Thursday, 8 January 2026

Venezuela Western Hemisphere

 

Venezuela Western Hemisphere

'వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!'

ఈరోజు సాక్షి దినపత్రిక నా వ్యాసాన్ని 'దాపరికం లేని సామ్రాజ్యవాదం' అనే ఉమ్మడి శీర్షిక కింద ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 


*వెనిజులాకేకాదు; ప్రపంచానికే అమెరిక శత్రువు!*

 

డానీ

సమాజవిశ్లేషకులు

 

ఇది వెనిజులా గురించి కాదు. ఇది ప్రపంచ చట్టవ్యవస్థ ప్రాణాలు, ప్రమాణాల గురించి. ఇది వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడూరో మంచి వాడా? చెడ్డవాడా? అన్న ప్రశ్న కాదు. ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అన్న రాజకీయ చర్చ కూడా కాదు. ఇక్కడ  ఒకే ఒక మౌలిక ప్రశ్న వుంది. ఒక దేశం మరో దేశపు రాజకీయ భవిష్యత్తును బలప్రయోగంతో నిర్ణయించే హక్కును కలిగి వుంటుందా? వుండవచ్చా?

 

ఈ ప్రశ్నకు “వుండకూడదు” అని గట్టిగా సమాధానం చెప్పడానికే 1945 అక్టోబరు 24న  ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తడమే ఈ రోజున జరుగుతున్న అతిపెద్ద నేరం.

 

అంతర్జాతీయ చట్టంకన్నా సైనిక బలం గొప్పదా?

 

ఏ దేశమైనా సరే మరో దేశ సార్వభౌమత్వాన్ని బలప్రయోగం ద్వారానో,  బెదిరింపుల ద్వారానో ధ్వంసం చేయకూడదు. ఐక్యరాజ్యసమితి చార్టర్—ఆర్టికల్ 2(4)— ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటీ? మార్కెట్ విస్తరణ కోసం, దిగజారుతున్న తన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం. బలహీన దేశాలపై  సైనిక దాడి. కుదరదంటే కుత్రిమంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం. నౌకల ముట్టడి. ఆస్తుల స్తంభన. దాడికి లక్ష్యంగా పెట్టుకున్న దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నచ్చడం లేదని ప్రచారం. ‘రాజ్యాంగ మార్పు’ పేరుతో రాజకీయ బ్లాక్‌మెయిల్. దానికి తోడు అగ్రరాజ్య మీడియా మాయాజాలం.  ఇది అపవాదు కాదు; ఇది సుదీర్ఘ కాలంగా అమెరిక ఆచరిస్తున్న  విధానం.

 

          రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసిన తరువాత వివిధ దేశాల్లో అమెరికా చేసిన ‘రాజ్యపాలన మార్పు’ ఆపరేషన్లు వందకు పైగా వుంటాయి. 1991లో సోవియట్ రష్యా పతనమై ప్రఛ్ఛన్న యుధ్ధం (కోల్డ్ వార్) ముగిసినా అమెరికా ఆగడాలు ఆగలేదు. మరింత వేగాన్ని పుంజుకున్నాయి. ఇరాక్, లిబియా, సిరియా, ఉక్రెయిన్, హోండురాస్, వెనిజులా. ఈ జాబితా చాలా పెద్దది. ఈ దారుణాలన్నింటి వెనుక ఒక దారుణ సత్యం వుంది; ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండానే బలప్రయోగానికి పాల్పడడం. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి సైనిక బలంతో విర్రవీగే రాజకీయాలివి. 

తన ఆర్ధిక ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే దేశాలను అమెరిక సహించదు.  వాటిమీద ‘ఆర్థిక ఆంక్షలు’ విధిస్తుంది. ఇది ప్రత్యక్ష యుధ్ధానికి మరో రూపం. రెండింటి ప్రభావం ఒక్కటే.

 

వెనిజులాపై అమెరిక విధించిన ఆంక్షలు ఆయుధాల యుధ్ధంకాదు. కానీ,  వాటి ప్రభావంతో జరిగే ఆర్ధిక నష్టం ప్రత్యక్ష యుధ్ధంకన్నా తక్కువ కాదు. వెనిజులాలో చమురు ఉత్పత్తి 75 శాతం పడిపోయింది. ప్రజల సగటు ఆదాయం 60 శాతం కంటే ఎక్కువగా కూలిపోయింది.

 

పాలకులు నిరంకుశులుగా మారితే ఆ దేశ ప్రజలు వారిని తప్పిస్తారు. దానికోసం పోరాటాలు చేస్తారు. తిరుగుబాట్లు చేస్తారు. అమెరికా వాళ్లకు ఆ అవకాశం ఇవ్వదు. పాలకులను శిక్షిస్తున్నాం అనే వంకతో దేశాన్ని శిక్షిస్తుంది. దేష ప్రజల్ని శిక్షిస్తుంది.  ఒక దేశం అధ్యక్షుడిని గుర్తిస్తామా, తిరస్కరిస్తామా అన్నది నిర్ణయించాల్సింది ఆ దేశ ప్రజలే; వైట్ హౌస్ కాదు. పెంటగాన్ అస్సలే కాదు.

 

ఇది మడూరో మీద శిక్షా? లేదా వెనిజులా పిల్లల మీద శిక్షా?  ఒకవేళ, శిక్షా పడాల్సింది పాలకుల మీద అయితే, సామాన్య ప్రజల్ని ఇక్కడ ఆకలితో చనిపోయేలా చేయడం ఏం న్యాయం?.

 

దీనికి అంతర్జాతీయ చట్టం ఏమంటోంది? ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక్క భద్రతా మండలిని మాత్రమే సభ్య దేశాల మీద ఆంక్షలు విధించే హక్కు ఉంది. అమెరిక తనకు తాను అంతర్జాతీయ భద్రతా మండలి అనుకుంటుంది. ట్రంప్ అయితే అంతకన్నా ఎక్కువే అనుకునే వ్యక్తి. ”ప్రజాస్వామ్య రక్షణ’ అనే నెపంతో గ్లోబల్ గూండాయిజాన్ని చెలాయిస్తుంది. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”. ఇది కొత్త వలసవాదానికి అమెరిక పెట్టిన అందమైన పేరు.

 

ఇది పశ్చిమార్ధగోళం అంతర్గత వ్యవహారం; పూర్వార్ధ గోళానికి దీనితో సంబంధంలేదు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇదొక అపభ్రంశవాదం. పశ్చిమార్ధగోళంలో అమెరిక సంయుక్తరాష్ట్రాలు మాత్రమే వుండవు. దానికి ఉత్తరాన కెనడా వంటి దేశాలు, దక్షణాన మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు అనేకం వున్నాయి. వాదన కోసంఐనా సరే అవన్ని అమెరికా ఆఢిపత్యాన్ని అంగీకరిస్తాయా।

 

రెండవ ప్రపంచ యుధ్ధం దాదాపుగా ముగిశాక, 1945 మే 8న యూరప్ లో విజయ దినం (VE Day) జరిగాక, అమెరిక దూకుడుతో జపాన్ మీద అణుబాంబుల దాడి చేసింది. ఇది ఎంత అమానుషచర్యో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ప్రపంచ యుధ్ధం ముగిసిన రెండుదశాబ్దాలకే రెండో ప్రపంచ యుధ్ధాం జరిగింది. ఆ తరువాత ఎనభై యేళ్ళు గడిచినా మూడో ప్రపంచ యుధం రాలేదు. దానికి ప్రధాన కారణం,  నాగాసాకీ, హీరోషీమాల్లో మానవహననం ఆ పైన  కొనసాగిన జన్యు సమస్యల్ని చూసిన దేశాలు మరో ప్రపంచ యుధ్ధానికి ఇప్పటి వరకు సాహసించలేదు. కానీ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కాదని మూడో ప్రపంచ యుధ్ధానికి కాలు దువ్వుతోంది.

 

అణుయుగంలో  ప్రపంచ యుధ్ధం అంటే మొత్తం మానజాతి హననం అని అర్ధం. ఈ భయంతోనే తన జోలికి ఎవ్వరూ రారని అమెరిక ధీమా. ఈరోజు ప్రపంచం మౌనం వహిస్తే రేపు మానవజాతికే సమాధి.  కాబట్టి ప్రశ్న మడూరో కాదు; మనమే. ప్రశ్న వెనిజులాకాదు; ప్రపంచం. బలిసిన దేశాల ఆయుధ సంపత్తితో కింద  ప్రపంచం నడవకూడదు.

 

ఐక్యరాజ్యసమితి తన చార్టర్లను  కాపాడుకుంటుందా? లేదా గొప్ప దేశాల దౌర్జన్యానికి మౌన సాక్షిగా మారుతుందా? ఇప్పుడు ప్రపంచానికి ఇది  ఒక పెద్ద సందేహం. ఐక్యరాజ్య సమితీ వెన్నెముకతో నిలబడినా, వెన్నెముక విరిగి కిందపడినా ప్రపంచాన్ని కాపాడుకోవడం ప్రపంచ ప్రజల బాధ్యత. ఇప్పుడు ప్రపంచం స్పందించకపోతే రేపటి ప్రపంచానికి సమాధానమే ఉండదు.

 

6 జనవరి 2026

ప్రచురణ : సాక్షి దినపత్రిక, 8 జనవరి 2026

No comments:

Post a Comment