Thursday, 25 July 2013

Marxism and Logicism

గతితర్కమూ, అతితర్కమూ

ఏ. యం.  ఖాన్‌ యజ్దానీ (డానీ) 


        ఏదీ శూన్యం నుండి పుట్టదు అనేది భౌతికవాదానికి ప్రాథమిక సూత్రం. మార్క్సిజం అంటూ మనమంతా పిలిచే గతితార్కిక, చారిత్రక భౌతికవాదానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. మార్క్సిజానికి కూడా ఏదో ఒకటో, అనేకమో మూలాలుంటాయి.

        సామ్యవాద భావాలుగానీ, సమానత్వ సిద్ధాంతాలుగానీ మార్క్స్‌తోనే ఆరంభంకాలేదు. ఆదిమ సమసమాజం అసమ సమాజంగా మారిన క్షణం నుండే సమాజంలో సామ్యవాద, సమానత్వ భావాలు ఆవిర్భవించి వుంటాయి. మానవాళీ చారిత్రక దశలన్నింటిలోనూ చెక్కుచెదరక కొనసాగుతున్న ఒకేఒక బలీయమైన కోరిక, సమానత్వం.

        ఎన్నడైనా సామాన్యప్రజలు  సమానత్వాన్నే ప్రేమిస్తారు. ఆకాంక్షిస్తారు. అందుకే, సమానత్వాన్ని సాధిస్తానంటూ ఎంతో కొంత కొత్త వాగ్దానం చేయకుండా సమాజంలోనికి ఏ వాదం, ఏ సంఘం కూడా ప్రవేశించజాలదు. మతాలు సహితం దీనికి మినహాయింపుకాదు. ప్రపంచ మతాలైన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాంలు తమదైన శైలిలో సమానత్వన్నే బోధించాయి. వీటిల్లో, ఇస్లాం మరింత యువమతం కనుక సమానత్వ లక్షణాలు మరింత ప్రస్పుటంగా కనిపిస్తాయి. అందులోనూ, సూఫీ తెగది మరీ నిరాడంబర శైలి. అంచేత, సమానత్వాన్ని ప్రేమించే వరవరరావు వంటివాళ్ళకు సమీపగతంలో సూఫీ తెగ ఆదర్శంగా కనబడడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. ఇందులో రంగనాయకమ్మ తప్పుపట్టాల్సిందీ ఏమీలేదు.

        జర్మన్‌ త్త్వశాస్త్రం, ఫ్రెంచ్‌ రాజకీయాలు, ఇంగ్లీషు అర్ధశాస్త్రాల నుండి మార్క్స్‌ ఉత్తేజాన్ని పొందాడనేది అందరూ అంగీకరిస్తున్న విషయం. అయితే, మార్క్స్‌ ఉత్తేజాన్ని ఆ మూడు దేశాలకే, ఆయన సమకాలానికే పరిమితం చేయడం గతితార్కిక  భౌతికవాద సూత్రాలకే విరుద్ధం. బానిసల తిరుగుబాటు వీరుడు స్పార్టకస్‌ నుండి ఛార్లెస్‌ డార్విన్‌ వరకు, షేక్స్‌పియర్‌ నుండి బైరన్‌ వరకు, ప్లేటో నుండి హెగల్‌ వరకు అనేకుల్ని అనేక సందర్భాల్లో మెచ్చుకున్నాడు మార్క్స్‌.

        ఇటాలియన్‌ వలస పాలనపై తిరుగుబాటుచేసిన లిబియా విప్లవవీరుడు, ఓమర్‌ ముఖ్తార్‌ గాధను, 1981లో లయన్‌ ఆఫ్‌ ది డిజర్ట్‌ పేరిట తెరకెక్కించిన ముస్తఫా అక్కడ్‌, అంతకు ముందు ద మేసేజ్‌, రిసాలా, అర్‌ సినిమాలు నిర్మించాడు. మొదటి రెండు సినిమాలూ ముహమ్మద్‌ ప్రవక్త జీవితంపై తీసినవి. "ప్రజల వద్దకు భగవంతుని సందేశాన్ని తీసుకువెళితే పాలకులు సహించరు. మనం బలహీనంగా వున్నప్పుడు రహస్యంగా ప్రచారం సాగించాలి. శత్రువు బలంగా వున్నప్పుడు వెనక్కు తగ్గాలి. అవసరమైతే పురపరిత్యాగం చేయాలి. ఇతర ప్రాంతాలకు వ్యాపించాలి. శాంతి ఒప్పందాలు చేసుకోవాలి. అలసట తీర్చుకునే సమయాన్ని దక్కించుకోవడానికి శాంతిచర్చల్ని ఉపయోగించుకోవాలి. శాంతికాలంలో యుద్ధానికి  అవసరమైన వనరులు సమకూర్చుకోవాలి. నిర్భంధం భరించశక్యం కానప్పుడు యుద్ధానికి సిద్ధపడాలి. శత్రువు బలహీనంగా వున్నప్పుడు విరుచుకుపడాలి. మహాసంగ్రామంలో అంతిమ విజయాన్ని సాధించడం కోసం, ప్రజల్ని చిన్నచిన్న యుధ్ధాల్లో శిక్షణ ఇవ్వాలి. యుధ్ధఖైదీలను, హింసించరాదు.  పిల్లల్ని, మహిళల్నీ, వృద్ధుల్నీ చంపరాదు. చెట్లను నరకరాదు. నీటివనరుల్ని ధ్వంసం చేయరాదు. నేటి ఓటమి రేపటి విజయంగా మారుతుంది. మంచివాళ్లదే అంతిమ విజయం” మొదలైన అనేక పోరాట సందేశాలుంటాయి ముహమ్మద్‌ ప్రవక్త జీవితంలో.

        ’దమెసేజ్‌’ సినిమా చూస్తుంటే, మావో సేటుంగ్‌ మిలటరీ రచనలు గుర్తుకొస్తాయి. ముహమ్మద్‌ ప్రవక్త జీవితం నుండి ఉత్తేజాన్ని పొందే, మావో ఆ సైనిక ఎత్తుగడల్ని, గెరిల్లా యుద్ధతంత్రాల్నీ రూపొందించాడేమో అనిపిస్తుంది. అది వాస్తవం కావచ్చు, కాకపోనూవచ్చు. కానీ, ద మేసేజ్‌రిసాలా అర్‌, సినిమాలకు సహజమైన కొనసాగింపే లయన్‌ ఆఫ్‌ ది డిజర్ట్‌ సినిమాలు  అనంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.

        లయన్‌ ఆఫ్‌ ది డిజర్ట్‌లో నటించిన ఆంథోనీ క్విన్‌, ఐరీన్‌ పపాస్‌ లే ద మేసేజ్‌ లోనూ ప్రధాన పాత్రల్ని పోషించారు. ముస్లిం ప్రేక్షకులు లయన్‌ ఆఫ్‌ ది డిజర్ట్‌ను ద మేసేజ్‌ కు సీక్వెల్‌గానే భావిస్తారు. రిసాలా, అర్‌ ను కూడా కలుపుకుంటే అదో ట్రయాలజీ అవుతుంది.

        ఓమర్‌ ముఖ్తార్‌ సినిమా విడుదలైనపుడు తెలుగు ప్రేక్షకుల్లోని విప్లవాభిమానులు దాన్నో నక్సలైటు సినిమాగా భావించి విరగబడి చూసారు. కొందరైతే, ఓమర్‌ముఖ్తార్‌లో కొండపల్లి సీతారామయ్యను పోల్చుకున్నారు. కొండపల్లి కూడా మొదట్లో టీచరేనని గుర్తుచేసుకున్నారు. సినిమా తీసినవాళ్ళ మూలాలు అస్థిత్వాలు ఇస్లాంలోవుంటే, సినిమా చూసినవాళ్ళ అస్థిత్వాలు విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాల్లో వున్నాయి. ఇలా భిన్న అస్థిత్వాలు ఐక్యమవడంలో  అసంబద్ధమైనదీ, అసహజమైనదీ, ఏదీ కనిపించదు. మార్క్సిజాన్ని జడపదార్ధంగా భావించేవాళ్లకుతప్ప. మనుషులు సాహిత్యంలోంచి సామ్యవాదానికి, కవిత్వంలోంచి కమ్యూనిజానికి వచ్చినంత సులువుగానే, ఇస్లాం నుండి విప్లవానికి కూడా రావచ్చు. కమ్యూనిజం కూడా ఇస్లాం వంటిదే అనుకునే ముస్లింల సంఖ్య తక్కువేమీకాదు.

        ప్రకృతి, సమాజం, ఆ రెండింటికీ సంబంధించిన భావాల మొత్తంలో, మనం గమనించిన అంశాల మధ్యనేగాక, ఇంకా గమనించని అంశాల మధ్య కూడా అంతర్లీనంగా ఒక సంబంధం కొనసాగుతూ వుంటుందనేది గతితార్కిక చారిత్రక భౌతికవాదంలో ప్రాథమిక సూత్రం, పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా పరిణితిచెందుతుందనే సూత్రం ఎలాగూ వుండనేవుంది. ఆ రెండు అంశాలను గుర్తుచేయడానికే పై ఉదాహరణలు ఇవ్వాల్సివచ్చింది. మార్క్సిజం పునాదుల్లో మనం గమనించిన అంశాలేకాక గమనించని అంశాలూ అనేకం వుండొచ్చు అనేదే దాని భావం. సూఫీల జీవనవిధానం కమ్యూన్‌లను పోలివుందని వరవరరావో, మరొకరో అంటే మార్క్సిజానికే లేని అభ్యంతరం రంగనాయకమ్మకు దేనికో అర్ధంకాదు. మార్క్స్‌ అయితే ఏకంగా ఆదిమ సమాజాన్నే పునురుద్ధరిస్తామన్నాడు. కాకుంటే; అత్యున్నత స్థాయిలో.

        పీడితుల్ని విముక్తి చేయాల్సిన సందర్భాలు అనేక దేశాల్లో, అనేక వేలసార్లు వచ్చివుంటాయి. విముక్తి సిద్ధాంతాల్లో మార్క్సిజం అత్యంత శాస్త్రీయమైనదంటే పేచీలేదు. కానీ, అన్ని చోట్లా, సర్వకాల సర్వావస్థల్లో మార్క్సిజం మాత్రమే పీడితుల విముక్తి మార్గంగా నిలిచిందనడం అతిశయోక్తి అవుతుంది. మార్క్సిజాన్ని పోలిన అనేక భావజాలాలు ఆయాకాలాల్లో, ఆయా ప్రజల్ని విముక్తిపథాన నిడిపించి వుంటాయి. మార్క్సిస్టులకు అలాంటి విశాల దృక్పథం అవసరం.

        పేదవర్గాల్ని ధనికవర్గాలు దోచుకుంటున్నాయని మొదట చెప్పినవాడు మార్క్స్‌ కాదు. పాలకులు-పాలితులు, శ్రామికులు-పెట్టుబడీదారులు అనే విభజన, వర్గాలు, వర్గ ఘర్షణ, సామ్యవాదం మొదలైన భావాలు కూడా కార్ల్‌ మార్క్స్‌ కన్నా ముందే వాడుకలోవున్నాయి. కమ్యూన్‌, కమ్యూనిజం అనే పదాల్ని సృష్టించినవాడు కూడా మార్క్స్‌ కాదు.

        పీడితుల విముక్తి అవసరమైన ఒకానొక చారిత్రక సందర్భంలో, ”కాలం కడుపుతో వుండింది. కార్ల్‌ మార్క్స్‌ను కనింది”. తనను కన్న కాలం భుజాలపై నిలబడి మార్క్స్‌ మూడు మహత్తర సూత్రీకరణలు చేశాడు. సమాజ చోదకశక్తి శ్రామికవర్గమేనని తేల్చేశాడు. పాలకవర్గాన్ని అంతం చేయడమేగాక, తననుతానే రద్దుచేసుకొని సమసమాజాన్ని సృష్టించే శక్తి శ్రామికవర్గానికి మాత్రమే వుందని నిర్ధారించాడు. అలాంటి సమసమాజం ఏర్పడడానికి ఒక షరతుగా శ్రామికవర్గ నియంతృత్వం కొంతకాలం కొనసాగాల్సి వుంటుందన్నాడు.

        సామ్యవాద సమాజ సాధనకు కీలకమైన ఈ మూడు సూత్రీకరణల్ని మార్క్స్‌కు ముందు ఎవరూ చెప్పలేదు. మార్క్స్‌ తరువాత వెలుగులోనికి వచ్చిన అనేక వర్గేతర సమస్యల్ని కూడా ఈ మూడు సూత్రాల వెలుగులో పరిష్కరించే అవకాశాలున్నాయి. వాటిని ఇప్పడు శ్రామికులకేకాక, దళితులు, మైనారిటీలు, స్త్రీలు వగయిరా బలహీనవర్గాలు ఎవరికైనా, ఎవరైనా, అన్వయించే అవకాశం వుంది. అంతమాత్రాన వారిని తక్కువ చేయాల్సిన పనిలేదు. దాన్ని, చౌకబారుగా, నకలు దింపడంగా భావించనక్కరలేదు. నిజానికి గతంకన్న మెరుగైన స్థాయిలోనే సంఘటనలు పునరావృతమౌతాయి. ఒక వ్యక్తి ఉత్తేజాన్ని పొందడానికీ, ఆచరించడానికీ మధ్య, కాలంతోపాటూ, సన్నివేశమూ మారిపోయి వుంటుంది. ఆ తేడాను గమనించకుండా కాలాతీతంగా తీర్మానాలు చేయడం చారిత్రక భౌతికవాదానికి విరుద్ధం. ”మరి వరవరరావుగారు ఫకీరుతనాన్నే తన సిద్ధాంతంగా చేపట్టక, మార్క్సిజాన్ని చెప్పుకుంటారెందుకూ?” అని గడుసుగా అడగడం అర్ధంలేని వ్యవహారం.

        మార్క్సిజాన్ని విస్తారంగా చదివిన వాళ్లల్లో రంగనాయకమ్మ ఒకరు. తెలుగునాట గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని జడపదార్ధంగా మార్చేసిన వాళ్లలోనూ వారొకరు. మార్క్స్‌ మీద ఈగ కూడా వాలనివ్వని రంగనాయకమ్మ పట్టుదలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మార్క్స్‌ను అభిమానించే మాబోటివాళ్లక్కూడా వారిపట్ల గౌరవమేస్తుంది. కానీ, గతితర్కాన్ని రంగనాయకమ్మ తరచూ అతితర్కంగా మార్చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఫకీర్ల దినచర్య గురించి అంత వివరంగా రాసిన రంగనాయకమ్మ, ఫకీర్లు పూజారివర్గంకారనే కీలక వాస్తవాన్ని మరిచిపోయారు.

        నిన్న ఇరాక్‌, నేడు ఇరాన్‌, రేపు బహుశ సిరియా. కాకుంటే మరోదేశం. ఒకదాని వెంట మరోదాన్ని ఏకధృవ అధిపతి అమెరికా భస్మీపటలం చేసుకుంటుపోతుంటే ప్రపంచం కళ్ళప్పగించి చూస్తున్నది. తొలి నాగరీక ప్రజాసమూహాల్ని తన ఊయలతొట్టిలో లాలించిన మొసొపొటామియా నాశనమైపోతున్నదని బాధపడేవారే లేరు. ముందుకొచ్చి, ఈ అన్యాయాన్ని అడ్డుకునేవారు అసలే లేరు. మానవాళి తొలి జన్మభూమి ఛిద్రమైపోతుంటే మనకేమీ పట్టకపోవడం న్యాయంకాదు. అంతిమ విశ్లేషణలో, ప్రపంచపటంపై ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిలువరిస్తున్నవి రెండేరెండు. ఇస్లాం, కమ్యూనిజం.

        రెండు విభిన్న శక్తులు ఒక చారిత్రక అవసరంగా ఏకమవ్వాల్సి వచ్చినపుడు, అవి  వర్తమానంలో మాత్రమే కలిసి ఊరుకోవు. గతంలోనూ కలుస్తాయి అంటే, ఇద్దరి వారసత్త్వాల్లోవున్న సామాన్యాంశాలను కొత్త విలువలుగా ముందుకు తెస్తాయి. ”మార్కిజం అంటే సూఫీజమే” అని వరవరరావు అన్నది ఇలాంటి సందర్భంలోనే.

        మానవాళికి స్థిర చరిత్ర అంటూ ఏదీ వుండదు.  వర్తమానం, తన భవిష్యత్‌ అవసరాల కోసం గతంపై చేసే నిరంతర వ్యాఖ్యానమే చరిత్ర అయ్యేది ఈ క్రమంలోనే. ప్రపంచమంతటావున్న పిల్లికళ్ళ సుందరాంగులందరూ ఒకే వ్యక్తి సంతతని  ఆంథ్రపాలజిస్టులు తేలిస్తే, పిల్లికళ్ళ ఐశ్వర్యరాయ్‌కు రాని కోపం నల్లకళ్ళ నీలిమకు దేనికీ?

హైదరాబాద్

18-03-2013

No comments:

Post a Comment