రాజకీయాల్లో మా కుటుంబం కాంగ్రెస్ అభిమాని. మానాన్నకు కొందరు కమ్యూనిస్టు నాయకులతో సాన్నిహిత్యం వుండేది. 1970వ దశకం ఆరంభంలో నాటకాల మీద ఆసక్తి పెరిగింది. అలా ధవళ సత్యం, ఎంజీ రామారావుగార్లతో సన్నిహితంగా వున్నాను. వాళ్ళ మూలంగా సిపిఐ నాయకులతోనేగాక ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘానికి కూడ దగ్గరయ్యాను. అలా నన్ను కమ్యూనిస్టు భావాలు తాకాయి.
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Thursday, 6 February 2025
Adivasis and Muslims
1978లో సమాజాన్ని సమూలంగా
మార్చాలనే తీవ్ర భావాలు నన్ను చుట్టుముట్టాయి. హైవోల్టేజ్ కమ్యూనిజం అవసరమైంది.
స్వఛ్ఛందంగా వెళ్ళి ‘పీపుల్ వార్’లో చేరాను. అప్పట్లో దాన్ని సివోసి అనేవారు.
లేదా, కొండపల్లి సీతారామయ్య గ్రూపు అనేవారు.
నా జీవితంలో ఒక అద్భుత కాలం అది. అద్భుతమైన మనుషులు,
సమాజాన్ని మార్చడం కోసం ప్రాణాలను కూడ లెక్క చేసేవారు కాదు. వాళ్ళ మధ్యన జీవించే
అవకాశం రావడమే ఒక అదృష్టం. వాళ్ళు నాకు ఉత్తేజాన్ని ఇచ్చారు. నేను
విప్లవోద్యమానికి సంబంధించిన సమస్త రంగాల్లోనూ నా సేవలను అందించాను. ఆక్షరాలు,
ఆయుధాలు అనే తేడాను కూడ నేను పాటించలేదు. విప్లవం విజయవంతం అయ్యాక సమాజం
ఎలావుంటుందనేది ఒక ఊహాగానమేతప్ప నేను దాన్ని చూడలేదు. అయితే, సమాజాన్ని మార్చడం
కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయడం గొప్ప భావోద్వేగం. మా మధ్య మాటల్లో చెప్పలేనంత
సంఘీభావం సోదరభావం వుండేది. మరోమాటల్లో చెప్పాలంటే విప్లవ సమాజాన్ని మేము చాలా ముందుగానే
ఆస్వాదించేశాము.
రెండున్నరేళ్ళు చాలా గొప్పగా
సాగాయి. ఉద్యమం విస్తరించాక, విప్లవాభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగాక లోపల
పరిస్థితి మారింది. పార్టి నాయకుల్లో ఆధిపత్యాన్ని చెలాయించాలనే యావ క్రమంగా
పెరిగింది. విప్లవం మీద అచంచల విశ్వాసం వుండాలి. పైవాళ్ళు చెప్పింది వినాలి.
వాళ్ళను ప్రశ్నించ కూడదు అనే సాంప్రదాయం ప్రవేశించింది. ప్రశ్నించడం అంటే
విప్లవాన్ని శంకించడం అనే అర్ధం చెప్పడం మొదలెట్టారు.
గతితార్కిక చారిత్రక భౌతిక వాదం ఒక
శాస్త్రం. శాస్త్ర పరిజ్ఞానం లేనివాళ్ళు ఎలాగూ ప్రశ్నించలేరు. కానీ, వాళ్ళు పార్టి
విధేయులుగా, విప్లవ విధేయులుగా చెలామణికాసాగారు. నాలుగు పుస్తకాలు చదువుకున్న
నాబోటి వాళ్ళకు, రష్యాలో నిలబడని విప్లవం చైనాలో అయినా సజావుగా వుందా? అనే
అనుమానాలు వచ్చేవి. అది అప్పటికి ఒక సందేహం మాత్రమే. కానీ నిర్మాణంలో అలా వుండదు.
పార్టీ లైన్ ను శంకించడం అవుతుంది. పార్టీ లైన్ ను శంకించడం అంటే అగ్రనేత
సామర్ధ్యాన్ని శంకిస్తున్నామని ఒక పెద్ద నింద మన మీద పడుతుంది. దాన్ని తట్టుకుని
నిలబడ్డం చాలా కష్టం. ప్రాణాపాయం కూడ కలుగవచ్చు. ఒకవేళ ఆ ప్రమాదం తప్పినా మనం
ఎన్నడూ ఊహించని విప్లవ నిందలు మన మీద పడతాయి.
విపవకర సందర్భం, విపవకర సిధ్ధాంతం,
విప్లవకర కార్యక్రమం, విప్లవకర నాయకుడు ఈ నాలుగూ వుంటేనే కమ్యూనిస్టు పార్టి తన లక్ష్యాన్ని సాకారం
చేసుకుంటుంది. నాకేవేవో సందేహాలు రావడం
మొదలయ్యాయి. వ్యవసాయ విప్లవంతో కూడిన నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కార్యక్రమం చైనాలో
1929లో పుట్టింది. అది 1980లలోని ఇండియాలో
పనికి వస్తుందా? అనేది నా ప్రధాన సందేహం. దాదాపు 150 సంవత్సరాల పరిణామాల్ని
పట్టించుకోకపోవడం చారిత్రక భౌతిక వాదానికి అచారం అనిపించింది.
మొదట్లో ఇలాంటి సందేహాలు రాగానే అమాయికంగా
అందరి ముందు రాష్ట్ర నాయకుల్ని అడిగేసేవాడిని. నిజానికి నా సందేహాలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ విషయాన్ని
ఒప్పుకునే నిజాయతీ కూడ వారికి లేదు. పైగా పార్టి క్రమశిక్షణను వుల్లంఘించారనే
ఆరోపణలతో నన్ను బోనెక్కించే ప్రయత్నాలు
మొదలెట్టారు. ఆ అనుభవంతో కొంత జ్ఞానోదయం అయింది. సందేహాలను అడగడం మానేసి నేనే
నెమ్మదిగా తప్పుకోవడం మంచిదని పించింది.
హోల్ టైమర్ జీవితం నుండి నేను
బయటికి రావడం వేరే సంగతి. విప్లవం మీద అచంచల విశ్వాసంతో పనిచేస్తున్నవారు అందులో
కొందరున్నారని నేను ఇప్పటికీ నమ్ముతాను.
పార్టి బయట ఏం చేయాలన్నది చాలా పెద్ద ప్రశ్న. అప్పటికే ఈశాన్య
రాష్ట్రాల్లో కొలిమంటుకున్నది. ఆదివాసుల ఉనికి ఉద్యమాలు రూపందుకున్నాయి. పంజాబ్
లోనూ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. 1984 నాటి శిక్కుల ఉచకోత నా ముందు ఒక భవిష్యత్
చిత్రపటాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ అల్లర్లను చూశాను. పంజాబ్ తో నాకు ప్రత్యక్ష సంబంధం
కూడ వుంది. ఢిల్లీ అల్లర్లు రాజకీయంగా కాంగ్రెస్ కు గొప్ప మేలు చేశాయి. మైనారిటీ సమూహాల
అణిచివేత శిక్కులతో ఆగదనీ మరిన్ని గొప్ప విజయాల కోసం రాజకీయ పార్టిలు ముస్లింల మీద
విరుచుకు పడతారనీ అర్ధం అయింది. ఆ తరువాత, ఆదివాసులు, ముస్లింలను నా ప్రధాన కార్యక్షేత్రంగా
ఎంచుకున్నాను. ప్రత్యక్ష అనుభవం కోసం ఇష్టంగా
వెళ్ళి కారంచెడు ఉద్యమంలో పాల్గొన్నాను.
ఉనికివాద ఉద్యమాలకు సహజంగానే ఒక పరిమితి
వుంటుంది. అవి కొన్ని సమూహాలను మాత్రమే పట్టించుకుంటాయి. మొత్తం సమాజాన్ని మార్చడం
వాటి లక్ష్యం కాదు. పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే దేశ సమస్యలన్నీ క్రమంగా ఆదివాసులు, ముస్లింల చుట్టు తిరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో ఈ రెండు సమూహాలకు ప్రాధాన్యం వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment