమా? మైనారిటీ మతమా? మైదానమా? అడివా? పీడకులా? పీడితులా? సౌఖ్యమా? పోరాటమా? మొదలైనవన్నీ తరువాతి విషయాలు. సాహిత్యానికి అన్నింటికన్నా ప్రాధమిక అంశం భాష.
మా అమ్మది గోదావరి తూర్పు గట్టున రాజమండ్రి; మా నాన్నది గోదావరి పశ్చిమ గట్టున నరసాపురం. వాళ్ళిద్దరి మాతృభాష ఉర్దూ. అత్యంత సహజంగానే నా మీద రెండు భాషలు మూడు యాసల ప్రభావాలున్నాయి. ఇది నాకు ఆర్గానిక్ అడ్వాంటేజ్; ఇంకో కోణంలో డిజ్ అడ్వాంటేజ్. మనుషులు ప్రాంతీయంగా భాషోన్మాదులు. ఒకరి భాష మరొకరికి పడదు. భాషేకాదు యాస కూడ పడదు.
ఏవో కొన్ని కథలు, నాటికలు అలా రాసేసి కొంచెం గుర్తింపు తెచ్చుకున్నానుగానీ శ్రీశ్రీ ‘మహాప్రస్తానం’ కు చెలం రాసిన ముందుమాట చదివాక తెలుగు వాక్యం అలా పరుగెత్తాలి అనిపించింది. చెలం తెలుగు వాక్యం పాదరసం లాంటిది. ఆయన వాక్యాన్ని పట్టుకున్నవారు దానికి తరువాతి కాలంలో బోలెడు పదునుపెట్టారు.
మానవ భావోద్వేగాలన్నీ ప్రపంచ ఇతిహాసాల్లో ఎక్కడో ఒకచోట ఉదాత్తంగా నమోదై వుంటాయి. ఆ తరువాతి కాలపు రచయితలు కొత్త సందర్భాలకు ఆ భావోద్వేగాలను అన్వయిస్తారు. అంటే వాళ్ళను తక్కువ చేయడం కాదు; ఏ రంగంలో అయినా సరే సమర్ధత, నైపుణ్యం అనేవి వున్నట్టే అసమర్ధత చేతకానితనాలు వుంటాయి.
మార్స్కిస్టు సమూహంలో చేరాక జాక్ లండన్ రచనా శైలి శిల్పాలు నాకు తెగ నచ్చాయి. యుధ్ధరంగంలో దాడిచేసే తెగువ వుండాలి; ప్రత్యర్ధి దాడి చేసినపుడు తిప్పికొట్టే సాహసం వుండాలి; వాటి మధ్య కాలంలో మనం నమ్ముతున్న దాన్ని ప్రజలకు నచ్చచెప్పే సహనం వుండాలి. ఈ మూడు లక్షణాలు నాకు జాక్ లండన్ లో ఎక్కువగా కనిపించాయి. జాక్ జీవన విధానం కూడ నాకు గొప్ప ఉత్తేజం. మనం ప్రేమించేవాళ్ళను ప్రేమిస్తున్నామనీ, ద్వేషించేవాళ్ళను ద్వేషిస్తున్నామని బాహాటంగా చెప్పగల నిజాయితీ రచయితలకు వుండాల్సిన కనీస లక్షణం.
ఆధునిక రచయితల్లో గై డి మొపాస, సాదత్ హసన్ మంటో మానవ భావోద్వేగాలను చాలా గొప్పగా చిత్రించారనిపిస్తుంది. ఇక, తెలివైన రచయితల జాబితాలో నా తొలి ఛాయిస్ చెఖోవ్, రెండో ఛాయిస్ లూసన్.
లూసన్ ను నేను 1979 ఆరంభంలో మొదటిసారి చదివాను. సంభ్రమాశ్ఛర్యాలకు గురయ్యాను. అందుబాటులోవున్న ఆయన రచనలన్నీ సంపాదించి కొన్ని రోజులపాటు వాటినే చదువుతూ వుండిపోయాను. లూసన్ మీద నా అభిమానం ఆ నోటా ఈనోటా ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ వరకు చేరింది. జెఎన్ యూ లోని ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్ మెంట్ 1981 సెప్టెంబరు 25-27 తేదీల్లో మూడు రోజులపాటు లూసన్ శత జయంతోత్సవాలు నిర్వహించింది. అందులో ఒక సెషన్ లో ప్రసంగం చేయడానికి నన్ను పిలిచింది. అది నా తొలి ఆంగ్ల ప్రసంగం.
లూసన్ రచనల్లో ‘పిచ్చివాని డైరి’ ప్రపంచ ప్రసిధ్ధి. ప్రపంచ సాహిత్యంలో గొప్పవాళ్ళనిపించుకున్న రచయితలు వాణిజ్య వేశ్యల్ని ప్రధాన పాత్రలుగా తీసుకున్నారు; మన గురజాడ అప్పారావు మధురవాణిని తీసుకున్నట్టు. అలాగే, లూసన్ కన్నా ముందే గొగోల్, గైడీ మొపాసా లు కూడ పిచ్చివాళ్లను ప్రధాన పాత్రలుగా చేసి ప్రసిధ్ధ రచనలు చేశారు. ఆధునిక కాలపు మనుషుల్లోని హిప్పోక్రసీని, డొల్లతనాన్నీ, బూటకాన్ని ఎండగట్టడానికి ఈ పాత్రల్ని ఎంచుకున్నారనిపిస్తుంది. సాహిత్యంలో వాణిజ్య వేశ్యలు, పిచ్చివాళ్ళు అనే రెండు అంశాల మీద ఎవరయినా ఒక పరిశోధనా గ్రంధం రాయవచ్చు.
స్వీయ రచన చేసినంత సులువుకాదు అనువదించడం. అనువాదానికి అనేక అదనపు దినుసులు కావాలి. అనువదిస్తున్న అంశం మీద ముందు మనకు గొప్ప ఆసక్తి అభిమానం వుండాలి. వేరే భాషలో చదివి మనం పొందిన ఒక గొప్ప అనుభూతిని మన భాషలో మరొకరితో పంచుకోకుండా వుండలేనంత తపన వుండాలి. గమ్య భాషతోపాటు, మూల భాష రీతి సాంప్రదాయాలు సమయ సందర్భాలు తెలుసుండాలి.
లూసన్ ‘వైల్డ్ గ్రాస్’లో కొన్ని భాగాలను నేను 1980 ప్రాంతంలో అనువాదం చేసి ప్రచురించాను. ‘పిచ్చివాని డైరీ’ని 2015లో అనువాదం చేశాను. చెఖోవ్, లూసన్ లను అనువాదం చేయడం చాలా కష్టం. ప్రతి పదానికీ ప్రాధాన్యం వుంటుంది. ఒక్క పదాన్ని మిస్ అయినా దాని తీవ్రత దెబ్బతింటుంది. ఒక్కోసారి అర్ధం పూర్తిగా మారిపోతుంది. ఆ భయం వల్ల దాన్ని బయటికి వదల్లేదు. నిన్న పాత కాపీలు తీసి మరోసారి చదివాను. కొన్ని సవరణలు చేశాను. ఇక దీన్ని ప్రచురించవచ్చు అనుకున్నాను. ఇప్పటికీ లోపాలు వుండవచ్చు.
లూసన్ ‘పిచ్చివాడి డైరీ’ నా అనువాదాన్ని ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 7 గంటలకు పోస్టు చేస్తాను.
దీనికి అవసరమైన ఇలస్ట్రేషన్ కూడ ఏఐ సహకారంతో నేనే రూపొందించాను. అన్నట్టు ఏఐ అనేది లెఖ్ఖలు, తర్కం మీద పనిచేస్తుంది. మనిషికుండే సృజనాత్మకత దానికి లేదు; రాదు. మనం ఎంత సృజనాత్మకంగా దాన్ని నడిపిస్తే అదలా సాకారం చేస్తుంటుంది. అంచేత సృజనాత్మకత వున్నోళ్ళు ఏఐని చూసి భయపడాల్సిందేమీలేదు. సృష్టిలో అద్భుతమైన జీవి మనిషి. అంతకన్నా అద్భుతమైనది మనిషి మెదడు. యంత్రాలు అద్భుతాలు సృష్టించేమాట నిజమేగానీ, అవి ఎన్నడూ మనిషిని అధిగమించలేవు. ఎందుకంటే యంత్రాలను సృష్టించేదీ మనిషే!!
ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 7 గంటలకు నా పోస్టు చదివి మీ అభిప్రాయాల్ని సూచనల్ని నిర్మొహమాటంగా చెప్పండి.
మీ
*ఉషా యస్ డానీ*
No comments:
Post a Comment