Tuesday, 24 July 2012

పీపుల్స్ వార్ లో సత్యమూర్తి

పీపుల్స్ వార్ లో సత్యమూర్తి

ఉషా యస్ డానీ

పీపుల్స్ వార్ లో నేను ఒక విధంగా నిత్య అసమ్మతివాదిని. ఇటీవల నాడానీ వ్యంగ్యం’ పుస్తకావిష్కరణ సభలో వరవరరావు సార్ అన్నట్టు  పీపుల్స్ వార్ ప్రముఖులు నాతో జరిపినంత పొలిమికల్ డిబేటును మరొకరితో జరిపివుండరు. అయితే   దశలోనూ నేను పీపుల్స్ వార్ తో తెగతెంపులు చేసుకోవాలనుకోలేదు. జీవపరంగా మా అమ్మ నా అస్తిత్వమైనట్టు, సామాజిక, రాజకీయ అభిప్రాయాల్లో పీపుల్స్ వార్ నా అస్థిత్వం. పీపుల్స్ వార్ ను రద్దుచేసి మావోయిస్టుగా మార్చినపుడు నాకు చాలా బాధవేసింది. మా ఊరి పేరు మార్చేశారు  అన్నంత కోపం  కూడా వచ్చింది. అందుకే మావోయిస్టు పార్టీకి దూరంగా వున్నాను. 

పీపుల్స్ వార్ నుండి బయటికి వచ్చినపుడు నేను సంస్థాగతంగా తనతో కలిసి నడుస్తానని సత్యమూర్తి సార్ ఆశించారు. నాకది ఇష్టంగాలేదు. అయితే, వారితో వ్యక్తిగత స్థాయిలో అనుబంధాలను కొనసాగించాను. బహిరంగ జీవితంలొనికి వచ్చిన తరువాత, 1990లో తొలిసారి విజయవాడ వచ్చినపుడు ఆయన మా ఇంట్లోనే విడిదిచేశారువ్యక్తిగత అనుబంధాలు వేరు. సంస్థాగత సంబంధాలువేరు. నేను వారు పెట్టిన కొన్ని సంస్థల 'తో' వున్నానుగానీ, ఎన్నడూ సంస్థల 'లో' లేను.

1991 జులై 17 నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. సత్యమూర్తి సార్ విజయవాడ వచ్చినప్పుడెల్లా నన్ను కలవడానికి వచ్చేవారు. రాత్రి నేను డ్యూటీ దిగాక నిర్మానుష్యంగావున్న బందర్ రోడ్డు లోని ఏదో ఒక అరుగు మీద తెల్లవారే వరకు సిట్టింగు వేసేవాళ్ళం.

సత్యమూర్తి సార్ బీయస్పీలో చేరడం నాకు వచ్చలేదు. వారు ముదినేపల్లిలో  పోటీ చేయడం అస్సలు నచ్చలేదు."మిమ్మల్ని విముక్తి ప్రదాతగా చూడాలనుకున్న జనం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేని చేయమని అడగడం చౌకబారుగా వుంటుంది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం ఏం బాగుంటుందీ? అన్నాను. "నువ్వు ఎన్నికల బహిష్కరణ పాలసీ నుండి బయటికి రాలేదు" అన్నారు. తరువాత మేము కలవడం దాదాపు ఆగిపొయింది.

ఫొటో చూసి నేను 1991 నాటిది అనుకున్నా. కానీ, అది 1994 నాటిది అని తేలింది. బహుశ అది మా చివరి సిట్టింగ్ అయివుంటుంది.

తరువాత కూడా మేము కొన్నిసార్లు కలిశాం. అవి పాత కలియికలుకావు. నేనొక పాత్రికేయుడిగా, ఆయనొక వృధ్ధ రాజకీయ నాయకుడిగా! అంతే!

సత్యమూర్తి సారును మొన్న ఏప్రిల్ 17 తలుచుకున్నా,18 విజయవాడలో అంత్యక్రియలకు హాజరయినా, దానికి ప్రేరణ 1978-1985 నాటి సత్యమూర్తి సారే.

హైదరాబాద్
20  ఏప్రిల్ 2012



1 comment:

  1. బాగా చెప్పారు సార్...
    వ్యక్తిపూజను దాటలేని వ్యాసాలు రాసి మభ్యపెట్టే వారే అంతా..
    థాంక్యూ..

    ReplyDelete